Home » vaddera chandidas » Anukshanikam 2



    కనకదుర్గ ముఖం దిగులుగా అయింది. లోన యేదో తెలియని భయంగానూ అనిపించింది ఆమెకి.
    పక్కకి తిరిగి కనకదుర్గ వంక చూస్తూ, "ఐతే నీకు విజయ్ కుమార్ గురించి యేమీ తెల్వదన్నమాట! వోఫ్__" అని వందన మొదలెడితే విమల అందుకుని, "వందనా ఆమె నీ ఫ్రెండూ మా బంధువూ. విజయ్ కుమార్ గారి భార్య. యిప్పుడు అనవసరమైన విషయాలు దేనికి? అంతా సవ్యంగానే వుండొచ్చు?" అంది.
    "నో ఐ కాంట్ స్పేర్__ ఏమిటీ స్పేర్ చెయ్యలేనిది? అతని ఈవిల్ నెస్ ని, నా దుర్గ లైఫ్ ని__ దుర్గా విను, చెప్త"
    "వందనా ఫూలిష్ గా ప్రవర్తించకు. నువ్వు చెప్పాల్సిందేమీ వుండదు. భార్యాభర్తలు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలుగుతారు" అంది విమల.
    "యు ఆర్ ఎ టిపికల్ హజిఫ్. డోంట్ సాఫ్టెన్ థింగ్స్" అని కనకదుర్గ వైపు తిరిగి, "నువ్వు పెళ్ళాడిన మనిషి భయంకరమైన మనిషి. నీ జీవితాన్ని యెంత నీచంగా ఘోరంగా అయినా చెయ్యగలడు" అంది వందన ఇంగ్లీషులో.
    కనకదుర్గ వణుకుతోంది. ఆమె కళ్ళలో నీళ్ళు.
    చూసి, ఆమె చుట్టూ చెయ్యివేసి దగ్గిరికి తీసుకుని, "డియర్ దుర్గీ బట్ నథింగ్ టు వర్రీ. ఆ మొదటి భార్య యెవరో నాకు తెలవదు. సతీ సావిత్రినో, సతీ అనసూయనో ఫూలిష్ గా ఆహుతైపోయింది. యు కెన్ మేనేజ్ హిమ్" అని విమలవైపు తిరిగి, "పెండ్లి గిండ్లి లేక వున్నదానికి జెలసీ తోటి అంటున్నాననుకోవద్దు. దుర్గ జీవితం పాడుకాకుండా వుండటానికే చెప్తున్నా. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఏంచేస్తాం! యు హ్యావ్ టు సెట్ హిమ్ రైట్. అందితే జుట్టు పట్టుకొనుడు విజయ్ కుమార్ నేచర్" అంది వందన.
    "అందకపోతే కాళ్ళు పట్టుకుంటారా?" అంది కనకదుర్గ.
    "అదేమో తెలియదుగాని, చేతులు ముడుచుకుని కూర్చుంటడు."
    "నిన్నేమన్నా__"
    "అవన్నీ దేనికి? పోనీ"
    "మావారి ఘనత గురించి వినాలని సరదాగా వుంది చెప్పవే, నేనేమీ అనుకోను" అంది కనకదుర్గ.
    వందన విజయ్ కుమార్ తన చెయ్యి పట్టుకున్న సంఘటన వివరంగా చెప్పింది__తను చెంప దెబ్బ కొట్టటం వదిలేసి. ఎంతైనా భర్త కదా బాధపడుతుందేమోనని.
    పనిమనిషి కాఫీ పట్టుకొచ్చింది రెండోసారి.
    "నేను నీకు తెల్సునని ఇప్పుడప్పుడే చెప్పకు" అంది వందన.
    అంతలో ప్రసాదూ భావనారాయణా వచ్చారు.
    విమల లేచి లోనకి వెళ్ళి రెండు నిమిషాల్లో రెండు కప్పులు కాఫీ తనే తెచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది.
    భర్త సంగతి ముందే తెలిసినందున కనకదుర్గ విజయ్ కుమార్ ని తప్పుకు తిరిగింది. ఎక్కువగా చిన్నత్త దగ్గిరే వుండేది. శోభనం జరగనందున పడక కూడా అక్కడే. పదిహేను రోజులుండి వూరెళ్ళిపోయింది.
    ఉన్న పదిహేను రోజుల్లో విజయ్ కుమార్ లేనప్పుడు వందనకీ విమలకీ ఫోన్లు చేస్తుండేది అప్పుడప్పుడు. రెండుసార్లు వాళ్ళు కారు పంపితే వెళ్ళొచ్చింది.
    ఈ రోజు శోభనం, వూళ్ళో కనకదుర్గ వాళ్ళింట్లో.
    మంచం మీదకి చేరుతూనే బ్లౌజు హుక్కులు తీసే యత్నంలో నిమగ్నమయ్యాడు విజయ్ కుమార్, రెండో చేత్తో వొత్తుతూ.
    "ఏంటా తొందర? సగంరాత్రికో ఒక రాత్రికో రేటుకి మాట్లాడుకున్నట్లు, ఆగండి. రాత్రంతా వుంటాను. రాత్రి పగలు జన్మంతా వుంటాను" అంది కనకదుర్గ.
    "పెద్ద అనుభవం వున్నదాన్లాగా నాకే సరసం నేర్పుతున్నావా?" అన్నాడు విజయ్ కుమార్.
    "మొగుడూ పెళ్ళాలన్నాక ఒకరికొకరు నేర్పకుండా తప్పుతుందా? మీరంటే ఒకసారి పెళ్ళయినవాళ్ళు. నాకు పూర్వానుభవంలేదు. దీన్లో కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కి ప్రిఫరెన్స్ వుంటుందని తెలవక" అని చిన్నగా నవ్వింది కనకదుర్గ.
    విజయ్ కుమార్ కి మండుకొచ్చింది.
    'హైస్కూలు చదువేనా యూనివర్శిటీ చదువు కూడానా?" అన్నాడు వెటకారంగా.
    "హైస్కూలు కూడా లేదు. చిన్నప్పుడు కాన్వెంటు చదువు" అంది.
    "అట్లా చెప్పు. నాతో యెవరూ అన్లేదే ఆ సంగతి"
    అతని చేతిని తన చేతులోకి తీసుకుంది. వేళ్ళతో స్పర్శిస్తోంది.
    చెయ్యి తప్పించుకుని, పొట్టమీద నుంచి చీరకట్టు లోపలికి జొనుపుతున్నాడు.
    అతని చెయ్యి బయటికి లాగేసింది.
    "నీ ఇదేం మనదగ్గిర దొబ్బదు" అని బుగ్గ కొరికాడు.
    ఆమెకి కళ్ళనీళ్ళు తిరిగాయి, అంత కఠినంగా కొరికితే. ఆపుకుని, కిలకిలా నవ్వి అతని బుగ్గ బలంగా కొరికింది.
    "అబ్బా! నీయమ్మా" అని అరిచాడు.
    "అట్లా తిట్టకండి __ నాకు తమకం వస్తే అంతేనండీ. యెంత మజాగా వుంటుందనుకున్నారూ__ మీకూ తెలుసుగా__ అట్లా అంటారేం? పైకి నాటకం_ మధ్యలో మా అమ్మ దేనికి_ చాలా పెద్దది, ముసల్ది. నేనున్నానుగా" అంది.
    గుర్రుగా చూశాడు పెదాలూ మూతీ బిగించి.
    "చుట్టూ చెయ్యి వేసి దగ్గిరికి తీసుకుని అతని చెంపమీద పెదాలు అద్దింది__
    అసహనంగా ఒకగంట గడిపి __ గదిలో పడుకోలేక గది బయటికి వెళ్ళాడు విజయ్ కుమార్. ఆమె తండ్రి పరామర్శించాడు. 'మధ్యలో వీడి కాపలా ఏమిటిక్కడ' అనుకుని లోనకి వచ్చేశాడు.
    యేదో పుస్తకం చదువుకుంటోంది కనకదుర్గ.
    "ఏం పడుకోలేదా?" అన్నాడు.
    "మీకోసం ఎదురుచూస్తున్నా కలిసి పాడుకుందాం" అని దగ్గిరికి తీసుకుని చెయ్యి వేసుకుని పడుకుంది.
    విజయ్ కుమార్ కి లేచి కాల్తో లాగిపత్తి తన్ని చెడామడా బూతులు తిట్టాలనిపించింది గానీ తమాయించుకున్నాడు.
    మిగతా రెండు రాత్రులూ శాంతంగా వుండిపోయాడు. 'ఇక్కడ కాదులే నీ సంగతి తేల్చుతాను అక్కడి కొచ్చినాక' అనుకున్నాడు.
    నాలుగోరోజు ఉదయమే బయల్దేరి హైదరాబాద్ వచ్చేశాడు. 




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.