Home » vaddera chandidas » Anukshanikam 2



    "ఒక స్త్రీ చెడాలంటే చాలామంది మగాళ్ళు చెడాలనుకుంటాను."
    "మగకీ ఆడకీ పోలికేంటి? ఒళ్ళమ్ముకుని బతికేవాళ్ళని__"
    "యెవడో నీచుడు మోసగించితే ఒక్కో స్త్రీ ఒళ్ళమ్ముకుని బతకాల్సి రావొచ్చు కానీ చాలామంది మగాళ్ళు మనసుని కూడా అమ్ముకుని బతుకుతుంటారు."
    "ఆదర్శాలు వేరు జీవితం వేరు శ్రీపతిగారూ"
    "మార్క్సిజం అలా అనదనుకుంటాను!" అన్నాడు శ్రీపతి.
    "మార్క్సిజాన్ని ఇట్లాంటి సందర్భాల్లో తేవటం సరికాదు. మన హిందూ స్థితి గతులు వేరు. పతనమైన స్త్రీని చేసుకుంటే__"
    "కానీ అదే పతనం అనుకుంటే, నాకంటే పతనమైందా అని నా సందేహం!"
    "మీరు పతనమవటమేమిటి, నాన్సెన్స్!" అన్నాడు విజయ్ కుమార్.
    "నేను పతనం అవ్వని వాణ్నయితే ఆమె పతనమైనట్లు యెలా అనుకోవటం?"
    "పెళ్ళి అవకుండా కడుపుచేయించుకుని__"
    "ఇంకా నయం రజస్వలవకుండానే కడుపొచ్చిందనలేదు. కడుపు యెవడో వొకడు చేస్తేనేగా వచ్చేది! మగాడికి కడుపొచ్చే వీలుంటే, ఆడది మగాడికి కడుపు చేసే వీలుంటే, చరిత్ర యెలా వుండునంటారు?" అన్నాడు శ్రీపతి.
    శ్రీపతికి కస్తూరిచేత కాఫీ తెప్పించి విజయ్ కుమార్ కి యిప్పించాలనిపించింది. కానీ ఆమె అవమానంతో కుంగిపోతుంది. లేదూ, కాఫీ వాడి మొహంమీద దిమ్మరించి లోనకి వెళ్ళిపోతుంది. మొదటిది, నేను సహించను. రెండోది సరదాగానే అనిపిస్తుందిగానీ భావ్యంకాదు__యింటికి వచ్చినవాడు కదా'__అనుకున్నాడు శ్రీపతి.
    "ఆమె పేరు ఏమని చెప్పింది?" అన్నాడు విజయ్ కుమార్.
    "మిసెస్ యస్.వి.కె. అంది. అంటే ఏమిటంటే దానికి చాలా అర్దాలుంటాయి_అంది. కొత్త పరిచయంగా__యింకా తన వెనుకటి విషయాలు అంతగా తెలియవు."
    "మీరు ఆ గుంటూరు గుడిశేటిదాన్ని యెంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. వాళ్ళు అసలు పేర్లు చెపుతారా! యెన్నో అవతారాలెత్తుతారు!
    "ఐతే అలాంటి సత్సంకల్పం మానుకోమంటారు!"
    "లక్షణంగా. అదోటి పోరంబోకు లంజ. గుంటూర్లో యెవడ్నడిగినా దాని సంగతి చెప్తారు యీ సాయంత్రమే దాన్ని వదిలించుకోండి. మీ ఎస్టేటుకే ముప్పు తెచ్చినా తేగలదు. నా ఫ్రెండ్ ఒకడు దీని వల్లో పడి నానాచావూ చచ్చి చివరకి బయటపడ్డాడు. వెళ్ళొస్తా__" అని లేవబోతుంటే, "వచ్చిన పని చెప్పనేలేదు" అన్నాడు శ్రీపతి.
    "పనీ__ పనీ__ యేం లేదు. వూరికే మిమ్మల్నొకసారి చూసెళ్దామని వచ్చా" అని లేచి హడావుడిగా వెళ్ళిపోయాడు విజయ్ కుమార్.
    స్కూటర్ చప్పుడు.
    తలుపు వేసి లోనకి వచ్చాడు. మంచంమీద కూర్చున్నాడు.
    కస్తూరి కళ్ళవెంట నీళ్ళు.
    కన్నీటివంక చూస్తూ, "యెందుకు?" అన్నాడు.
    "నా బతుకు తలుచుకుంటే బాధ. మిమ్మల్ని తలుచుకుంటే ఆనందం. వాడి ప్రాణాలు నిలువునా తీసేసి, మీకోసం నా ప్రాణాలర్పించాలనిపిస్తోంది" అంది.
    "రెండూ అవసరమే" అన్నాడు.
    "నేను వాణ్ని యెప్పుడో చంపివుండును కానీ ఆ క్రూరుణ్ని నీచుణ్ని తుచ్చుణ్ని చంపను. నా కన్నబిడ్డ వాణ్ని తన కన్నతండ్రిగా అసహ్యించుకుని, ఛీ__అని ముఖాన ఉమ్మెయ్యడం_ నేను కోరుకునేది. అందుకే బతికి వున్నాను. లేకపోతే ఏనాడో వాణ్ని చంపి నా ప్రాణాలు నేను తీసేసుకుని వుండును" అంది ఆవేశంగా.
    ఆ మూడోరోజున "యెన్నాళ్ళిలా సంపాదన లేకుండా? అనిల్ కి డబ్బు యెలా కడతావు!" అన్నాడు శ్రీపతి.
    "నేను హాస్పిటల్ లో పడివున్నప్పుడు యెవరు కట్టారో వాళ్ళే!" అని తృప్తిగా అతనివంక చూసింది.
    యీ రోజు వరంగల్ వెళ్ళిన మోహన్ రెడ్డి తిరిగివచ్చాడు. జ్వరం సంగతి చెప్పి, "ఈమె నా నేస్తం, జ్వరపడితే ఆస్పత్రికి వెళ్ళనివ్వకుండా సుష్రూష చేసింది" అని, "మా మోహన్ వచ్చాడు. తను చూసుకుంటాడు నువ్వు వెళ్ళొచ్చునమ్మా కస్తూరీ" అన్నాడు శ్రీపతి.
    ఆ మరుసటిరోజు అట్టపెట్టెలు సర్దుకుని వెళ్ళిపోయింది కస్తూరి. రిక్షా యెక్కుతూ శ్రీపతివంక చూసిన కస్తూరి కళ్ళలో నీళ్ళు__ ఆత్మీయ భావపు వొత్తిడికి వుబికిన కన్నీళ్లు.

                               110

    యీరోజు విజయ్ కుమార్ కి రెండో తొలిరేయి. మూడు నెలల క్రితం విజయ్ కుమార్ కి రెండో పెళ్ళి జరిగింది కనకదుర్గతో. ఆమె తండ్రి తండ్రి చిరుమామిళ్ళ భావనారాయణకి లాండ్ సీలింగ్ లో పోగా మిగిలిన ఆస్తే బోలెడుంది__కొంత భూమి పాత దస్తావేజులతో డబ్బులోకి మార్చటం వల్ల. తిరువూరు ప్రాంతం. కనకదుర్గ ఏకైక సంతానం.
    రేపు పెళ్ళి అనగా వై.వి.యల్.యన్.వి.ప్రసాద్ కి శుభలేఖ అందింది. వాళ్ళకీ వీళ్ళకీ దూరపు చుట్టరికం వుంది. ప్రసాద్ బద్ధకించి వెళ్ళకపోయినా వెళ్ళకపోనేమోగానే, పెళ్ళి విజయ్ కుమార్ తో అని చూసేసరికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. రాత్రి రెండున్నరకి పెళ్ళి.
    అతను చేరేసరికి రాత్రి పదిన్నర ఐంది. కనకదుర్గ తండ్రితో అతనికి ముఖపరిచయం కూడా లేదు. తన తండ్రికి బాగా తెలుసు. వెళ్ళగానే అతనిని కలుసుకుని, తను ఫలానా అని చెప్పాడు. "నువ్వా బాబు చాలా సంతోషం. నాన్నగారు వస్తారనుకున్నాం. రాలేదేం బాబూ?" అన్నాడు భావనారాయణ.
    "ఆయనకి యీ మధ్య వొంట్లో బాగుండటంలేదు. నేను నేరుగా హైదరాబాదు నుండి వచ్చాను. శుభలేఖ యీ పొద్దుటే అందింది" అన్నాడు ప్రసాద్.
    "అయ్యో అట్లాగా? మేమెప్పుడో పోస్ట్ చేయించాం"
    "తొందర పనుల్లో వుండివుంటారు. నేను అర్జంటుగా ఒకవిషయం మీతో చెప్పాలని__"
    "పనుల్దేముంది__పర్లేదు. చెప్పు బాబూ"
    "మీకు కాబోయే అల్లుడు విజయ్ కుమార్ నాకూ, నా ఫ్రెండ్స్ కి చాలా కాలంగా తెలుసు. మీకు అన్ని సంగతులూ తెలిసేవుండాలి_" అన్నాడు ప్రసాద్.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.