Home » vaddera chandidas » Anukshanikam 2



    "నక్కని తొక్కి వచ్చిన సామెతగా ఈ జగజ్జీవన్ బాబు అదృష్టవంతుడు__వేళకి రైలు దిగేశాడు. వాడి జాతకం యెప్పుడూ అలా అదృష్టపుదే. ఒక్కడు__ఒక్కడన్నా గెలవలేదే! పొరపాట్న చెవాన్ బువాన్ లాంటి నలుగురు గెలిచారు. కానీ సౌత్ చెక్కు చెదరలేదు. కర్ణాటకలోనూ ఆంధ్రాలోనూ జనతాకి ఒక్క సీటు కూడా రాలేదు ఆ నంద్యాలలో యేం జరిగిందో జనతా అభ్యర్థిగా నీలంవారు గెలిచాడు. అస్త్ర సన్యాసం చేసి వూళ్ళో వ్యవసాయం చేసుకుంటూ చిటుక్కున నామినేషన్ దాఖలుచేస్తే గెలిచికూచున్నాడు. ముసుగువీరుడిలా ఏకైక కర్నాటకాంధ్ర జనతా వీరుడు!" అన్నాడు శ్రీపతి.
    మరో పది నిమిషాలకి మోహన్ రెడ్డి నిద్రపోయాడు.
    ఇద్దరూ తెల్లవార్లూ మేలుకుని వింటూ కూచున్నారు.
    శ్రీపతికి కళ్ళు మంటలుగా అనిపిస్తున్నాయిగానీ నిద్ర రావటంలేదు.
    __యీ జాతి ఓటు వేసే అర్హతే లేదని అనుకుంటే యెలా జరిగిందిలా! వెన్నెముక లేనిదనుకున్న యీ జాతి, యీ గొర్రెదాటు జనం, చవటలు ముంతెడు కల్లుకి అమ్ముడుపోయే జనం__ యీ దేశం, యీ ప్రజలు, యీ నత్తనడక, అనంతంగా యిలా గొర్రెచాటుగా సాగిపోతుందేమోననిపించిన యీ దేశం యీ గొర్రెలు _ ఏమైంది ఇందిరా ప్రభుత్వ యంత్రాంగం_ ఏమయ్యాయి తన మత్తుమందు నినాదాలు_ ఏమిటీ వింత, ఏమిటీ మహశ్చర్యం_ ఏమైంది ఆ మాయ ఆ గారడీ, ఆ అంది రాజాలికత_ ఇందిర జాలికలుగుతుందే చిటుక్కున! సామాన్య ప్రజానీకాన్ని తక్కువ అంచనా వేసే మేధావుల నిప్పుడెలా అంచనా వెయ్యాలి! ముప్పయ్యేళ్ళ రాజకీయ రధచక్రాల కింద సామాన్య ప్రజానీకం తమ ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా పడివున్నారేమోననుకున్న మేధావితనం బుర్రల్లోని ఆలోచనల అల్లికల ననుసరించి వుండదు. మనుషుల అనుఘాతుల్లోంచి ఆవేదనల్లోంచి, ఆక్రోశాల్లోంచి, ఆనందాల్లోంచి చరిత్రగతి కొనసాగుతుంది_చల్లని పచ్చిక మైదానం వున్నట్లుండి ఒక్క క్షణంలో యెర్రగా కాలిన ఇనప పొరలా ఐనట్లు_ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకోవటమే కాక అతి పెద్ద ప్రజాస్వామిక బూటకమనీ, అతి పెద్ద ప్రజాస్వామిక అసహాయతనీ అనుకుంటూంటే_ఏమిటీ వింత, ఏమిటీ మహాశ్చర్యం! ఆ కళ్ళలోంచే మంచు కురుస్తుంది, అగ్నీ కురుస్తుంది. మూసుకునీ వుండిపోతాయి. తెరుచుకోనూ తెరుచుకుంటాయి. కన్ను తెరుచుకోవటం ఐతే పెరుగుతుంది గానీ చివరికి_గుడ్డికన్ను మూస్తే యెంత తెరిస్తే యెంత అన్నట్లు అవదుకదా_యీ పంచకూళ్ళ కషాయం సంగతి రేపు మినిస్ట్రీ యేర్పడేటప్పుడు తెలుస్తుంది_ జయప్రకాష్ జీ. ఇల్లకగానే పండగవదు_ గద్ది సంగతి తేల్చిపెట్టు మరి.....
    సుధీర్ వుత్సాహంగా లోనకి వచ్చి, "గాయ్ భీ గనూ, బిఛ్ డా భీ గయా" అన్నాడు.
    "గాయ్ అవర్ బిఛ్ కె సాథ్, సారా గోకుల్ భీ గయా, బేపతా" అని నవ్వాడు శ్రీపతి.
    సుధీర్, "యేమి మోహన్ నిద్రపోతున్నావా, సారా దునియా జాగ్ వుఠేతో!" అని మోహన్ రెడ్డిని కదిపి లేపాడు.
    "అగర్ దునియా జాగ్ వుఠేతో న జనతా న ఇందిరా. ఇంఖిలాబ్ జిందాబాద్, ఆజ్ నహీ తొ కల్" అంటూ లేచి కూర్చున్నాడు మోహన్ రెడ్డి.
    "ఇంఖిలాబ్ లేదు నక్సిఖిలాబూ లేదు. యెప్పుడూ ధన్ఖిలాబే. ప్రస్తుతానికి జనతా జిందాబాద్. రేపటినుంచి కాంగ్రెస్ వాళ్ళంతా కొత్త జండా చేతబట్టుకుంటారు పాపం. విషాదేందిర దేశాంతరమై దక్షిణాపథాన కాలం వెళ్ళబుచ్చాలి" అన్నాడు శ్రీపతి.
    "సిటీ నుండి పోటీచేసిన అందరితోపాటు ఆ దయానంద భారతిగాడు కూడా యెగిరిపోయినాడు" అన్నాడు మోహన్ రెడ్డి.
    "రవి ఇందిరా కాంగ్రెస్ ని సపోర్టు చేసిందట కదా?" అన్నాడు సుధీర్.
    "లే. యే పార్టీని సపోర్ట్ చెయ్యలే. వాని నియోజకవర్గంలోని ఇండిపెండెంట్ అభ్యర్థి పరమ రోగ్ అందుకుని సపోర్ట్ చెయ్యలే రవి. సపోర్ట్ చేసి వుంటే గెలుచునేమొ. రవికి అతని నియోజక వర్గంలో బ్రహ్మాండమైన సపోర్ట్ వుంది. తన నియోజక వర్గంలో మాత్రం ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిని సపోర్ట్ చేసినాడట. దానికీ యేదో కారణం వుంటుంది. అసెంబ్లీకి పోయినంత పొలిటికల్ పవర్ కాన్షస్ నెస్ అబ్బింది."
    రాజకీయాల చర్చ, కబుర్లు.
    మరుసటిరోజున ఇందిరాగాంధీ రాజీనామా.
    ఆ రెండోరోజున జనతా పార్టీ మంత్రివర్గం_జగజ్జీవన్ రామ్ తను సి.డి.యఫ్. వర్గంగానే జనతాలో భాగస్వామిగా చేరాడు.
    ప్రధానమంత్రి యెవరు అవ్వాలి? ఆ కుర్చీ కోసం మొరార్జీ జగజ్జీవన్ రామ్ చరణ్ సింగ్ గింజుకులాడుతూంటే _ జయప్రకాష్ నారాయణుడూ కృపలానీ చొరబడి మధ్య వర్తిత్వం నెరిసి_మొరార్జీని కూచోబెట్టారు. తమ సపోర్టు చెయ్యకపోతే మొరార్జీ ప్రధాని అయ్యేవాడు కాదనీ, అది తన దయాధర్మ మన్నట్లుగా చరణ్ సింగ్ భీష్మింపు. యెన్నిక జరిగితే తానే ప్రధాని ఐవుండేవాడినని జగజ్జీవన్ రామ్ బింకం.
    "మొరార్జీ జగజ్జీవన్ రామ్ లు అభ్యర్థులుగా తయారయ్యారుగా _ ఇద్దరూ అర్హులే. ఇద్దరూ సమర్దులే యిద్దరూ యోగ్యులే_ఐనా ఒకరిని ఎన్నుకోవాల్సి వుంది. మొరార్జీని కూచోనిద్దాం అని, జేపీ కృపలావీలు నిర్ణయిస్తే అది సమిష్టి అవగాహనా? కానీ యిలాంటి విషయం ఇందిరా కాంగ్రెసుకి సంబంధించినదైతే నామినేటెడ్ అనో నియంత అనో అని వుందురు. ఇందిర హయాంలో రాష్ట్రాలలో ముఖ్యమంత్రులే లేరట. పెద్ద పాలేళ్ళున్నారట కావచ్చునేమో గానీ సాధ్యమైతే వీళ్ళు రోజు కూలీ నౌకర్లని వుంచుతారు" అని శ్రీపతి అంటే, "అందుకేగా వన్ యీవి యీజ్ రిప్లేస్డ్ బై అనదర్ ఈవిల్ అన్నాను!" అన్నాడు మోహన్ రెడ్డి.

                              109

    శ్రీపతి డిస్పెన్సరీలో కూర్చునే ఆటో పిలిపించుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ బయటికొచ్చి ఆటో యెక్కబోతూండగా అటునుంచి ఆ వేళకి ఆ పక్కనుంచి వెళుతున్న రిక్షాలో వున్న కస్తూరి చూసి రిక్షా ఆనించి చటుక్కున దిగి గబగబా ఆటో దగ్గిరికి వచ్చింది.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.