Home » vaddera chandidas » Anukshanikam 2



    కాఫీ__రాతి పలకలా అనిపించి పింగాణి కాఫీ సెట్టు.
    వొంపుకున్నాడు. 'కేరళారవ నాయరు కాఫీలాగా దీనికి నురగ యెలా వచ్చింది?' అనుకుని ఒక గుక్క వేసి, "రుచి అలా లేదు అమరి." అనుకుని, మరో గుక్కవేసి, "యెస్ప్రెస్సో పరికరమో పెర్కొలేటర్లోనో మిక్సీలోనో దేనిలోనో తయారించి వుంటారు__?' అనుకున్నాడు శ్రీపతి.
    కాఫీ ముగించి అప్పటిదాకా బలవంతంగా వాయిదా వేసిన పని ప్రారంభించాడు.
    గోడలకి చిత్ర లేఖనాలు__పునరుత్పన్నాలున్నాయి. కొన్ని ఇటీవలి భారతీయ చిత్రలేఖనాలు__మాతృకలు.
    టిటియన్__ది త్రీ యేజెస్ ఆఫ్ మ్యాన్ డెలక్రా__ది డెత్ ఆఫ్ వొఫీలియా, వాస్ గో__ది సన్ ఫ్లవర్స్, సెజాన్నె__పోప్లర్స్, ద విన్చీ_ శ్వాన్ అండ్ ది లీడా, మోనాలీస్జా, ది లాస్ట్ సప్పర్, మోనే)సన్ సెట్ వంటి చిత్రలేఖనలు. జపాన్ చైనా రాజస్థానీ అజంటా రేఖా చిత్రాలు జామివీరాయ్, చగాల్, యస్వీ రామారావు, పి.టి.రెడ్డి వంటి ఇటీవలి వారి చిత్రలేఖనలు. యీ చిత్రాల మధ్యలో ఒకచోట డాడా ఫోటోగ్రాఫు తిరగేసి బిగించి వుంది.
    పుస్తకాల అలమరాలు__సాహిత్యం, చిత్రలేఖనాలు, పుస్తకాలు.
    చిత్రలేఖనం పుస్తకాలు తీసి చూస్తున్నాడు. కొన్ని శ్రీపతి చూడనివి వున్నాయి.
    మధ్యాహ్నం భోజనం__ఒక స్టీలు పళ్ళెంలో అన్నీ సర్ది పైన అదే సైజు పళ్ళెంతో మూతపెట్టి తెచ్చారు.
    భోంచేశాక వో కునుకు తీశాడు.
    లేచి మళ్ళీ స్నానించి__ఓ పుస్తకం తీసి చూస్తున్నాడు.
    గుమ్మంలో అడుగుల సవ్వడి. తల పైకెత్తాడు.
    స్వప్నరాగలీన.
    "పెళ్ళివారిల్లు నచ్చలేదనుకుంటాను. యీ పూరిపాకలో చేరారు!"
    "మీకు అంతచక్కని పెద్ద మహల్ వుందని చెప్పలేదేం యెన్నడూ" అన్నాడు.
    "చెబుదునుగానీ మీ రాజప్రసాదాల ముందు అదేపాటి"
    "ఆఖరికి యిక్కడ గుడిశలో పడేశారు అతిథిని!"
    "పిలవని పేరంటానికొస్తే అలాగే జరుగుతుంది మరి! మీకు యిక్కడ బాగా మేత దొరకలేదా!"
    చుట్టూ గోడలు బీరువాంవైపు చూసి, "మేతకేం కరువు యిక్కడ! ఆపైన మీరు అక్కడినుంచి పంపించే మేత!"
    "ఆ మేత సంగతి నాకు తెలియదు. మావాళ్ళు పంపించిన మేత."
    "మీ బాబాయి నాకు చాలా నచ్చారు"
    "మా హరనాధ బాబాయి మీకు నచ్చుతారని నాకు తెలుసు."
    "తెల్లవారుజామున మీరంతా ఉరవకొండకి తరలి వెడతారుకదా! మూడు రోజులా?"
    "అనుకుంటాను. ఆ వివరాలూ అవీ నాకు బొత్తిగా తెలియవు."
    "నేను రేపు సాయంత్రందాకా యిక్కడే వుండి, సాయంత్రం మా వూరెళతాను" అన్నాడు శ్రీపతి.
    "మహా సంతోషం. సగం సంతోషం రేపు సాయంత్రందాకా యిక్కడ ఈ పాకలో వుండదలిచినందుకు. సగం సంతోషం మీ అమ్మగారి దగ్గిరికి వెళుతున్నందుకు"
    "అనంత్ చెప్పారా మిమ్మల్ని పిలవమన్నానని? మీకు ఫోన్ లేదు. కలుసుకునే వ్యవధి లేకపోయింది."
    "అనంత్ ఏమీ చెప్పలేదు. నేనే వచ్చాను" అని సరదాగా నవ్వాడు శ్రీపతి.
    "చెప్పేవుంటారులెండి."
    "మిత్రులనెవర్నీ పిలవలేదేం?" అన్నాడు.
    "మిమ్మల్ని పిలిచాంగా?"
    "ఒక్కణ్నేగా__"
    "మీరు చాలామంది మిత్రులతో సమానం. ప్రస్తుతం ఈ మినీ సర్కిల్ లో నేను ది మోస్ట్ కాస్ట్ లీ రిక్వైర్డ్ పర్సన్ ని. నేవెళతా. మిమ్మల్నెవరూ పట్టించుకోరు. మీ అవసరాలు మీరే చెప్పి చేయించుకోవాలి." అని చిన్నగా నవ్వింది.
    "మీ నవ్వు యీ కుటీరానికి చెందినట్లుగా అనిపిస్తోంది__వింత కదూ!" అన్నాడు.
    "తమాషా ఏమిటంటే__నేను ఆ భవంతిలో కాక ఈ పాకలోనే పుట్టానట. అ రోజు మా అమ్మా నాన్నా పిన్నీ అందరూ దీనిలోనే వున్నారట__మా బాబాయికి ఒంట్లో బాగుండకపోతే__అమ్మకి నిండు నెలలు. అంతలో అనుకోకుండా నొప్పులు రావటం....యెటూ తీసుకెళ్ళే వ్యవధి కూడా లేకుండా మంత్రసానైనా లేకుండా మా పిన్ని సాయంతో చిటికెలో ప్రసవించిందట మా అమ్మ__"
    "నీ జన్మ గాథ వివరిస్తున్నావా చిట్టితల్లీ. నీ జన్మగాథంటే నా కడుపునొప్పి గాథ. అప్పుడు మొదలైన కడుపునొప్పి ఇప్పటికీ నన్ను అంటిపెట్టుకునే వుంది." అని పకపకా నవ్వాడు, అప్పుడే లోనకి వచ్చిన హరినాధరెడ్డి.
    "నొప్పులు తల్లికి కదండీ రావాలి!" అని నవ్వాడు శ్రీపతి.
    "అదే చిత్రం. ఆవిడగారు నొప్పులు పడకుండా సునాయాసంగా కనేసింది. ఆ బదులు మరిదిని నాకొచ్చింది కడుపునొప్పి నొప్పులు" అని పకపకా నవ్వాడు హరినాధరెడ్డి.
    "నే వెళతా" అంది.
    "వెళ్ళొస్తాను అను" మళ్ళీ నవ్వాడు హరనాథ్ రెడ్డి.
    స్వప్నరాగలీన బయటికి నడిచింది.
    శ్రీపతీ, హరనాధరెడ్డి లలితకళల కబుర్లలోకి దిగారు.
    ముప్పావుగంట.
    కాఫీ తెచ్చిన మనిషి, "శివబాబు గారూ ఆడ తమర్ని పిలుస్తున్నారండీ పెదబాబుగారు" అన్నాడు.
    "నాలుగు గుక్కలు కాఫీ తాగనివ్వరా వస్తాన్లే"
    "ఆడ పుచ్చుకోవచ్చునండీ. వున్నపళాన తీసుకురమ్మన్నారండీ."
    కాఫీ నాలుగు గుక్కలు వేసి, "మళ్ళీ వస్తాను కాస్తాగి" అని వెళ్ళిపోయాడు హరనాధరెడ్డి.
    శ్రీపతి చిత్రలేఖనం పుస్తకాలు చూస్తూ వుండిపోయాడు.
    చీకటి పడింది. లైటు వేసి మళ్ళీ కూర్చున్నాడు.
    తొమ్మిదింటికి భోజనానికి పిలువు__వెళ్ళాడు.
    'ఇంతమందికి యింత ఇదిగా విందు భోజనమా! దండగ ఖర్చు' అనుకున్నాడు శ్రీపతి. మళ్ళీ వచ్చి చిత్రలేఖనం పుస్తకాలు తెరిచాడు.
    పదకొండింటికి యెవరో వచ్చి పిలిచారు. వెళ్ళాడు.
    చాలా పెద్ద పెళ్ళిపందిరి. చాలా ఘనంగా చేశారు యేర్పాట్లు. జనం కూడా అలాగే చాలామంది వున్నారు.
    వివాహం__చాలా శాస్త్రోక్తంగా కప్పదాట్లు వెయ్యకుండా స్థిమితంగా జరుపుతున్నారు పురోహితులు.
    పెళ్ళిపీటమీద అనంత్ రెడ్డి. జరీ అంచు కోరారంగు ధోవతి చొక్కా, తలపాగా.
    చాకలివాళ్ళు, షోలాపూర్ పట్టుదుప్పటితెచ్చి అడ్డుగా పట్టుకుని నిలుచున్నారు.
    మరికొన్ని నిమిషాలకి స్వప్నరాగలీనని_యిద్దరు ఆడవాళ్ళు చెరొక ప్రక్కన వుండి తీసుకొచ్చారు జబ్బ పట్టుకున్నట్లుగా చెయ్యి యెత్తి.
    "ఏం ఖర్మొచ్చింది స్వప్నకి __ హుందా సొగసు నడక పిల్లని కుంటిదాన్ని తెచ్చినట్లు తెస్తున్నారు! లేదూ రాష్ట్రపతి బాడీగార్డుల్లా. రాష్ట్రపతి స్త్రీ ఐతే__రాష్ట్రపత్ని__" అనుకున్నాడు శ్రీపతి.
    స్వప్నరాగలీన__కోరారంగు నూరో నంబరు నూలు చీర! బాగా వెడల్పాటి జరీ అంచు. బుట్టెడు పూలు, నగలు.
    'పూలజడ కుట్టలేదు. అదృష్టవంతురాలు బతికిపోయింది__" అనుకున్నాడు శ్రీపతి.
    పెళ్ళి తంతు జరుగుతూంది.
    అద్దంలో పెళ్ళికూతుర్ని చూపించే ఘోషా స్థితికిగానీ, ఐదారేళ్ళ నుంచి పరస్పరం తెలిసిన ముఖాలమధ్య ఆ తెర దేనికి! అనుకున్నాడు శ్రీపతి.
    హరనాధరెడ్డి వచ్చి శ్రీపతి ప్రక్కన ఓ మూడు నిమిషాలు కూర్చుని__అవీ ఇవీ సంగతులు చెబుతూ వుండి వెళ్ళాడు.
    తెర తొలిగింది.
    పెళ్ళి తంతు జరుగుతూంది. శ్రీపతి అదంతా గమనించకుండా వధూవరుల్ని జనాన్నీ గమనిస్తున్నాడు.
    పారాణి పూసిన పచ్చని ఆమె పాదాలమీద చేతులు ఆన్చాడు అనంత్ రెడ్డి. సందర్భం గుర్తొచ్చి వెంటనే తీసేశాడు. యెవరూ గమనించలేదు. గమనించిన ముసలి పౌరోహితుడు 'ఆ సరసం కళ్యాణ వేదికమీద కాదు నాయనా శోభనం పడకమీద' అనుకుని నవ్వుకున్నాడు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.