Home » vaddera chandidas » Anukshanikam 2



                               105

    మోహన్ రెడ్డి సాయంత్రం బజారుకి వెళ్ళి రాత్రి యెనిమిదింటికి తిరిగి వచ్చాడు. తాళం వేసి వుంది. తీసి, కాసేపు కుర్చీలో కూర్చున్నాడు. గాయత్రి యింట్లోంచి బయటికే కదలటంలేదు. అతను బలవంతంగా కదలదీస్తే తప్ప.
    యెక్కడి కెళ్ళిందబ్బా_అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి చూస్తే, వంట చేసిన ఛాయలేమీ లేవు. వంట ప్రారంభించాడు. అరగంటలో ముగించాడు. యెనిమిదీ ముప్పావు. ఆకలిగా వుంది. ఒక్కడికే తినబుద్ధవటంలేదు. మరో పావుగంట, యెదురు చూశాడు. ఓ పత్రిక తిరగేస్తూ.
    'వాళ్ళింటికెళ్ళి_వాళ్ళు కబుర్లు చెప్తావుంటే వుండిపోయినదేమో_ అనుకుంటూ లేచి, తాళం వేసి వెళ్ళాడు. తలుపులు వేసి వున్నాయి. యింట్లో దీపాలు కూడా వేసిలేవు. రెండు మూడు నిమిషాలు గమనింపుగా చూసి_ గేటు తీసుకుని, తలుపు తట్టాడు.
    "యెవరూ?" అని గాయత్రి తండ్రి రామనాధం గొంతు.
    "నేను మోహన్ ని"
    తలుపు తెరుచుకుంది.
    "రా బాబూ."
    "గాయత్రి వున్న ఛాయలేం కనిపించలేము అతనికి. రామనాధం నిద్రలోంచి లేచివచ్చాడు. సాధారణంగా గాయత్రి వాళ్ళింట్లో వుండిపోదు. అందునా ప్రస్తుతపు మూడ్ లో.
    "గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ యింటికెళ్ళింది. ఇంకా రాలే. వస్తూ వస్తూ యిక్కడికొచ్చి మాట్లాడతా వుండిపోయిందేమోనని వచ్చా" అన్నాడు మోహన్ రెడ్డి.
    అబ్బే. నాలుగు రోజుల నాడు మీరిద్దరూ కలిసి రావడమే__"
    మధ్యలోనే అందుకుని, "ఆ ఫ్రెండ్ ఇంట్లోనే వుండివుంటది. అక్కడికి వెళ్ళి తీసుకొస్తాన్లే." అని బయటికి వచ్చాడు మోహన్ రెడ్డి.
    నడిచి యింటికొచ్చి తలుపువంక చూశాడు. తాళం వేసేవుంది. నీరసంగా తాళంతీసి కుర్చీలో కూలబడ్డాడు.
    పది నిమిషాలు.
    వాకిట్లో చప్పుడైంది. అమాంతంలేచి గుమ్మంలోకి వెళ్ళాడు. యెవరూ లేరు.
    వచ్చి కూర్చున్నాడు.
    అడుగుల చప్పుడు.
    మళ్ళీ లేచి వెళ్ళాడు యెవరో వీధిలో నడిచి వెళుతున్నారు వాకిలి ప్రక్కగా.
    మళ్ళీ లోనకి వచ్చాడు.
    ఐదు నిమిషాలు.
    గుమ్మంలో అలికిడి.
    గబుక్కున లేచి వెళ్ళాడు.
    ఎండుటాకులు గాలికి కదిలిపోయిన చప్పుడు.
    మళ్ళీ వచ్చి కూర్చున్నాడు.
    నలభయ్ సెకండ్లు.
    గుమ్మంలో శ్వాస గట్టిగా పీల్చిన సవ్వడి.
    గిరుక్కున తిరిగి చూశాడు. యెవరూ లేరు.
    కుర్చీ వాకిట్లో వేసుకు కూర్చున్నాడు.
    పది నిమిషాలు.
    తాళం వేసి, వీధిలో నడిచాడు కొసవరకు....వుఁహూఁ.
    అటువైపు నుంచి వచ్చిందేమో_ అనిపించి చకచకా అడుగులు వేస్తూ యింటిదగ్గిరి కొచ్చాడు.
    తాళం తియ్యకుండా వాకిట్లో కూర్చునిపోయాడు.
    అరగంట.
    ప్రస్తుతపు మూడ్ లో తను యెక్కడికి కదలటం లేదు. ఆఖరికి విరసం కార్యాలయానికి కూడా వెళ్ళటం లేదు. "శ్రీపతి దగ్గరకు వెళ్ళివుంటది" అనుకుని బయల్దేరాడు. వీధి చివరిదాకా వెళ్ళాక, 'యింతలో తను వస్తే_' అనుకుని, తిరిగి వచ్చి తాళం తీసి, "నీకోసం శ్రీపతి దగ్గరకు వెళ్తున్నా_ అక్కడికి వెళ్ళినావేమోనని. వెంటనే తిరిగి వచ్చేస్తాను." అని చీటీ రాసి గుమ్మంకి లోపలిపక్క నేలమీద లావుపాటి పుస్తకం పెట్టి దానిమీద చీటీ పెట్టి పేపర్ వెయిట్ పెట్టాడు.
    తాళంవేసి రిక్షా యెక్కి శ్రీపతి యింటికి వెళ్ళాడు.
    తలుపులు తెరిచి వున్నాయి. లైటు వెలుగుతుంది.
    మోహన్ రెడ్డిని చూసి, చదువుతున్న సిడ్నీ జొరార్డ్ పుస్తకం "ది ట్రాన్స్ పరెంట్ సెల్ఫ్" మూసి, "యేఁవఁయ్యా మోహనం యెలా వుంది నీ న్యాయ వాదనం?" అని. "గాయత్రి ఏం చేస్తోంది? యింకా యింట్లోంచి బయటికి కదలకుండా అలాగే వుండిపోతుందా? యేదో చెయ్యాలి మోహన్. ఆ స్థితిలో యెక్కువ కాలం వుండటం మంచిదికాదు." అన్నాడు శ్రీపతి.
    విషయం చెప్పాలనిపించినా, 'దేనికి నాతోపాటు తనుకూడా వర్రీ అవటం_అనవసరంగా_' అనుకుని, "అవును యేదో చెయ్యాల. లెట్ అజ్ థింక్ ఎబౌట్ యిట్. వస్తా. వూరికే వచ్చినా." అని లేచాడు మోహన్ రెడ్డి.
    "కూర్చో__" అన్నాడు శ్రీపతి.
    "యింట్లో ఒక్కతే వుంటది."
    "అవునవును ఈ మూడ్ లో ఒక్కతెనే ఒంటరిగా యెక్కువసేపు వుండనివ్వక" అన్నాడు శ్రీపతి.
    మోహన్ రెడ్డి లేచాడు.
    "ఈ జనవరి రాత్రి చలిలో ఆ సన్నటి స్లాక్ తో తిరుగుతున్నావా!" అని లేచి స్వెట్టర్ తీసి ఇచ్చాడు శ్రీపతి.
    తొడుక్కుని బయటికి వచ్చాడు మోహన్ రెడ్డి.
    నడుస్తున్నాడు చలిగాలి.
    ఉస్మానియా ఆస్పత్రి. ఎమర్జన్సీ వార్డులో అడిగాడు. అక్కడినుంచే గాంధీ ఆస్పత్రికి ఫోన్ చేయించి అడిగాడు. వుఁహూఁ.
    నడుస్తున్నాడు.
    వుక్కగా అనిపించి స్వెట్టర్ తీసి భుజాన వేసుకున్నాడు. రిక్షా కనిపించగానే యెక్కి యింటికి చేరుకున్నాడు. తాళం వేసే వుంది. తాళం తీశాడు. అక్కడ పెట్టిన పుస్తకం అలాగే వుంది. వెంటనే తాళం వేసి, వీధిలోకి వచ్చి నడుస్తున్నాడు.
    చటుక్కున బుర్రలో ఓ ఆలోచన వచ్చి, పోతున్న రిక్షా అతనిని పిలిచాడు గట్టిగా అరిచి.
    రిక్షా ఆగింది. వెనక్కి తిరిగి రాకముందే గబగబా అడుగులు వేసి రిక్షాలో కూర్చున్నాడు.
    ఆ ఏరియా పోలీస్ స్టేషన్ దగ్గిర రిక్షా దిగి డబ్బులిచ్చి_స్టేషను వాకిట్లోకి వెళ్ళాడు. బయట_ముతక ఉన్ని ఓవర్ కోట్ తొడుక్కుని తుపాకీ పట్టుకుని కూర్చునివున్న పోలీసుని, "యీ పొద్దు వయసులో వున్నామెను యెవరినైనా అరెస్ట్ చేసిన్రా?" అని అడిగాడు మోహన్ రెడ్డి.
    "యెవర్ని అరెస్ట్ చెయ్యాలె. అరెస్ట్ లు చేసెడిదె మా పనా యేమి?" అని విసుక్కున్నాడు పోలీసు.
    "యస్సై వున్నారా?"
    "యింట్ల పెండ్లం పక్కలో వున్నాడు" అని నవ్వాడు పోలీసు.
    నడుస్తున్నాడు.
    మరో పోలీస్టేషను మరో పోలీస్టేషను మరో పోలీస్టేషను మరో పోలీస్టేషను.
    కొన్ని పోలీస్ స్టేషన్ల దగ్గిర జవాబు చెప్పించుకోవటానికి అరగంటా గంటా సమయం పట్టింది.
    ఉదయం యెనిమిదిన్నర.
    యింకో పోలీస్టేషను. సిటీలో మిగిలివున్న స్టేషను అదొక్కటే.
    లోనకి వెళ్ళాడు. యస్సైని అడిగాడు. ఆ యస్సై అదివరకు గాయత్రిని అరెస్టు చేసిన యస్సై.
    "యెవడితో లేచిపోయిందో వాణ్ని వెతికి పట్టుకో__ యెక్కడికి చెక్కేసిందో__వాళ్ళ బందరుకి యెగిరిపోయిందేమో చిలక_పోయి వెతుకు అన్నాడు ఆ యస్సై పరిహాసంగా.
    "మాటలు జాగ్రత్తగా రానియ్"
    "జాగ్రత్తగానే మాట్లాడాను. జాగ్రత్తగా వచ్చిన మాటలే. బూతులు వినాలని వుంటే చెప్పు నాయనా వినిపిస్తాను. నీ పెళ్ళాంకి భలే సరదాలే నా బూతులంటే!"
    మోహన్ రెడ్డికి లాగి లెంపమీద కొట్టాలనిపించిందిగానీ తమాయించుకున్నాడు_ఆ పని చేస్తే తనని లాకప్ లో పెడితే గాయత్రి విషయం తెలియకుండా దాన్లో పడి వుండాల్సొస్తుందనిపించి.
    ముషీరాబాద్ జైలుకి వెళ్ళాడు. అక్కడ జైల్లో వున్న రచయితలు, రాజకీయ నాయకులు తదితరులు కొందరు తెలుసు. కొందర్ని యెలాగో కలుసుకుని ఆచూకీ తీశాడు. ఆరోజు యే స్త్రీని తీసుకురాలేదని తెలుసుకున్నాడు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.