Home » D Kameshwari » Madhupam


           
                                               లక్షణ రేఖ
    
    చెంప చెళ్ళుమంది కార్తీకది. 'కొట్టావా, కొడతావా నన్ను' అన్నట్టు మింగేసేట్లు చూస్తింది కార్తీక.
    "నీకేన్నాళ్ళు? ఏం చదివావు? ఏం ఉద్యోగం చేస్తున్నావు?" సావిత్రి అరిచింది. కార్తీక కళ్ళు పెద్దవి చేసి తెలీక అడుగుతున్నావా అన్నట్టు కోపంగా చూసింది.
    "పాతిక దాటాయి, అమెరికాలో ఎమ్మెస్ చేసి వచ్చావు. పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. అయినా ప్రపంచ జ్ఞానం లేదు. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. అడ్డమైన వాళ్ళతో తిరగొద్దని, మేం చూసిన వాడు నచ్చకపోతే నీకు నచ్చినవాడిని వెతుక్కుని చూసుకో అన్నదీ చెప్పాను. స్నేహమంటూ ప్రతీవాడితో క్లబ్బులు, పబ్బులు, డిన్నర్లు, షికార్లు, తిరిగితే , రోజుకో మగాడితో తిరిగే ఆడదాన్ని మగాడేవరూ నమ్మడు. తనూ నీతో తిరుగుతాడు కనీ, పెళ్ళికి పనికిరావనుకుంటాడు అని చెప్పాను విన్నావా..... పర్యవసానం  తెల్సిన్డిగా . పిచ్చి డ్రెస్సు లేసుకుని బాయ్ ఫ్రెండ్స్ తో మోటారు సైకిళ్ళ మీద తిరగడం ఫ్యాషన్ అనుకున్నావు. ఇప్పుడొచ్చి ఏం చెయ్యను అని నన్నడగడం ఏమిటి? సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్ ల మధ్య అనుక్షణం గడిపేదానివి. సెల్ ఫోను ఉపయోగాలు, దురపయోగాలు తెలియవా? సరదాగా కౌగాలించుకున్నట్లు, మొహాలు దగ్గర చేర్చుకుని, భుజాల చుట్టూ చేతులేసుకుని సెల్ ఫోన్లలో సరదాగా ఫోటోలు చూసుకుని మురిసిపోయిన ఆ ఫొటోలే నీ మెడలో పాముల్లా చుట్టుకుని నిన్ను కాటేయడానికి వాడుకునే ఆయుధాలని తెలిసిందిగా ఇప్పుడు? ఏం చేయను నన్నడిగితే యూ స్టుపిడ్. ఇడియట్ మదర్ ఏం చెబుతుంది? నా లైఫ్ నా ఇష్టం . నాకు తెలుసు అన్నావుగా. నీ ప్రాబ్లం నీవే సాల్వ్ చేసుకో' ఆవేశంలో అగుకుండా ఆయాసం వచ్చే వరకు దులిపి పారేసింది సావిత్రి.
    'ఛా .... ఛా.... ఈ ఆడపిల్లలకి ఎన్ని యుగాలైనా బుద్ది రాదు. కాలేజీల్లో చదవడం డిగ్రీల కోసం తప్ప ప్రపంచజ్ఞానం కోసం కాదు. పుస్తకాలు , ఇంటర్ నెట్ లు , టీవీలు, సినిమాలు అన్నీ చూస్తారు. ఏం నేర్చుకుంటున్నారు" ఆవేశంలో ఆమె మాటలు తడబడ్డాయి.
    కార్తీక తల్లి వంక చురచుర చూస్తూ మొహం మాడ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏదో ఇన్నాళ్ళకి దానికి నచ్చినవాడు దొరికాడు, పెళ్ళి చేసుకుంటాం అని చెప్పినప్పుడు మంచి చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నీ బాగున్నాయి. కులాలు వేరయినా సర్దుకున్నారు. పెళ్ళి ఇంకో పదిహేనురోజులుండగా ఈ ఉపద్రవం వచ్చిపడిందేమిటి? కూతురు గతంతో ఆడుకోడానికి సిద్దపడిన వాడిని ఏం చేయాలి? ఈ అమ్మాయి లెప్పుడు బుద్ది తెచ్చుకుంటారు. ఆ వయసులాంటిదా? ఆ ఆకర్షణ అలాంటిదా? అందులోంచి తప్పించుకోలేని బలహీనతతో తప్పటడుగులు వేసి ఊబిలో దిగాబడతారా? అందరమ్మాయిల్లా కాకపోయినా తెలివితక్కువగా కొందరు , అహంకారంతో కార్తిక లాంటి అమ్మాయిలు తమ అందం డబ్బు చూసి మగపిల్లలని ఆకర్షించాలని , తమ వెంట తిరిగేట్టు చేసుకోవాలని వళ్ళు పై తెలీకుండా ప్రవర్తించి, ఉచ్చులో పడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కూతురునయితే కసిరేసింది కానీ మనసులో భయాన్ని తీసేయలేక పోయింది సావిత్రి. దిక్కుతోచని దానిలో కూర్చుండిపోయింది.
        
                                                           *    *    *    *

    "ఏమిటి మళ్ళీ తల్లీ కూతుళ్ళు దెబ్బలాడుకున్నారా? మాటల తూటాలు, విసురుకున్నారా?" డైనింగ్ టేబుల్ దగ్గర గంభీర వాతావరణం చూసి 'ఆ సీన్లకి తెరపడిందనుకున్నాను. మళ్ళీ ఏం వచ్చింది గొడవ" తేలిగ్గా నవ్వి అన్నాడు అశోక్. కూతురు పెళ్ళి కుదిరాక ఇంట్లో ప్రశాంతత ఏర్పడింది. తల్లీ కూతుళ్ళ పోట్లాటలు , అరచుకోటాలు వాద ప్రతివాదాలు తగ్గాయి. మళ్ళీ ఈరోజెం వచ్చిందో ఇద్దరూ మొహాలు మాడ్చుకు కూర్చున్నారు. అర్ధం కాలేదు అశోక్ కి.
    ఇద్దరూ జవాబివ్వలేదు.
    "ఏమిటి , ఎనీ థింగ్ సీరియస్?"
    కొంపతీసి రెండు నెలలు తిరిగేసరికి గౌతమ్ అనుకున్నట్టు లేదు. నే చేసుకోను అని గానీ కూతురు అనలేదు గదా. "సావిత్రీ ఏం జరిగింది?" అసహనం ధ్వనించింది ఆ స్వరంలో.
    "మీ ముద్దుల కూతుర్ని అడగండి. నన్ను అడగదమెందుకు?"
    "కార్తీ ఏమయిందిరా నాన్నా" లాలనగా అడిగాడు.
    "అదిగో ..... ఈ ముద్దే దాన్నలా తయారుచేసింది." కయ్ మంది సావిత్రి. కార్తీక చేతిలో అన్నం పళ్ళెం విసిరి కొట్టి విసవిస వెళ్ళిపోయింది లోపలికి.
    "ఏం జరిగిందో చెప్తావా?" అసహనంగా అడిగాడు.
    "ఆ దినేష్ అనే అబ్బాయి..... ఇదివరకు ఇద్దరూ చాలా క్లోజ్ గా తిరిగారు కదా...."
    "ఆ .... ఆ... పెళ్ళి చేసుకుంటారనుకున్నాం. మళ్ళీ చేసుకొం అని అదే అంది గదా."
    "ఆ వాడే , ఇప్పుడ దీన్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడుట. నాతో తిరిగావు. ఎంజాయ్ చేశాం. ఇప్పుడు ఇంకెవరినో ఎలా చేసుకుంటావో చూస్తా అని బెదిరించి, సెల్ లో మన ఇంటిమేట్ ఫోటోలు నీ కాబోయే మొగుడికి చూపిస్తాను అంటున్నాడట."
    "ఎందుకలా..... ఇద్దరూ వాళ్ళంతట వాళ్ళే వద్దనుకున్నారు గదా" తెల్లబడ్డ మొహంతో అన్నాడు అశోక్.
    "ఇద్దరూ వద్దనుకోలేదు. ఇది వద్దనుకుంది. పెళ్ళి కాకముందే అధార్టీ చెలాయించి వాళ్ళతో ఎందుకు మాట్లాడవు వీళ్ళతో ఎందుకు మాట్లాడవు అంటూ అదుపులో పట్టాలని చూస్తె ఈవిడ సహిస్తుందా..... నీకు నాకు పడదు అంటూ చెప్పేసింది. ఇన్నాళ్ళు ఊరుకున్నాడు. ఇప్పుడు పెళ్ళి అనగానే వాడిలో అహం తలెత్తింది. తన అసలు రూపం చూపాడు."
    "మైగాడ్ ఇప్పుడెలా , ఏం చెయ్యాలి..... పెళ్ళి శుభలేఖలు కూడా వెళ్ళిపోయాయి. గౌతమ్ కి తెలిస్తే."
    "ఇందాకటినుంచి ఆలోచిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారం."
    "వాడు చెప్పేలోగా దాన్నే గౌతమ్ తో జరిగింది చెప్పేయమంటే."
    "నేనూ అదే అనుకుంటున్నాను. వాడు చెప్పేక సంజాయిషీ చెప్పుకునే కంటే నిజాయితీగా జరిగింది చెపితే గౌతమ్ ఎలా రియాక్ట్ అయినా ఇదే నయం పెళ్ళయ్యాక ఏ క్షణం గౌతమ్ కి చెపుతాడో అని టెన్షన్ లో బతికే కంటే ముందే చెప్పేస్తే ఫలితం ఎలా ఉన్నా ఎదుర్కొందాం. ఈ విషయం మీరె దానికి చెప్పండి. నేచేపితే వినదు" సావిత్రి భర్తకి సలహా ఇచ్చింది.

                                *    *    *    *
    "హరితా, ఐయామ్ ఇన్ ట్రబుల్ .... నీ సలహా కావాలె ."




Related Novels


Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

D Kameswari Kathalu

Teeram Cherina Naava

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.