Home » A V Gurava Reddy » Guravayanam - Part - 2


                                            సెలవోపాఖ్యానం

    సెలవు అనేమాట వినగానే, నాకు ఇప్పటికీ తెగ ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా పండుగ, ఆదివారంనాడు వస్తే చాలా బాధగానూ ఉంటుంది- అనవసవరంగా ఓ సెలవు పోయిందే అని.
    ఈ విషయంలో నాకూ, మా లేడీస్ కి తరచూ భేదాభిప్రాయాలు వస్తుంటాయి. ఆమెకి సెలవు అంటే- ఓ 24 గంటలు, పని అవ్వని, పనిచేయలేని, సోమరితనం. నాకేమో ఆ రోజు, పని సమస్యలన్నీ మూటకట్టి, అటకెక్కించి, చిన్నచిన్న ఆనందాలన్నీ అంబరానికి ఎగరేసే ఆటవిడుపు దినం.
    సెలవులు ఆనందించే పద్ధతి తెల్లోడి దగ్గర నేర్చుకోవాల్సిందే. ముందుగా వారానికి రెండ్రోజులు సెలవులు అతనికి. ఆ ప్రేరణతోనే, నేను ఇంగ్లాండునుంచి వచ్చాక పదిహేనేళ్ళపాటు, శనివారం నాకు నేనే సెలవు ఇచ్చేసుకున్నాను. కానీ ఈ మధ్యే ఆసుపత్రిని 'కాసుపత్రి'గా చేసే ప్రయత్నంలో నా శనివారం చచ్చిపోయింది. ఇంగ్లాండ్ లో మా ఓ బాస్ అంటుంటేవాడు- "ఇండియావాళ్ళు- పనిచేసే రోజుల్ని సెలవులుగా- నిమ్మళంగా, నింపాదిగా గడుపుతారు.
    సెలవుల్లోనేమో రోజంతా పరుగెత్తుతూ, పది sight seeingలు వందమంది స్నేహితుల ఇళ్ళకు visitingలు పెట్టుకుని తెగ హైరానా పడుతుంటారు" అని. నిజమే. మనమేమో సెలవంటే- పైసా వసూల్.
    నాణానికి రెండోవైపు- An English man's Fishing holiday గమనించండి. హోటల్ లో ఉదయం Breadకి Jam పూయడంతో మొదలవుతుంది దినచర్య.
    Jam కరెక్టుగా 2mm మాత్రమే ఉండాలి. Bread అంతటికీ- ఒకే మందంలో పూయాలి.
    వేరే కత్తితో-ఈ Jam మీద అలవోకగా, ఏమాత్రం తేడా వచ్చినా-Bread- ఓ బాంబులాగా పేలిపోతుందేమో అన్నంత జాగ్రత్తగా వెన్న పూస్తాడు. ఆ తర్వాత రెండు బ్రెడ్ ముక్కలని, కొత్త దంపతులు కౌగిలించుకున్నంత సున్నితంగా, సుతారంగా, అంటించేసి, అప్పుడు తినడం మొదలెడతాడు తన్మయత్వంగా.
    ఈ తంతు అంతా అవ్వడానికి ఒక్క గంట హీన పక్షం. అదే మనమైతేనా- ఈపాటికి, నాలుగు దోసెలు, ఆరు ఇడ్లీలు కుక్కేసి, మెక్కేసి పదినిమిషాల్లో బయటపడేవాళ్ళం. సూర్యుడు నడినెత్తిమీదకి వచ్చేసరికి- కాలువ పక్కన- కుర్చీ, పైన గొడుగు. ఓ చేతిలో గాలం, ఇంకో చేతిలో పుస్తకం, ఎడంపక్క- చేపకు తిండి, కుడిపక్కకి తనకి తిండి- ముందుపక్క మూడు 'బీరు' కాయలు- వగైరాలతో సిద్ధం.
    సాయంత్రందాకా అదే భంగిమ, మాటల్లేవు. ఫోన్ లు లేవు. ఫోటోలు లేవు. ప్రపంచానితో సంబంధమే లేదు తనూ, తన ఆలోచనలు తప్ప. మనవల్ల అవుతుందా ఇలా తాపీగా చేపలు పట్టడం?
    చిన్నతనంలో ఎండాకాలం సెలవులంటే- బాపట్ల నుంచి గుంటూరు. మేనత్తవాళ్ళింటికే- బస్సు ప్రయాణం. ప్రయాణంలో వాంతి వస్తుందని అబద్ధం ఆడేసి నిమ్మకాయ సోడా లాగించేయడం- మన తెలివితేటలకు నిదర్శనం.
    ఎండల్లో బచ్చాలాట, Charminar, Berkley ఓకులు-కుందుళ్ళు-బిళ్ళంగోడు, టెన్నిస్ బాల్ తో క్రికెట్, కబడ్డీ, ఐస్ ఫ్రూట్ లు, బాదంపాలు, టెర్రస్ మీద సామూహిక పడకలు, ఒకటో, రెండో సిన్మాలు, ఇంటర్ వెల్ లో సమోసాలు-నెలలు, రోజులులాగా బాగా గడిచిపోయేవి.
    ఆ రోజుల్లో హైదరాబాద్ బస్సులో వెళ్ళాలంటే ముందు సీట్లకోసం. ఎమ్.ఎల్.ఎ. నుంచి రికమెండేషన్ లెటర్ తెచ్చుకోవాలి.
    మెడికల్ కాలేజీలో, క్లాస్ మేట్స్ తో కలిసి వెళ్ళిన, బెంగళూరు, హంపి, గోవా సెలవులు గ్రూప్ హాలిడేస్ ల్లోని మజాని చూపెట్టాయి.
    ఆ రోజుల్లో AGFA camera ఉంటే- పెద్ద హీరోలా ఫీలింగు. సాగరసంగమంలో తిరపతిలాగా భంగిమలు.
    Neptune studioలో ప్రింట్ లు వేయిస్తే- సగం ఫోటోలు మొత్తం బ్లాక్. మిగిలిన సగం మొత్తం వైట్. ఇంగ్లాండ్ లో సెలవుల లెవల్ పెరిగిపోయింది.
    AGFA నుంచి Cannonకి, బస్సు నుంచి, విమానంకి, అరండల్ పేట (మేనత్త ఇల్లు గుంటూరులో) నుంచి అమెరికాకి promotion వచ్చేసింది.
    ప్రతి సంవత్సరం కనీసం నాలుగుసార్లైనా, సెలవులు సంపాదించి, ఆనందించి, శేషజీవితాన్ని గడపాలని నా చెడ్డ కోరిక. అలానే కొంచెం overaction చేసి 2019లో పది దేశాల సెలవుల పండుగ చేసుకున్నాను- దేవుడికి కూడా కుళ్ళు పుట్టినట్లుంది-
    "గురవా! ఐసా నహీ 'కరోనా' అని 2020లో గృహ నిర్బంధంలో ఉంచేశాడు. ముంచేశాడు.
    మళ్ళీ మంచిరోజులు, ఇంకా మంచి సెలవులు వస్తాయ్. మిత్రులారా దిగులుపడొద్దు. ముందస్తుగా 'శనివారం-నో పనివారం' కింద పరిగణించాలని ఓ ప్రజా ఉద్యమానికి నాంది పలుకుదాం.
    కనీసం సంవత్సరానికి రెండుసార్లైనా, కుటుంబంతో సెలవులు గడుపుదాం. అప్పికట్ల అయినా ఓకే, అమలాపురం అయినా ఓకే. అట్లాంటా అయినా ఓకే. కలిసి గడపడం ముఖ్యం. బిజీ కొడుకుని, లేజీ కూతుర్ని వెటకారం కోడలిని, అహంకారం అల్లుడిని అందర్నీ కలుపుకుని మరీ సెలవులు గడుపుదాం. ఎందుకంటే ఈ జ్ఞాపకాలే చివరకు మిగిలేది.
    నాకుమట్టుకు సెలవులు అంటే ప్రయాణాలు, పరిసరాలు, పచ్చదనాలు, పరిమళాలు, పరిచయాలు అవి మిగిల్చే అనుభూతులు, ఆనందాలు, అనుభవాలు- ఈ వారానికి సెలవ్. *




Related Novels


Guravayanam - Part - 2

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.