Home » vaddera chandidas » Anukshanikam 2



    అదెవత్తి ఆ క్రీనీడన ఎమర్జన్సీలో యిదీ కష్టమే. పోలీసులు మరీ అలుసుగా వాటంగా డబ్బు గుంజుతున్నారట. లేకపోతే మీసా అరెస్ట్. ఇందుకూ మీసా అరెస్టే__సినిమాలని అరెస్ట్ చెయ్యరేం_ యెన్ని సినిమాలు యెన్ని బోర్డులు_ షోలే సాలే ఎంటర్ ది డ్రాగన్ దట్ ఎంటర్స్ ఫియర్ ఇన్ ది స్కై, స్కైయిన్ ది ఫియర్, ఫర్ యెఫ్యూ డాలర్స్, డాలర్స్ ఫర్ యెఫ్యూ కభీ కభీ గౌరవనీయమైన వ్యభిచరింపు_ అప్పుడప్పుడూ కాదు యెప్పుడూ యెల్లప్పుడూ గౌరవనీయమైన యీ పవిత్ర భారతావనిలో .... ఇండియా బుక్ హౌస్ ఇండియా కాఫీ హౌస్ బుక్ లవ్వర్స్ కార్నర్ లవ్వర్స్ బ్యాక్ కార్నర్ ప్రేమ బురద చింది ప్రేమ బంక అంటుకుని ప్రేమ వూబిలో దిగబడి__ ప్రేమ సాహిత్యంలో నీరస ప్రేమ సాహిత్యంలో పాక్కుంటూ పోతూ_ సాహిత్యం సాల్ బెల్లో నోబెల్ బుల్లోడయ్యాడు_జ్ఞానపీఠం విశ్వనాథ హరీమన్నాడు_ఆయన మిత్రుడు శ్రీశ్రీ ఇంకా బతికే వున్నాడు. ఈయనకీ జ్ఞానపీఠం లక్షా వచ్చేదాకా బతికుంటాడేమో_ లక్షా పుచ్చుకుని ఆపైన విరసానికి క్షమాపణ చెప్పుకుని_రాకపోతే_ తృణీకరిస్తాను. బూర్జువా సత్కారాలు అని చెప్పుకుంటూ వుండగలడు_ జ్ఞానపీఠం నోబెల్ పీఠం. యెందరో చవటలకి ఇచ్చారు_యెందరో మహానుభావులకి ఇచ్చారు. నోబెల్ బహుమతి గతే అలా వుంటే యింక జిల్లా అవార్డులు_తాలూకా అవార్డులు వార్డు అవార్డులు _ ఇప్పుడు అందరికీ అవార్డులే. కళ్ళూ, చెవులూ, నోరూ మూసుకుని అందరికీ అవార్డులే జైలు అవార్డులూ మీసా అవార్డులూ......

                               99

    మూడేళ్ళ క్రితం పెళ్ళయిన దగ్గిర్నుంచి తనకి వాటా పంచి ఇమ్మని గొడవ పెడుతూనే వున్నాడు అంకినీడు. రెండేళ్ళకంటే యెక్కువ కాలం భరించలేకపోయారు ఇతని గోల.
    తన మామగారి వ్యాపారాల్లో వాటా కలుపుతానని కొన్నిసార్లు, ఒక ప్రసిద్ధ సినీ నిర్మాత ఒప్పుకున్నాడనీ అతనితో కలిసి సినిమా తీస్తాననీ కొన్నిసార్లు చెబుతూ వచ్చాడు. "మీ మామను కూడా పెట్టుబడి పెట్టమను" అని తండ్రి అంటే అత్తవారిమీద ఆధారపడటం తనకి అవమానంలా అనిపిస్తుందని వాళ్ళని అడగననీ చెప్పాడు.
    నళినితో సినిమా తియ్యటం ప్రసక్తి పెళ్ళయిన కొత్తలోనే తెచ్చాడు అంకినీడు. "సినిమానో యెనిమానో నీ డబ్బుల్తో నువ్వేమన్నా చేసుకో. నన్ను మాత్రం ఇరికించకు." అని నిర్మొహమాటంగా అంది.
    వాళ్ళ వూళ్ళో సుభాష్ చంద్రబోస్ అని ఓ నడివయసతను వున్నాడు. సినిమా తియ్యాలన్న ఉబలాటం వున్నవాడు. అంకినీడు వాళ్ళకి దూరపు చుట్టం. అతనిని కదలదీసి బాగా నచ్చజెప్పి ఒప్పించాడు. అతను మూడు లక్షలు పెట్టుబడి పెట్టేటట్లు, తను ఆరు లక్షలు పెట్టుబడి పెట్టేటట్లు, మిగతాది డిస్ట్రిబ్యూటర్ చేత సర్దుబాటు చేయించేటట్లు. నిర్మాతగా తనపేరు, కింద చిన్న అక్షరాలలో సహనిర్మాతగా అతని పేరు వుంటుందనీ, తనొక్కడే పనులన్నీ చూసుకోలేనట్లూ అతనినీ వుండమన్నాడు. "నేను కూడా వుంటాగా"_అని ధైర్యం తెచ్చుకున్నాడు అతను.
    వూళ్ళో ఫలానా అతను పెట్టుబడి పెడుతున్నాడని తెలిసి, "వీడిగోల భరించటం కష్టం. చావనీ. ఛాన్సు తగిల్తే తగుల్తుంది, పిక్చరు హిట్టయితే. సినిమాలు చూసి చూసి బాగా అనుభవం వుందిలే మన సన్నాసికి" అని తండ్రి ఒప్పుకున్నాడు. ఆ మీదట తల్లి ఆమోదముద్ర వేసింది.
    వాటాల దగ్గిరికొచ్చేసరికి తల్లి పేచీ పెట్టింది__ తను పుట్టింటి వారిచ్చిన ఆస్తి ఆడపిల్లలకే ఇస్తానంటూ. దానిమీద పెరిగిన ఆస్తీ విడిగా వున్న ఆస్థిలోనే మగపిల్లలకి వాటాలంటూ. అంకినీడుకి రెండు లక్షల వాటా వచ్చింది.
    క్యాష్ కావాలి__పిక్చరుకి కదా అన్నాడు. ఒక్కసారే దేనికి. వర్క్ సాగుతూండటాన్ని బట్టి తీసుకో. కానీ నీ వాటాకి మించి దమ్మిడీ అదనంగా ఇచ్చేదిలేదు__అన్నారు.
    పాత వారిని భరాయించటం కష్టం __ అని ఓ చాకులాంటి జేమ్స్ బాండ్ హీరోని, బాగా గ్లామర్ వున్న టాప్ హీరోయిన్ ని ఒకామెని ఎన్నుకున్నాడు.
    ఒక అందమైన అమాయక యువతి ఎమర్జన్సీ అరెస్టుల్లో పొరపాటున అరెస్టయ్యి జ్యూడీషియల్ కస్టడీలో వుంటుంది. ఆమె ప్రియుడు ఆమెని తప్పించి అడవి పరిసరాల పల్లె ప్రాంతానికి చెక్కేస్తాడు ఆమెతో. అక్కడ వాళ్ళు కొండజాతి దుస్తుల్లో డ్యూయెట్లు పాడుకుంటూ, పోలీసుల్నుంచి తప్పించుకునే యత్నంలో__హీరో ; స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటీర్లు, దేశంలో అల్లర్లు కల్పించి దోపిడీలు సాగించే సంఘవిద్రోహ వ్యక్తుల వలయాల్లోంచి తప్పించుకుంటూ __ చివరికి వాళ్ళందర్నీ పట్టించి, కథ మధ్యలో ఓ స్మగ్లరు ముఠాకి చిక్కిన తన ప్రేయసిని విడిపించుకుని __చివరికి పోలీసు మెప్పు పొందుతాడు. 'ఆంతరంగిక భద్రత కోసం ఆత్యయిక చంద్రునికో నూలుపోగు'గా తన చిత్రాన్ని సమర్పించాడు. క్రైమ్, సెక్సు, ఫైటింగ్స్, నాలుగురకాల డాన్సులు__సస్పెన్స్ లాంటి వాటిని సమకూర్చాడు.
    దీనిని ఓ ప్రసిద్ధ సినీ రచయితకి చెప్పి కథ మలిపించాడు.
    తెలిసినవాళ్ళతో చెప్పించుకుని ఓ ప్రసిద్ధ ఫిలిం పంపిణీ సంస్థ వాటాదారులైన జవర్ బాబు, శివాజీలకి కథ వినిపించాడు. భారీ చిత్రంగా నిర్మించదలిచినట్లూ పెట్టుబడి సగం తనే పెడతానని చెప్పాడు. సగం వాళ్ళని సర్దమన్నాడు.
    వాళ్ళు కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించారు. హీరో విషయంలో మొదట్లో సందేహించినా చివరికి ఒప్పుకున్నారు. అంకినీడు చెప్పిన హీరోయిన్ ని కాక మరో గ్లామర్ హీరోయిన్ పేరు చెప్పారు. అన్నిటికీ ఒప్పుకున్నాడు అంకినీడు. కొన్ని రీళ్ళు తియ్యండి దాన్నిబట్టి చూస్తాం అని వాళ్ళు అంటే, "మీ సూచనల ప్రకారమే తీస్తాగా. ముందుగానే ఒప్పందం వుంటే నాకు మానసికంగా ధైర్యంగా వుంటుంది. కొత్తగా ఫీల్డ్ లోకి దిగుతున్న వాణ్ని." అని అగ్రిమెంటుకి ఒప్పించుకున్నాడు. డైరక్టరుని కూడా డిస్ట్రిబ్యూటర్ల ఇష్టానుసారమే తీసుకున్నాడు. సినిమా పేరు 'చిక్కుల్లో చిన్నది' అని చెబితే వాళ్ళు సందేహించారు గానీ, చివరికి డైరెక్టరు రచయిత అందరూ 'కథమీద కూర్చుని' చర్చించి ఆఖరికి అదే పేరు ఖాయపరిచారు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.