Home » D Kameshwari » Kannitiki Viluventha Kathalu



                                              ఇది కథ కాదు!

    [ఇది కథ గాదు! కటిక నిజం! నిజ సంఘటనకు దిద్దిన మెరుగులు. 'కథ!' కన్న కడుపు తీపికంటే ఆకలి ఎక్కువదని, తల్లి పిల్ల మధ్య ఉండాల్సిన అనుబంధాలని కూడా దుర్భర దారిద్ర్యం జయిస్తుందన్నది__యిలాటి తల్లికూతుళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్న మనదేశంలో__యిలాటి కథలు నిరూపిస్తాయి. పాతికేళ్ళలో మనం సాధించిన ప్రగతి యిది.]

                                            *    *    *    *

    ఎండాకాలం. ఎండ నిప్పులు చెరుగుతూంది.పన్నెండు గంటల సమయం! బయటికి రావడానికే భయం వేసే వేడి!
    కర్టెన్లు అన్నీ లాగి గదిలోకి ఎండపొడ రాకుండా చేసుకుని, ఫ్యాన్ వేసుకుని నో రెండుకు పోతున్నడల్లా ఫ్రిజ్ లో నీళ్ళు త్రాగుతూ, వేడికి ఆపసోపాలు పడుతూ పుస్తకం చదవాలని తాపత్రయ పడుతున్నాను. ఆ వేడికి, ఉక్కకి కనీసం పుస్తకం కూడా చదవలేకపోతున్నాను.
    ఉన్నట్లుండి బయట పెద్ద గోల, ఏడ్పు అమ్మోయ్, బాబోయ్ అంటూ గోలగోల. పెద్ద కేకలు. ఏడ్పు.... చప్పున తలుపు తీసి బయటకి వెళ్ళాను.
    మా యింటి ముందు అప్పటికే ఓ గుంపు తయారైంది. పదేళ్ళ పిల్ల పెద్దగా గోడు గోడున ఏడుస్తూంది. ఓ ఆడమనిషి ఆ పిల్లని చింత బరికతో బాదుతూంది. జుట్టు పట్టుకు గుంజి ఎత్తి కుదేస్తూంది. కాలితో తన్నేస్తూంది. ఆ పిల్ల చేతిలో వున్న కట్టెల మోపును లాక్కోవాలని ప్రయత్నిస్తూంది.నోటికి రాని బండబూతులు తిడ్తోంది. అన్ని దెబ్బలుతింటున్న ఆ పిల్ల ఆ కట్టెల మోపును వదలడం లేదు! 'నే తెస్తానే అమ్మోయ్, కొట్టకే అమ్మో, నేనీయనేబాబో....' అంటూ దెబ్బలకి చేతులు అడ్డం పెట్టుకుంటూ వుంటే ఆ సందులో ఆడది కట్టెలమోపు లాక్కోవాలని ప్రయత్నించేంతలో ఆ పిల్ల మళ్ళీ మీదపడి ఆ మోపు లాక్కుంటోంది. 'వదలయే, నంజకానా, వదులుతావా నేదా, నీ చేతులిరగ నిన్నియాల సంపేస్తా నంజకూతురా, వదులు ముందు. వంటో ఓపికలేదు. నీ అంత ఎత్తు మోపేలా ఎత్తుకొస్తావే నంజ, వదల్తావా లేదా' అంటూ మళ్ళీ బాదింది. మళ్లీ ఆ పిల్ల ఏడుపు. ఆ పిల్ల కట్టెల మోపు వదలదు.
    చూస్తూంటే నాకేం అర్థం కాలేదు. ఆ పిల్ల ఎవరు, ఆడ మనిషి ఎవరు? ఇద్దరికీ ఏమిటి సంబంధం? ఆ పిల్ల తనంత బరువున్న కట్టెల మోపు, మోయలేని బరువు వున్నా అది మోసుకొస్తానని ఎందుకేడుస్తూంది? ఆ కట్టెలమోపు ఈయమని ఆడది ఎందుకు కొడ్తోంది? ఆ కట్టెల మోపు ఎవరిది? వాళ్లిద్దరూ ఏమవుతారు? ఏమీ అర్థంకాక గుమ్మం దిగి గేటు దగ్గిరకు నడిచాను. అప్పటికే మా కాలనీలో ఆడవాళ్ళందరూ ఆ గోలకి తలుపులు తెరుచుకుని బయటికివచ్చి నాలాగే చోద్యం చూస్తూ నిలబడ్డారు కాసేపు, ఆ పిల్లని అలా బాదుతూంటే చూడలేక అందరూ ముందుకు వచ్చారు సంగతి ఏమిటో తెలుసుకుందామని. ఆ గోలకి అసలందరూ ఆ వీధిలో ఏ దొంగతనమో జరిగింది కాబోలు దొంగని పట్టుకుని కొడ్తున్నారు కాబోలనుకుని ఆరాటంగా అంతా తలుపులు తీసుకు వచ్చారు, కాని జరుగుతున్నది వేరు.
    "ఏయ్ అమ్మీ.... ఆ పిల్లని ఎందుకలా చావకొడ్తున్నావు. చస్తుందనుకుంటున్నావా బ్రతుకుతుందనుకుంటున్నావా" అంటూ కేకలేసాను. "అసలు నీవెవరు అది నీకేం అవుతుంది. దాన్నెందుకు అలా కొడ్తున్నావు" అంటూ మా పక్కింటావిడ ముందుకు వెళ్ళి అడిగింది. అందరూ గుమ్మం దిగి రోడ్డుమీదికి వచ్చారు.
    నిప్పులు చెరిగే ఆ ఎండలో కాళ్ళకి చెప్పులయినా లేకుండా కాళ్ళు బొబ్బలు ఎక్కేంత ఆ వేడిలో ఆ పిల్ల నల్ల శరీరం కూడా ఎండకో, ఏడుపుకో, దెబ్బలకో ఎర్రబడి పోయింది. ఏడ్చి ఏడ్చి వగరుస్తూ ఆయాసపడిపోతూంది, వళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. అట్టలుకట్టిన జుట్టంతా పీకడంతో చీకేసిన తాటిపండులావుంది. కొట్టికొట్టి అలసిపోయి కాబోలు వగరుస్తూంది. మేం అందరం గుమిగూడడం చూసి కొట్టడం ఆపింది. ఆ పిల్ల ఆ మండుటెండలో నడిరోడ్డుమీద ఆ కఱ్ఱల మోపుని కౌగలించుకుని దానిమీద వాలిపోయి బెక్కుతూంది ఏడవడానికి ఇంక ఓపికలేనట్టు 'ఊ.... ఊ.... అమ్మో, బాబోయి' అంటూంది సన్నగా.
    "ఏయ్ నీవు మనిషివేనా అంత చిన్న పిల్లని పట్టుకుని అలా కొడ్తావా, దానికి నీవేం అవుతావు?" అంటూ గుడ్లెర్రచేసి అడిగాను ఆ పిల్ల స్థితికి జాలిపడి.
    "నా కూతురే అమ్మగారూ. మొండినంజ సూడండి యిన్ని దెబ్బలు తిన్నా మాట యినదు.... మోపు వగ్గదు, ఎంటరాయే ఎత్తుకుని అంటే ఎత్తుకో నేదు. ఏటిసేయ మంటారు సెప్పండి కొట్టక" అంది అందరివంకా చూస్తూ, నా తప్పేం లేదన్నట్టు చూసింది.
    దాని మాటలకి అర్థం బోధపడలేదు నాకు. స్వంత కూతురే అంటుంది, తల్లీ కూతురే కనక ఆ పిల్ల తను మోయలేని బరువు తల్లి ఎత్తుకొస్తానంటే హాయిగా బరువు వదుల్చుకోవచ్చుగదా! మరి ఆ పిల్ల ఆ మోపు ఎందుకు వదలదు? మోయలేకపోయినా తనే మోసుకొస్తానని ఏడవడం ఏమిటో వింతగా అన్పించింది.
    రోజూ మా వీధమ్మంట ఇలాంటి కఱ్ఱల మోపులు ఎత్తుకుని చాలామంది వెళ్ళడం రోజూ చూస్తూనే వుంటాను. పెద్ద పెద్ద ఎండుకొమ్మలు నరికి అవన్నీ ఓ మోపుకట్టి రెండు రూపాయలకి అమ్ముతారు. పెద్దవాళ్ళ వెనక ఏడెనిమిదేళ్ళ పిల్లల దగ్గిరనించికూడా వాళ్ళెత్తుకోగలిగిన బరువు మోపు ఎత్తుకుని వెడుతూంటారు అమ్మడానికి. ఆ చుట్టుప్రక్కల రెండు మూడు మైళ్ళ దూరాన వున్న కొండలలో చిన్న చిన్న అడవులలో ఈ కంపలు కొట్టి వూళ్ళోకి తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఉదయానే అడవికి పోయి కఱ్ఱలుకొట్టి ఊళ్లోకి తెచ్చి, అమ్మి ఆ తెచ్చుకున్న డబ్బుతో బియ్యం ఉప్పు పప్పు కొనుక్కొని సాయంత్రం అయ్యేసరికి ఇల్లు చేరతారు అలాంటివాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఈ తల్లీపిల్లా ఒకరు!
    "అదేమిటి ఎందుకీయనంటుంది, అది మోయలేకపోతే దాని మోపు నీకీయడానికేం?" నే అడగదల్చిన ప్రశ్న ఎదురింటావిడ అడిగింది.
    "అదేనమ్మా.... దాని మొండితనం సూడండి, నే ఎత్తుకెళ్ళి అమ్ముకొస్తానే యియ్యే అంటే ఇనదు, అదే తేవాలంటది, బుర్రమీద ఎత్తుకునేసరికి నడలేక కూలబడ్డది.... నన్నెల్లనీయదు. అది నడవలేదు.... ఎండ మాడిపోతంది. బేగి కర్రలమ్ముకుని ఎల్లాలంటే యీగుంట సచ్చింది మాట ఇనదు...." తల్లి ఫిర్యాదు చేసింది.
    "ఓలమ్మో.... నే నీయనే అమ్మో.... పొద్దుటేలనించి కఱ్ఱలు కొట్టినాను, నా నమ్ముకుంటానే.... ఇంతదూరం మోసుకొచ్చి నీకిస్తానేంటేవ్.... మోపు నా నెత్తినేట్టే.... ఈసారి నడుస్తానే అమ్మోవ్" అంటూ ఆ పిల్ల ఏడుస్తూ లేచి నిల్చుంది...." నీ జిమ్మడ.... ముదనష్టపుముండ___ ఈ తూరి నడిచి రాకపోతే ఈ కత్తెట్టి నీ పీక తెగగొడ్త" అంటూ తల్లి కఱ్ఱలు కొట్టే కత్తితీసి కూతురి మీద మీదకి వెళ్ళింది.
    "ఓలమ్మో, కొట్టకే. మోపెత్తే...." అంటూ ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల. "ఎత్తుకోవే నంజా, ఎత్తుకో, ఈ తూరి వగ్గేసావంటే సంపేస్తా" అంటూ ఆ తల్లి కూతురు కఱ్ఱల మోపు ఎత్తి దాని బుర్రమీద పెట్టి 'నడు నంజా నడు, అంటూ తన మోపు ఎత్తుకుంది. ఆ పిల్ల కఱ్ఱల మోపు బుర్ర మీద పెట్టగానే ఆ బరువుకి తూలిపోయినది. బుర్రమీద మోపు నిలుపుకోలేక క్రింద పడబోయి నిలదొక్కుకుంది. బుర్రమీదనించి జారిపోతున్న మోపు జారకుండా నిలుపుకోలేక అలాగే నాలుగడుగులు వేసి మరి నడవలేక మోపుతోపాటు క్రింద కూలిపోయింది. 'ఓలమ్మో' నే ఎత్తుకోలేనే.... అంటూ భయం భయంగా తల్లివంక చూస్తూ ఏడుపు లంకించుకుంది___
    తల్లి తన మోపు ధబాలున క్రింద పారేసి మళ్ళీ ఓ కర్రపుల్ల విరిచి వీరావేశంతో ఆ పిల్ల దగ్గిరకి వెళ్ళి బాదడం మొదలుపెట్టింది. 'ఏటే ఎదవ నంజా, ఇదేటి తమాసా అనుకున్నావేటి.... గుడిసేటి నంజా సావు ఇక్కడే.... నా ఎనకల మల్లా బయలుదేరావంటే సూడు.... ఆ కర్రలట్టుకుని సావు.... పీడాపోతది ఆ కర్రలతోటే నీకు నిప్పెడతా' అంటూ బాదుతూ, జుట్టుపట్టుకు ఎత్తికుదేసింది. అందరం వెళ్ళి అడ్డుపడేసరికి ఆగింది. చేతిలో పుల్ల విసిరేసి తనమోపు ఎత్తుకుని నడవడం మొదలుపెట్టింది.... 'ఓలమ్మో.... ఎల్లిపోవద్దే.... నన్నొగ్గి పోవద్దే.... 'ఆ పిల్ల ఏడుస్తూ తల్లి కాళ్ళకి అడ్డుపడింది. తల్లి కాళ్ళతో తన్నింది కూతుర్ని.




Related Novels


Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

D Kameswari Kathalu

Teeram Cherina Naava

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.