Home » Sree Sree » China Yaanam



    న్యూడిల్లీలోని చీనా రాయబారి మిస్టర్ చెన్ చావో - యెన్ 4-12-76 శనివారం రాత్రి తను రాయబార కార్యాలయంలో 6.30 నుండి 8.00 వరకు వీడ్కోలు, 8.00 గంటలకు విందు మా ప్రతినిధి వర్గానికి సమకూర్చారు. మా అందరి పక్షాన, డాక్టర్ బాసూ ప్రసంగించారు.
    రాత్రి 9.00 గంటలకు జన్ పద్ హోటల్ కు మరలి వచ్చి నిద్రపోయాను.
    5వ తేదీ ఉదయం ప్రతినిధి వర్గం అందరమూ బొంబాయికి బయల్దేరాము. సీతాట్రావెల్స్ ప్రతినిధి మా ప్యాస్ పోర్తులూ, టిక్కెట్లూ తలా ఒక ఎయిర్ బాగ్ ఇచ్చారు. టిక్కెట్లూ, ప్యాస్ పోర్టులూ మా ప్రతినిధి వర్గ కార్యదర్శి శ్రీ డి.సి.పాండే తీసుకున్నారు. డెలిగేషన్ గా వెళ్ళడంలో ఏదో సదుపాయం. ఎక్కడ ఎప్పుడు ఏ పత్రం పారేసుకుంటానో అనే తాపత్రయం లేదు.
    బొంబాయి విమానాశ్రయంలో మాకు చాలామంది ఘనస్వాగతం ఇచ్చారు. వారిలో ఎవరైనా తెలుగువాళ్ళు వున్నారేమో నాకు తెలియదు. డాక్టర్ కోట్నీస్ బంధువులు మమ్మల్ని వారింటికి ఆ సాయంత్రం తేనీటి విందుకు ఆహ్వానించారు. ఒక మరాఠీ లాయరు మిత్రుడు, బొంబాయిలో ఇండియా చైనా మిత్రమండలి ఏర్పాటు చేయదలచుకున్నాడనీ, దానికి ఉపాధ్యక్షుడుగా ఉండవలసిందనీ శ్యాంబెనిగాల్ కు ఒక ఉత్తరం రాసివ్వమనీ అడిగాడు. అలాగే రాసిస్తానన్నాను. మరాఠీ నవల "కొండూరా" కు హిందీ , తెలుగు, ఇంగ్లీషు, ఏ బాషలో నైనా అనువాదం వుంటే కావాలన్నారు. లేకపోతే మరాఠీ నవలనయినా సరే అన్నాను. (మా అమ్మాయి మంజుల మరాఠీ భాష చదువుతుంది , బాగా మాట్లాడుతుంది.)
    అయిదవ తారీఖంతా (సాయంత్రం తేనీటి విందు మినహాయిస్తే) షేరాటాన్ హోటల్ లోనే ఉన్నాను. స్వీస్ ఎయిర్ అతిధిని కాబట్టి ఉండగలిగాను గాని ఎవరో లక్షాధికారులు మాత్రమే బస చెయ్యదగ్గ హోటల్ అది! ఒక్క గది అద్దె మాత్రమే రోజుకు 250 రూపాయలు 20, 40, 30 రూపాయల కార్డులు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు) స్వీస్ ఎయిర్ వాళ్ళు నాకిచ్చారు. ఉదయం ఒక అమ్లేట్లూ, మధ్యాహ్నం మరో ప్లేటు అన్నం చికెన్ కూరా, రాత్రి క్వార్టర్ బాటిల్ రమ్మూ, మరికొంచెం భోజనమూ, రెండుసార్లూ మద్రాసుకు ట్రంకాల్సూ ఇవి నా అదనపు ఖర్చులు. మర్నాడు ఈ పద్దుల కింద నా దగ్గర వున్న 50డాలర్లలో 30 డాలర్లూ (సుమారు 290 రూ.) తరిగిపోయాయి. మనదేశంలో హోటల్ పరిశ్రమ ధనస్వామ్య దేశాల అంతర్జాతీయ స్థాయిని అందుకున్నందుకు సంతోషించాను గాని, సామాన్య మానవుడు ఆ యిరు పంచలకు చేరడానికైనా వీలులేదని తలచుకున్నప్పుడు నా మనస్సు చివుక్కుమంది.
    6వతేదీ ఉదయం బెనిగాల్ కు ఉత్తరం రాసి, దాన్ని విమానాశ్రయానికి వచ్చిన లాయర్ మిత్రుడికిచ్చాను. "ఉత్తరం కేరాఫ్ ఇండియన్ ఎంబస్సీ , పీకింగ్ అని రాయండి" అని కూడా రాశాను.
    స్వీస్ ఎయిర్ విమానం బయల్దేరింది. బొంబాయి నుంచి ఎక్కడా ఆగకుండా పీకింగ్ కు 6గంటల 40 నిమిషాల ప్రయాణం. నా వాచీలో 3గంటలయే సరికి అప్పుడే పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తున్నాడు. అదో మరపురాని దృశ్యం. నేను కూర్చున్న స్థలం కిటికీ దగ్గరనే వుంది. కిటికీలోంచి చూస్తుంటే కనుచూపుమేర దాకా తెల్లని మేఘాలు పాలసముద్రం అని వర్ణించవచ్చు. సూర్యుడు క్రమక్రమంగా ఆ మహా సముద్రంలో మునిగిపోతున్నాడు.
    నేలకు పదివేల మీటర్ల ఎత్తున మా డిసి 8-62 జెట్ విమానం ప్రయాణిస్తోంది.
    పీకింగ్ సమీపిస్తున్న సూచనగా విమానం ఎత్తూ తగ్గుతూ వచ్చింది.
    నేను సిగరెట్ ఆర్పేసి సీట్ బెల్ట్ తగిలించుకున్నాను. కొద్ది సేపటిలో విమానం చిన్న కుదుపుతో నేలను తాకింది చీనా భూభాగం!

                                           నాలుగు

    పీకింగ్ విమానాశ్రయంలో మా ప్రతినిధి వర్గానికి అఖండ స్వాగతం లభించింది. మన రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు ముగ్గురు ఉన్నతోద్యోగులు కూడ అక్కడ ఉన్నారు. మా సభ్యులందరికీ చీనావారు ముమ్మోదటిగా ఓవర్ కోట్లిచ్చారు. అవి వేసుకోకపోతే చలిబాద భరించడం కష్టం. ఆ రోజంతా పీకింగ్ నగరంలో గొప్ప ,మంచు కురిసిందట. అందుచేత (జారుగా ఉన్న తారురోడ్డు మీదుగా) కార్లను అతి జాగ్రత్తగా మెల్లగా నడిపించుకుంటూ మమ్మల్ని పీకింగ్ హోటల్ కు తీసుకెళ్ళారు. నా ప్రక్కన కూర్చున్న విన్ అనే యువకుడు చక్కని ఇంగ్లీషు మాట్లాడుతాడు. సుమారు రెండు గంటల ప్రయాణం రెండు నిమిషాలలో గడిచిపోయినట్లనిపించింది.
    కారులోంచి ఆకాశం వైపు చూస్తె చెదురు మదురుగా మబ్బులు కనిపించాయి. How Chinese are the clouds! (ఎంత చైనీయంగా ఉన్నాయి మేఘలు) అన్న సర్రియలిస్టు కవి వాక్యం గుర్తుకొచ్చింది.
    విన్ తన కాలేజీ జీవితపువిశేషాలు చెబుతున్నాడు. పీకింగ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో యమ్మే ప్యాసయ్యాడు. ఆంగ్లసాహిత్యంలో అతనికి చక్కని పరిచయం ఉంది. ఆమాటాఈమాటా చెప్పుకుంటూ ఉండగానే , పీకింగ్ హోటల్ దగ్గర పడింది. అది పద్దెనిమిది అంతస్తుల పెద్ద భవనం . ఎప్పుడూ దేశ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధి వర్గాలతో క్రిక్కిరిసి ఉంటుంది.
    లోనికి ప్రవేశించగానే ఎదురుగా ఒక మావో సూక్తి కనిపించింది. చైనీస్ అక్షరాలూ , ఆ క్రిందనే ఇంగ్లీషు తర్జుమా ఉన్నాయి. We have friends all over the World (మనకు ప్రపంచమంతటా స్నేహితులున్నారు) అని ఈ సూక్తి అర్ధం.
    మా ప్రతినిధి వర్గంలో మైత్రేయీదేవి అనే బెంగాలీ కవయిత్రి ఉన్నారు. ఆమె రవీంద్రనాధ ఠాగూరుఅభిమాన పుత్రిక అని తర్వాత తెలిసింది. "మా గురుదేవులు కూడా ఈ మాటే ఏనాడో అన్నారు. " అని ఈవిడంటే "ఏమన్నారు?" అని నేనడిగాను. "I have a home in every country" (ప్రతి దేశంలోనూ నాకో ఇల్లుంది) అన్నారట రవీంద్రులు. "మావో సూక్తికి, రవీంద్రులన్న దానికీ చిన్న తేడా వుంది తల్లీ! గురుదేవులు idealist, individualist, romanticist కవి కాబట్టి ఎంత సేపూ "నేనూ, నేనూ, నా కది వుంది, ఇది వుంది' అంటారు. మావో nationalistci, realistic, communistic కాబట్టి "మేము, మనమూ " అంటారు. ఆ చిన్న భేదాన్ని మనం గుర్తించా"లన్నాను నేను.




Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.