Home » vaddera chandidas » Anukshanikam 2



    అంత వణుకులోనూ, 'వేశ్య కాదూ! మరి?' అనుకున్నాడు రామ్మూర్తి అయోమయంగా.

                              94

    యివాళ్టి యీ మే యిరవై యేడో తేదీ వార్తాపత్రికలో పతాక శీర్షిక చూసి, అదే మొదటి పేజీ పెద్దగా బొమ్మ వేశాడు శ్రీపతి.
    పాలిపోయిన గులాబీ రంగులో జయప్రకాశ్ నారాయణ్ బొమ్మ నిలువెత్తున వేశాడు. కుడిభుజం మీద మొరార్జీని వేశాడు, కాషాయం రంగులో యెడమ భుజం మీద చరణ్ సింగ్ ని వేశాడు, పచ్చరంగులో కుడి చంకలో నల్లరంగులో వాజ్ పేయీని, యెడమ చంకలో మెరూన్ రంగులో ఫెర్నాండెజ్ ని వేశాడు.
    ఆ బరువు మొయ్యలేక కుప్పలా కూలేలా కనిపిస్తున్నా పళ్ళబిగువున భారం మోస్తూ, పైకి ఇకిలిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు బొమ్మకింద, పసుపు రంగులో "Punity" అని రాశాడు.
    నీటిరంగులలో ముంచిన ఆ ఆరు బ్రష్టుల్నీ నీళ్ళగ్లాసులో వేశాడు.
    ఓ నిమిషం ఆ బొమ్మవంక చూసి ఫక్కున నవ్వి, రెండు చేతుల్తో లుంగచుట్టి మూలకి విసిరాడు.
    పేము కుర్చీలో యేటవాలుగా కూచుని, కుడిచేతి చూపుడువేలి కణుపుతో పెదాలమీద చిన్నగా వత్తుకుంటూ పైకప్పుకేసి చూస్తూ వుండిపోయాడు.
    రెండు నెలలక్రితం ఓ మధ్యాహ్నం హోటల్లో భోంచేసి గూటికి వస్తూ, దారిలోవున్న పెయింటింగ్ కాలేజీలోకి వెళ్ళాడు.
    ఒక హల్లో కొందరు కాన్వాసుల మీద రంగులు పూస్తున్నారు. ఒకతను అజమాయిషీగా చూస్తున్నాడు. అప్పుడప్పుడు యేదో చెబుతున్నాడు మాస్టారు. యింకో హాల్లో కొందరు కూచుని లైన్ డ్రాయింగ్ వేస్తున్నారు_ పెన్సిళ్ళతోనూ బ్రష్ లతోనూ.
    ఆ మాస్టారు బయటికొస్తే, "నేను పెయింటింగ్ ప్రారంభిద్దామనుకుంటున్నాను ఏమంటారు" అన్నాడు శ్రీపతి.
    వింతగా చూసి, "మీపేరు? డ్రాయింగ్ సర్టిఫికెట్లూ అవీ యేమైనా వున్నాయా. అడ్మిషన్స్ ఇంకో నాలుగు నెలలకి వచ్చే జులైలో వుంటాయ్" అన్నాడు అతను.
    "అడ్మిషను అక్కర్లేదు. చిన్నప్పుడు డ్రాయింగు మాష్టారు చెప్పిన బొమ్మలు కూడా వెయ్యలేదు. పెయింటింగ్ ప్రారంభిద్దామనుకుంటున్నాను. ఏమంటారు?" అన్నాడు శ్రీపతి.
    విస్మయంగా చూసి, చిన్నగా నవ్వి, "బేసిక్ ప్రిన్సిపుల్స్ నేర్చుకోండి ముందు. ఆ తరువాత పెయింటింగు" అన్నాడు అతను.
    "అలాంటి రూళ్ళబద్దీలతో మొదలెడితే మీలాగా పెయింటింగ్ మాస్టారుగా వుండిపోవాల్సొస్తుంది. ఐ మస్ట్ డు యిట్ స్ట్రెయిట్ యెవే" అన్నాడు శ్రీపతి.
    కొంచెం పరిహాసంగా చూసి, "రోడ్లమీద మసిబొగ్గుతో బొమ్మలేసి పక్కన కూచుని, పారేసిన పైసలు ఏరుకుంటూ యెవరన్నా కనిపిస్తారు. అట్లాంటి వాణ్ని చూసి సంప్రదించండి" అని అంటించాడు అతను.
    "యీ స్కూల్లో లాగా కాకుండా అలాంటి చోట్ల యెలైన్ ఆఫ్ ఆర్ట్, యె ప్యాచ్ ఆఫ్ ఆర్ట్ వుండొచ్చేమో" అని, అతని ముఖంలోకి చూసి చిన్నగా నవ్వి బయటికి వచ్చి చకచకా నడుస్తూ__
    వంద గజాలు గడిచాక__వెనక్కి తిరిగి, నడుస్తూ, రిక్షా కనిపిస్తే కూచుని అబిడ్స్ లోనూ కోఠిలోనూ దిగి, పెయింటింగ్ సామగ్రి కొనుక్కుని గూటికి చేరాడు. అప్పటి నుంచి బొమ్మలు వేస్తున్నాడు.
    నెల రోజుల తరవాత తలుపులకి వేసే రంగుల డబ్బా తెచ్చాడు. ఆ రంగుల్లో వేళ్ళు పంపింపజేస్తూ, విదిల్చుతూ, ఆన్చుతూ, మీటుతూ, గీస్తూ, మెలితిప్పుతూ, కాన్వాసుమీద పెయింటింగ్స్ తయారుచెయ్యసాగాడు. పెయింటింగ్స్ ప్రతిదాన్లోనూ ఒక భావం ప్రస్ఫుటంగా స్ఫురిస్తుంది__ ఒక్కచూపులో కాక కాసేపు దీక్షగా చూస్తే, ప్రతి పెయింటింగ్ కీ వెనకవైపున ఆ భావం పేరు రాశాడు జాణతనం, భీతి, కరుణ, అతి వినయం, తృష్ణ, మోహం, ధైర్యం, మూర్ఖత్వం, అశాంతి, సుషుప్తి, చైతన్యం__ వంటి పేర్లు.
    లేచి యీజెల్ వైపు నడిచాడు. వారంరోజుల క్రితం ప్రారంభించిన కాన్వాసు. ముగింపు దశలో వుంది.
    నల్లగా మెరుస్తూన్న విశాలమైన తారు రోడ్డు దానిమీద గులాబీ రంగు ఫోం పరుపు. దానిమీద విశ్రమించిన యువతి__ యాంకీ తెలుపు శరీరం మొలమీద కప్పినట్లుగా, తెరిచి పరచిన ప్లేబోయ్ పత్రిక. చనుకట్టుకి బిగించిన నీలం రంగు బ్రాసియరు మీద యెనామెల్ తెలుపులో "బాండ్ స్ట్రిబ్ ఫిట్టింగ్స్" అని ఇంగ్లీషులో అక్షరాలూ. పైన యెడమవైపున ఉదయిస్తున్న చంద్రుడు ఆ పక్కన మూడునాలుగు నక్షత్రాలు. పాలిపోయిన పసుపురంగు ఆకాశం, పైన కుడివైపున యెగిసిపడుతున్న యెర్ర రంగు సముద్రం. పైన మధ్యలో తెల్లగా సెగలు కక్కుతున్న అపరాహ్ణపు సూర్యుడు. పెయింటింగ్ దిగువన "అట్లాంటిక్ జిలబాల" అని రాశాడు తెలుగులో.
    దగ్గిరికి వెళ్ళి బ్రష్ అందుకుని ఆమె గోళ్ళకి నేరేడు పండురంగు పూయసాగాడు.
    ఒక అరగంట తరవాత మంచంమీద పడుకున్నాడు. అదే గదిలో పెయింటింగ్ సరంజామా__ మంచం, టేబుల్ కుర్చీ, పుస్తకాలు. గజిబిజిగా చిక్కురొక్కురుగా కనిపిస్తుంది గది, చూడగానే కానీ మురికిగా అనిపించదు.
    పది నిమిషాల్లో నిద్రపట్టేసింది. మెలుకువ వచ్చేసరికి సాయంత్రం ఆరు అయింది. లేచి స్నానించాడు. అలా బయటికి వెళ్ళి టీ తాగి రావాలని బట్టలు మార్చుకుంటూ వుండగా, ముందు తలుపుల మీద చప్పుడు, "శ్రీపతిగారూ" అని పిలుపు. ఆ గొంతు యెవరిదో గుర్తించగలడు. ధనలక్ష్మి అని, ఓ ప్రయివేటు కంపెనీలో స్టెనో టైపిస్టు. అదే బంగళాలో పైన ఒక వాటాలో వుంటుంది తండ్రి, ముష్టి రంగనాథం యాడీసీగా చేసి రిటైరై కూతురితో వుంటున్నాడు. యిద్దరు కొడుకులు. పెళ్ళిళ్ళయి భార్యా పిల్లలతో వుంటున్నారు. కోడళ్ళతో అతనికి పొసగదు. పిసిగినా కొడుకులతో సరిపడదు. అందుకని పెళ్ళికాని యీ కూతురితో వుంటున్నాడు. అనారోగ్యం. "నీ పెళ్ళి చూసి కళ్ళు మూస్తా తల్లీ" అంటుంటాడు. "నువ్వు కళ్ళు యుయ్యకుండా వుండటం కోసమైనా నేను పెళ్ళిచేసుకోకుండా వుంటాను నాన్నా." అని చమత్కరిస్తుంటుంది. కట్నం ఇవ్వటానికి దమ్మిడీ ఆస్తి లేదు. అతనికి వచ్చే పెన్షన్ అతనికే చాలదు. ప్రావిడెంట్ ఫండ్ కొద్దిగా వస్తే, అది కొడుకులు గుంజేసుకున్నారు దాంతో_ ఒక కొడుకు పెళ్ళానికి రాళ్ళ నెక్లెస్ చేయించాడు, రెండో కొడుకు మూడొందలు గజాల స్థలం కొన్నాడు సరూర్ నగర్ వైపు లే అవుట్స్ లో.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.