Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                        శ్రీ వీరరాజు, సున్నం

    దురాక్రమణ

    మంచి తృణీకరించి, యభిమానము ద్రుంచి,
        యకార్యమంచు దా
    నెంచక, పంచశీల గణియింపగ,
        స్నేహితులంచు నెంచ కొ
    క్కించుక, భారతీయుల జయింపగ
        "చౌ-ఎను-లై" సిపాయులన్
    బంచెను వంచకుండని ప్రపంచజనుల్
        నిరసించి తిట్టగన్.

    జవహరులాలు శాశ్వత్ కీర్తి దిశదిశల్
        వ్యాప్తిజెందుట సహింపని కతాన,
    ఆశించునటు లాసియా ఖండమున దన
        'కమ్యూనిజము' పెంపుగనని కతన,
    భారతదేశ సంపదలు దినదినాభి
        వృద్ధినొందుట కోర్వలేని కతన,
    భారతీయులు పాడిపంటలతో సుఖి
        యించుట గని మచ్చరించు కతన

    కనులలో నిప్పులను పోసికొని హటాత్తు
    గా "చౌ-ఎను-లయి" ధర్మమార్గమును దప్పి
    మిత్రరాజ్యంబుపై దండయాత్ర జరిపె;
    నితనికంటె గృతఘ్ను డెందేని కలడె?

    న్యాయము దప్పి తా దొలి దు
        రాక్రమణ మ్మొనరించి "ఇండియా
    యే" యొనరించెనంచు వచి
        యించి ప్రపంచము విశ్వసింపగా
    జేయ నభూత కల్పనల
        జేసి "చౌ-ఎన్-లయి" చాటుచుండినన్,
    మాయురె! వాని మాటలను
        నమ్మెడు వారాలు లేరు ధారుణి

    ఆయన సత్యదూర డగు
        నంచు గ్రహించిన రీతిగా "చౌ-ఎన్-
    లై" యను పేరు పెట్టినటు
        లన్ గనుపట్టెడు, "లై" యటన్న "నాం
    గ్లేయము"లో నబద్ధమగు;
        నిక్కున మాతని పల్కులందు నౌ
    రా! యణుమాత్రమైన నిజ
        మన్నది యున్నదె మచ్చుకేనయున్!

    "చీనీభారత భాయి, భాయి" యనుచున్ జెల్మిన్ బ్రదర్శించుచున్
    చైనా పెద్దలు రాజ్య విస్తరణ కాంక్షన్ మారణాస్త్రాలతో
    సేనల్ పంపిరి "ఇండియా"ను తొలి జేజిక్కించుకొండంచు, నా
    పై నాశించిన ఆసియాను కబళింపన్ వచ్చునం చెంచుచున్.

    పోరున గెల్చి, యాంగ్ల ప్రభు
        వున్ దొలగించి, స్వరాజ్యలక్ష్మి జే
    కూరగ జేసి మన్ననల
        గొన్న పరాక్రమశాలులైన తత్
    భారత వీరసైనికుల
        పౌరుష మప్పుడె విస్మరించినా
    రౌర! పెకింగు పెద్దలు మ
        దాంధులు, జ్ఞానవిదూరు లౌటచే.

    ఆటంబాంబులు మాకు నున్నవని బా
        హాటమ్ముగా, మాటికిన్
    జాటెన్ ధాటిగ "చౌ-ఎన్-లయి" భయా
        నన్ భారతీయుల్ మరే
    యాటంకంబును లేక లొంగెదరటం
        చాసించి; యవ్వానికిన్
    యాటంబాంబులె యున్న నీశ్వర స
        హాయం బేది నిర్జింపగన్.

    అనుచితరీతి శత్రువు దురాక్రమణం బొనరించినంతనే
    కని వినినంత యైక్యమును గాంచిన భారతజాతి భక్తితో
    ధన కనకాదు లంపెను ప్రధానికి తత్ క్షణ మాతృదేశ ర
    క్షణకు బ్రవాహరీతిగ జగజ్జను లచ్చెరువొంది మెచ్చగన్.

    అనుపమ దేశభక్తి గల
        యంగన లెందరొ మాతృదేశ ర
    క్షణ నిధికై యయాచితము
        గా దమ స్వర్ణ విభూషలన్ సమ
    ర్పణమును సల్పి, యుద్ధమున
        భారత వీరులతో స్వరాజ్యం ర
    క్షణ మొనరింప గంకణము
        కట్టిరి వైరులు తల్లడిల్లగన్.

    శాంతి కాంక్షించి మిత్రరాజ్యములు న్యాయ
    సమ్మతమ్మగు కొన్ని సూచనలు చేసి,
    యిరువురును సఖ్యపడుడని హిత మొనర్ప,
    ద్రోహబుద్ధిని నవి చైన త్రోచివైచె.

    న్యాయము దప్పి సంగర మొ
        నర్చుట నాశనహేతువంచు, గాం
    గేయ, జనార్దనాది మహ
        నీయులు చెప్పిన లెక్కసేయ కే
    మాయెనొ కౌరవేశు! డటు
        లయ్యెడు "చౌ-ఎను-ల" య్యు కూడ చై
    నీయులతో, జయం బొదవు
        నిక్కము భారతజాతికే తుదిన్.

                                        *  *  *  *           




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.