Home » D Kameshwari » Madhupam



                               వడ్లగింజలో బియ్యం గింజ
    
    ఆదివారం సాయంత్రం ఐదు గంటల వేల "సినిమా కెడదాం పదండి ఏం తోచడం లేదు " ఓ శ్రీమతి శ్రీవారితో అంది.
    ఇంటాయన పేపరులో "సుడోకు" నించి తలెత్తి "లేడికి లేచిందే పరగన్నట్టు హటాత్తుగా ఆదివారం ఐదు గంటలకి సినిమా కెడదాం అంటే సినిమాకి టిక్కెట్టు ఎలా దొరుకుతుంది" ఎత్తిన తల మళ్ళీ వంగింది పేపరులోకి.
    "మహారాజాలా దొరుకుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది. కొత్త రిలీజ్ సినిమా వద్దు. కాస్త పాతబడిన డానికి హాయిగా దొరుకుతాయి టిక్కెట్లు. ముందు లేచి తయారవండి" దబాయించింది యిల్లాలు'.
    "అబ్బ ఆ చెత్త సినిమాలు డబ్బిచ్చి మరీ చూడాలా - అయినా రోజుకి నాలుగు సినిమాలు తక్కువ కాకుండా చూపిస్తున్నా ఇంకేం మిగిలాయి చూడడానికి."
    'అబ్బ ఏంటండి , ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు. ఎంతయినా పెద్ద తెరమీద చూసినట్లుంటుందా ఇంట్లో టీవీలో చూస్తె - ఏ ఏడాదికో , ఓసారి బుద్ది పుట్టి ఆడిగితే నా ముచ్చట తీర్చడాని కన్నా సరే అనరు" బుంగమూతి పెట్టింది ఇల్లాలు.
    బుంగమూతి పెట్టిన ఇల్లాలు ఏ కొత్తగా పెళ్ళయిన ఇరవై ఏళ్ళ ముద్దుగుమ్మో పదహారేళ్ళ బాలాకుమారో గాదు. రిటైరయి యింట్లో కూర్చుని "సుడోకు' లు పూరించుకుంటున్న అరవై మూడేళ్ళ భర్తగారికి ఏభై ఎనిమిదేళ్ళ ఇల్లాలు రాజేశ్వరి. "ఏమిటి బాబూ. ఆ దిక్కుమాలిన గుడ్డలిప్పుకు అడే తైతక్కలు చూడడానికి ఓ రెండొందలు తగలేసుకు వెళ్ళాలా" చిరాగ్గా అన్నాడు మూర్తి అనబడే కేశవమూర్తి.
    "గుడ్ద్దలిప్పుకు తైతక్కలాడే సుందరాంగులే మీ మగాళ్ళకి నయనానందకరం గదా! ఓ విసురు విసిరింది యిల్లాలు.
    "అవన్నీ యవ్వన వికారాల వయసులో. ఆ స్టేజి దాటి పుష్కరం అయిందిలే. అమ్మా తల్లీ, ఏ పక్కింటి పిన్నిగారితోనో వెళ్ళి నన్నిలా వదిలేయ్ నీకు పుణ్యం ఉంటుంది." చిరాగ్గా అన్నాడాయన.
    "ఆ దిక్కుమాలిన "డోకులు" ప్రతి పేపర్లో తగలేడ్తున్న వాళ్ళకి బుద్ది లేదు. మాట పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోయి ఆ అంకెలు నింపడమే పుణ్యం పురుషార్ధంలా రోజంతా నాలుగు పేపర్లు పట్టుకు అతుక్కుపోవడం, లేస్తారా లేవరా - వాదులాటమాని తయారవండి లేదంటే నేనోక్కర్తినే పోతాను" బెదిరించింది యిల్లాలు.
    'అమ్మా బతికించావు తల్లీ. హాయిగా నీపాటికి నీ ఇష్టం నా పాటికి నా యిష్టం. అంటూ నీ స్వాతంత్ర్యం ప్రకటించేశావు చూడు. ఇంక ఆ మాట మీద నిలబడి నీ యిష్టం వచ్చిన చోటికి హాయిగా తిరిగి రా పో. కావలిస్తే నీవు వచ్చేవేళకి రైస్ కుక్కరు మీతనోక్కేసి అన్నం వండేస్తాను వేడిగా."
    "అబ్బే అంత కష్టం వద్దు. వెలికి ఎందుకు పనిచెప్పడం. హాయిగా సుడోకు చేసుకోండి. పెళ్ళాం ముచ్చ్హట తీర్చని మొగుడు, కాపుకాయని చెట్టు వున్నా లేకపోయినా ఒకటే.... ' కోపంగా అంది యిల్లాలు.
    "ఓసి నీ అఘాయిత్యం కూల. సినిమాకి తీసికెళ్ళనంత మాత్రాన మొగుడున్నా లేకపోయినా ఒకటే అనేటంత దూరానికి వచ్చేశారు మీ ఆడవాళ్ళు..... అనేవన్నీ అంటూ ఏదో మగాళ్ళు రాసిరంపాన పెడ్తున్నట్లు గగ్గోలు..... 'మొగుణ్ణి కొట్టి మొగసాల ఎక్కడం " అంటే ఇదే కాబోలు....."
    'ఆపండిక , సినిమాకి రమ్మంటే ఇంతగోల....." విసురుగా వెళ్ళిపోయిందావిడ. మరో పదినిమిషాలలో చీర సింగారించుకుని వెడుతున్న రాజేశ్వరిని చూస్తె ..... మనసులో కాస్త ఆశ్చర్యపడ్డారాయన. పెళ్ళయాక మొదటిసారి ఆవిడ ఒంటరిగా వెళ్ళిందన్నది తట్టాక, పోనీలే తననిబ్బంది పెట్టకుండా ఆవిడ సరదాలు ఆవిడవి తీర్చుకొని.... అనుకున్నాడా భార్తగారు.

                                *    *    *    *

    సినిమానించి చాలా హుషారుగా వచ్చింది రాజేశ్వరి. "మంచి సినిమా మిస్ అయిపోయారు" విలాసంగా ఓ చూపువిసిరి లోపలికెళ్ళిపోయింది. "ఓ భోం చేశారన్న మాట. అంతేలెండి. మగాళ్ళ కోసం ఆడవాళ్ళు ఎదురుచూస్తూ ఆగాలి కాని పెళ్ళాం కోసం వేచే మొగుళ్ళు ఎవరు?' నిష్టూరంగా అంది.
    'చక్కగా సినిమా చూసొచ్చి పైగా చెప్పాడాలొకటి. నేను ఎనిమిది గంటలకల్లా తింటానని తెలీదా. నీలా ఈ చిరుతిండి ఆ చిరుతిండి తిననని తెలుసుగా..... చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి ఎరగదన్న సామెతుంది కదా....' అయన ఉక్రోషంగా అన్నాడు.
    "ఏం చక్కగా మిమ్మల్ని సినిమా చూడద్దన్నానా - చిరుతిళ్ళు తినద్దన్నానా. సరే లెండి .... ఇవాళ నేనోక్కర్తినే సినిమాకి వెళ్ళడం ఓ మంచి సరదా అనుభవం సుమండీ.." స్టూలు జరుపుకుని అయన పడకకుర్చీ దగ్గరగా కూర్చుని చాలా హుషారుగా అంది వయ్యారాలు పోతూ , ఆవిడ కులుకులు ఒరకంటా చూసి చూడనట్టు చూసి ఏం మాట్లాడలేదు - అడగక పోయినా తనే చెప్తుంది అని తెలిసి "ఏమిటి, ఎందుకు" అనడిగితే మీ సొమ్మేం పోతుందా, సినిమా కెళ్ళాలని కుళ్ళు మీకు" అంది నవ్వి." "నిజంగా , మీరు రాకుండా ఒక్కర్తిని వెళ్ళడం బాగుంది సుమండీ, యిన్నాళ్ళు మిమ్మల్ని బతిమిలాడ్తూ , రానంటే అలుగుతూ వెర్రి మొగంలా వుండి పోయాను - ఈ తెలివి ముందే వుంటే ఎంత బాగుండేదో - "ఆయన్ని ఊరిస్తున్నట్లుంది.
    "పోనీలే ఇప్పటికన్నా గ్రహించావుగా.... ఇంకేం నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగింక" ఉడుకుమోత్తనం ధ్వనించిందా గొంతులో.
    "దీనికే ఉడుక్కోకండి. ఇంకా నేచెప్పడం మొదలుపెట్టలేదు -అవును గాని ఓ మాట చెప్పండి .... నన్ను చూసిన వాళ్ళెం అనుకుంటారు చెప్పండి."
    అర్ధం కానట్లు చూశాడాయన. - మళ్ళీ రాజేశ్వరి చిలిపిగా "నేనేన్నేళ్ళ దానిలా కనిపిస్తాను చెప్పండి" వయ్యారాలు పోయింది. ఆవిడ కులుకులు చూసి చిరాగ్గా "ఏమిటీ గోల , కులికింది చాలు చెప్పు ...." అన్నారాయన విసుగ్గా.
    "అబ్బ చెప్పండి...... అందరూ నీవు జుత్తుకు రంగేసుకుంటే నలబై ఏళ్ళదానిలా ఉన్నావంటారు . మా వాళ్ళంతా .... నీ మొహంలో వయసే కనపడదు .... అంటున్నారు గదా."
    "ఎవరా అన్నది.... రంగేసుకున్నంత మాత్రాన వయసెం దాగదు..."
    'అబ్బ మీరు రంగేసుకోరుగా అందుకే మీకు నన్ను చూస్తె అసూయ. ముసలి మొగుడి పడుచు పెళ్ళాం అనుకుంటారని నేను వేసుకున్నప్పుడల్లా ఈ వయసులో సింగారాలేందుకు , అని దేప్పేవారు."
    "ఏమిటీ గోల, సందర్భం లేని ఈ వాగుడేమిటి - సినిమాకి వెళ్ళి ఏదో ఊడబోడ్చిన ఘనకార్యం చేసిన దానిలా ఈ ఉపోద్ఘాతాలు ఏమిటి....'




Related Novels


Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

D Kameswari Kathalu

Teeram Cherina Naava

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.