Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ విశ్వం, అరిపిరాల
రాజీబేరం
హద్దుమీరిన అహంకారం
దేశాల హద్దుల్ని చెరిపేసింది.
విశ్రమించని దుర్ నీతి
తీరని రాజ్యదాహంగా మారి
చైనాసుర వాహినియై
హిమ శిఖరాన్ని ఒరసికొని
ఆర్యభూమిని ముంచెత్తింది.
ప్రకటించక చేస్తున్న యుద్ధానికి
ప్రకటించిన యుద్ధ విరమణకు
అంతరార్థం ఒకటే
గూడుకట్టిన దుర్మదం.
సంయుక్త సంప్రదింపులలో
వాళ్ళకి నమ్మకం లేదు!
గెలుస్తున్న వాడి మాటే చెల్లాలన్న
రాజనీతి తప్ప!
సంప్రదించక చేసిన యుద్ధ విరమణ
మళ్ళీ అలాగే భగ్నం కాదని
విశ్వాసం ఏమిటి?
ఓ చైనాసురుడా!
మా గడ్డనుంచి తొలగిపో.
చేసింది దురాక్రమణ అని ఒప్పుకో
స్వాతంత్ర్యమంటే దుస్తంత్రం కాదని తెలుసుకో
స్వాతంత్ర్య దేశానికి
దురాక్రమణ సమాధిని
కట్టే ప్రయత్నం మానుకో
ఎవరికోసమో త్రవ్విన గోతిలో
చివరికి నీవే పడిపోగలవు!
ప్రపంచ చరిత్రలో
నీ జాతి ముఖానికి
ద్రోహం, కుహకం రంగరించి
మసిగా పూసుకోకు.
మానవత్వం నిన్ను హెచ్చరిస్తోంది
బుద్ధికలిగి మసలుకో.
అకారణంగా చివ్వకు
కాలుదువ్వినవాడు
అణగారక మానడని
హిట్లరు, ముస్సోలినీలవలె
నిరూపిద్దామని పూనుకొంటే
నీవు నమ్మిన సిద్ధాంతాల కట్టెలతో
నీకు నీవే చితి రగుల్చుకోవాలిసొస్తుంది.
విలువల కిరణాలతో వెలిగే
మానవత్వపు సూర్యుణ్ణి-
కబళించే ప్రయత్నంలో
నిన్ను నీవే బుగ్గి చేసుకోకు.
నీ కొంపకు నీవే అగ్గి ముట్టించుకోకు.
నీ రాజీ ప్రయత్నాలు
మా హృదయాల్లో రాజుకొన్న
మంటలపై గుగ్గిలం చల్లినట్లు.
నీ నక్కజిత్తులకు మళ్ళీమళ్ళీ
మోసపోతామని భావించకు.
భవిష్యత్తులో నీ పాపం పండే
రోజొకటి వస్తుంది
ధరిత్తిలో నిజం జయిస్తుంది.
మానవత్వం నిలుస్తుంది.
* * * *





