Home » vaddera chandidas » Anukshanikam 2



    "యివన్నీ నిజమేనా?"
    "మీ గురించి వినే రావడానికి సాహసించాను. మీ ముందు ఒక్క పిసరు అబద్ధం కూడా చెప్పలేదు. మీరు దేవుడిలాంటివారని అందరూ అంటారు."
    "నిజానిజాలు వాకబు చేసినాక తెలుస్తయ్ ఆధారాలు వుండాలి. నువ్వు చెప్పేవన్నీ నిజమైనా నే చెయ్యగలిగిందేమీ వుండకనూ పోవచ్చు. చర్య తీసుకోటానికి ఆధారాలు అవసరం. అవన్నీ నిజమైతే, నీ స్థితి దృష్ట్యా మరొకచోట పోస్టింగ్ వచ్చేటందుకు ప్రయత్నిస్తాను" అన్నాడు నాగిరెడ్డి.
    మధ్యలో మరొకసారి, కూర్చోమని అన్నా, చారుమతి నిలుచునే వుంది.
    "రేపు ఆఫీసుకి రమ్మంటారా సార్" అంది.
    "అవసరం లేదు. నువ్వు చెప్పినవన్నీ వివరంగా రాసి యిక్కడికే తెచ్చి యివ్వు రేపు సాయంత్రం. నన్ను కలుసుకున్నట్లూ ఇదంతా ఎవరితోనూ అనొద్దు. మంచిది వెళ్ళు." అని లోనకి వెళ్ళిపోయాడు.
    చారుమతి వెనక్కి తిరిగి_పోర్టికోలోకి వస్తుండగా_పోర్టికోలో స్వప్న రాగలీన_
    ఆశ్చర్యంగా చూసి, "రండి" అంది స్వప్న రాగలీన.
    "నా పేరు చారుమతి__"
    "అన్నీ తెలుసు వరాహశాస్త్రిగారి చెల్లెలనీ తెలుసు. వీణా ప్రావీణ్యురాలనీ తెలుసు. నా నవ్వుని వీణతో దొంగిలించటమూ గుర్తుంది. రండి లోనకి" అంది.
    "మీరు యిక్కడ__"
    "నేనుండేది యిక్కడే. యిది మా బాబాయి గారిల్లు."
    "అలాగా! మా అన్నయ్య అయినా యెన్నడూ అనలేదు. కనీసం నేనిక్కడికి వస్తున్నట్లు తెలిసి కూడా అనలేదు" అంది చారుమతి.
    "మీ అన్నగారికి నేనుండేది ఇక్కడని తెలియకపోవచ్చు ఐతే మీరు నాకోసం రాలేదా" అంది.
    "లేదు. టీచరుగా__"
    "ఆ వుద్యోగంలో నుండి వూస్ట్ చేసేస్తే సార్ ని కలుసుకుందామని వచ్చాను" అంది చారుమతి.
    తన గదిలోకి తీసుకెళ్ళింది.
    "కలిశారా?"
    "వూఁ. ఓపికగా విన్నారు, చెప్పినదంతా" అని విషయం టూకీగా చెప్పింది.
    "మా బాబాయికి నేనంటే చాలాయిష్టం. అక్రమమైందైతే నేనేకాదు యెవరు చెప్పినా వినరు అని జనవాక్యం" అని చిన్నగా నవ్వి, "మీకు అన్యాయం జరిగివుంటే అందుకు బాధ్యులైనవాళ్ళని శిక్షిస్తాడు, వీలయితే కనీసం నీకు చెయ్యగల సహాయం చేస్తాడు. అంచేత నిశ్చింతగా వుండండి" అంది స్వప్న రాగలీన.
    వుద్యోగం మాట యెలా వున్నా__ మీ గదిలో యిలా మీతో కూర్చుంటే యేదో అనిర్వచనీయమైన సంగీతం వినిపిస్తున్నట్లనిపిస్తోంది" అంది చారుమతి.
    "వరాహశాస్త్రి చెల్లెలనిపించుకున్నారు! ఆ సంగీత భ్రమ వొదిలి మీ వుద్యోగం కబుర్లు చెప్పండి. మిమ్మల్ని వుద్యోగంలోంచి పీకించేసిన మీ ప్రియతమ హెడ్డు మిస్సమ్మని గురించి చెప్పండి" అంది స్వప్నరాగలీన ఉత్సాహంగా.
    చారుమతి యింకా బిడియం బిడియంగానే కూచుంది.
    స్వప్నరాగలీన గది సామాన్యంగా సాదాగా వుంది. రోజ్ వుడ్__మంచం, టేబుల్, కుర్చీ, ముస్తాబు బల్ల, బీరువా, బుక్ షెల్ప్, టేప్ కం ట్రాన్సిష్టరు. రెండు పేము కుర్చీలు, తెల్లగా గోడలు.
    "నా గదిలో సంగీతం అని మొదలెట్టారు__ అది ఈ టేపులోది" అని ఓ కేసెట్ తీసి_పెట్టింది. "మనసున మల్లెలు" అని మొదలైంది.
    ముప్పావుగంట మాట్లాడుతూ కూచున్నారు. టిఫినూ, టీ.
    మరో టేపు పెట్టింది. బాలమురళికృష్ణ "నను పాలింప" తో మొదలైంది.

                                84

    యీ రోజున యీ పందొమ్మిది వందల డెబ్బయ్ ఐదు జూన్ పన్నెండో తేదీ వార్త__
    తాటికాయలంత అక్షరాలతో దేశంలో అన్ని దినపత్రికలలోనూ వైర్ లెస్ లలోను విమానాల్లోనూ రైళ్ళలోనూ బస్సుల్లోనూ కార్లలోను సైకిళ్ళమీదా కాలినడకనా, పొలాలమీంచి చెట్లమీంచి గుట్టలమీంచి నదులలోంచి పర్వతాలమీంచి గాలిలోంచి ధూళిలోంచి నేలనా నింగినా కోటానుకోట్ల ప్రజల నోళ్ళలోంచి; హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా__ కాంతి వేగంతో ప్రయాణించినట్లుగా వ్యాపించి, భూగోళం అంతటా కూడా పల్చని ఛాయగా పడిన వార్త.
    ఒక ప్రజా ప్రతినిధి, ఎన్నికలలో నియమావళికి భిన్నంగా అనుచితంగా అపసవ్య మార్గాలు అవలంభించినందున ఆ ప్రతినిధి యెన్నిక చెల్లనేరదని దేశంలోని ఒక న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వార్త.
    మన రాష్ట్రంలోనే ఒకప్పుడు వీ.బీ. రాజుకీ ఆ తరవాత చెన్నారెడ్డికి ఆ యోగం వట్టింది. ఐదేళ్ళో ఆరేళ్ళో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని తీర్పు. దేశంలో ఇంకెందరికో ఆ ఖ్యాతి లభ్యమై వుండొచ్చు. వాళ్ళంతా కూడా కీలకమైన ముఖ్యమైన రాజకీయ నాయకులే. కానీ ఆ వార్తలు యెన్నడూ ఈ రకంగా వ్యాపించలేదు. దేశం పావుభాగం భూకంపమొచ్చి పూడుకుపోయిందన్న వార్తకూడా యింతగా యీ రీతిగా వ్యాపించదే.
    మహా భూకంపంలా విషంలా ఉప్పెనలా కోటి పిడుగులలా కోటి సౌదామినులలా శతకోటి కంఠస్వరాలలా యీ వార్త చిచ్చుబుడ్డిలా యెగసి, యేడ్పుల్లోంచి నవ్వుల్లోంచి తామసాల్లోంచి తపనల్లోంచి కంపిస్తున్న యీ వార్త__
    యెవరా ప్రజా ప్రతినిధి? సాధారణ ప్రజా ప్రతినిధి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా__ ఆ వార్త ఈ రకంగా కార్చిచ్చులా భగీరథ గంగలా కాకపోను. అందుకే అది వార్త కాదు. దేశ జన జీవిత రాజకీయార్నవంలో యెగిసిన బడబాగ్ని.
    ఎందుకంటే అది ఆ వ్యక్తీ ఫలానా ప్రజా ప్రతినిధి అవటంవల్ల? సవాలక్ష ప్రజాప్రతినిధుల్లోని ఆ ప్రజాప్రతినిధి యెవరు?
    దేశ రాజకీయ వయోవృద్ధ మహామహులందరినీ యెదుర్కొని తానుగా నిలబడినా_బెంగుళూరు సభలో రాష్ట్రపతి ఎన్నిక గురించి తన అభిమతానికి అనుగుణంగా నిర్ణయం చేయించుకోలేక__ తలపండిన పెద్ద పెద్ద సిండికేటులన్నీ కలిస్తే_చివరికి, యెవరి చిత్తమొచ్చినట్లు వాళ్ళు ఓట్లు వేసెయ్యొచ్చని గూబ అదరగొట్టి కాళ శక్తిలా చెలరేగి నిలదొక్కుకుని సామాన్య ప్రజానీకానికి ఆరాధ్యురాలిగా కాగలిగిన ఓ స్త్రీ_కీర్తినిధి మాజీ ప్రధాని కూతురు, ఫెరోషియస్ అగ్గిబరాటా పార్లమెంటేరియస్ భార్య ఇందిరా ప్రియదర్శిని ; యీ భూగోళం బరువంతటి భూషణలూ దూషణలూ నెత్తిమీద పడిన స్త్రీ_ప్రజాప్రతినిధికదా మరి ప్రజల సొత్తు _ యెవరి చిత్తమొచ్చినట్లు వాళ్ళు అనొచ్చు.
    కానీ స్వపరిపాలన భారతావనిలో యిప్పటివరకు ఆమె సామర్థ్యం_అనితరసాధ్యమనీ అసాధారణమనీ నిర్ద్వందంగా అందరూ ఒప్పుకోక తప్పదు. ఆ సామర్థ్యపు సబబూ బసబబుల సంగతి వేరు. అది రాజకీయ నైతికాంశం.
    ఆమె మీద_భారత పార్లమెంటులో జులాయి విదూషకుడిగా పేరొందిన వ్యక్తి పెట్టిన కేసులో_అలహాబాదు హైకోర్టులో న్యాయమూర్తి సిన్హా తీర్పు అది.
    మరీ అంత నియమావళి ప్రకారం ఎన్నికలలో యెవరూ వుండరు. అది ఆచరణ సాధ్యమూ కాదు. దొరికితే దొంగ. దొరకకపోతే దొర. అంచేత అందరూ దొంగలే. అందరూ దొరలే_అని ఆచితూచి కొందరంటారు.
    కోర్టు కోర్టే. తీర్పు తీర్పే.
    ఐతే సుప్రీంకోర్టుకి అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాడు ఆ న్యాయమూర్తి సిన్హా.
    _అని అనుకుంటూ శ్రీపతి పత్రికాఫీసులోంచి బయటికొచ్చి వీధిలో కాలిబాటన నడుస్తున్నాడు.
    _పాపం ఇందిరమ్మ స్థితి చాలా కాలంగా పెనం మీద వున్నట్లుగా వుంటే యిప్పుడు కుంపట్లో పడినట్లయింది. యేఁవోఁ_ నిండా మునిగితే చలి వుండదన్నట్లు_ యిటో అటో ఒక వూపు వూపొచ్చు_గల్లీ లీడర్ లాంటి ఆ చీంబోతు రాజ్ నారాయణ్ కి యేం భోగం పట్టిందీ! యిలా అనుకుంటే ఇందిరమ్మ కూడా ఉచ్చులు పన్నివుంటే అతగాడి పని ఇంతే ఐవుండునేఁవోఁ....




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.