Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    "నేను తింటున్నా" అంటుంది లేఖ పెదవులకొసల్లో పాలు కనుపిస్తుండగా వెక్కిరింపుగా.
    అతడు కాస్త ఆగుతాడు. "ఇకచెప్పు ఏమైందో" అంటాడు.
    "మా ఇంగ్లీషు టీచర్" ఝార్నామహారాజు చనిపోయాడని చెప్పింది."
    "అవును మన జిల్లాలో అతనికి పది ఊళ్లైనా కనీసం ఉన్నాయి. ఇవ్వాళ ఉదయం చనిపోయాడు"
    "అతని ఎడల గౌరవం వ్యక్తపర్చడానిగ్గాను రేపు స్కూలుకు శలవు అని మా ఇంగ్లీషు టీచర్ చెప్పింది. ఇద్దరు ముగ్గురు చప్పట్లు కొట్టి అరిచారు"
    "ఆఁ" అంటూ "నువ్వైతే అరవలేదుకదూ!" అన్నాడు కాలూ.
    "నవ్వలేదు. మా ఇంగ్లీషు టీచరుకు కోపం వచ్చింది. ఇదంతా తమాషా" అంటూ ఆమె నవ్వింది.
    లేఖ, తనకు అసంతోషకరమైన సంఘటన వచ్చినప్పుడు నిజాన్ని మరుగుపరుస్తుందనే విషయం అతడెరుగడు.
    "ఓ కమ్మరి బిడ్డా! కారేబక్కెటు అతికించడానికి కూలెంత?" అని సుహాషీ అరచింది. ఆమెతండ్రి కమ్మరి అనేది రహస్యమేమీకాదు.
    ఇంకొందరు పిల్లలు వెక్కిరించగా ఇరా" కమ్మరి పిల్లా, మీ నాయనతో ఇతరుల్ను మోసగించవద్దనిచెప్పు. మా బక్కెట్టు అతుకుతే రెండునెలలలోపునే మళ్ళీ కారుతూంది" అన్నది.
    తండ్రి సౌశీల్యంమీద గాఢమైన విశ్వాసంగల లేఖ అతని నిందను చూచి భరించలేక ఇరాను గట్టిగా ఒకచెంపమీద అంటుకుంది. తరువాత రెండవచెంప పొంగింది.
    పిల్లలంతా ఆమెమీద పడ్డారు. ఇంటికి వచ్చేవరకు బట్టలు చిరిగి, వెంట్రుకలు చెదరివున్నాయి. తండ్రి దిగాలుపోయి "చంద్రలేఖా" అని అరిచాడు.
    "నేను......నేను జామిచెట్టుమీంచి పడ్డాను" అబద్దం ఆడింది. చీదడం మొదలుపెట్టింది.
    అతడు ఒళ్ళోకూర్చోపెట్టుకొని "లేఖా! మళ్ళీచెట్టెక్కనని వాగ్దానం చేయి, చెట్టుమీంచిపడి కాలువిరుచుకుంటే ఎలాచెప్పు" అన్నాడు.
    అలాంటి ఊహలవల్ల కలిగిన భయంతో ఆమెవంక చూచాడు.
    "మళ్ళీ ఎక్కను" అని గొణిగింది. ఆ శబ్దం గింగురుమని ఆమె చెవిముందు తిరుగసాగింది. ఆమెనెత్తిమీదా భుజంమీదా చరిచాడు. ఆమె ఊహల్ను అందుకోవడానికి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. పడడంకంటే ఇంకేదో ఉందని అతని అంతరాత్మ పలికింది.
    అది ఆమె గుర్తించింది. ఇందునుగురించి జరుగుతున్న ఆలోచనను తెంపేయడానిగ్గాను "పొర ఉన్న పాలు నేను త్రాగను చూడు" అని కంచుగిన్నె ముందుకునెట్టింది.
    అతడు గరిటెతో పొరతీసివేస్తుండగా ఆమెచేత్తో చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంది. మళ్ళీ ఆమె మామూలు కాలూబిడ్డ అయింది.
    "అయితే నువ్వెప్పుడూ చెట్లెక్కలేదా? నువ్వెప్పుడూ కుర్రాడివిగా లేవా?" అని అడిగింది.
    అతడు నవ్వాడు. అతడు స్కూలుకు మాత్రం వెళ్ళలేదు. కాని అతనికీ బాల్యమిత్రులు బాల్యచేష్టలూ ఉన్నాయి. వాటికి రంగులువేసి, అసలే చారెడుగా ఉన్న కళ్ళను ఆశ్చర్యమగ్నంగా చేయడానిగ్గాను, నాటకంలో లాగా వర్ణించాడు. అతడు తన వృత్తాంతం ముగించింతరువాత లేఖ తలవూపింది.
    "నాకు నమ్మకంలేదు. నీవు ఎప్పుడూ చిన్నగాలేవు. నీవు మొదటినుంచీ బాబువే" అంది.
    కొంతసేపయిన తరువాత" సుహాషితండ్రి బక్కెట్లు ఇంకెప్పుడు బాగుచేయకు" అంది.
    "సుహాషీ ఎవరు?"
    "సుహాషీసేన్"
    'సేన్' అతడు హెల్త్ ఇన్స్ పెక్టర్ కావచ్చుననుకున్నాడు. "అతడు ఏంచేశాడు"
    "అతడు ఏమీచేయలేదు. అయినా అతనిబక్కెట్లు బాగుచేయకు"
    "నేను సరిగా బాగుచేయకుంటే మాటుచెడకొడ్తే?"
    'వద్దు' ఆమె కేకవేసినంత పనిచేసింది. మళ్ళీ కన్నీరుదాకా వచ్చింది.
    "సరే" అని ఆమెను ఓదార్చాడు. కాని ఆమె ఈ ప్రవర్తనకు ఆశ్చర్యచకితుడైనాడు.
    "మంచిది లేఖా." ఒక్కొక్కసారి ఆమెను అడ్డడం అసాధ్యం అయ్యేది.
    లేఖ చాల బక్కగానూ, అస్వస్తంగానూ ఉండడం అతనికి విచారంగా ఉండేది.
    "నిన్ను ఒరుగులా చూళ్ళేను. కరువుకరిగించినట్లు చర్మపుసంచిలో దూర్చిన ఎముకలగూడులా నిన్నుచూచి సంహించలేను. ప్రజలేమంటారు? "ఏనుగులా ఉన్న ఆ తండ్రిని చూడండి బిడ్డకు సరియైన తిండైనా పెట్టడు అంటారు. అది నీకు బాగుంటుందా?" అని అడిగాడు.
    ఆమె ఆలోచించింది. ఉద్రేకంగా 'వెధవలు' అంది. తన తండ్రిని తిట్టిన అదృశ్య పురుషులమీద కోపంతో ఆమెకళ్ళు చింతనిప్పులైనాయి. ఉబుసుపోకకు తన తండ్రిని నిందించినా, తిట్టినా సహించలేదు ఆమె.
    "లేఖా"
    అతని ధ్వనికాఠిన్యత వలయాలు ఏర్పడ్డట్లుంది.
    క్షణం తరువాత విరగబడి నవ్వాడు. అతని కళ్ళు కోపరేఖతో ఆమె ముఖాన అంటుకున్నాయి. ఆమెలో వచ్చినస్వల్పాతిస్వల్పమైన మార్పును సహితం అతడు గౌరవించాడు. ఆమె భావాలకు దర్పణప్రాయములైన అతని కళ్ళు ఛాయామాత్రమైన ఆమె భావనలను సహితం ఇట్టేపట్టేవి.
    ఇప్పుడిప్పుడే కాలూ కొద్దిగా వ్రాయడమూ, చదవడమూ నేర్చుకున్నాడు. బిడ్డ స్కూలుకు పోవడంతో అతని మేధస్సుకు శ్రమ కలిగింది. ఆమె స్కూలునుంచి వచ్చి అనేక ప్రశ్నలు అడిగేది. భూమి నారింజపండులా గుండ్రంగా ఉందా? చంద్రగ్రహణం ఎలా కలుగుతుంది? రాజులూ, యుద్దాలూ ఒకటేమిటి అనేకం అడిగేది. అతడు తన అజ్ఞానాన్ని ఆమెకెలా వ్యక్తపరుస్తాడు?
    దృఢసంకల్పంతో స్వయం బోధన ప్రారంభించాడు. పగలంతా తన పనితో తీరేదేకాదు. లేఖ నిద్రించింతర్వాత, ఆమె పచ్చని సంచిలోంచి పుస్తకాలు తీసి వాటిమీద పడేవాడు. కిర్సనాయిలు లాంపుముందు గంటలతరబడి చదివేవాడు. తృష్ణ మెండుగా ఉంది కాబట్టి అతడే ముందు నేర్చుకున్నాడు. ఏనాడో ఒకనాడు ఆమె అతన్ని అధిగమించగలదనే నమ్మకం అతనికి ఉన్నా ఈ విధంగా ఆమె స్నేహాన్ని బలపర్చుకోవాలని ఆశించాడు.
    గుఱ్ఱపు నాదాను నిప్పులో కాల్చి సమ్మెటతో కొట్టే అతని పనితనానికే, అతని చదువుకంటే ఎక్కువ స్థానం లేఖ హృదయంలో ఉందనే విషయం అతడు గ్రహించలేక పోయాడు. ఎర్రగా కాలిన ఇనుమునుంచి రాలుతున్న నిప్పురవ్వల్ను చూచి తాను మగవాణ్ణి కాకపోతినే అనే విచారం ఆమె గుండెను బాదేది. స్కూల్లో అంతమంచిగా చదివి బహుమతులు పొందుతున్న తన కూతురుకు తన చేతి పనితనం నేర్పడానికి నిరాకరించాడు కాలూ.
    తన పేరు చరిత్ర ఆమెకు తెలుసునుకాబట్టి "నేనే అభిజిత్తునైతే!" అని ఒకసారి ఆలోచించింది.
    అతని హృదయంలోకి ఒక విచారం చొరప్రాకింది. అనాది కాలంనుంచి తండ్రినుంచి కొడుక్కు సంక్రమించి, నేడు తాను సాధించిన నైపుణ్యం ఏంకాను? అతని జీవితం తన వృత్తిలో నిపుణత్వంమీదనే ఆధారపడిఉంది. అభిజిత్తు నామమాత్రంగానే కదా నిల్చిపోయేది?
    కూతురు వదనంలోని విచార వివర్ణతను తండ్రి గమనించాడు. ఆమెను ఓదార్చడానికి దరికి చేరాడు.
    "బిడ్డ! మొత్తం అభిజిత్తుకోసం నీ ఒక్క వెంట్రుకను సహితం ఖర్చుచేయలేను. విన్నావా?"
    బాల్యం విడిచి యవ్వన ప్రాంగణంలో అడుగిడుతూ తన సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటున్న లేఖ కఠినమైన అతని శరీరంలోని కోమలమైన భాగంగా మారింది. అతడు తన మిత్రుల్తో సగర్వంగా "ఆమె దృక్కులు చూడండి." "అవి అలా ఎందుకున్నాయో తెలుసా? ఆమె పుట్టకముందే నేను అలాంటి పేరు పెట్టడమే అందుకు కారణం. నేనింకా పుట్టకముందే నా తండ్రి నాకు 'కాలూ' అని పేరుపెట్టాడు. చూడండి నా వేషం. నేనూ నా కూతురుకు పుంటి అనో మున్నీ అనో పేరు పెట్టి ఉంటే?" అనేవాడు.
    లేఖ అంత అందంగా ఉండడానికి ఆమె తల్లి రూపమే కారణమనే విషయం కాలూకు తెలియకపోలేదు.
    లేఖ ఎంత అద్భుతంగా మారుతుంది! ఆమె రంగు పుట్టినప్పటికంటే మెరుగుతేరి సానపట్టిన దంతంలా అయింది. ఆమెకళ్ళు, దీర్ఘాపాంగములు లోతుగా నల్లని అంజనరేఖా సహితములై అందంగా ఉన్నాయి. ఆమె పొడవైంది. ఆమె తల అతని భుజాన్ని తాకుతూంది. ఆమె అందం ఆనందాన్నిచ్చేది. ఆమె హస్త విన్యాసం ప్రశాంతమే అయినా, ఆమె చిరునవ్వూ మధురవాక్కూ అందరినీ ఆహ్లాదపర్చేవి. ఆమె అనేక పుస్తకాలు బహుమతులుగా బడసింది. కొన్ని గ్రంథాలయం నుంచి తెచ్చింది. వాటిని ఆమె ఎక్కువగా ప్రేమించేది. తన విజ్ఞానాన్ని గురించి బైట పడేదికాదు. ఆమె తన సౌందర్యాన్ని గురించి ఎరుగనట్లే కనిపించేది. ఎలాంటి చీర జాకెట్టు ఉన్నా సంతృప్తిపడేది. తన సహాధ్యాయినుల బట్టల్నుచూచి తనకూ అలాంటివే కావాలనేదికాదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.