Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



        ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
        సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే 62

    విషయములను తలచుట వలన వాటి మీద ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వల్ల కోరిక, కోరికల వల్ల క్రోధము కలుగును.
        క్షోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
        స్మృతి భ్రంశాద్భుద్దినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి 63

    క్రోధము వలన వ్యామోహము, వ్యామోహము వలన చిత్తభ్రమయును, చిత్తభ్రమ వలన బుద్ధి నాశమును, బుద్ధి నాశము వలన అయోగ్యుడై నశించును.
        రాగద్వేష వియుక్తై స్తు విషయానింద్రియైశ్చరన్
        ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాద మధిగచ్చతి 64

    మనసును వశమునందుంచుకొన్న సాధకుడు, రాగద్వేష రహితుడగుచున్నాడు. అతడు బాహ్యము గ్రహించుచున్నను, మనఃశాంతిని బొందుచున్నాడు.
        ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే
        ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే 65

    మనశ్శాంతి కలిగినంతనే దుఃఖములు నశించుచున్నవి. అట్టి కర్మయోగి యొక్క బుద్ధి పరమాత్ముని యందు మాత్రమే పూర్తిగా స్థిరమగుచున్నది.
        నాస్తి బుద్ధి రాయుక్తస్య న చా యుక్తస్య భావనా
        న చా భావయతశ్శాంతి అశాంతస్య కుతః సుఖమ్ 66

    ఇంద్రియ నిగ్రహము లేనివానికి స్థిరబుద్ధి కలుగకున్నది. అట్టి అస్థిరబుద్ధికి ఆస్తిక భావమే కలుగకున్నది. ఆ భావన లేనివానికి శాంతి లభించకున్నది. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును?
        ఇంద్రియాణాం హి చరతాం యన్మనో-సు విధీయతే
        తదస్య హారతిప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి 67

    నీటిపై తేలియాడు నావను గాలి ఊపుచుండును. ఇంద్రియములందు సంచరించు మనస్సు అట్లే ఏ ఒక్కదానితో కూడినను ప్రజ్ఞ హరించివేయుచున్నది.
        తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః
        ఇంద్రియాణీంద్రియార్దేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా 68

    అర్జునా! ఎవడు నిగ్రహము కలిగి, ఇంద్రియములను ఇంద్రియ విషయములను కట్టివేయుచున్నాడో  అట్టి వానియందు ప్రజ్ఞ ప్రతిష్టితము అగుచున్నది.
        యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
        యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః 69

    ఆత్మను గ్రహించు యోగికి సమస్త జనులకు రాత్రియైనను, అతను జాగృతగానే యుండును. ప్రాణులు మేలుకొనియున్న చోట అట్టి మునికి రాత్రి యగుచున్నది.
    
    దీపిక:
    
    రాత్రియైనను మునియగు వాని ఇంద్రియములు జాగ్రుతములయి యుండును. జనము జాగృతమైనప్పుడు పై ఇంద్రియములు నిద్రించును.
    ఇది ఇంద్రియ వ్యవహారము. ప్రశాంత చిత్తమున అది మేల్కొనును. ఇతరులు మేల్కొన్నను అతని ఇంద్రియములు నిద్రించును. ఇంద్రియములు మేల్కొనుట, మేల్కొనకుండుట మనస్సంబంధి మనసును నిగ్రహించువానికి బాహ్యప్రపంచముతో సంబంధము తెగిపోవును. అతని నిద్రాజాగ్రత్తలు అతని వశమున నుండును. కాకతీయుల కాలమున ఒక లింగధారి ఋషి యుండేవాడు. సూర్యునియందు, నారాయణుడు వున్నాడు కాబట్టి అతడు సూర్యుని చూడని వ్రతము. అతడు సూర్యుని కిరణము సైతము సోకని యొక గుహయందు, పగలంతయు వుండువాడు. సాయంత్రము సూర్యాస్తమయము తర్వాత అతడు బయటకు వచ్చువాడు. అప్పుడు ఒక జొన్నగింజ నాటువాడు. రాత్రియంతయు స్నాన సంధ్యాది అనుష్టానములు చేయువాడు. సూర్యోదయమునకు పూర్వమే ఆ జొన్నపైరు కంకులు వేయునది. ఆ ముని వాటిని గ్రహించి మరల గుహయందు ప్రవేశించువాడు.
        తర్వాత కథ ప్రస్తుతము కాదు.
        ఆపూర్యమాణ మచల ప్రతిష్ఠం
        సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
        తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే
        స శాంతి మాప్నోతిన కామాకామీ 70

    నదీనాం సాగరోగతిః నదులన్నియు పొంగిపొరలుచున్నను సముద్రములో చేరును. అట్లయ్యు సముద్రము నిశ్చలముగా నుండును. అట్లే సమస్త భోగ ములును, స్థిప్రజ్ఞునియందు నిశ్చలముగా నిలచియుండును. వాడు పరమశాంతిని పొందుచున్నాడు. భోగాసక్తునికి శాంతి లభించకున్నది.
        విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిః స్పృహః
        నిర్మమో నిరహంకారః శాంతి మధిగచ్చతి 71

    ఎవడు సమస్త కోరికలను జయించి వానిని లెక్కచేయనివాడై, అహంకార మమకారములను వదలినవాడు అగుచున్నాడో అట్టివాడు శాంతిని పొందుచున్నాడు.
        ఏషా బ్రాహ్మీ స్థితిః పార్ధ! నైశాం ప్రాప్యవిముహ్యతి.
        స్థిత్వా స్యామంత కాలే-ఫై బ్రహ్మనిర్వాణ మృచ్చతి

    అర్జునా! ఇది బ్రహ్మీస్థితి. దీనిని పొందినవాడు చలించడు అంత్యకాలమునకు స్థిరచిత్తుడగును. అంత్యకాలమునను బ్రహ్మానందము బొందును.
    
    దీపిక:
    
    ఇది మిశ్రమ అధ్యాయము. అర్జునునికి యుద్దము వదులుటలో ఎంత ఆతురతకలదో, భగవానునికి ఉపదేశించుటలో అంత ఆతురత కన్పించుచున్నది. అచ్చటచట దూకుడు, దాటవేయుట కన్పించుచున్నది. ఒక విషయము చెప్పి, దానిని ఖండించుటయు జరుగుచున్నది. గజేంద్రుడు స్వామిని శరణుజొచ్చాడు. గజేంద్రుని రక్షించుటలో స్వామి ఆతురత ఎంత అనగా 'శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు' అమ్మకొంగు సహితము వీడక పరుగెత్తుకొని వస్తున్నాడండి స్వామి.    
    అదే ఆతురత అర్జునుని రక్షించుటలో స్వామి కనుపర్చుచున్నాడు.
    ఈ అధ్యాయమునః
    1. కృష్ణార్జున సంవాదము. చివరకు అర్జునుడు శరణాగతుడైనాడు.
    2. దేహము బాల్య యవ్వన వార్ధక్యముల వలెనే దేహాంతము గూడా ఒక పరిణామమని ప్రవచించినాడు.
    3. సమబుద్ధిని ఉపదేశించినాడు. ఇది సుఖదుఃఖములు జయాపజయములయందు సమభావము                 కలిగియుండుట ఐవున్నది.
    4. ఆత్మజ్ఞానము బోధించినాడు. ఆత్మ అవినాశ్యమని, నిత్యమని బోధించినాడు.
    5. నిష్కామఖర్మను బోధించినాడు.
    6. స్థితప్రజ్ఞతను గురించి వివరించినాడు.
    7. బ్రహ్మనిర్వాణము, బ్రహ్మానందమును గురించి చెప్పినాడు. ఇది 'బ్రాహ్మీస్థితి' అగుచున్నది.
    ఈ అంశములన్నింటిలోను ఇంద్రియ నిగ్రహము ప్రధానముగా చెప్పబడింది. సామాన్య మానవుని జీవితములో ఆటుపోట్లు వచ్చినపుడు తప్ప నిగ్రహమునే పాటించుచున్నాడు. కోపతాపములను గూడా చాలావరకు నిగ్రహించుచున్నాడు. ఇది తొలిదశ. భగవానుడు చెప్పిన ఇంద్రియ నిగ్రహాదులకు వ్యక్తి ప్రయత్నము అవసరమైయున్నది. ఎంత నిగ్రహించిన అంత ఫలితము అయితే భగవానుడు చెప్పిన స్థితికి చేరుకొనుటకు ఎన్ని జన్మలు పట్టునో చెప్పుట అసాధ్యము. కాని ఈ జన్మల ప్రయత్నము మరుజన్మకు సహాయపడును. కాబట్టి నరుడు ప్రయత్నమును మానరాదు. ప్రయత్నమే మానవులు చేయునది. ఫలితము దైవాధీనము.
    చివరి శ్లోకమున బ్రహ్మానందము గురించి చెప్పబడినది. తైత్తిరీయ ఉపనిషత్తున ఆనందపు కొలతలు చెప్పినాడు. దానిని చేర్చుచున్నాను.
    కపిలదేవుడు తల్లియగు దేవహూతికి, సాంఖ్యముపదేశించినాడు. ఇది భాగవత వృత్తాంతము. దీనిని గూడా చేర్చుచున్నాను.
    కపిలుడు భగవంతుడని కర్ధమునకు తెలియును. అతడు ఏకాంతముగా కుమారుని దగ్గరకు వెళ్ళినాడు. నమస్కరించినాడు. "పూర్వజన్మముల పాపమువలన సంసార బంధనమున పడిన జనులను దేవతలు ఎంతో కాలమునకు గని కనికరించరు. నిర్జన స్థలమున యోగసమాధి అవలంబించిన నీ పాద దర్శనము అభిలషింతురు. మేము నీచులము. అట్టి మా ఇంట నీవు అవతరించినావు. దేవా! నీవు నా పుత్రుడవై జన్మించినావు. నా పితృఋణము తీరినది. నా కోరిక ఫలించినది. నేను సన్యాస మార్గమును అవలంభించుచున్నాను. అనుజ్ఞ ప్రసాదించుము" అని వేడుకున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.