Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    6. స్థూలకర్ణుడు శిఖండిని పురుషునిగా మార్చినాడు. తాను స్త్రీ అయినాడు. ఇది అతని ఉదారతకు త్యాగమునకు, పరోపకారమునకు నిదర్శనము. పురుషులను స్త్రీలుగా మార్చుట నేటి శస్త్రవిద్యకు సామాన్యము అయిపోయినది. ఇట్టి విద్యయే స్థూలకర్ణునకు తెలిసి ఉండవలెను. ఒక పురుషుని చేయుటకు తాను స్త్రీ కావలసిన అవసరము ఆనాడు ఉండెనేమోపరిశీలించవలసి వున్నది. స్థూలకర్ణుని త్యాగబుద్ధిని చిత్రించుటకు మాత్రము గొప్పగా ఉపయోగపడినది.
    7. ద్రుపదుడు, ద్రోణుడు చిన్ననాటి స్నేహితులు. వారికి స్పర్ధలు వచ్చుట, ద్రుపదుని గెలుచుట ఆదిపర్వమున చెప్పబడినది. ద్రుపదుని కొడుకు దృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించుటకే పుట్టినాడు. ఇరువురి మధ్య ఇంతటి వైరము ఉన్నది.
    అయినను ద్రుపదుడు శిఖండిని విద్యాభ్యాసమునకు ద్రోణుని దగ్గరికే పంపినాడు. ద్రోణుడు శిఖండికి శస్త్రాశస్త్రములు నేర్పినాడు.
    శిఖండి తనను చంపనున్నవాడని తెలిసి భీష్ముడు వారించలేదు.
    వృత్తి నిర్వహించుటకు వ్యక్తిగత ద్వేషములను మరచిపోయి విధిని నిర్వహించిన ఆ మహామహులను ఎట్లు కీర్తించవలెనో కూడా తెలియకున్నది.
    
        తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః  పితామహః
        సింహనాదం వినద్యోచ్చై శంఖం దధ్మౌ ప్రతాపవాన్ 12

    భీష్ముడు, కురువృద్ధుడు, పితామహుడు, ప్రతాప వంతుడు. అతడు ఆ మాటలు విన్నాడు. హర్షాతిరేక మొందినాడు. శంఖమును పూరించినాడు, సింహనాదము చేసినాడు.
    
        తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముకాః
        సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములో భవత్ 13 
   
    భీష్ముని శంఖనాదమును విన్నారు. ఇతర సేనానాయకులు వెంటనే శంఖనాదము చేసినారు. ఒకేసారి డప్పులు మ్రోగినవి. కొమ్ములు వినిపించినవి. ఆ మహాధ్వని సర్వత్ర వ్యాపించినది.
    
        తతః శ్వేతైర్హయైరుక్తే మహతి స్వందనే స్థితౌ!
        మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః 14

    అంతట తెల్లని గుర్రములు గట్టిన మహారథము మీద ఆశీనులైన కృష్ణార్జునులు, తమ దివ్య శంఖములను పూరించినారు.
    
    దీపిక:
    
    కౌరవ సైన్యము గల రథములను వర్ణించుట జరుగలేదు. కృష్ణార్జునుల రథమును మాత్రమే వర్ణించాడు. రథాన్ని 'మహతి సంధ్యనే' అన్నారు. అంటే మహారథమని అర్ధము.
    శంఖమును పూరించు విషయములో గూడా దివ్యశంఖములు అన్నాడు. ఇది వ్యాసభగవానుని ధర్మపక్షపాఠము.
        పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః
        పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః 15

    
        అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్టరః
        నకుల స్సహదేవశ్చ సఘోష మణిపుష్పకౌ 16

    
        కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మమారథః
        ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః 17

    
        ద్రుపదో ద్రౌదేయాశ్చ సర్వశః పృథివీపతే!
        సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ 18

    
    ధృతరాష్ట్రా! శ్రీకృష్ణుడు పాంచజన్యమును పూరించినాడు. అర్జునుడు దేవదత్త శంఖనాదము చేసినాడు. భయంకర కార్యమును చేయగల వృకోదరుడను భీముడు, పౌండ్రము అను శంఖనాదము చేసినాడు. కుంతీపుత్రుడగు యుధిష్టిరుడు అనంత విజయమును, నకుల సహదేవులు సుఖోష, మణిపుష్పకములను పూరించినారు. మహావీరుడగు కాశీరాజు, శిఖండి, మహాయోధుడు, దృష్టధ్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, మమావీరుడగు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించి ధ్వనింపచేసినారు.
        
        స ఘోషో ధార్త రాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్    
        నభశ్చ పృథివీం చైవ తుములోవ్యనునాదయన్ 19
        అథ వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః
        ప్రవృత్తే శ్రస్తసంపాతే ధను రుద్యుమ్య పాండవః 20

    పాండవసేవ చేసిన ధ్వనులకు దశ దిక్కులు నిండినవి. భూమ్యాకాశములు, కౌరవుల గుండెలు దద్దరిల్లినవి.
    ఓ రాజా! కౌరవులు యుద్దమునకు సన్నద్దులైనారు. యుద్దము ప్రారంభము  కానున్నది. అప్పుడు అర్జునుడు బాణాలు సంధించినాడు. కృష్ణ భగవానునితో యీ విధముగా అన్నాడు.
    
        సేనయో రుభయోర్మధ్యే
        రథం స్థాపయమే - చ్యుత 21

    
        యావదేతాన్నిరీక్షే - హం యోద్దుకామానవస్థితాన్
        కైర్మయా సహయోద్దవ్యం అస్మిన్ రణసముద్యమే 22

    
        యోత్స్యమానా నవేక్షే - హం య ఏతే - త్ర సమాగతా
        ధార్తరాష్ట్రస్య దుర్భద్దేః యుద్ధేప్రియచికీర్షవః 23
    
    కృష్ణా! ఉభయసేనా మధ్యమునకు రథమును తరలింపుము. అచ్చటనుండి నాతో యుద్దము చేయువారిని నేను చూడవలయును. నేను ఎవరితో యుద్దము చేయవలయును తెలియవలయును. అట్టి స్థలమునకు రథమును మరలింపుము.
    దుర్యోధనుడు దుష్టబుద్ధి, అతనిని సంతోషపెట్టుటకు యీ యుద్దమున కూడిన వీరులను నేను చూచెదనుగాక.
    
                                                సంజయ ఉవాచ
    
        ఏవముక్తో హృషీకేశః గుడాశేన భారత!
        సేనయో రుభయోర్మధ్యే స్తాపయిత్వా రథోత్తమమ్ 24

    
        భీష్మ  ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్
        ఉవాచ పార్ధ! పశ్వైతాన్ సమవేతాన్ కురూనితి 25    

    అర్జునుని అభీష్టము మేరకు కృష్ణ భగవానుడు ఉత్తమ రథమును సేనా మధ్యమున నిల్పినాడు. భీష్మ ద్రోణాది రాజుల ఎదుట నిలిచినది. అర్జునా! ఇచట చేరిన కౌరవసేనలను తిలకింపుము అన్నాడు.
    
        తత్రాపశ్యత్ స్థితాన్ పార్దః పిత్రూనథ పితామహన్
        ఆచార్యాన్ మాతులన్ భ్రాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా 26

    శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి
    తదుపరి పార్ధుడు, ఉభయసేనలలో వున్న తమ తండ్రులను, తాతలను, ఆచార్యులను, మామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, సహచరులను, మిత్రులను చూచినాడు.
        
        తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బందూ నవస్థితాన్
        కృపయా పరయా విష్ణఃవిషీదన్నిద మబ్రవీత్ 27

    కానున్న యుద్దమున చేరిన బంధుమిత్ర వర్గమును చూచినాడు. అర్జునుడు సంతాపమున క్రుంగినాడు. విషాదమును ఈ విధముగా అన్నాడు.
    
        దృష్ట్వేమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్ 28
        సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి
        వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే 29




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.