Home » Chalam » Musings 1



    శేషాచారి శ్రీహరి డాబామీద రాత్రులు కూచుని అట్లానే తల జూచి, కళ్ళల్లో నిశ్చలానందమయమైన చూపు పెట్టేవాడు. ఆ చెరువు వంక చూస్త్ఘే ఆసీ నే జ్ఞాపకం వొస్తోంది.
    ఏదో పిట్ట కొత్తది వొచ్చి చాలా హాయిగా కూస్తోంది. తన పాటని తాను విని ఆనందిస్తోందా? సిండడిల్లా కథ జ్ఞాపకంవొచ్చింది. ఈ కైదులో మగ్గుతున్న నన్ను చూసి జాలిపడి యీ రూపాన్ని ధరించి మృతులైన నా ఆప్తులెవరో నన్ను సంతోష పెడుతున్నారు. పిచ్చిక నామీద వాలినప్పుడు, పిల్లలు నాకేసి జాలిగా నిదానంగా చూసినప్పుడు నా వాళ్ళెవరో నాతో సందేహమివ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుంది.
    వీళ్ళీ కుర్చీలమీద కూర్చుని వ్రాయడం, యీ కాయితాలు మేము ఎవరికో పంపడం, వాళ్ళు గీసిన గీతలమీద వీళ్ళ జీవితాలు ఆధారపడడం?
    ఆలోచించడానికి మనకి తీరుబడీ, angle of vision వుండదు గాని, వుంటే అన్నీ miracles, అద్భుతాలుగా కనపడతాయి. ఇంకో కోణం నించి absurd jokes గా తోస్తాయి.
    ఈ పక్షి పాట యెట్లా వూపుతోందో యీ పరిసరాల్ని! ఈ కుర్చీలు కూడా ఆ పాటకి ప్రకంపిస్తున్నాయి. ఏనాడో, యే బర్మా అరణ్యాల్లోనొ, టేకుమానులై వున్న రోజుల్లో, తమ శాఖలమీద కూచుని పాటలతో రంజింపచేసిన పక్షుల కూతలు జ్ఞాపకం రావడం లేదు కద యీ కుర్చీలకి? ఒక కవి అన్నమాటలు "వసంత కాలంలో ప్రతిసారీ ప్రతి తలుపూ, కిటికీ, దూలాలూ అన్నీ చిగిర్చాలని ప్రయత్నిస్తాయి" జ్ఞాపకం వొస్తున్నాయి.
    ఎవరిది? ఎందుకు నాకీబాధ? ఏమిటి అట్లా స్ఫురణకి రావాలనిమనసులో గిలగిలలాడే విషయం?  చెరువుగట్టున యెండ లోంచి చెట్టునీడలోకి నీడలోనించి యెండలోకి నడుస్తున్న అబ్బాయినీ చూస్తున్నాను నా ఆలోచనల్లో మునిగికూడా. ఆ అమ్మాయి వీపు కనపడ్డది. చుక్కల పావడ, తెల్లని ఆఫారం, చక్కని గుండ్రని పచ్చని వొళ్ళు. ఎవరు? ఎవరు? చప్పున జ్ఞాపకం వొచ్చి, నా రక్తం ఝల్లుమని ప్రవహించింది. పైకి లేచిన అల విరిగి బీచి మీద పరుచుకున్నట్లు.
    అవును అట్లానే వుండేది ... ణ మొదటిసారి నా కళ్ళపడ్డప్పుడు. చిన్నది యింకా పన్నెండేళ్ళు లేవు. అప్పటికే, రెండు మాటలు మాట్లాడగానే "ఇన్నేళ్ళెక్కడ దాక్కున్నావు నాకు కనపడక?" అన్నాను. ఆ మాట నా కెంత స్వభావికంగా అంత చిన్నప్పుడే చాతనయిందా అని ఆశ్చర్యపడతాను. ఆ నాటినించి ఆరేళ్ళు పెద్దదై, పెళ్లై, తల్లై నాకందక దూరంగా పోయిందాకా.
     ఎట్లాగో నాదేననీ అంత గాఢంగా ప్రేమించే నా హృదయాన్ని విధి disappoint చెయ్యదనీ, మా యిద్దరికీ మధ్యనున్న దాటరాని ఆటంకాన్ని యెట్లాగో తొలిగించి నాకిస్తుందనీ ఆశించాను. ఈ నాటికీ పోలేదు అట్లాంటి ఆశ. ఎట్లాగో నేను గాఢంగా కోరిన ప్రేమని నాకు విధి ప్రసాదిస్తుందని. ఇన్ని నిరాశలూ, విరహాలూ నాకు వివేకాన్నివ్వలేక పోయినాయి... నిన్ను ఆధారంగా పెట్టుకుని, ఎన్ని కలలు, ఎన్ని కన్నీళ్ళు. అప్పుడే వికసించే నా యవ్వనపు restleseness  నా నూత్న రసికత్వం, అది యింకా బాగా అర్ధంగాని రొమాన్టిక్ అవేశాలూ అన్నీ అన్నింటితోనూ పూజించాను, నీ సుందర బాలమూర్తిని. అట్లాంటి అందం, పాలూ పువ్వులూ తేనే కలిసిన దేహపుకాంతిని, నీవెన్నెల చెక్కిళ్ళని, నా రక్తాన్ని ఆగేట్టు చేసే చిరునవ్వుని మళ్ళీ యింతవరకు యెక్కడా నేను చూడలేదు. ఆడవాళ్ళు, నిన్ను తలుచుకుని నీ అందానికి మురవడం, ఆశ్చర్యపడడం చూశాను. అందమైన వాళ్ళకి ప్రసిద్దికెక్కిన మీ వంశంతో అందమైన దానివి నువ్వు. నువ్వు లేకపోతే పాఠాలతో పరీక్షలతో టీచర్లతో కంటకమైన నాబాల్యం దుర్భరమై వుండును. నువ్వు నా పక్కనవుంటే, నీతో ఆడుకుంటున్నానన్న మాటేగాని అంతసేపూ నీ ఆఫారంలోంచి మెరుస్తో కనపడే మెడ మీదా, చేతులమీదా, నవ్వే నీ పెదవులమీదనే వుండేది దృష్టి. నీవు ఇంకోవంక తిరిగితే యింకోరితో మాట్లాడితే భరించలేను. నువ్వు నిద్రపోతున్నప్పుడు, సన్నని దీపం కింద పడుకున్న రాత్రులు, నిన్ను దగ్గిరగా అదుముకుంటో గడిపిన గడియలన్నీ తెల్లవారి వెలుతురు కిటికీలోంచి మీదపడి నన్ను దూరంగా జరిపిందాకా, నీ నవ కోమలత్వంతో నేను పడ్డ శ్రమ నీకు తెలీదు. నీ అందాన్ని ఏం చేసుకోవాలో నాకింకా తెలీదు అప్పటికి. కోతికి మెరిసే జరీ వస్త్రం దొరికినట్టు. నిన్ను పెళ్లిచేసుకోవాలనివుంది. నీతో చెపితే నవ్వుతావనీ, ఇంకా నాతో మాట్లాడవనీ భయం. 'మూర్ఖుడా, అభ్యంతరాలు నీకు తెలీవా?' అని అంటావేమోనని సిగ్గు. కాని నా ఆశకు అంతంలేదు. విధిలో విశ్వాసం అమోఘం. ఎన్నడూ నా వాంఛని నీకు తెలీనియ్యలేదు. ఎన్నడూ చెప్పను: కాని నీ కళ్ళల్లోని నవ్వుని చూసినప్పుడు, మన చిన్నతనాన్ని తలుచుకున్నప్పుడు, నీ పెదవుల్లో జాలిని గుర్తించినప్పుడు, నా కోర్కెలు నా నిరాశలు, నీకు తెలుసునా అని సందేహపడతా నీవాడు. ఎప్పుడూ నిన్నెందుకు వొంటరిగా లాక్కుపొయ్యేవాన్నో, నువ్వు మళ్ళీ కదలకుండా, నిన్ను నవ్విస్తో entertain  చేస్తో గంటలకొలది యెందుకు కూచోపెట్టుకునేవాన్నో ఆనాడు నీకు తెలీదు, స్పష్టంగా నాకూ తెలీదు. ఏమిటి నా వంక అట్లా చూస్తానని నవ్వడిగితే నాకు మాత్రం ఏం తెలుసు జవాబు? ప్రత్యుత్తరం యింకా బాల్యపు పొరల కిందనించి పెనుగులాడుతోంది రూపధారణకోసం.




Related Novels


Musings 2

Musings 1

Maidanam

వివాహం

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.