Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


  

   కీటకమా! నీవు ఏ కొమ్మతో బాధింతువో దానిని విరిచినాను. నీ 'షుకంభ' మను అవయవమును త్రుంచినాను. నీ లోన ఉన్న విషయము పిండినాను.
   
                                             రెండవ సూక్తము - 33

వినియోగము :-
   
      1) కన్ను, ముక్కు, చెవి, నాలుక, మెడ మున్నగు అవయవముల చికిత్స యందు. నొప్పులున్న     కీళ్ళను వదిలి రోగిమీద సంపాతిత జలము చల్లవలెను.
   
      2) ఈ సూక్త పాఠము అహోలింగ గణములందు కలదు. సర్వరోగ చికిత్స యందు వినియోగము.
   
      3) అశ్వమేధ దీక్షలో ఉన్న యజమానికి చికిత్స యందు.
   
1.    యక్ష్మగస్తా! నీ నేత్రములు, ముక్కు, చెవులు, చుబుకము నుండి యక్ష్మను తొలగించుచున్నాను. తల, మెదడు, నాలుక నుండి కూడ యక్ష్మను దూరము చేయుచున్నాను.
   
2.    నీ మెడ, ఉష్ణిహనాడి, కికల, అనూక్యముల నుండి, మాంసము నుండి, భుజముల నుండి యక్ష్మను తొలగించుచున్నాను.
   
3.    హృదయము, క్లోమము, హలీక్షము, పార్శ్వములు, మాంసపిండములు, ప్లీహము, ఉదరము నుండి యక్ష్మను తొలగించుచున్నాను.
   
4.    అంత్రములు, గుదము, ఉదరము నుండి యక్ష్మను తొలగించుచున్నాను. కుక్షినుండి, ప్లాశనాభి నుండి యక్ష్మను తొలగించుచున్నాను.
   
5.    ఊరువుల నుండి, జానువుల నుండి, పాదముల అపర, అగ్రభాగముల నుండి యక్ష్మను కటి దిగువ భాగము నుంచి, గుహ్య ప్రదేశ యక్ష్మను గుహ్య స్థానము నుంచి తొలగించుచున్నాను.
   
6.    ఎముకల నుండి, మూలుగు నుండి, ధాతువు నుండి, సూక్ష్మ, స్థూల నాడుల నుంచి, వేళ్ళనుంచి, గోళ్ళనుంచి యక్ష్మను తొలగించుచున్నాను.
   
7.    రోగగ్రస్తా! అంగాంగములందు, రోమ రోమములందు చేరిన యక్ష్మను తొలగించుచున్నాను. చర్మవ్యాధిని సహితము తొలగించుచున్నాను. వీటన్నింటిని కశ్యపుని "వివర్ణ" మంత్ర ప్రభావమున చేయుచున్నాను.
   
వ్యాఖ్య -    యక్ష్మ అనగా వ్యాధి. నేటి పాశ్చాత్య వైద్య విధానము వ్యాధిని నివారించుచున్నది. నిర్మూలించుట లేదు. ఏ అవయవపు వ్యాధిని దాని నుండి తొలగించుచున్నది. WHOLIWSTIC పరిపూర్ణ చికిత్స సాధ్యమగుట లేదు. వ్యాధి శరీరమంతటి నుండి తొలగించుటను గురించి వివరించినాడు.
   
    శరీర నిర్మాణ ANOTOMY శాస్త్రము నాడు ఎంత విపులముగా తెలిసికొన్నారో విదితమగుచున్నది. నఖ, శిఖ - గోటి నుండి తల - పర్యంతము సమస్త అవయవములను పేర్కొన్నాడు. వీటి అన్నింటి నుండి వ్యాధి తొలగినపుడే వ్యాధి నిర్మూలమగుట - రోగి ఆరోగ్యవంతుడగుట.
   
    నేడు మనము దీనికి ఎంత దూరములో ఉన్నాము?
   
                                             మూడవ సూక్తము - 34

వినియోగము :-
   
      1) వశాశమన కర్మమున ఘ్రుతా హుతులకు
   
      2) సకల లోకాధిపత్యము కోరువాడు దీనిచే ఇంద్రాగ్ని యాగము లేక ఉపస్థానము చేయవలెను.
   
      3) బ్రాహ్మణులకు ఇష్టాన్నము ఇచ్చుటకు.
   
      4) పశు యాగమున యూపము నుంచి సంజ్ఞాపనమునకు విడిచిన పశువును ఈ సూక్తముచే అనుమంత్రణము     చేయవలెను.
   
      5) 5వ మంత్రముచే వశా పశువును సంజ్ఞాపనము చేయవలెను.
   
1.    పశుపతి యగు రుద్రుడు పశుపోషకుడు, మానవులకు ప్రభువు అగుచున్నాడు. ఆ పశుపతి వద్ద నుండి గ్రహించి, స్వాధీన పరచుకున్న వశాపశువు యజ్ఞభాగము అగును గాక. యజమానికి ధన ధాన్యములు కలిగించును గాక.
   
2.    యాగము ప్రాణుల ఉత్పత్తి హేతువు అగుచున్నది. కావున వధించుటకు వదిలిన పశువును విడుచునట్టి చక్షురాధి దేవతలారా! ఈ యజమాని పుణ్యలోకము చేరుటకు మార్గము చేయండి. మంత్ర బలమున ఈ లోకము వదిలి పై లోకమునకు వెళ్ళు ఈ పశువు మాంసము దేవతలకు భోగ్యమగును గాక.
   
3.    ఇది వధ్యపశువు. దీని మందలోని ఇతర పశువులు దీనిని మనసుతోను, కంటితోను చూచుచున్నవి. అగ్నిదేవా! ఈ వధ్య పశువును ఆ చూపుల నుండి విడిపించుము. అవి విశ్వకర్మ సృష్టించిన ప్రజా కొరకు ఇహమున నిలుచును గాక.
   
4.    ఈ వధ్య పశువునకు గ్రామమున అన్య వివిధరూప, విరూప పశువుల సఖ్యత ఉన్నది. వాయుదేవా! ఆ పశువుల స్నేహమును విడిపించుము. అవి విశ్వకర్మ సృష్టించిన ప్రజ కొరకు ఈ లోకమున నిలుచును గాక.
   
5.    పశువా! నీ రాక కొరకు దేవతలు ఆకాశమున వేచి ఉన్నారు. వారు నీ దేహమును విడిచి వచ్చు ప్రాణమును అనుగ్రహించి, గ్రహింతురు గాక. ఆలోకమున భోగములనుభవించు దేహమున నిన్ను ప్రతిష్టింతురు గాక. దేవయాన మార్గమున నిన్ను స్వర్గమునకు చేర్చెదరు గాక.
   
                                              నాలుగవ సూక్తము - 35
   
వినియోగము :-

   
      1) అందరి మధ్యన భక్షించిన దృష్టి దోష నివారణార్ధము ఈ సూక్తముచే అన్నమును అభిమంత్రించి భుజించ     వలెను.
   
      2) సకల లోకాధిపత్యము కోరువాడు దీనిచే ఇంద్రాగ్ని యాగము లేక ఉపస్థానము చేయవలెను.
   
      3) అన్ని సవయజ్ఞములందు దీనిచే పురుస్తాద్హోహము చేయవలెను.
   
      4) సాకమేధ కర్మమున ఈ సూక్తముచే వైశ్వకర్మయాగ అనుమంత్రణము చేయవలెను. అగ్ని చయనపు     వైశ్వకర్మణ హోమానుమంత్రమున వినియోగము.
   
      5) దర్శపూర్ణ మాసపు పురస్తా ద్హోమమున దీని వినియోగము.
   
1.    ధనమును యాగాదులకు వ్యయించక అన్యములకు వ్యయించువారికి సమృద్ది కలుగకున్నది. ఆ ధనము తనను యాగాదులకు వ్యయించుమని విలపించుచున్నది. మేము అయజ్ఞము, దుర్యజ్ఞము చేసిన వారలము అగుచున్నాము. విశ్వకర్మ ఆ దోషములను నివారించును గాక.
   
2.    యాగ వైకల్ప పాపములకు యజమాని సహితముగ ఋషియు బాధపడుచున్నాడు. అట్లయ్యు యజమానికి పాపము కలుగుచున్నది. ప్రజాపతి సోమ బిందువులను స్వాధీన పరచుకున్నాడు. ఆ బిందువులు ఈ యజ్ఞమును పునీతము చేయును గాక.
   
3.    యుద్దములందు సైనికుడు అన్యుని అల్పునిగా భావించును. అట్లే తానే యజ్ఞమును ఎరిగిన వాడనని ఇతడు గర్వించినాడు. ఇతర యజ్ఞికులను చులకన చేసి పాపము చేసినాడు. విశ్వకర్మా! ఇతనిని ఈ పాప విముక్తుని చేయుము. ఇతనికి శుభములు కలిగించుము.
   
4.    ఋషులకు నమస్కారము. అంతః కరణమందుండి సత్యమును దర్శించు చక్షువునకు నమస్కారము. ద్యుమంతుడగు బృహస్పతికి మహా నమస్కారము. విశ్వకర్మకు నమస్కారము. పాహ్య2స్మాన్. మమ్ము కాపాడుము.
   
5.    ఇతడు యజ్ఞచక్షువు - యజ్ఞముఖము అగుచున్నాడు. వాక్కు, శ్రోత్రములు, మనసును ఎకాగ్రము చేసి ఇతనిని హోమించుచున్నాను. విశ్వకర్మ ఈ యజ్ఞమును, కల్పించి నిర్వహించుచున్నాడు. కావున సమస్త దేవతలు మంచి మనసుతో విచ్చేయుదురు గాక.
   
                                               ఐదవ సూక్తము - 36
   
వినియోగము :-

   
      1) కుమారికి పతి లభించుటకు ఈ సూక్తముచే తిలాన్నమును సంపాతించి తినిపించ వలెను.
   
      2) ఔక్షము, గుగ్గిలము, అలంకారములను సంపాతించి కన్యను కట్టి, పొగ వేసి, అలంకరించ వలెను.
   
      3) రాత్రిపూట ధాన్యమును ఈ సూక్తముచే ఆహుతి ఇచ్చి కన్యను ప్రదక్షిణము చేయించవలెను.
   
      4) సంపాతించిన నావ మీద ఎక్కించి ఇందలి 5వ మంత్రముచే దించవలెను.
   
      5) ప్రతిలాభ విజ్ఞాన కర్మమున ఏడు 'దామంత్రు' లందు ఏడు దూడలను కట్టి కన్యచే విడిపించ వలెను.     అవి దక్షిణమునకు పోయిన పతిలాభమని తెలియ వలెను.
   
      6) చిరగని బట్ట కట్టిన ఋషభమును హోమము చేసి విడువ వలెను.
   
      7) వివాహ కార్యమంది ఈ సూక్తముచే 'ఆగమకృసరము' ను సంపాతన, అభిమంత్రణములు చేసి కన్యను     తినిపించవలెను.
   
1.    అగ్నిదేవా! ఈ కన్యను భాగ్య సహితముగా వరించు వానిని మాకు చూపుము. అతడు సహృదయులగు తన బంధువులతో కూడి వచ్చును గాక. వారు మెచ్చుదురు గాక. ఆమెకు పతి సౌభాగ్యము కలిగింతురు గాక.
   
2.    ఈమె సోముని సేవించినది. గంధర్వులను సేవించినది. ఆర్యను స్వీకరించినాడు. ఈ కన్య ఐశ్వర్యమున ప్రసిద్దురాలు. ధాత అనుమతిన - దేవత కాని - మానవ పతిని ఈమెకు కూర్చుచున్నాను.
   
3.    ఈమె కన్య పతిని చేరును గాక. ప్రభువగు సోమ దేవత ఈమెకు సౌభాగ్యము కలిగించును గాక. పతిని చేరి మంచి భార్యయై పుత్రులను కనును గాక. అట్లు ఈమె సౌభాగ్యవతి, పరమ తేజస్వి అగును గాక.
   
4.    భోగ్య పదార్ధములతో కూడిన ప్రదేశము మృగములకు ప్రియము, సుఖ ఆవాసము అయినట్లు ఈమె పతి ప్రేమ కలిగి విలాస వస్తువులను వర్ధిల్ల చేయుచు భాగ్యవతి అగును గాక.
   
5.    కన్యా! భాగ్యప్రాప్తి సాధనము, అభిలషిత ప్రపూర్ణము, అక్షయమగు నావను ఎక్కుము ఈ నావలో ఎక్కి కోరిన భర్త వద్దకు చేరుము. 'ఇతడే నేను కోరినవాడు' అని అతనిని చేరు కొనుము.
   
6.    ధనపతీ! వరునిచే 'ఈ కన్య నా భార్య అగును గాక' అని ఘోషింప చేయుము. వారుణి వధువు ముందుకు చేర్చండి. వరుని మనసు వధువును ఆకర్షించునట్లు చేయుము. సమస్త ప్రాణులను వివాహమునకు అనుకూలురను చేయండి. వరుడు అనుకూలుడు అగును గాక.
   
7.    అమ్మాయీ! ఇవిగో బంగారు నగలు. ఇదిగో ధూపము. ఇదిగో ఔక్ష. వీటి అధిష్ఠాన దేవత భగుడు. నీవు వీనిని ధరించుము. సోమ, గంధర్వ, అగ్నులు నిన్ను నీ పతికి ఇచ్చుచున్నారు.
   
    (ఔక్షము - చందనము, పాలు, నేయి, నీరు కలిపి దానిని తేనెతో కలిపిన అలంకార ద్రవ్యము.)
   
8.    కన్యా! సవితా దేవత నీవు వరించిన వరుని తెచ్చును గాక. నీ భర్త నిన్ను తన ఇంటికి తోడ్కొని పోవును గాక.
   
    ఓషధులారా! ఈమెకు కోరిన వరుని ప్రసాదించండి.
   
   

    విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలా కారుడు, నాటక రచయిత, బాల సాహిత్య కారుడు, విమర్శకుడు, సినీ రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రగతి పథగామి, ప్రసన్నుడగు దాశరథి రంగాచార్య రచించిన శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత యందలి రెండవ కాండ సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.