Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    దరఖాస్తులు పరిశీలించి కేటాయించవలసింది స్థాయీ సంఘం. వారు కంచే - చేనూ రెండు మేశారు. ఇళ్ళన్నీ అర్హతలేని తమ బంధువులకూ అధికార్లకూ పంచారు. బంధువులపేర పరోక్షంగా తామూ కాజేశారు. నాకు ఇల్లు రాలేదు!
    
    పోరాటం నా సహజగుణం. అర్ధించడం అస్సలు చేతకాదు. అలా అర్హత కలిగి ఇళ్ళు దొరకని నలుగురిని కలుపుకున్నాను. వారు స్థాయీ సంఘాన్ని ఎదిరించడానికి సంకోచించారు. వారికి ధైర్యం చెప్పాను. నాకు సాహసం మెండు సూటిగా సాగిపోవడమే! వెనుకా ముందూ ఆలోచన ఉండదు!!

    నేను - జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ - ఒక అప్లికేషను వ్రాశాను. మిగిలినవారు జంకుతూ సంతకాలు పెట్టారు. నేను కమీషనరును కలిశాను. జరిగిన అన్యాయం వివరించాను. వారు గుర్తించారు. ఇక్కడ న్యాయం జరక్కుంటే పై అధికారుల దగ్గరికి వెళ్తానన్నాను. అవసరం అవుతే కోర్టుకు వెళ్తాననీ, ఇప్పుడు దొరికిన వారి ఇండ్లు ఊడ్తాయనీ బెదిరించాను.
    
    ధర్మరాజ్ మాథుర్ కమీషనరు నిజాయితీ గలవాడు. నా వాదనలోని న్యాయం గ్రహించారు. స్థాయీ సంఘం ముందు చాల గట్టిగా వాదించారు. 'ఈ దరఖాస్తుదారులకు ఇళ్ళు కేటాయించడం జరక్కుంటే తీర్మానాన్ని అమలుపరచను, అని బెదిరించారు.
    
    స్థాయీ సంఘంవారు తమ ఇల్లు పోతాయని బెదిరారు. అధికారులకు చేసిన అలాట్ మెంట్ రద్దు చేశారు. మా నలుగురికీ కేటాయించారు. అప్పటికి స్థాయీ సంఘాన్ని ఎదిరించి నెగ్గిన సంఘటన ఇది ఒక్కటే! నన్ను - ఇల్లు కోల్పోయిన అధికార్లు - కొందరు కార్పొరేటర్లు సహితంగా అభినందించారు. ఇళ్ళు దొరకని కార్పొరేటర్లు - నా ద్వారా - రాజకీయం జరపాలని ప్రయత్నించారు. నేను లొంగలేదు.
    
    మాకు అలాట్ మెంట్ ఆర్డర్లు వచ్చాయి. అయిదువందలు డిపాజిటు కట్టాలి. అయిదువందలు ఆ రోజుల్లో చాల పెద్ద మొత్తం. అది లభించడం దుర్లభం అయింది. పట్టుదలతో సాధించిన ఇల్లు వదులుకుంటే అపహాస్యం పాలు అవుతాం. చాల చిక్కు సమస్య వచ్చింది. నాకు అడగడం చేతకాదు!
    
    జీతం ఎక్కువని మాత్రమే ఈ కొలువులో చేరింది. అధికారపు ఆకర్షణ - ఆకాంక్ష నాటికీ నేటికీ లేవు. ఎక్కువ జీతం పట్నంలో ఎందుకూ చాలకుండా అయింది. కమల కాన్పులు - పిల్లలు - జబ్బులు - పెరిగిన అవసరాలు - అప్పులు చేయక తప్పడం లేదు. ఆర్ధిక దారిద్ర్యం వదల్లేదు. అది మరింత క్రుంగదీస్తున్నది. కమల సహనం తప్ప నాకు ఆధారం లేదు. కమల తన బాధలు కనిపించనిచ్చేది కాదు. పైగా కష్టాలు 'మనుషులకు కాక మానులకు వస్తాయా?' అని ధైర్యం చెప్పేది.
    
    అయిదువందలు సమస్య అయింది. ఉద్యోగుల సహకారపరపతి సంఘ కార్యనిర్వాహక సంఘంలో నేను సభ్యుణ్ణి కొంత అప్పు దొరికింది. అన్నయ్యను అప్పు అడిగాను, లేవన్నారు. ఇల్లు వస్తుందంటే అమ్మ సంతోషించింది. గార్ల పొలంలో వచ్చే ధాన్యం అమ్మి తెచ్చుకొమ్మంది. అన్నయ్య వీల్లేదన్నారు. ఒక మిత్రునికి ఈ విషయం తెలిసింది. 'పట్నంలో ఇల్లు సామాన్యమా?' అని తన పెళ్ళాం మెళ్ళో గొలుసు తీసి ఇచ్చాడు. నాకు నమస్కరించలేదు. నేను తీసుకోలేదు.
    
    అయిదువందలు దుస్తరం అయంది. పట్టుదలతో ఇల్లు సాధించినందుకు కుమిలిపోయాను. నా వైఫల్యం నన్ను నవ్వుల పాలు చేస్తుంది. అది మరింత క్రుంగదీసింది. కమల మెళ్ళో గొలుసు డోర్నకల్లులో అమ్ముకున్నాం. ఏమీ మిగల్లేదు. గడువు దగ్గరపడుతున్నది!
    
    కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన అప్పు మూడువందల ఇరవైరూపాయలు 12-1-59 న జమ కట్టాను. ఒక మిత్రుడు తాను సైకిల్ లోన్ తీసుకొని నాకిచ్చిన వంద రూపాయలు 3-2-59న కట్టాను. మరో 80 తెల్లవారి కట్టాలి. ఆళ్వార్ స్వామిగారు 80 అప్పు ఇచ్చారు. వారికి సమయానికి నేను తిరిగి ఇవ్వలేక పోయాను. అందును గురించి వారు వ్రాసిన ఉత్తరం నా దగ్గర ఉంది.
    
    మొత్తం మీద అయిదువందలు కట్టగలిగాం. ఇల్లు సాధించగలిగాం. ఇదొక విశేషం. ఇంతా చెప్పింది ఆనాటి ఆర్ధిక స్థితిని గురించి చెప్పడానికి నా పరిస్థితి కాదు నాడు నాలాంటివారి అందరి స్థితీ అలాంటిదే! దశాబ్ధంన్నర క్రితం - నా కౌమార్యంలోనే - ప్రజల సహకారంతో - గార్లలో సునాయాసంగా ఇల్లు కట్టాను!
    
    నాకు లాటరీలో 16 వ నెంబరు ఇల్లు అలాట్ అయింది. 1959 అక్టోబరు 11, ఆదివారం విజయదశమినాడు అమ్మ, అన్నయ్య కుటుంబం - ఇతర బంధుమిత్రులు వెంటరాగా - సంప్రదాయబద్దంగా గృహప్రవేశం చేశాం.
    
    మా ఇల్లు - అలా అనటంలో ఆనందం - శ్రామికుల మురికివాడకు ఎదురుగా ఉంది. అక్కడ రిక్షా కార్మికులు - తహపీ పనివారు - రోజుకూలీ జనం - మున్సిపల్ స్వీపర్లు ఉంటారు. పగలంతా పని చేస్తారు. రాత్రికి తాగి వస్తారు. జగడాలు - కేకలు - అరుపులు - కొట్టుకోవడాలు - కలవలాటలు - ఏడుపులు - పాటలు - పదాలు - అదొక లోకం. మేం గృహప్రవేశం అయిన్నాడు శ్రామికులు తుమ్మ చెట్టుక్రింద - తెల్లవార్లూ 'బాగోతులు' ఆడారు.
    
    మేం అడవిలో ఉన్నట్లున్నాం. మేం తప్ప ఎవరూ ఇళ్ళల్లోకి రాలేదు. అందరికీ ఊళ్ళో ఇళ్ళున్నాయి. ఇవి అదనం. ఇంటి ముందు రోడ్డు లేదు. రాళ్ళు బోళ్ళు. మా ఇళ్ళ పక్కన మామిడి తోట ఇంకా ఇంటికి కరెంటు రాలేదు. నల్లా ఉంది. పట్నం ఇంట్లో లాంతర్లతోనే ఉన్నాం. కరెంటు ఇంకా సంపన్నుల సౌకర్యమే! రాత్రి అవుతే భయం. తోటలోంచి పాములు - తేళ్ళు వస్తుండేవి!
    
    మా నివాసాలకు కొద్ది దూరంలో కల్లు కాంపౌండు. విశాలమయిన స్థలంలో అర్దరాత్రి దాకా జన సమ్మర్ధం!
    
    సామాన్యుల - పేదల - కార్మికుల - శ్రామికుల పట్నపు జీవితం దిసమొలతో ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఈ జీవితం 'మాయ జలతారు'లో వర్ణించడానికి అనేక రాత్రులు అక్కడ గడిపాను. ఇది పట్నంలో పల్లె. 'పసిడితో పట్నమ్ము - పసిడిలేక పల్లె' అన్నాను.
        
    మా అమ్మ మమ్ములను పెంచడం గుర్తులేదు. కాని కమల మా పిల్లలను పెంచడం చూస్తే తల్లి ప్రేమ ఎంత విలువయిందో అర్ధం అవుతున్నది. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకుంటుంది. గద్దవస్తే రౌద్రాకారంతో దండెత్తుతుంది. పిల్లలను కదిలిస్తే పిల్లి పులి అవుతుంది. సకల జీవజాలంలోనూ తల్లులకు పిల్లలను కాపాడుకుని - పెంచి - వదిలేసే గుణం ఉంది. మనవులలో మాత్రమే తండ్రి కొంత బాధ్యత వహిస్తాడు.
    
    ఈ అనుబంధాలతోనే లోకం నిలుస్తున్నది. పిల్లల కోసం తల్లితండ్రులు ఎంతటి త్యాగాలకయినా సిద్దం అవుతారు. పెద్దయి పెరిగిన పిల్లలు తల్లితండ్రులను లెక్కచేయరు!
    
    ఎన్నో లక్షల సంవత్సరాలు మేధావులు నిరంతరం కృషి చేసిన ఫలితంగా వివాహ వ్యవస్థ - కుటుంబం ఏర్పడినాయి. పారిశ్రామికీకరణ సృష్టించిన వ్యక్తివాదం కుటుంబాన్ని కుంచిస్తున్నది. తండ్రి, తాతలతో కూడిన ఉమ్మడి కుటుంబాలు మృగ్యం అయినాయి. అప్పటికి తల్లిదండ్రులు పిల్లల కుటుంబాలున్నాయి. ఇప్పుడు అభివృద్ధి చెందినవి అని చెప్పుకునే దేశాల్లో కుటుంబాలు మాయం అయి, వ్యక్తులు మిగిలారు. అక్కడ వివాహ వ్యవస్థ వెక్కిరింతకు గురి అయింది. సగంమంది పెళ్ళిలేని తల్లులున్నారు. తండ్రిలేని పిల్లలను గుర్తించే జంతుదశకు సమాజం చేరుకుంది. దీనిని అభివృద్ధి అనడం సిగ్గుచేటు! ఇప్పుడు ఆ సమాజాలు సిగ్గుపడుతున్నాయి. కుటుంబాలను కూర్చే ఉద్యమాలు నిర్వహిస్తూ, చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
    
    భారత కుటుంబ వ్యవస్థలో కొన్ని విలువలు ఇంకా నిలిచి ఉన్నాయి. తల్లి కావడానికి ఎన్ని యాతనలు పడినా స్త్రీ మూర్తి మురిసిపోతుంది. మాకు 1958లో ఒక బాబు కలిగాడు. నాకు ఆడా, మగా వ్యత్యాసం లేదు. కాని మిగతా వాళ్ళు మురిసిపోయారు. విజయకుమార్ ను అపురూపంగా చూచుకున్నాం. 1959లో నెలలు నిండక ఏడునెలలకే రెండున్నర పౌనుల పాప కలిగింది. ఆమె పేరు సుధ. ఆమెను పెంచడానికి కమల పడిన యాతనలు వర్ణనాతీతం! ఆస్పత్రికి వెళ్ళడానికి బస్సుకు ఏడు పైసలు లేక - ఇద్దరు పిల్లలను వేసుకుని నడిచి ఆస్పత్రికి వెళ్ళింది. 1961లో విరించి అనే బాబు కలిగింతరువాత - జారిపోతున్న కమల ఆరోగ్యం దృష్ట్యా - నేను డబ్బిచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకున్నాను! అప్పటికి కుటుంబ నియంత్రణ ప్రాచుర్యం లేదు.
    
    అమ్మ - ఒక్కతే - గార్ల ఇంట్లో ఉండేది. జీవితంలో 'నాది' అనేదాన్ని మించిన మత్తులేదు. అహంకారం అంటే 'నేను', మమకారం అంటే 'నాది' - ఈ రెంటినీ తగ్గించుకొమ్మని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయినా, మానవ నైజం మారడం అంత సులభంకాదు. అమ్మ 'తన' ఇంట్లోనే తనువు వాలిస్తానంటుంది, కదలదు.
    
తల్లిలేని బిడ్డలం:
    
    మా అమ్మ - వేంకటమ్మ - గృహప్రవేశానికి వచ్చింది, ఉండిపోయింది. ఆమెకు ఇల్లు నచ్చింది. మనుమలు కొడుకులను మించిన బంధం! వదల్లేకపోయింది. వీళ్ళు చాదనక్కరలేదు. నల్లా ఎప్పుడూ వచ్చేది. కట్టెల పొగ లేదు. బొగ్గుల పొయ్యి. విజయ్ ని తీసుకొని సీతాఫలం బండ్ల దగ్గరికి పోయేది. పళ్ళు తెచ్చేది. ఆమెకు అవసరం అయినవి తెచ్చి ఇచ్చేవాన్ని. కమల బాగానే చూచుకునేది. అమ్మకోసం మడికట్టుకుని వంట చేసేది లక్ష్మీనారాయణ, రంగనాథుని కోవెలలకు తీసికెళ్ళేది. నెలా, నెలాపదిహీను రోజులుంది. అమ్మకు జీవితం అంతా కష్టాలే! ఆమె సుఖంగా ఉన్నందుకు నేను సంతోషించాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.