Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఆళ్వార్ స్వామికి దేవునిమీదికన్న మనిషిమీద - సమాజంమీద అనంతం అయిన విశ్వాసం ఉండేది. వారు తమ తొలి నవలకు పేరు పెట్టడానికి దారితీసిన ఉదంతం అందుకు నిదర్శనం. వారు 'చిత్ర' - ఇప్పటి 'అంజలి' టాకీస్ లో త్యాగయ్య - పిక్చర్ చూశారు. నాగయ్య నటించిన గొప్ప చిత్రం అది. నాగయ్య పోతన చిత్రంలో పోతన అవతారం, గౌరీనాథశాస్త్రి శ్రీనాథుని అవతారం దాల్చారు. అలాగే నాగయ్య త్యాగయ్యగా అవతరించారు. ఆ చిత్రం ఆళ్వార్ మీద ఎంతో ప్రభావం వేసింది. భక్తిపరంగా కాదు. దేవుణ్ణి నమ్ముకున్నవాడే బ్రతక కలుగుతే ప్రజలను నమ్ముకున్నవాడు బ్రతకలేడా అని తన నవలకు 'ప్రజల మనిషి' అని పేరు పెట్టారు. ఆళ్వార్ తిరుపతి వెళ్ళి వచ్చారు. తన కొడుకుకు శ్రీనివాస్ అని పేరుపెట్టారు.
ఆళ్వార్ స్వామి తెలంగాణ ప్రజాజీవితాన్ని నవలీకరించడానికి ఒక ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ప్రజల మనిషి తరువాత 'గంగు' నవలలు ప్రారంభించారు. ఆ నవలను - పాత్రలను - సన్నివేశాలను - ఇతివృత్తాన్ని గురించి నాతో వివరంగా చర్చించారు. అయితే, నేను వారికి సూచనలుగాని సలహాలుగాని ఇచ్చానని చెప్పలేను. నాకు అంతటి స్తోమత లేదు. వారు నాకు వ్రాసినంతవరకు చదివి వినిపించేవారు. నాకు నచ్చని చోట చెప్పేవాన్ని. వారికి కూడా అది నచ్చితే మార్చేవారు. వారు చివరిసారి వినిపించినపుడు "కాని, వెంకట్రావు ఇంట్లోంచి కేకలు పెడ్తూనే ఉన్నాడు. "కామ్రేడ్ సుజాత జిందాబాద్" వరకు విని అన్నాను: "మామయ్యా! నవల ఇక్కడికి ముగించడం మంచిది. మరీ పెద్దది కావటం మంచిది కాదు. గంగు ఇంకా చిన్నపిల్ల. నవలకు 'నవనీతం' అని పేరుపెట్టండి." నా సూచన వారికి నచ్చిందో లేదో తెలియదు. కాని దైవికంగా అది అక్కడికే ఆగిపోయింది.
మన ప్రయత్నం సంపూర్ణంగా ఉన్నా జరక్కపోయేది, ప్రయత్నం ఏమాత్రం లేకున్నా జరిగేది దైవికం.
ఆళ్వార్ స్వామి ఒక రోజు భవానీ భట్టాచార్య రచించిన "He who rides a tiger"అనే నవల నామీద వేశారు. "రంగన్నా! దీన్ని తొందరగ అనువాదం చేయి అచ్చు కావలె" అన్నారు. "మామయ్యా! నాకు ఇది...." నా మాట పూర్తి కానివ్వలేదు. "నీ శక్తి తెలియదు. చేయమంటున్నగద, చేసి ఇయ్యి" అన్నారు. అక్కడ నిలువలేదు, వెళ్ళిపోయారు.
మహారచయిత భవానీ భట్టాచార్య, వారు రచించిన ఆంగ్లనవల HE WHO RIDES A TIGER అనువాద బాధ్యత నామీద పడింది. నవల చదివాను. గొప్ప నవల. దాని మీద ఎనలేని అభిమానం ఏర్పడింది. అనువాదం విషయంలో భయమూ ఏర్పడింది. కాని తప్పదు. చేయల్సిందే, పుస్తకం మొత్తాన్నీ వాక్యాను వాదం చేశాను. తరువాత text వదిలాను. నా అనువాదాన్ని తెలుగు నుడికారపు వాక్యాలుగా వ్రాశాను. అనువదం పూర్తిచేసి మామయ్యకు అందించాను. వారు కనీసం నా అనువాదం సరిచూడలేదు. అచ్చుకు ఇచ్చారు. దానికి వారు పెట్టిన పేరు "దేవుని పేరిట" అది అచ్చయి 'చిత్తప్రసాద్' ముఖ చిత్రంతో నా చేతికి వచ్చిన్నాటి నా మురిపెం - బిడ్డకు కన్నతల్లి మురిపెం లాంటిది! అది నా తొలి నవలా అనువాదం!
"దేవుని పేరిట" 1943లో బెంగాలులో వచ్చిన భయంకర కాటకం ఇతివృత్తంగా వచ్చిన మహత్తర నవల. కరువులో మోసగించబడిన 'కాలూ' దేవుణ్ణి ఆయుధంగా తనను మోసగించిన వర్గాన్ని - మోసగిస్తాడు. దుర్మార్గాన్ని జయించడానికి దుర్మార్గపు ఆయుధాలే అవసరం అనుకుంటాడు. 'దేవుని పేరిట' అందరి మన్ననలు పొందింది. రచయితగా నాకు ఆత్మవిశ్వాసం కలిగించింది.
ముల్కరాజ్ ఆనంద్ రచన 'THE STORY OF MAN' కూడా మామయ్య నాతో అనువాదం చేయించారు. కాని అది అచ్చుకాకుండానే వెళ్ళిపోయారు.
ఆళ్వార్ స్వామికి అంతకుముందు కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం లేకుండింది. వారు సాహిత్యరంగంలో పని చేస్తున్నారు. అందువల్ల సభ్యత్వం తీసుకోలేదు.
కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెహ్రూ ప్రభుత్వం కూలదోసింది. అది ప్రగతిశీల రందరికీ ఆగ్రహకారణం అయింది. ఆ అకార్యంతో నెహ్రూ విషయంలో నాకు ఉండిన అచంచల విశ్వాసం పడిపోయింది.
అదేరోజు మామయ్య తోలుసంచీ పట్టుకొని మా ఇంటికి వచ్చి ధుమధుమలాడుతూ కూలబడ్డారు. "చిన్నాయిన ఇవ్వాళ శాన గరంగున్నడు" అని కమల చాయ్ అందించింది.
"అమ్మడూ! గరంగ ఉన్ననని ఇంకింత గరం చాయ్ ఇస్తున్నవు, చల్లటి నీళ్లియ్యి" అని తెప్పించుకొని త్రాగారు. వారి ఆక్రోశం సాంతం వెళ్ళగ్రక్కారు. నేనూ అగ్నికి ఆజ్యం పోశాను. ఇద్దరమూ కాస్సేపు కాంగ్రెసుమీది అక్కసు సాంతం వెళ్ళగ్రక్కాం.
"రంగన్నా! ఇగో నువ్వు సరియైన సలహా ఇవ్వాలె. నేను పార్టీ సభ్యత్వం తీసుకుందామనుకుంటున్న - ఏమంటవు?" అడిగారు.
"పార్టీ సభ్యత్వంతో నెహ్రూ సర్కారును కూలగొడ్తవా?" అని అడిగాను.
"ఇగో, పరాచికం కాదు. నా వ్యక్తిగత అసమ్మతి! నువ్వు వద్దన్నా చేరేదే!" అని చివాలున లేచివెళ్ళిపోయారు.
కమలా -నేనూ నివ్వెరపోయి చూచాం.
తరువాత మామయ్య పార్టీ మెంబరుగా దర్శనం ఇచ్చారు. వారిది సంకల్పబలం. కమ్యూనిస్టుగానే 6-2-1961న కన్నుమూశారు.
పగలంతా తన కొడుకు శ్రీనివాస్ను తీసుకొని ఎగ్జిబిషన్ కు వెళ్ళారు. మిత్రులను కలిసి వచ్చారు. రాత్రి అమాంతంగ గొంతుబాధ వచ్చింది. నొప్పింపక - తానొవ్వక ఎవరికీ చెప్పక వెళ్ళిపోయారు!
ఆళ్వార్ స్వామి కోరిక నెరవేరింది.
కమ్యూనిస్టుపార్టీ సభ్యునిగా కాలంచేశారు.
అరుణపతాక చ్చాయలో అంత్యక్రియలు జరిగాయి.
ఆళ్వార్ స్వామి ధర్మపత్ని యశోదమ్మ - కొడుకు శ్రీనివాస్ కంటే నేను ఎక్కువగా కోల్పోయాను.
ద్వారకనుంచి తిరిగివచ్చిన అర్జునుడు ధర్మరాజుకు కృష్ణ నిర్యాణం గురించి తెలియపరచే తొలిపద్యం "మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు మన బాంధవుడున్, మన విభుడు, గురువు, దేవర మనలను దిగనాడి చనియె మనజాధీశా! వలె ఉంది నా స్థితి. ఇది తీర్చనలవి కాని వేదన!
24.8.1976లో నా నవల "జనపదం" వట్టికోట ఆళ్వార్ స్వామికి అంకితం ఇచ్చి కొంత తృప్తి చెందాను. శ్రీకృష్ణదేవరాయాంద్ర గ్రంథాలయంలో - దేవులపల్లి రామానుజరావుగారు అధ్యక్షత వహించి, మా అన్నయ్య దాశరథి సహితంగా అనేకులు మాట్లాడిన సభలో శ్రీమతి యశోదమ్మగారికి శాలువా కప్పి - సజల నయనాలతో అంకితం అందించాను.
"ఆళ్వార్' ఏదో ఒక మనిషి పేరు కాదు.
అదో విధానము విధానమంటే ఏదో ఒక
కార్యవిధానముకాదు. అదొక జీవిత విధానము"
అదో కాళోజీ నివాళి.
మా అన్నయ్య డాక్టర్ దాశరథి వారి "అగ్నిధార" కావ్యాన్ని మామయ్యకు అంకితం ఇచ్చారు.
"ఎక్కడ దుఃఖం వున్నా బుద్దుడిలా
ఏగి, తోచిన సాయం చేస్తాడు.
అతడు 'ప్రజల మనిషి'
అతడంటే దుష్టులకు కసి
అబద్దాసురుని పాలిటి తల్వార్ ఆళ్వార్
ఆనందరమణికి షల్వార్ ఆళ్వార్" అన్నారు.
ఇరవయి తొమ్మిది
ఇయంగేహే లక్ష్మీ:
విధి విచిత్రం అయింది. విపరీతం అయింది. విశిష్టం అయింది. అనివార్యం అయింది.
విధి వేదాంతం కాదు. పార లౌకికం కాదు. ఆధ్యాత్మికం కాదు. వైరాగ్యం కాదు. విధి మానవ జీవితంలోనూ - సామాజిక జీవితంలోనూ అనివార్యం అయిన భాగం.
మానవుడు కాని, సమాజం కాని నిరంతర యత్నంలో ఉంటారు. కర్మ - కార్యం - ప్రయత్నం - ఇవి మానవ జీవితంలో ఊపిరి అంతటి ముఖ్యములు. అయితే సకల ప్రయత్నాలు ఫలించవు. మానవ ప్రయత్నం అంతగా లేకుండా ఫలించడం కూడా విధిమూలంగానే ప్రతివారి జీవితంలో - వారు ఎంతటి గొప్పవారయినా - ఎంతటి చిన్నవారయినా - విధి తన ప్రభావం చూపుతుంది. ఇందుకు నిదర్శణాలు నిశ్చింతగా అందరి జీవితాలలోనూ ఉంటాయి.
నేను చినగూడూరులో జన్మించాను. ఆ ఊరు నేటికీ నాకు ప్రియం. నా ప్రమేయం లేకుండానే నేను ఖమ్మంమెట్టు చేరాను. అక్కడ కొంత చైతన్యం కలిగింది. వాస్తవంగా ఖమ్మం నుంచి మారవలసిలేదు. నేను అనుకోకుండానే ఏమాత్రం చైతన్యం ఎరుగని గార్ల జాగీరు చేరాం. అక్కడ జీవితం ఒక మలుపు తిరగింది. ప్రజాపోరాటాల్లో పాల్గొనగలిగాం. ఆనాడు ఆ మైకంలో వ్యక్తిగత భవిష్యత్తును గురించి ఆలోచించనేలేదు.





