Home » vaddera chandidas » Anukshanikam 2



    అంకినీడు, నళిని వచ్చారు. నళినిని క్రితం నెలలో తొలి కాన్పు. మగబిడ్డ.
    "హలో శ్రీపతీ, యింత గొప్ప పెయింటర్ వని తెలిస్తే నా పిక్చర్ కి ఆర్ట్ డైరక్టరుగా వుండమనేవాణ్ని" అన్నాడు అంకినీడు.
    "అప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా నెత్తిన గుడ్డవేసుకునేవాడు!" అని నవ్వాడు శ్రీపతి.
    "ఆ డర్టీ సినిమా మాట యెత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను?" అని కసిరింది నళిని.
    ఆమె మెడలోని రవ్వలహారం కాంతికి చిత్రలేఖనాల కొన్ని రంగులు జిగేలుమంటున్నాయి.
    "నాక్కూడా పెయింటింగ్స్ నేర్చుకోవాలనిపిస్తాంది. అజంతా శిల్పాల వంటి చక్కని బొమ్మలు వెయ్యాలని__" అంకినీడు అంటూంటే__
    "స్వామీ మీ పెయింటింగ్ ఆసక్తి ఆపుతారూ? అన్యాయంగా చిత్రలేఖనం కళని యెందుకు నాశనం చేస్తారు! ఆ వ్యాపారమేదో వుంది. అది చూసుకోండి చాలు" అని శ్రీపతితో, "మీ అంకినీడుగారికి సరదాలెక్కువ" అంది నళిని.
    "పూర్వ వాసనలన్నీ పోగొట్టారనుకుంటాను!" అన్నాడు శ్రీపతి.
    "సొంతంగా కొంత జ్ఞానోదయం అయినాకనే సాధ్యపడింది. పూర్తిగా నా ప్రతిభ కాదు" అని నవ్వింది నళిని.
    ఆరో రోజున__
    విజయ్ కుమార్, అతని భార్య కనకదుర్గ, వాళ్ళతో పాటు వందన వచ్చారు. కనకదుర్గకి తొలి వేవిళ్ళ సమయం. విజయ్ కుమార్ విరసంతో సహా అన్ని వదిలేశాడు. ఇప్పుడు అతని లోకం వ్యాపారం, డబ్బు, కనకదుర్గ. ఆ దుర్గం దాటలేని మానసిక స్థితి. ఓ పెయింటింగ్ లో ముఖం పెట్టి చూస్తున్నాడు.
    కనకదుర్గ కొన్ని పెయింటింగ్స్ గురించి వివరాలు అడుగుతోంది. ఆమెకి లలితకళలన్నా సాహిత్యమన్నా చాలా ఆసక్తి. ముఖ్యంగా లలిత కళలు.
    యేదో చెప్పాడు శ్రీపతి.
    "ఆ కాంపోజిషన్ లో నల్లని మారక యెందుకు వేశారు? పక్కన గీత దేనికుంది?" అని అడిగింది కనకదుర్గ.
    "ఇదంతా షీ మెర్ స్పాన్ టేనియస్ ప్లో. నాకేం తెలియదు. మీలాంటివారు వివరించాలి" అన్నాడు శ్రీపతి.
    "నాకు చూసి ఆనందించటం తప్ప పెయింటింగ్ గురించి బొత్తిగా తెలవదు. పల్లెటూరిదాన్ని" అంది కనకదుర్గ.
    "చాలామందిమి పల్లెటూరి వాళ్ళమే. అయినా పల్లెటూళ్ళు తెలియని పట్నవాసపు వాళ్ళం" అన్నాడు శ్రీపతి.
    అప్పటిదాకా శ్రీపతిని కన్నార్పకుండా మౌనంగా చూస్తున్న వందన, "నా పేరు వందన. మా దుర్గ సిటీ కాన్వెంట్ నుండి నగర సన్యాసం పుచ్చుకుని పల్లెవాసానికెళ్ళింది" అంది ఇంగ్లీషులో.
    "మీ పేరూ తెలుసు. మీ నాట్యమూ తెలుసు" అని చిన్నగా నవ్వి "అందుకే మా విజయుడంతవాణ్ని దారికి తేగలిగారు" అన్నాడు శ్రీపతి కనకదుర్గతో.
    "అందులో మా వందన నేస్తం పాత్ర చాలావుంది" అంది.
    కన్నార్పకుండా శ్రీపతిని చూస్తూనే వున్న వందన, "ఆ పెయింటింగ్ కదలనట్లుగా వున్నదిగాని దాన్లో నాకు డాన్స్ కన్పిస్తున్నది" అంది వందన.
    "మెచ్చుకోలుగా చూసి, "దాని మూలశక్తి నాట్యమే. మూలశక్తి అజ్ఞానంగా వుంటుంది కదా, అందుకని కనపడదు. మీరు నర్తకి కదా అందుకని గ్రహించగలిగారు!" అన్నాడు శ్రీపతి.
    సంతోషంతో పొంగిపోతూ, "మీరు సాయంత్రంకాక పొద్దుట పూట వుండరా?" అంది వందన ఇంగ్లీషులో.
    "ఐపోయింది. యిది ఆఖరి రోజు. ఆఖరి పూట" అన్నాడు.
    "మిమ్మల్ని పెయింటింగ్ గురించి అడిగి తెలుసుకోవాలనుంది. మీరు హాస్టల్లో వుంటారు కదా__ మీకు అభ్యంతరం లేకపోతే నా ఆహ్వానాన్ని మన్నించి ఒకరోజు మీకు వీలున్నప్పుడు మా యింటికి ఓ సాయంత్రం రాగలరూ?" అంది వందన ఇంగ్లీషులో.
    "అదెంత భాగ్యం? రికామీగా తిరుగుతుంటాను. మీకెప్పుడు వీలో చెప్పండి" అన్నాడు శ్రీపతి.
    "మీరు చెప్తే యే సాయంత్రమైనా సరే. రేపు రాకూడదూ?" అని ఇంగ్లీషులో మాట్లాడుతున్నాను" అంది ఇంగ్లీషులోనే.
    "మీ తెలుగు స్వచ్చమైన తెలుగు" అన్నాడు శ్రీపతి.
    "మరీ అంత దిల్లగి చెయ్యరాదు!" అంది వందన.
    "దాన్లో దిల్లగి లేకపోతే స్వచ్చమే మరి!" అని చిన్నగా నవ్వాడు శ్రీపతి.
    వాళ్ళతోపాటు శ్రీపతి ఎదుట వుండదలచక అటు వెళ్ళిన విజయ్ కుమార్ తిరిగి వచ్చాడు. మళ్ళీ అవతలకి వెళ్ళి కనకదుర్గని పట్టుకొచ్చాడు పెయింటింగ్స్ లోంచి. ముగ్గురూ బయల్దేరారు.
    వెళ్ళబోతూ, శ్రీపతిని కంటినిండా చూసి నడుస్తూ__మళ్ళీ వొకసారి వెనక్కి తిరిగిచూసి, గెంతినట్లుగా అడుగులు వేసి వాళ్ళిద్దరినీ కలుసుకుంది వందన.

                              121

    శ్రీపతి పోర్టికో మెట్లమీద కనిపించేసరికి, సోఫాలో కూర్చుని వున్న వందన చెంగున గెంతినట్లుగా లేచి యెదురువెళ్ళి, 'మీకోసం అప్పటి నుంచి యెదురుచూస్తున్నా" అంది.
    "నేను లేటా? ఫోన్లో ఆరింటికి వస్తానని చెప్పాననుకుంటాను" అని వాచ్ వంక చూసుకున్నాడు సరిగ్గా ఆరు గంటలు.
    "అవును కదా! మీరు లేట్ కాదు. నాకు అట్లనిపించి వుండాల" అని సోఫా వంక చెయ్యి చూపెట్టింది కూచోమన్నట్లుగా.
    నాట్యాభినయనానికి అనుకూలమైన సన్నటి పొడవాటి చేతులు.
    కూర్చుని, "మీ ఇల్లు బాగుంది. యీ వూళ్ళో చాలా బావున్న ఇళ్ళలో వొకటి" అన్నాడు శ్రీపతి.
    "యెవరో ఒక ఇటాలియన్ ఆర్కిటెక్ట్ తోటి ప్లాను రాయించిన్రు మా ఫాదర్" అంది.
    "ఐతే నాట్యపు చురుకుతనం లేదు బంగళాలో. స్థబ్దుగా వుంది." అన్నాడు.
    "మా ఫాదర్ కి నాట్యం తెలియదుగా" అని నవ్వి, "ఆ ఆర్కిటెక్ కి కూడా తెలిసివుండదు" అంది. చిన్నగా నవ్వాడు శ్రీపతి.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.