Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    15. సోమమా ! అంగిరుల గోవులను వెతుకువాడును. మహామహుడును, మానవదర్శకుడగు ఇంద్రుని కొరకు ప్రవహించుము. "ఐంద్రస్య జఠరేవిశ" ఇంద్రుని ఉదరమున వసింపుము.

    16. సోమమా ! నీవు  మహామహుడవు. దేవతలకు ఆనందదాతవు. ప్రశంసనీయుడవు. ఎంతో బలవంతులందు తేజస్వివి. శత్రువులతో యుద్ధము చేసినావు. వారి ధనమును గెలిచినావు.

    17. సోమము బలవంతులందు మహాబలవంతుడు, శూరులందు, మహాశూరుడు, దాతలందు మహాదాత.

    18. సోమమా! నీవు మహాబలవంతుడవు. యజ్ఞముల ప్రేరకుడవు. మాకు అన్నమునిమ్ము. పుత్రులనిమ్ము. వృణీమహే సఖ్యాయ వృణీమహే యాజ్యాయ. మైత్రి కొరకు నిన్ను వరింతుము. శత్రువులనుండి రక్షణ కొరకు నిన్ను వరింతుము.

    19. పవమాన సోమమా! నీవు మా  బ్రతుకులను రక్షింతువు. మాకు అన్నమునిమ్ము. అన్నరసము నిమ్ము. రాక్షసులను మాకు దూరమున నష్టపరచుము.

    20. పంచజన హితైషి, ఋషి, పవిత్రుడు, పురోహితుడు, మహాయశస్వి అగ్నిని ధనాదులకు యాచింతుము.

    21. అగ్నీ! నీవు శుభకర్ముడవు. మాకు మంచి బలోపేత తేజస్సునిమ్ము. పుత్రులనిమ్ము. గోవులు మున్నగు వానినిమ్ము.

    22. పవమాన సోమము శత్రువులను ఆక్రమించును. స్తోతల శోభన స్తుతులను అందుకొనును. "సూరోన దిశ్వదర్శతః" సూర్యునివలె విశ్వదర్శనీయుడు కూడ అగును.

    23. మానవులచే మాటి మాటికి శుద్ధి చేయబడిన సోమము నిరంతరము దేవతల వద్దకేగును. సోమము ఆనందప్రదుడు. అన్నవంతుడు, హవికి హితైషి. అందరకు ద్రష్ట.

    24. క్షరణశీల సోమము అంధకారమును అంతము చేసినాడు. విశేషమ్ సర్వత్రవ్యాప్తి, దీప్తిమంత, శ్వేతవర్ణ తేజస్సును కలిగించినాడు.

    25. సోమము తేపతేప అంధకారమును అంతమెందించును. అతడు వ్యాపక తేజోవంతుడు. క్షరణశీలుడు. అతని ధారలు ఆనందదాయినులు. శీఘ్రకారిణులు వహనశీలలు. అవి దశాపవిత్రము నుండి వెడలుచున్నవి.

    26. పవమాన సోమము అతిరథవంతుడు. నిర్మలతమ యశశ్వి హరితధారావంతుడు మరుత్తుల సహాయ యుక్తుడు. తన కిరణములచే సకల విశ్వమున వ్యాపించును.

    27. పవమనాసోమము అన్నదాత. స్తోతలను బలయుతులను చేయువాడు. పుత్రులనిచ్చువాడు. అతడు తన కిరణములచే సకల విశ్వములందు వ్యాపించును.

    28. క్షరణశీల సోమము మేషలోమమయ పవిత్రమును దాటి క్షరితమైనది. పవిత్రమున శుద్ధమై. ఇంద్రుని ఉదరమున వసించినది.

    29. కిరణరూప సోమము గోచర్మము మీద రాళ్లతో ఆటలాడుచు, "ఇంద్రం మదాయ జోహువత్" ఇంద్రుని మదమునకు ఆహ్వానించినాడు.

    30. క్షరణశీల సోమమును శ్యేనరూపగాయత్రి ద్యులోకమునుండి తెచ్చినది. రసరూప అన్నము యశోయుక్త సోమము వద్ద ఉన్నది. "తేననో మృళయ జీవసే" దానితో మా జీవితమును ఆనందమయము చేయుము.
   
                               అరువది ఏడవ సూక్తము
      ఋషులు - వేరువేరు, దేవతలు - వేరు వేరు, ఛందస్సు - గాయత్రి.

    1. క్షరణశీల సోమమా! నీవు అత్యంతమదకరుడవు, అత్యంత ఓజస్వివి. హింసాశూన్యూడవు. యజ్ఞములందు అభిషవధారము కోరువాడవు. స్తోతలకు ధనమిచ్చువాడవు. ద్రోణ కలశమున ధారారూపముగా పడుము.

    2. కర్మనిష్ఠపురోహితులకు మత్తుకలిగింతువు, వారికి ధనములనిత్తువు. ప్రాజ్ఞుడవు. యజ్ఞమును ధరించువాడవు అన్నసహితుడవై ఇంద్రునకు మరింత మత్తు కలిగింపుము.

    3. పవమాన సోమమా! రాతితో దంచబడుము. శబ్దము చేయుము. కలశమున చేరుము. దీప్తియుక్త, శత్రుశోషక బలము పొందుము.

    4. సోమము రాతితో దంచబడును. మేషలోమమయ పవిత్రమునుండి వెడలును. అప్పుడు హరిత సోమము అన్నముతో "నిన్నుకూడి ఇంద్రుని పిలుతును" అనును.

    5. సోమమా! మేషలోమమయ పవిత్రమునుండి వెడలినపుడు హవిరూప అన్నము, సౌభాగ్యము, గోయుక్త బలమును పొందెదవు.

    6. పాత్రలందు పడుసోమము వందగోవులు, వేయి అశ్వములు, ధనమును ప్రసాదించవలెను.

    7. పవిత్రమునుండి వెడలి, అనేక ధారలుగా కలశమందు పడునట్టి మాదక సోమము చమసాదులందు వ్యాపించును. తన చలనమున ఇంద్రుని పరివ్యాప్తము చేయును.

    8. సోమము అన్నింటికన్న ఉన్నతము. పూర్వజులు అభిషవించిన సోమము ఇంద్రుని కొరకు కలశమున చేరును. ఇంద్రుని కొరకు క్షరితమగును.

    9. పనులు చేయుటకు ఇటునటు కదులు అంగుళులు మాదక రసమును రాల్చును. యాగాది కర్మలను ప్రేరేపించును. క్షరణశీల సోమమునకు ప్రేరణ కలిగించును. స్తోతలు స్తోత్రములచే సోమమును స్తుతింతురు.

    10. పూష అజవాహనుడు. అతడు మా సమస్త యానములకు రక్షకుడు. అతడు మాకు  అందవతులగు కన్యలను ఈయవలెను - "ఆభక్షత్కన్యాసునః"

    11. కళ్యాణముకుటవంత పూష కొరకు మా సోమము మాదక ఘృతము వలె క్షరితమగును. అతడు మాకు సుందర కన్యలను ప్రసాదించవలెను - "ఆభక్షత్కవ్యాసునః"

    12. సర్వత్ర దీప్తమంతుడవగు పూషా ! నీ కొరకు అభిషుత సోమము పరిశుద్ధఘృతమువలె - క్షరితగును.

    13. సోమమా! నీవు స్తోతల స్తోత్రముల జనకుడవు. ద్రోణకలశమున చేరుము. నీవు దేవతలకు రత్నాదుల దాతవు.

    14. శ్యేనపక్షి గూటికి వెళ్లునప్పటివంటి ధ్వనిచేయుచు సోమము ద్రోణకలశమున చేరును.

    15. అభిషంతసోమము - శ్యేనమువలె - సర్వత్ర చేరగలది - చమసములందు చేరునది.

    16. సోమమా! నీవు ఎంతో మధుర రసవంతుడవు. మాదకుడవు. "ఇంద్రాయ మధుమత్తమః"  ఇంద్రుని ప్రసన్నుని చేయుము.

    17. సోమము అభిషుతము. అన్నవంతము. ఋత్విక్కులు సోమమును దేవతలకు అర్పింతురు. సోమము - రథమువలె - శత్రుసంపదను హరించును.

    18. సోమము అత్యంత మాదకము. అభిషుతము. దీప్తము. అతడు సోమరసపానము కొరకు వాయువును సృష్టించినాడు.

    19. సోమమా! నీవు శిలలచే అభిషుతమగుదువు. స్తోతలకు శోభన శక్తివంత  ధనాదుల నిచ్చెదవు. దశాపవిత్రమునకు సాగుదువు.

    20. శిలలచే  అభిషుతమై, అందరిచే స్తుతించబడిన సోమము రాక్షసుల వదించును. "పవిత్రమతిగాహతే" అవిత్రమును దాటి సాగును.

    21. సోమమా! దూరమున ఉన్న , దగ్గరున్న, ఇక్కడ ఉన్న భయమును భంగపరచుము.

    22. సర్వద్రష్ట, క్షరణశీల, దశాపవిత్ర శోధిత సోమము మమ్ము పావనులను చేయవలెను.

    23.శ్రేష్ఠఅగ్నీ! నీ తేజస్సునడుమ ఉన్న పరిశుద్ధము చేయు సామర్ద్యమున - పుత్రాది  వర్ధకమగు మాదేహమును "పునీహి" పవిత్రము చేయుము.

    24. అగ్నీ! నీ తేజస్సు శోథకము - సూర్యాదుల తేజోయుక్తము. దానితో మమ్ము పావనము చేయుము. సోమాభిషమును పవిత్రము చేయుము.

    25. సర్వప్రేరక, ప్రకాశమాన సోమమా! నీ అభిషవమున, పాపపరిహారక తేజమున నలుదిశల నుండి మమ్ము పావనులను చేయుము - "మాం పునీహి విశ్వతః"

    26. శ్రేష్ఠఅగ్నీ! దక్ష, సమర్థవంత అగ్ని, వాయు, సూర్య తేజస్సులతో మా దేహములను పావనము చేయుము.

    27. పునన్తుమాం దేవజనాః పునన్తువసవోధియా విశ్వేదేవాః పునీతమా జాతవేదః పునీహిమాం దేవతలు నన్ను పవిత్రుని చేయవలెను. దసువులు నన్ను మా కర్మలచే పవిత్రుని చేయవలెను. దేవతలందరు నన్ను పవిత్రుని చేయవలెను. జాతబుద్ధి అగ్ని నన్ను పవిత్రుని చేయవలెను.

    28. సోమమా! మమ్ము చక్కగా వర్థిల్లచేయుము. నీ కిరణములన్నింటితో దేవతలకు ఉత్తమ హవి రూపరసము అర్పించుము.

    29. సోమమా! నీవు అందరను ప్రసన్నులను చేయువాడవు. శబ్దించువాడవు. వయస్కుడవు ఆహుతులచే వర్థనీయుడవు. క్షయణశీలుడవు. నమస్కరించుచు సాగుదుము. "ఆగన్మబిభ్రతోనమః"

    30. దీప్యమాన సోమమా! ఆక్రమించు శత్రువు ఆయుధమును ననాశ, నాశము చేయుము. మాకొరకు క్షరితుడవగుము. సర్వహరిత శత్రువును వధించుము.

    31. పవమానసోమదేవత కొరకు ఋషులచే సంపాదించ బడిన వేదరసరూపసారమును పఠించిన వరునకు - వాయుదేవత పవిత్రము చేసిన - పాపశూన్య అన్నము లభించును.

    32. పవమానసోమదేవత కొరకు ఋషులచే సంపాదించ బడిన వేదరసరూపసారమును పఠించునరునకు సరస్వతి స్వయముగా ఘృత, క్షీర, మదకర సోమములను అందించును.

    (31,32 మంత్రములు ఫలశ్రుతి వంటివి వేదాధ్యయన ఫలమును సూచించుచున్నవి. ఇట్టివి ఇంతకు ముందు కనిపించిన జాడలేదు.)

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ అష్టకము తొమ్మిదవ మండలమున మూడవ  అనువాకము సమాప్తము.)

               నాలుగవ అనువాకము         అరువది ఎనిమిదవ సూక్తము
       ఋషి - భలందన పుత్ర వత్సప్రేరుడు. దేవత - పవమాన సోమము. ఛందస్సు -
                                            జగతి - 10 త్రిష్టుప్


    1. గోవులు ఆనందదాయనులు. సోమము గోవులవంటిదే. ఇది ఇంద్రుని కొరకు క్షరితమగును. అంబారావములు చేయుచు కుశలపై కూర్చున్న పాడియావులు ఇంద్రుని కొరకు - ప్రవహించునదియు, పరిశుద్ధమగు - సోమరసమును వహించును.

    2. హరితవర్ణసోమము ధ్వనిచేయును. స్తోతల ముఖ్యస్తుతులను ఆలకించును. పైకి పాకు తీవలకు రసవంతములగు ఫలములు కలిగించును. మేషలోమమయ దశాపవిత్రమున చేరును. వేగముగా ప్రవహించును.

    3. సోమము తనతో ఉండు ద్యావాపృథ్వులను సృష్టించినది. వానిని వర్థిల్లచేసి, సమర్ధులను చేయుటకు సోమము తన రసమును అందించినది. భువి, అపారద్యావా పృథ్వులను ఎరక పరచిన సోమము నలుగడల తిరుగుచు అవినాశ్య బలమును సాధించినది.

    4. ప్రాజ్ఞసోమము ద్యావా పృథ్వులందు సంచరించును. అంతరిక్షపు జలమును పంపును. అన్నసహితమై తన స్థానము ఆప్యాయతము చేయును. సోమము ఋత్విక్కులచే యవలసత్తులో కలుపుబడును. సోమము అంగుళుల సాంగత్యము పొంది సకల ప్రాణులను రక్షించును.

    5. సోమము ప్రవృద్ధమనస్కుడు. కార్యకుశలుడు. అతడు భువిమీద తన జన్మను గ్రహించును. యజ్ఞములందు స్తుతించబడును. దేవతలచే నియమ ప్రకారము నిలుపబడును. యువసోమము మరియు సూర్యుడు తమ ఉత్పత్తి సమయమున విశేషముగ అవతరింతురు ఒకరు గుహయందుండగా ఒకరు  ప్రకాశింతురు.

    6. మాదక సోమరస స్వరూపమును విద్వాంసులు ఎరుగుదురు. సోమరూప అన్నమును గాయత్రి రూప పక్షి ద్యులోకమునుండి తెచ్చినది. సోమము వర్థమానము, కిరణస్వరూపము. దేవాభిలాషి, నలుదిశల సంచరించునది -స్తుతించబడునది. ఋత్విక్కులు అట్టి  సోమమును వసతీవరీ జలములందు పరిమార్జితము చేయుదురు.

    7. సోమమా! నీవు రెండు చేతులండు పుట్టినావు. ఋషులు నిన్ను పాత్రలందుంచినారు. పది అంగుళులు నిన్ను అభిషవించి, స్తుతించి, కర్మలచే మేషలోమ పవిత్రమున  పరిమార్జించును. దేవతలను ఆహ్వానించు. కర్మనిష్ఠులగు ఋత్విక్కులు నిన్ను గృహములందు స్థాపింతురు. నీవు స్తోతలకు అన్నము ప్రసాదింతువు.

    8. సోమము పాత్రలందుండి నలువైపుల సంచరించును. సోమమును దేవతలు ఆకాంక్షింతురు. శోభనస్థానముగల సోమపుమనోగతమును స్తోత్రములు స్తుతించును. ఉన్మత్త, రసవంత సోమము వసతీవరీ జలసహితమై - ఆకసమునుండి - ద్రోణకలశమున చేరును. శత్రుధనవిజేత, అమరసోమము వాక్యమునకు ప్రేరణ కలిగించును.

    9. సోమము ద్యులోకమునుండి సమస్తజలమును కురిపించును. దశాపవిత్రమున పరిశుద్ధమై కలశమున చేరును. సోమము శిలలు, వసతీవరీజలము, దుగ్థాదులతో అలంకృతుడగును. అభిషుత. శోధిత సోమము స్తోతలకు ప్రియమును, శ్రేష్ఠమును అగు ధనమును ప్రసాదించును.

    10. సోమమా !నీవు దాతవు. పరిషిక్తుడవగుము. మాకు నానావిధ అన్నములను ప్రసాదించుము. ద్వేషశూన్యద్యావ్యా పృథ్వులను పిలుచుచున్నాము. దేవతలారా! మాకు వీరపుత్రయుక్త ధనము అందించండి.

                                 అరువది తొమ్మిదవ సూక్తము
       ఋషి - అంగిరస హిరణ్య స్తూపుడు, దేవత - పవమాన సోమము,
                           ఛందస్సు - జగతి  -9,10 త్రిష్టుప్


    1. ధనుస్సున బాణము ఉంచినట్లు - మేము పవమాన రూప ఇంద్రునందు మాననీయ స్తుతులను ఉంచుదుము. దూడ గోమాత స్తనముల కొరకు పుట్టినట్లు - మేము ఇంద్రుని మత్తు కొరకు సోమము కల్పింతుము. పాడియావు పాలిచ్చుటకు దూడముందు నడిచినట్లు ఇంద్రుడు స్తోతలముందు నడచును. "ప్రతేష్వపిసోమ ఇష్యతే" ఇంద్రుని కర్మములందు సోమము అర్పించబడును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.