Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    నలుడు అక్ష విద్యను నేర్చుకున్నాడు. ఋతుపర్ణునకు అశ్వహృదయమను విద్యను నేర్పుదునన్నాడు. ఋతుపర్ణుడు అందుకు సంతసించినాడు. కాని విదర్భకు శీఘ్రముగా వెళ్లవలసి ఉన్నందున ఆవిద్యను అనంతరము గ్రహింతునన్నాడు. ఈలోగా వార్ష్ణేయుడు గుఱ్ఱముల అలసట తీర్చినాడు. రథము సిద్దమయినది. సాగినది.
    నలుడు అక్ష విద్య నేర్చినాడు. అతనిలో ఆత్మ విశ్వాసము పెరిగినది. శక్తి హెచ్చినది. అంతటితో అతనిలో అంతవరకు ఉండిన కలిపురుషుడు బయటకు వచ్చినాడు. నలునకు నమస్కరించినాడు. తన బాధలకు కారణమయిన కలిని చూచి నలునకు కోపము వచ్చినది. కలి అది గ్రహించినాడు. "మహారాజా! నీలోని కర్కోటకుని విషముచేత సగము చచ్చినాను. నన్ను శపించకుము. మన్నింపుము. నిన్ను స్తుతించిన జనులు నా వలన అపాయములు పొందరు" అని నలుని ప్రార్థించినాడు. నలుడు కలిని కరుణించినాడు. విడిచినాడు. కలి పురుషుడు అది మొదలు తాండ్ర చెట్టును ఆశ్రయించినాడు. అందువలన తాండ్ర చెట్టు లోక ప్రసిద్ధమయినది. ఆవిధముగా నలుని నుంచి కలి వదలిపోగా అతడు నిర్మల మనస్కుడు అయినాడు. రూపము మాత్రము ఇంకను వికారముగనే ఉన్నది. నలునకు కలి పురుషునకు జరిగిన సంభాషణ వార్ష్ణేయ, ఋతుపర్ణులు ఎరుగరు.
    నలుని రథము విదర్భ చేరినది. అప్పటికి సాయంకాలమయినది. రథము వెళ్లునపుడు మేఘ ధ్వనివలె మ్రోగినది. దమయంతి ఆధ్వని విన్నది. అది నలుని రథ ధ్వని అని గుర్తించినది. పరుగు పరుగున వచ్చి మేడ మీదినుండి చూచినది. ఆరథమున నలుడు కనిపించలేదు. ఆమెకు దుఃఖము కలిగినది. కాని అనుమానముగనే ఉన్నది. వచ్చిన వారిలో ఒకడు నలుడు కావలెనని ఆమె నిశ్చయము. ఈలోన ఋతుపర్ణుడు ఒక మేడయందు విడిసినాడు. బాహుకుడు రథమును విప్పి, గుఱ్ఱములను కట్టివేసి రథము ప్రక్కన విశ్రమించినాడు.
    దమయంతికి బాహుకుని విషయమున అనుమానము కలిగినది. అయోధ్యకు వెళ్లివచ్చిన సుదేవుడు అట్టివానిని గురించియే చెప్పి ఉన్నాడు. అందువలన బాహుకుడే నలుడు కావలెను అనుకొని కేశిని అను చెలికత్తెను పిలిచినది. వివరములు చెప్పినది. బాహుకుని విషయము తెలుసుకొని రమ్మని పంపించినది. కేశిని బాహుకుని దగ్గరికి వెళ్లినది. వారి సంభాషణ ఇట్లు జరిగినది.
    కేశిని:- దమయంతి మీ కుశలము అడుగుటకు నన్ను పంపినది మీరు విదర్భ వచ్చుటకుగల కారణమేమి?
    బాహు:- భీమరాజు దమయంతికి రెండవ స్వయంవరము ప్రకటించినాడని ఋతుపర్ణుడు అయోధ్య నుంచి బయలుదేరినాడు. నేను అతని సారథిని. వారిని తీసుకొని నూరు ఆమడలు ఒక్కనాడే ప్రయాణించి వచ్చినాము.
    కేశిని:- మీ రథము మీద వచ్చిన మూడవ వాడెవడు?
    బాహు:- అతడు నల మహారాజునకు పూర్వపు సారథి వార్ష్ణేయుడు.
    కేశిని:- అట్లయిన నలుడు పోయిన జాడ వార్ష్ణేయుడు ఎరిగి ఉండవలెను.
    బాహు:- అది వార్ష్ణేయున కెట్లు తెలియును? అతడు నలుని బిడ్డలను విదర్భ వదిలి వెళ్లువరకు నలుని రాజ్యము పోయినది. అప్పుడు వార్ష్ణేయుడు అయోధ్య వెళ్లి ఋతుపర్ణుని ఆశ్రయించినాడు. నలుడు వెళ్లిన మార్గము దమయంతి మాత్రమే ఎరుగును. నలుని మార్గము నలునకు తెలియును. మూడవ వానికి అది తెలియదు. తెలుసుకొనవలసిన అవసరములేదు.
    కేశిని:- బాహుకా! నలుడు నిర్దయుడై దమయంతిని నట్టడవిలో ఒంటరిగా విడిచిపోయినాడు. ఆమె కట్టిన బట్టలో సగము చించుకొని పోయినాడు. నాటినుంచి ఆమె ఆ సగము వస్త్రముతోనే ఉన్నది. అది మురికిపట్టినది. కాని మార్చలేదు. శరీరము దుమ్ముతో నిండిపోయినది. ఆమె లెక్క పెట్టుటలేదు. జుట్టు జడలు కట్టినది. ఆమె గమనించుటలేదు. ఆమె వ్రతములు చేయుచున్నది. సగము తిండియే తినుచున్నది. నేలమీదనే పండుకొనుచున్నది. ఆమె చిక్కినది, శల్యమయినది. ఆమెను చూచిన గుండె జల్లుమనుచున్నది.
    నలుడు కేశిని మాటలు విన్నాడు. అతనికి దుఃఖము పొంగివచ్చినది. కన్నీరు కాలినది. అది కేశిని చూడరాదని తలవంచుకున్నాడు. మరొకవైపు చూచినాడు. మాట్లాడలేదు.
    కేశిని కొంతసేపు కూర్చున్నది, వెళ్లిపోయినది. దమయంతికి జరిగినదంతయు వివరించినది. దమయంతికి బాహుకుని విషయమున మరింత నమ్మకము ఏర్పడినది. కేశిని మరల బాహుకుని వద్దకు పంపినది. బాహుకుని వంట పద్ధతిని గమనించి రమ్మని చెప్పినది. కేశినిబాహుకుని వంటలు గమనించి వచ్చి చెప్పినది:-
    "అమ్మా! బాహుకుడు మనిషికాదమ్మా! సాక్షాత్తు దైవముగా కనిపించుచున్నాడు. అతడు అద్భుతములు చేయుచున్నాడు. ఆశ్చరయములు కలిగించుచున్నాడు. పొయ్యిలో గడ్డిపరక వేసిన భగ్గునమండుచున్నది. ఆ మంటతోనే సాంతము వంట చేయుచున్నాడు. మాంసాదులు కడుగ దలచినపుడు కుండలందు నీరు వాటంతట అవే వచ్చి నిండుచున్నవి. వాడిన పూలు సైతము అతని చేయి తగిలిన అప్పుడు కోసిన పూలవలె స్వచ్చములై, సుగంధము కలిగి ఉన్నవి. బాహుకునిది దివ్యశక్తి. అది అద్భుతము ఆశ్చర్యకరము".
    దమయంతి కేశిని మాటలు విన్నది. ఆమెకు మరింత విశ్వాసము ఏర్పడినది. బాహుకుడు వండిన మాంసము తెప్పించి తిని చూచినది. దానిలో నలుని పాక లక్షణములు కనిపించినవి. అప్పుడు తన కొడుకు కూతురును ఇచ్చి కేశినిని బాహుకుని భావములను తెలియపరచమని కోరినది.
    దమయంతి ఆ చొప్పున కేశిని బాహుకుని వద్దకు బిడ్డలను తీసుకొని వెళ్లినది. బాహుకుడు బిడ్డలను చూచినాడు. అతనిలో వాత్సల్యము పొంగిపొరలినది. బిడ్డలను అందుకున్నాడు. తల మూర్కొన్నాడు. తొడలమీద కూర్చుండ బెట్టుకొని ముద్దాడినాడు. తన నిజరూపము తెలియకుండుటకై కేశినితో "ఈ బిడ్డలు నా బిడ్డలవలె ఉన్నారు వారిని చూచి నా మనసు నీరగుచున్నది" అన్నాడు. కేశిని వెళ్లి ఈ మాటలు దమయంతికి తెలియపరచినది. దమయంతికి నిశ్చయమయినది బాహుకుడు నలుడని. ఆమె తన తల్లివద్దకు వెళ్లినది. జరిపినదంతయు, జరిగినదంతయు వివరించినది. తనను బాహుకుని వద్దకు పంపుమన్నది లేదా బాహుకుని పిలిపించమన్నది. దమయంతి తల్లి భీమరాజును సంప్రదించినది. బాహుకుని దమయంతి వద్దకు పిలిపించినారు. బాహుకుడు వచ్చినాడు. దమయంతి నలుని చూచినది. నలుడు దమయంతిని చూచినాడు. వారిలో సంద్రములు పొంగినవి. ఉప్పెనలు లేచినవి. తుఫానులు చెలరేగినవి, ఆటు-పోటు వచ్చినది. ఉభయులు ఎదురు బదురుగా చిత్తరువులవలె నిలచినారు. నోటమాట రాలేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.