Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



        యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
        నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||

        శ్రీమదాంధ్ర కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత

                                           ప్రథమ కాండము

                                         మొదటి ప్రపాఠకము

                                         మొదటి అనువాకము

    (యజమాని దర్శయాగము చేయకోరును. అప్పుడు అతని అధ్వర్యు అమావాస్య ఉదయమున అన్వాధానము చేయవలెను. వత్సాపాకరణార్థిమంత్రములు ఉచ్చరించవలెను. మోదుగు కొమ్మను నరుకవలెను.)

    1.2. పలాశమా! దేవతలకు అన్నము కొరకు నిన్ను నరుకుచున్నాను. వారికి బలము నిచ్చు రసము కొరకు నిన్ను సరిచేయుచున్నాను.

    3. దూడలారా! మీరు గడ్డి మేయవలసి ఉన్నది. మీ తల్లులను విడువండి. అరణ్యమునకు చేరండి. సాయంకాలము అగును. అప్పుడు యజమాని ఇంటికి తోలవలెను.)

    (అధ్వర్యు ఆల దూడలను మోదుగు కొమ్మతో అదిలించి తోలవలెను.)

    4. గోవులారా! ఇష్టి అను కర్మ అతిశ్రేష్ఠము. దాని నిమిత్తము దేవతలు మిమ్ము గడ్డిమేయుటకు అడవికి తోలుదురు గాత.

    (అధ్వర్యు దూడల వలె గోవులను అదిలించవలెను.)

    5. గోవులారా! మీరు ఇంద్రునకు దధిరూప భాగము ఇవ్వవలసి ఉన్నది. చక్కగా గడ్డిమేయండి. వర్థిల్లండి. మీరు రసవతులు. దుగ్ధవతులు. సంతానవతులు. క్రిమిదోష రహితలు. రోగరహితలు. మిమ్ము దొంగలు అపహరించకుందురుగాక. క్రూర జంతువులు హింసించకుండునుగాక.

    6. గోవులారా! రుద్రుడు క్రూరుడు. అతని ఆయుధము మిమ్ము బాధించకుండవలెను.

    7. గోవులారా! మీరు యజమాని వద్ద స్థిరముగా ఉండండి. సంతాన పరంపరలచే వర్థిల్లండి.

    8. పలాశమా! నీవు యజమాని గోవులను రక్షింపుము.

    (అధ్వర్యుడు మోదుగు కొమ్మను అగ్నిశాల మీద వేయవలెను.)

                              రెండవ అనువాకము

    (ఈ అనువాకమున బర్హి రాహరణము చెప్పబడుచున్నది.)

    1. గార్హ పత్యాగ్నీ! నీవు ఈ యజ్ఞమునకు 'ఘోషత్' అను ధనమవు అగుచున్నావు.

    2. నీకు గల శత్రువులును - రాక్షసులును నశింతురు గాత.

    3. ప్రాచీన విద్వాంసులు తూర్పు దిక్కునుండి దర్భలను తెచ్చినారు. అశ్వపు ప్రక్కటెముక జ్ఞాన స్వరూప. ప్రజాపతి మిర్మిత. అన్నముచే పదును పెట్టబడినది. యజ్ఞవేది మీద పరచవలసిన దర్భలు తెచ్చుటకు అశ్వపు పక్కఎముక తూర్పునకు పోవుచున్నది.

    (అధ్వర్యుడు తూర్పునకు - దర్భలు తెచ్చుటకు వెళ్లవలెను.)

    4. దర్భపుంజమా! దేవతల కొరకు మిమ్ము తీసికొనుచున్నాను. వర్షము వలన మీరు మరల పెరుగగలరు.

    5. దర్భా! నీవు దేవతలకు ప్రియమైన దానవు. నిన్ను నిలువుగా చీల్చినను - అడ్డముగా త్రుంచినను నిన్ను బాధించుటకు మాత్రము కాదు.

    (దేవతల కొరకు అనుట.)

    6. దర్భా! నీ గనుపు నశింపనివ్వను. మరల పెంచెదను.

    (అధ్వర్యు కత్తిని దర్భకు తాకించవలెను.)

    7. దర్భా! నేను నిన్ను హింసించక కోయుదును. "అచ్చేత్తాతేమారిషమ్".

    (అధ్వర్యు దర్భను కోయును.)

    8. దర్భా! నీవు ఎన్నో శాఖలుగ అంకురించుము.

    (అధ్వర్యు గనుపును తాకును.)

    9. వయం సహస్రవల్మాః విరుహేమ. మేము వేల శాఖలుగ విస్తరిల్లుదుము గాత.

    (అధ్వర్యు తన వక్షమును తాకవలెను.)

    10. తృణకాష్ఠాదుల ఆధారభూతమగు భూమీ! ఈ కోసిన దర్భలకు నీ సంపర్కము కలుగనీయకుము.

    (అని మరల మొలకెత్తకుండునట్లు ఎత్తుప్రదేశమున పెట్టవలెను.)

    11. దర్భలారా! మిమ్ము త్రాటిచే కట్టుచున్నాను.

    12. రజ్జువా! నీవు భూమికి మొలత్రాటివి. 'అదిత్యైరస్నాసి'.

    13. దర్భలను త్రాటిచే కట్టుట ఇంద్రాణికి ఇష్టముగనే జరిగినది.

    14. త్రాటిచే కట్టబడిన దర్భలారా! పూషదేవత మిమ్ము ముడివేయుచున్నాడు.

                (త్రాటిని ముడివేయవలెను.)

    15. దర్భలారా! మిమ్ము కట్టిన ఈ ముడి ఎంతో కాలము నిలువ కుండును గాత.

    16. దర్భల మోపా! నిన్ను ఇంద్రుని బాహువులచే ఎత్తుచున్నాను.

             (ఎత్తవలెను.)

    17. దర్భలమోపా! నిన్ను బృహస్పతి తలపై ధరించుచున్నాను.

             (తలపై పెట్టుకొనవలెను.)

    18. "ఉర్వంతరిక్షమన్విహి" మీరు విశాల ఆకాశమున సంచరించండి.

    (దర్భలమోపుతో అధ్వర్యుడు యజ్ఞవాటికకు చేరవలెను.)

    19. దేవం గమమసి. దర్భలారా! మీరు దేవతలను చేరుచున్నారు.

    దర్భలమోపును అగ్నిశాల మీద వేయవలెను.

                                మూడవ అనువాకము

        (ఇందు అమావాస్యనాటి రాత్రి చేయవలసిన విధానము చెప్పబడినది.)

    1. పాత్రద్వయమా! ఇది దేవతా సంబంధపుది. ఇది దేవయజన కర్మ. దీని కొరకు మీరు పరిశుద్ధులగుడు.

    (అధ్వర్యు పాత్రల మీద నీరు చల్లవలెను.)

    2. పాలకుండా! నీలో ఆకాశము ఉన్నది. అందు వాయు సంచారమునకు అవకాశము ఉన్నది. కావున నీవు అంతరిక్షమవు అగుచున్నావు.

    నీవు ద్యులోకము నుండి వచ్చిన వర్షజలము వలనను, భూలోకపు మట్టి వలనను పుట్టినావు. అందువలన నీవు ద్యావాపృథ్వీరూపమవు.

    నీవు పుష్కలముగ పాలను అందించి లోకములను పోషించు వర్షరూపము దాల్చుచున్నావు.

    దృహంస్వ మాహ్వః. గట్టిగా ఉండుము. పగలకుము.

    3. శాఖాపవిత్రమా! ఈ పాత్రలో వందల, వేల పాలచుక్కలు పడుచున్నవి. నీవు వాటిని అన్నింటిని శుభ్రము చేయుచున్నావు. వడగట్టుచున్నావు.

    (1. మూడు దర్భలను చేర్చి ముడి వేసినది శాఖా పవిత్రము. 2. అధ్వర్యుడు శాఖా పవిత్రమును పాత్రలో వేయవలెను.)

    4. పాలపాత్రయందలి చిన్న, పెద్ద చుక్కలన్నియు చక్కగా కాగవలయును. వీనిచే ద్యావా పృథ్వుల కొరకు హోమము చేయబడవలెను. హోమము కొరకే కదా ఈ పాలు పితుకబడినవి.

    (పాలను అభిమంత్రించవలెను.)

    5. ఇప్పుడు మూడు ఆవుల పాలు పితికినాము. వీనిలో ఒకగోవు భూమి సమము. రెండవది అంతరిక్షసమము. మూడవది ద్యులోకసమము.

    మూడును చిరాయువు గలవి - సర్వవ్యాప్తలు - సర్వకర్మలు గలవి అని కూడ చెప్పవచ్చును.

    ఆలోచనామృతము

    1. ఆంగ్లేయులు ఈ దేశమును రెండు వందల సంవత్సరములు మాత్రమే పాలించినారు. ఏదేశమునకైనను రాజకీయ బానిసత్వము - ఏదో ఒక రూపమున - తప్పదు. దీనికి మినహాయింపులు లేవు.

    ఆంగ్లేయులు రాజకీయ ప్రభుత్వము మాత్రము చేసి మిన్నకుండలేదు. వారు మన సంస్కృతిని వెక్కిరించినారు. కువ్యాఖ్యానములు చేసినారు. మనము అనాగరకులము - మన ఆచారములు రాక్షసములు అని భారతీయులతోనే అనిపించినారు. మన విద్వాంసులను, మేధావులను అంత బానిసలను చేసినారు!

    ఇది ఆంగ్లేయులకు కొత్తకాదు. అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాలలోని ఆదిమ వాసులను - వారిని సంస్కృతీ సంప్రదాయాలను మచ్చుకు మిగలకుండ హతమార్చినారు!

    ఆంగ్లేయులు రాజకీయాధిపత్యం మాత్రమే విడిచి ఈ దేశమునుంచి నిర్గమించినారు. రాజకీయ స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మనము పాశ్చాత్య నాగరకతకు మరింత బానిసలము అయినాము.

    2. వేదము మహోన్నతము. సనాతనము. పురాతనము. దీనికి సమమయినది ప్రపంచ సాహిత్యమున - జీవితమున లేదనుట వాస్తవ సత్యమగును. ఇది కటుసత్యము. అయినను పాశ్చాత్యులకు ఒప్పుకొనక తప్పుటలేదు.

    వేదము ఆర్యుల ఆటవికజీవిత చిత్రణమనియు, ఇది లిపిలేనివాడు అవతరించినదనియు లిపి వచ్చిన తరువాత వ్రాయబడినదనియు పాశ్చాత్యుల సంకుచిత వాదము. ఇది వారి తెలివి లేమిని సూచించుచున్నది!

    i.   సంస్కృతము వంటి భాషను అవతరింప చేసిన సమాజము ఎంతటి ఉన్నత నాగరికత కలిగియుండవలెను! ఆ సమాజమున ఎంతటి సుఖశాంతులు ఉండవలెను! ఇంతటి భాషను సాధించుట నేటి మొత్తము పాశ్చాత్య నాగరకతకు సాధ్యపడలేదు. వారిభాషల లిపి వారి స్వంతము కానేకాదు. అట్లయిన వేదము ఆటవిక నాగరికతా చిత్రమనుట ఒక జాతి సంస్కృతిని తెలిసికొనజాలక పరిహసించుట కాదా!

    ii.   వేదము లందలి ఛందస్సు ఏర్పడుటకు ఎంతటి మేధావంత సమాజము కావలెను? ఎంతటి పరిశోధనలు అవసరమై ఉండును? ఇది ఆటవిక సమాజమునకు సాధ్యమగునా?

    iii.   మానవ జీవితమునకు సకల చరాచర ప్రకృతి అవసరమును వేదము గుర్తించినది. వేదము సకల భూతములను మానవునితో సమానముగ పరిగణించినది. చేతనాచేతన జగత్తు మానవునకు మిత్రమని నిరూపించినది. ఈ మైత్రి లేనివాడు మానవ జీవితము అల్లకల్లోలమగునని వక్కాణించినది. అది నేడు నిక్కమైనది!

    నేడు మానవుని మనుగడ పేరిట - మనిషి దురాశకొరకు - సమస్త ప్రకృతి సంపదను కొల్లగొట్టియు ధ్వంసము చేసియు మానవ జీవితమును దుర్భరము చేసినాము. ఇప్పుడు మాటకు మాత్రము ప్రకృతిని రక్షించవలెననెడి పాశ్చాత్య నాగరకత వాస్తవముగా అందుకు తగిన చర్యలు తీసికొనుట లేదు! ఇది భస్మాసుర హస్తము!

    ఈ దుర్దశ సాంతము వేదపు ఉపదేశమును - సందేశమును ధిక్కరించుట వలన వచ్చినదే. నేటికిని తామేదో కనుగొన్నామని గొప్పలు చెప్పువారేకాని ఇది వేదమున చెప్పబడినదని గుర్తించరు కదా!

    iv.   ఈ మూడు అనువాకములందు మానవుడు ప్రకృతిని ఎంత ప్రేమించినాడో - ఎంత పూజించినాడో - ఎంత ఆదరించినాడో తెలిసికున్న మనసు పులకరించును. కొమ్మని కొట్టుటకు, దర్భను కోయుటకు, పాలు పితుకుటకు, ఎంతటి ఉన్నత ఆశయముల మంత్రములు చెప్పబడినవి. వాటిని వేదము ఎంత ప్రేమించినది. గడ్డిని నిన్ను హింసించను అనుటకు. ఎంతటి మానవత, ఎంతటి సంస్కారము, ఎంతటి ఔన్నత్యము కావలెను!

    దీనిని ఆటవిక నాగరకత అన్న వారిని ఏమన వలెను? వేదము ద్వేషించ లేదు!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.