Home » D Kameshwari » Kalani Venaki Tippaku



    సాయంత్రం ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి గదిలో పడుకుని ఉన్న సుజాతని చూసి, "ఏం తొందరగా వచ్చేశావు - బ్యాంకుకు వెళ్ళలేదా" అన్నాడు కాస్త ఆశ్చర్యంగా. రోజూ ప్రభాకర్ కంపెనీకి ఎనిమిదిన్నరకే వెళ్ళిపోతాడు. సుజాత బ్యాంకుకి 10 గంటలకి వెళ్ళి దగ్గరే కనుక మళ్ళీ లంచ్ కి వచ్చి ఓ గంట ఉండి, సాయంత్రం ఆరుగంటలకి వస్తుంది, అప్పటికి సాధారణంగా ప్రభాకర్ ఇంటికి వస్తాడు. సుజాత ముభావంగా "వెళ్ళ" లేదు. ఇవాళ వంట్లో కాస్త బాగులేదు" అంది "ఏమయింది, జ్వరమా?" వాడిన ఆమె మొహం చూసి అడిగాడు.. "ఏం లేదు. కాస్త తలనొప్పి" ఇంక మాటలు పెంచకుండా గదిలోంచి వెళ్ళిపోయింది.
    రాత్రి కూడా సుజాత మామూలుగా లేకపోవడంతో "ఏమిటి సంగతి? మళ్ళీ అత్తాకోడలు దెబ్బలాడుకున్నారా?" హాస్యంగా అన్నాడు. సుజాత చురచుర చూసి అతికష్టంమీద మాట తూలకుండా అదుపులో ఉంచుకుంది నోటిని. ప్రభాకర్ ని నిలదీసి కడిగి పారేయాలని ఎంతో అనిపించినా, ఒక్కరోజు ఉంచుకుంది నోటిని. ప్రభాకర్ నినిలదీసి కడిగి పారేయాలని ఎంతో అనిపించినా, ఒక్కరోజు ఓపిక పట్టి అసలు సంగతి పూర్తిగా తెలుసుకునేవరకు ఆ ప్రసక్తి తేరాదు అనుకుంది. ఉదయం నుంచి మనసు ఉడికిపోతోంది సుజాతకి. అసలు లోపం తనలో ఉంచుకుని లోకం ఎదుట తనని దోషిగా నిలబెట్టాడు. ఉన్న విషయం చెపితే సానుభూతితో అర్ధం చేసుకుని, ఏ పిల్లనో పెంచుకునేవారు. అతనిలో లోపం అతను కావాలని చేసింది కాదు గదా! చెపితే తానేం మొగుడ్ని వదిలేసి పోదుగదా! తన దగ్గర లోటు ఒప్పుకోవడానికి మగ అహం అడ్డుచ్చినట్టుంది. పిల్లలు కలగకపోవడానికి కారణం అతను అంటే అందరిలో చులకన అయిపోతానన్న భయంగాబోలు, ఇన్నాళ్ళూ పిల్లలు కలక్కపోతే ఆడదాన్నే 'గొడ్రాలు' అంటూ దోషిగా నిలబెట్టేవారు. ఇప్పుడు అన్నిరకాల పరీక్షలకి వీలు వివరం కలిగాక, మగాడిలో లోపం కనిపెట్టాక ఆడదాన్ని నిందించడం కాస్త తగ్గినా, అవకాశం ఉన్నంత వరకు తనలో లోపం బయటపడకుండా చూసుకుంటాడు మగాడు. ఇదేతనలో లోపం ఉంటే ప్రభాకర్ ఎలా రియాక్ట్ అయ్యేవాడు? అత్తగారు సాధించి చంపేది ఇంకా పిల్లలు కలగకపోతే ఆ భార్యని వదిలించుకుని ఇంకో పెళ్ళి చేసుకునే వీలు లేకపోయినా సాధింపు ఉండేది.
    అసలు పెళ్ళయ్యాక ఓ ఏడాది పిల్లలు వద్దనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రుల వేసుకుంది. రెండోఏడు మాత్రలు మానాక నార్మల్ అయి మళ్ళీ గర్భం రావడానికి టైము పడుతుందని పెద్దగా ఎదురుచూడనూల లేదు. బాధపడనూ లేదు. రెండో ఏడు ఇంట్లో అత్తగారి గొణుగుడు ఎక్కువైంది. "ఏమిటోనమ్మా - పాతిక ముప్ఫై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంకా పిల్లలు వద్దనుకుంటూ మాత్రలు మింగడాలు. వీళ్ళతో పెళ్ళి అయినవాళ్ళ పిల్లలకే ఏడాది నిండింది. మనవల ముద్దూముచ్చట చూసుకునే అదృష్టం ఇంకా నాకెప్పుడూ అంటూ మొదలుపెట్టి ప్రతినెల అయినప్పుడల్లా ఆవిడ 'ఊఁ... అయ్యావూ... ఏమిటోపెట్టి పుట్టాలి. పుల్లలు పారాడని ఇల్లు ఓ ఇల్లా. ఈ చదువులు, ఉద్యోగాలు వెలగబెడుతూ కావాలనుకోవడం, వద్దనుకోవడం అంతా వీళ్ళ చేతుల్లోనే ఉందనుకుంటారు. హుఁ. వద్దనడం చేతిలో ఉందేమోగానీ, కావాలనుకున్నప్పుడు బజారు నుంచి తెచ్చుకునేదా. వద్దు వద్దు. పిల్లలు వద్దు అనుకుంటే నెత్తిమీద తథాస్తు దేవతలుంటారట. అలాగే అవుతుంది మరి' అనేది. ఆవిడ ఆరాటం అర్ధం అయినా తానేం చేస్తుంది? ఏడాది వద్దనుకుందిగాని, ఈ ఏడాదినుంచి కావాలని అనుకుంటున్నారుగా తామూ, ఆవిడన్నట్లు కావాలనుకున్నప్పుడు ఆపదేమో! రెండేళ్ళు నిండిపోయాయి. తనకూ పిల్లలు కావాలని, తల్లినవ్వాలని బలంగా కోరిక కలుగుతుంది. ప్రభాకర్ ప్రతీసారీ డిసపాయింట్ అయ్యేవాడు. "ఏమిటోయ్, మా అమ్మ కోసమైనా ఓ పిల్లని కనవమ్మా తల్లీ." హాస్యంగా విసుక్కునేవాడు ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడల్లా, ఏదో తన చేతిలో ఉండితాను కనడం లేదన్నట్టు అత్తగారు, మొగుడు అలా అంటే ఉక్రోషం వచ్చింది ఓసారి. "పదండి. ఓసారి డాక్టర్ దగ్గరకెడదాం, మాటిమాటికీ పిల్లల్ని కనడం లేదని నన్ను దెప్పద్దు మీరిద్దరూ" అంది కోపంగా. ప్రభాకర్ "నీవెళ్ళి చూపించుకో, నాకేం ప్రాబ్లమ్ లేదు" అన్నాడు చాలా నమ్మకంగా. "పెళ్ళయి రెండున్నర ఏళ్ళయింది. నాలో ఏం లేదన్నది నీకు తెలీదా" కొంటెగా, గర్వంగా అన్నాడు. "చాల్లెండి బడాయి. దానికి, దీనికీ ఏం సంబంధం లేదు. అన్నీ పైకి సరిగా ఉన్నా, కొందరిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండచ్చు. నేను మేగజైన్స్ లో చదివాను. ఓసారి చూపించుకుంటే సందేహం తీరిపోతుందిగా" అంది. "సర్లే. చూద్దాం మా ఫ్రెండ్స్ ని ఎవరినన్నా అడుగుతాను ఎక్కడ చూపించుకోవాలో". ఇంట్లో అత్తగారు డాక్టరు దగ్గరకెళ్ళమన్న పోరు ఎక్కువవడం, చీటికీ మాటికి ఆవిడ అసంతృప్తి వెల్లడించడంతో డాక్టరయిన తన అక్క సలహా కోరుతూ ఉత్తరం రాసింది సుజాత. ఈలోగా వారం, పదిరోజుల తరువాత ఓ రోజు ప్రభాకర్ తాను టెస్ట్ చేయించుకున్నాను. అంతా సరిగా ఉందన్నారు అంటూ ఓ రిపోర్టు చూపించాడు. "అదేమిటి, ఎప్పుడు చూపించుకున్నారు? నాకు చెప్పలేదు. నేనూ వచ్చేదాన్నిగా" అంది ఆశ్చర్యంగా సుజాత.
    "అది మగాళ్ళది. నీవెళ్ళి లేడీ డాక్టర్ చేత చూపించుకో" అన్నాడు. అంతా సరిగా ఉందన్నాడు కదా అని రిపోర్టు సరిగా చదవలేదు. ఆ తరువాత ప్రభాకర్ ఎందుకో కొన్నాళ్లు ముభావంగా, అన్యమనస్కంగా ఉండేవాడు. "మరి అన్నీ సరిగా ఉంటే ఈపాటికి ప్రెగ్నెన్సీ రావాలేమో" అంది అక్కడికీ సుజాత.
    "ఏమో నాకేం తెలుసు? నీలో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందేమో. ఊరికే ఇంక నన్ను పదిసార్లు విసిగించకు. పిల్లలు లేకపోతే పీడా పోయింది. ఈ గోలతో మనశ్శాంతి లేకుండా పోయింది" అని విసుక్కున్నాడు. తల్లి ఏదో అంటే, ఆవిడ మీదా ఎగిరాడు ఒకటి రెండుసార్లు. తరువాత పిల్లల ప్రసక్తి తెచ్చేవాడు కాదు ప్రభాకర్.
    ఈలోగా సుజాత అక్క రమ ఉత్తరం రాసింది. తన స్నేహితురాలు డాక్టర్ అన్నపూర్ణ అనే ఆవిడ ఈ సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ చేసి హైదరాబాదులో ఫెర్టిలిటీ సెంటర్, క్లినిక్ ఓపెన్ చేసిందని, ఆవిడకి నేనే ప్రత్యేకం నీ గురించి రాస్తున్నాను. నీవెళ్ళి చూపించుకో. అన్ని టెస్టులు చేయించుకో అంటూరాసింది ఆవిడతో అపాయింట్ మెంటు ఫిక్స్ చేసుకుని "వెడదాం పదండి" అంది సుజాత ప్రభాకర్ తో. ప్రభాకర్ అనవసరమైన దానికంటే ఎక్కువ విసుగు చూపని, "అబ్బ ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకోవాలి. నే చేయించుకున్నాను గదా. నీవు వెళ్లిచేయించుకో" అన్నాడు.
    సుజాత ఒంటరిగానే వెళ్ళి కల్సుకుంది. "మీవారు రాలేదు. ఇద్దరూ చేయించుకోవాలి టెస్టులు" అంది అన్నపూర్ణ సుజాతని అభిమానంగా పలకరించి.
    "ఆయన చూపించుకున్నారు. అన్నీ సరిగా ఉన్నాయిట."
    "ఆఁ హాఁ. సరే ముందు నీకు అన్ని టెస్టులు చేద్దాం. నీకేం ప్రాబ్లమ్ లేకపోతే ఆయన్ని పిలుద్దాం" అంటే ఆన్నిరకాల టెస్టులు చేయించి సుజాతలో ఏం లోపం లేదని తేల్చింది అన్నపూర్ణ. "ఆయన్ని తీసుకురా. మా దగ్గర అన్నీ మోడర్న్ ఎక్విప్ మెంటు - కొత్త పద్ధతులతో టెస్టులు చేస్తాం. ఇదివరకు ఆయనెక్కడ చేయించుకున్నారో - ఒకటి రెండుసార్లు చెయ్యాలి ఈ టెస్ట్ లు. ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే, మందులతో కొందరికి, చిన్న సర్జరీతో సరిచెయ్యచ్చు. ఆయన్ని చూడకుండా ఇదంతా చేయలేం గదా. సాధారణంగా ఏ ప్రాబ్లమ్ లేని దంపతులకి, రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏడాదిలోగా ప్రెగ్నెన్సీ రావాలి. మూడేళ్ళయిందంటే ఆలోచించాలి. పరీక్షలు చెయ్యాలి." అందావిడ స్పష్టంగా. ఇంటికెళ్ళి అంతాచెప్పింది సుజాత. ప్రభాకర్ చాలా చిరాకు పడ్డాడు. "ఎన్నిసార్లు పరీక్షలు? నాకేం లేదు? అంటూ ఎగిరాడు. సుజాతకి కోపం వచ్చింది. అత్తగారికి చెప్పింది. "ఇదిగో అత్తయ్యా నాలో ఏం లోపం లేదని తేల్చారు. మీ అబ్బాయిని తీసుకురమ్మంది ఆవిడ. ఈయన రానంటున్నారు. ఇంక పిల్లలు పిల్లలు అని నన్నంటే ఊరుకోను". సుజాత కూడా ఎగిరింది. ఆవిడ కొడుకుని చివాట్లేసి, బతిమలాడి బలవంతంగా పంపించింది డాక్టర్ దగ్గరికి. ఇద్దరూ కలిసి వెళ్ళారు. డాక్టర్ చెయ్యాల్సిన టెస్టులన్నీ చేయించి, రిపోర్టుకి మూడోరోజు రమ్మంది. ప్రభాకర్ తాను ఆఫీసునుంచి వస్తూ తెస్తానన్నాడు.
    అంటే, ప్రభాకర్ లో లోపం ఉందని, కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెపితే తనకి అబద్ధం చెప్పాడన్నమాట. గతం అంతా గుర్తువచ్చి సుజాత ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచించింది.

                                                      *  *  *




Related Novels


Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

D Kameswari Kathalu

Teeram Cherina Naava

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.