Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    ఆగుట ఏల? అని అడుగుదురు కదా! ఈ యాంత్రిక నాగరికత మనకు వర్తకము, వాణిజ్యము, వ్యాపారము వంటివాటిని ఎన్నింటినో నేర్పినది. జీవించుట మాత్రము నేర్పలేదు - కాదు నేర్పుటను నిలిపివేసినది!

    జీవితము గొప్ప విషయము. అది విలక్షణము. విశుద్ధము. ఆది విలక్షణము. విశుద్ధము. విశ్వాత్మకము. బ్రతుకును గురించి తెలిసిన వాడులేడు. మనము గాలివలన బ్రతుకుచున్నామా? నీటి వలన బ్రతుకుచున్నామా? కుటుంబము వలన బ్రతుకుచున్నామా? సమాజము వలన బ్రతుకుచున్నామా? ఏమో? ఏమిటో? ఏదో?

    అన్నింటికలయిక - కూడిన - సమాహారము వలన బ్రతుకుచున్నామా? అట్లయిన మనము పోయినను అవన్నియు పోవుట లేదు కదా?

    ఆధునిక సైన్సు సామాన్యుని ఆలోచనలను అంతమొందించినది. తాను చెప్పిందే నమ్మమన్నది. సామాన్యునిలో సైన్సు మూఢనమ్మకాలను కలిగించింది. ఏలనన నేటి సైన్సు సైన్సుగా లేదు. సైన్సు వ్యాపారమైనది. వాణిజ్యమునకు ప్రచార సాధనమైనది. అది సామాన్యుని ముంచినది. ఆస్పత్రులే జీవితము అని భ్రమింపచేసినది.

    మనము ఆ భ్రమలోనే భ్రమించుచున్నాము.

    3. మనిషి గాలి, నీరు, ఆహారము మీద మాత్రము జీవించుట లేదు. అతడు 'విశ్వాసము' మీద జీవించుచున్నాడు. విశ్వాసమునకు హేతువు ఉండదని కాదు. కాని దానిని వెదుకుటకు ఈ ముష్టిబ్రతుకు చాలదు.

    భర్త భార్య మీద - భార్య భర్త మీద విశ్వాసంతో జీవిస్తున్నారు. వాస్తవం వేరుకావచ్చు. బిడ్డలు తన వారు అనే విశ్వాసంతో తండ్రి జీవిస్తున్నాడు. వారి కొరకు జీవితం అర్పిస్తున్నాడు. వాస్తవం వేరు కావచ్చు. ప్రభుత్వం మనది అనే విశ్వాసం వలన ప్రభుత్వాలు బ్రతుకుతున్నాయి. వాస్తవం వేరు కావచ్చు.

    మనిషి వీటిని అన్నింటిని గురించి ఆలోచించి నిర్ణయించాలనుకుంటే అతని జీవితం చాలదు. ఉన్నది నరక ప్రాయం అవుతుంది.

    కావున మనిషి విశ్వాసం మీద జీవిస్తున్నాడు. ప్రఖ్యాత ప్రేమగాధయగు లైలా, మజ్నులో లైలా అందకత్తె కానేకాదట! మరి అతడు అన్ని బాధలు ఎందుకు పడినట్లు? విశ్వాసమే కదా!!

    4. వేదము విశ్వాసము. వేదము అపౌరుషేయము. భగవంతుడు ప్రసాదించినది. ఆ విశ్వాసమే ఈ జాతి సంస్కృతిని - నాగరికతను - సభ్యతను ఇన్ని లక్షల సంవత్సరాలు నిలిపి ఉంచినది. అంత మాత్రమున అర్థము తెలిసికొనరాదను నియమము లేదు.

    జ్ఞానము సూర్య తేజము వంటిది. దానిని మూసి ఉంచు శక్తి ఎంతటి వానికిని లేదు. గ్రహణము తాత్కాలికము కదా!

    "నైషస్థాణో రపరాధః యదేనమ్ అంధోనపశ్యతి | పురుషాపరాధః సభవతి" అన్నాడు యాస్కుడు. చూడక పోవడం గుడ్డివని దోషము. పదార్థదోషము కాదు

    5. ఇంత ఏల చెప్పవలసి వచ్చినదనిన ఈ అనువాకమున కార్య కారణముల వివరణ జరిగినది. కాదనుట సులభము. అందుకు ఆలోచనముతో నిమిత్తము లేదు. అవుననుట - నిరూపించుటకు ఆలోచనము పరిశీలనము అవసరము. అందుకు అవగాహన, సంయమము, సమ్యక్ దృష్టి అవసరము.

    ఈ అనువాకపు తొలి మంత్రమున సంపద కొరకు వాయువును ఆరాధించమన్నాడు. వాస్తవముగా వాయువేగదా సకల సంపదలకు కారణము! వాయువు మాత్రమే కాకపోవచ్చును. వాయువు మాత్రమే కాకపోవచ్చును. వాయువు కూడ అగును. వాయువే అని ఒక పరిశీలన.

                                     సత్యము అగోచరము కదా!

    5వ మంత్రమున ప్రాణ, అపానములను గురించి చెప్పినాడు. ప్రాణము అయిదు అని పూర్వముచెప్పినాడు కదా అని ఆక్షేపణ తగదు. ఈ రెండు ప్రధాన ప్రాణములు కావచ్చును. పిండోత్పత్తికి అవి కారణము అనుచున్నాడు. అదే సత్యమా?

                                      సత్యము అగోచరము కదా!

    6వ మంత్రమున దీర్ఘరోగములకు వాయువే కారణము అనుచున్నాడు. చికిత్స కూడ వాయువునందే చూపినాడు. యోగవైద్యము నందు చాల వరకు శ్వాసను నియంత్రించి రోగము నివారించబడుచున్నది. జల చికిత్స వంటివి ఆధునిక వైద్యమునందున్నవి. ఇది వాయు చికిత్స కావచ్చును. ఇది మాత్రమే చికిత్సయా? అనిన

                                        సత్యము అగోచరము కదా!

    7వ మంత్రమున బలిని గురించి చెప్పబడినది. బలి మానవుని విశ్వాసము. అరిషడ్వర్గముల బలి జ్ఞానమార్గము.

    మానవుడు తొలిగా నరబలితో ప్రారంభము అయినాడు. అది మాన్పిన తీరు అన్ని మతములందు ఉన్నది.

    క్రైస్తవ, ఇస్లాం మతములందు ఇబ్రాహం గాధ ఉన్నది. అతడు తనపుత్రుని బలి ఇవ్వబోయినాడు. భగవంతుడు పుత్రుని స్థానమున గొర్రెను ఉంచినాడు. నాటినుండి ఆ మతస్థులకు గొర్రె బలి జంతువు అయినది. మహమ్మదీయులకు ఆ పేర ఒక పండుగ ఉన్నది.

    రామాయణమున విశ్వామిత్రుడు, శునశ్శేఫుని వృత్తాన్తమున్నది. అంబరీషుడను రాజు యజ్ఞపశువుగా శునశ్శేఫుని కరీదుచేసినాడు. శునశ్శేఫుడు తన మేనమామ అయిన విశ్వామిత్రుని ఆశ్రయించినాడు. విశ్వామిత్రుడు మంత్రమును కల్పించి ఇంద్రుని ప్రసన్నుని చేసినాడు. శునశ్శేఫుని రక్షించుట నరబలిని మాన్పుట అగును.

    ఈ మంత్రమున ప్రజాపతి తన వపనుండి సృష్టించిన మేకను - తనరూపమైన దానిని - దేవతలకు బలి ఇచ్చినాడని చెప్పబడినది.

    బుద్ధ భగవానుడు ప్రాణిబలిని నిరోధించినాడు!  అహింసామూర్తి - కరుణాసముద్రుడు అయినాడు.

    బలి త్యాగమునకు సంకేతమా! నరబలి నుండి నారికేళ బలి వరకు మనము ఎంత దూరము పయనించినాము!!!

    9వ మంత్రమున గ్రామ జంతువులు - యాగయోగ్యములగు - అయిదింటిలో పురుషుని చేర్చుట నరబలి స్వరూపమే!

                                         రెండవ అనువాకము

    1. ప్రజాపతి ప్రజలను సృష్టించినాడు. ప్రజలు ప్రజాపతికి విముఖులు అయినారు. వరుణుని వద్దకు చేరినారు. ప్రజాపతి వరుణుని వద్దకు వెళ్లినాడు. తన ప్రజను తనకు ఇవ్వవలసినదని వరుణుని అడిగినాడు. వరుణుడు అందుకు అంగీకరించలేదు. అప్పుడు ప్రజాపతి ప్రజలండు శ్రేష్ఠమును తనవద్ద ఉంచుకొని మిగిలిన వారిని తనకు ఇమ్మని వరుణుని అడిగినాడు. అందుకు వరుణుడు అంగీకరించినాడు. అతడు శ్రేష్ఠము అన్నదానిని తాకినాడు. అది నల్లనిది - ఒక పాదము తెల్లనైనది అయినది.

    2. జలోదరమున బాధపడుచున్నవాడు వరుణునకు నల్లనదియు, ఒకపాదము తెల్లనిదియు అయిన పశువును బలి ఇవ్వవలెను. అతడు తన భాగధేయమున వరుణుని యజించవలెను. అప్పుడు వరుణుడే అతనిని వరుణ పాశము నుండి విముక్తుని చేయును.

    3. నల్లనిదై, ఒక పాదము తెల్లగా ఉన్న జంతువు వరుణదేవతాకము అగును. అది యజమానికి ఆరోగ్యము కలిగించును.

    4. సువర్భానుడు రాక్షసుడు. అతడు భూమి రూపము దాల్చినాడు. నల్లని వాడు అయినాడు. నల్లని అంధకారమున సూర్యుని కప్పివేసినాడు.

    దేవతలు అదిచూచినారు. అంధకారమును వదిలించదలచినారు. వారు తొలిసారి ఆ చీకట్లను పోగొట్టినారు. ఆ విధముగా పోగొట్టిన చీకట్లు నల్లని గొర్రె అయినవి.

    మరల చీకట్లు ముసిరినవి. దేవతలు రెండవసారి చీకట్లను తరిమినారు. అప్పుడు ఆ చీకట్లు రాగి రంగు గొర్రెగా మారినవి.

    మరల చీకట్లు క్రమ్మినవి. దేవతలు మూడవసారి చీకట్లను పోగొట్టినారు. ఆ చీకట్లు తెల్లని గొర్రెగా మారినవి.

    మరల చీకట్లు క్రమ్మినవి. దేవతలు శవము నుండి ఒక ఎముకను తీసినారు. దానితో నాలుగవసారి చీకట్లను వెళ్లగొట్టినారు. అదియే వంధ్య పశువు అయినది.

    ఈ వంధ్య పశువు ఎముక నుంచి కదా పుట్టినది. అందువలన దేవతలు దానిని దేవపశువుగా భావించినారు. దీనిని ఏ కార్యము కోరి బలి ఇవ్వవలెను అని దేవతలు తమలో తాము ఆలోచించినారు.

    వారు ఆ విధముగా ఆలోచించుచున్నంత భూమి చిన్నది అయినది. భూమి మీద ఓషధులు మొలవకున్నవి. అప్పుడు దేవతలు ఆ వంధ్యగొర్రెను ఆదిత్యులకు బలి ఇచ్చినారు.

    దేవతలు ఆ విధముగా బలి ఇచ్చినంతనే పృథివి విశాలమైనది. ఓషధులు మొలకలెత్తినవి.

    5. పశు సమృద్ధియు, పుత్ర పౌత్రాది సమృద్ధియు కోరువాడు వంధ్యగొర్రెను ఆదిత్యులకు బలి ఇవ్వవలెను. అతడు - తన భాగధేయముచే - ఆదిత్యులను ఆరాధించవలెను. అప్పుడు ఆదిత్యులే అతనికి పశుసమృద్ధి ప్రజాసమృద్ధి కలిగింతురు.

    6. ఆదిత్యుడు చీకట్లనుంచి బయట పడినాడు. అయినను అప్పుడప్పుడు అతడు మసక బారినాడు. దేవతలు ఆ ప్రకాశమాంద్యమును తొలగించ దలచినారు.

    దేవతలు మెడకు చన్నులు గల జంతువును గురించి ఆలోచించినారు. 1. అగ్ని దేవతాకమగు నల్లని మెడ దానిని 2. ఇంద్రదేవతాకమగు వేరువేరు రంగులు గల దానిని 3. బృహస్పతి దేవతాకమైన తెల్లని దానిని. ఆ మూడింటిని బలి ఇచ్చినారు.

    "తాభిరేవాస్మిన్రుచ మదధుః" వానితోనే వారు సూర్యుని యందు వెలుగును ప్రవేశపెట్టినారు.

    7. బ్రహ్మవర్చస్సును కోరువాడు ఆ మూడు మేకలను బలి ఇవ్వవలెను. అగ్ని దేవతాకమగు నల్లని మెడ దానిని - ఇంద్ర దేవతాకమగు రంగురంగుల దానిని, బృహస్పతి దేవతకమగు తెల్లని దానిని ఆలంభనము చేయవలెను - అతడు ఆ ముగ్గురు దేవతలను - తనభాగధేయముచే అర్పించవలెను. అప్పుడు ఆ ముగ్గురు అతనికి బ్రహ్మవర్చస్సు కలిగింతురు.

    8. వసంతకాలపు ఉదయమున అగ్ని దేవతాకమగు నల్లని మేకను వధించవలెను. గ్రీష్మకాల మధ్యాహ్నమున ఇంద్ర దేవతాకమగు రంగురంగుల మేకను వధించవలెను. శరత్కాలపు అపరాహ్ణమున బృహస్పతి దేవతాకమగు తెల్లని మేకను వధించవలెను.

    ఆ విధముగా చేసినందున వసంతపు ఉదయపు సూర్యతేజస్సు, గ్రీష్మమధ్యాహ్నపు సూర్య తేజస్సు, శరత్కాలపు అపరాహ్ణపు సూర్యతేజస్సు యజమానియందు చేరుచున్నవి.

    9. సంవత్సర కాలము నియమము గ్రహించిన యజమాని ఆ యా కాలములందు పశువులను వధించవలెను. సంవత్సరమే కదా బ్రహ్మవర్చస్సు నిచ్చునది! సంవత్సరమే యజమానికి బ్రహ్మవర్చస్సును ఇచ్చును. యజమాని బ్రహ్మ వర్చస్సు కలవాడు అగుచున్నాడు.

    10. ఇంతకు ముందు చెప్పిన మూడు పశువులు గర్భిణులు కావలెను. ఇంద్రియమే కదా గర్భము. అందువలన యజమాని ఇంద్రియవంతుడు అగుచున్నాడు.

    11. వాక్కు పలుకుటకు సమర్థుడయిన ఎవడు పలుక జాలడో వాడు సరస్వతీ దేవతాకమగు ఆడు మేకను వధించవలెను. వగ్వైసరస్వతీ - వాక్కే సరస్వతి కదా! అతడు సరస్వతిని - తన భాగధేయముచే యజించవలెను. సరస్వతి అతనికి వాక్కు కలిగించును. అతడు చక్కగా పలుకువాడగును.

    12. అట్టి ఆడమేక దంతములు లేనిది కారాదు. అందువలన మానవులు సమస్త వాక్కులు పలుకగలరు.

    13. దీర్ఘరోగము కలవాడు అగ్నిదేవతాకమగు నల్లని మెడ దానిని, సోమ దేవతాకమగు పింగళవర్ణము గల దానిని బలి ఇవ్వవలెను. అందువల్ల దీర్ఘరోగి దేహమున అగ్నియు, సోమసంబంధి రసమును ప్రవేశించుచున్నది. అతని దేహము అగ్ని నుండి తేజమును, సోముని నుండి రసమును పొందుచున్నది. అతడు పోయిన ప్రాణము గలవాడు అయినను జీవించుచున్నాడు.

    14. సంతానము కోరువాడు సోమదేవతాకమైన పచ్చని పశువును, అగ్ని దేవతాకమగు నల్లని మెడ పశువును ఆలంభనము చేయవలెను. సోముడు యజమాని రేతస్సును నిలుపును. అగ్ని సంతానము కలిగించును. కావున అతడు సంతాన వంతుడు అగుచున్నాడు.

    15. ఒకప్పుడు బ్రాహ్మణుడు విద్యనేర్చును. కాని సభను రంజింపచేయజాలడు. అట్టివాడు అగ్ని దేవతాకమగు కృష్ణగ్రీవను, సోమదేవతాకమగు పింగళ వర్ణపశువును బలి సమర్పించవలెను. కృష్ణగ్రీవము అగ్ని దేవతాకము. అగ్ని తేజోరూపము. అందువలన అతనికి సభను రంజింపచేయగల తేజస్సు లభించును. పింగళవర్ణ సోమదేవతాకము. సోముడు బ్రహ్మవర్చస్సును ఇచ్చువాడు. అందువలన అతనికి బ్రహ్మవర్చస్సు కలుగును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.