Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                          జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                        ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                                         పదకొండవ అధ్యాయము


1.    యుఞ్జౌనః ప్రథమం మనస్తత్వాయ సవితాధియః
    అగ్నే ర్జ్యోతిర్నిచాయ్య పృథివ్యా అధ్యాభరత్

    సర్వ ఉత్పాదక సవిత తనమనమున వేది చయనమును నిశ్చయించినాడు. వేది యొక్క నిర్మాణ ప్రకారాదులను గురించి ఆలోచించినాడు. అగ్ని జ్యోతి యొక్క సర్వఫలసాధకమును గురించి సహితము నిశ్చయించినాడు. అప్పుడు అతడు మట్టి వేది నిర్మాణపు - ఇటుకలు మున్నగు వానిని సేకరించినాడు.

    2. సవితృ దేవుని ఆజ్ఞానువర్తులమగు మేము - స్వర్గ గమనకాంక్షచే - యథాశక్తి వేది నిర్మాణము చేయుదుము.

    3. సర్వప్రేరక సవిత అగ్ని కర్మమున సంయోజితుడు అయినాడు. అగ్ని  స్వర్గగామి. ద్యులోకచింతనుడు. సర్వ ఫలసాధకుడు. అతని జ్యోతిని యజ్ఞమున ప్రజ్వలింపచేయదలచినాడు సవిత. అందుకుగాను దేవతలను వేద చయనమునకు ఆహ్వానించినాడు.
   
    4. యజమాని మహానుడు, విద్వాంసుడు. అతని ఋత్విజులు వేదిచయన విప్రులు. వారు ఏకాగ్రచిత్తులై వేదిచయన కర్మ, పరిమాణ నిర్మాణాదులందు సంలగ్నులగుదురు. యజ్ఞకర్మ విషయక సర్వ విజ్ఞానములు తెలిసినవాడు సవిత మాత్రమే. ఆ సవితయే ఈ యజమాన, ఋత్విజులందు ప్రవేశించును. సవిత ఒక్కడే ఋత్విగ్యజమానులను స్వామి సేవక సంబంధమున నియమించును. ఆ సవితా దేవునకు ఇది పరమస్తుతి అగును.

    5. యజమాన - యజమాన పత్నీ! మీ ఉభయులకు శుభములు కలుగుటకు విప్రశ్రేష్ఠుని సంతృప్తిపరతును. ఉభయలోకప్రాప్తి కలిగించు ఆహుతి వంటి ఋత్విజులను యజ్ఞము నందు నియమించిన యజమాని కీర్తి ఉభయ లోకములకు వ్యాపించవలెను. అమృతమూర్తి ప్రజాపతి యొక్క, దేవ పుత్రులందరు ఈ యజమాని కీర్తిని వినవలెను. వారు తాము అధిష్ఠించిన దివ్య స్థానములందుండి ఇతని కీర్తిని ఆకర్షించవలెను.

    6. ఎవని గమనమును సకల దేవతలు అనుసరింతురో, ఎవని మహిమ వలన సకల దేవతలకు ఓజో తేజములు కలుగునో - ఎవడు సకల పార్థివ పదార్థములను సృష్టించినాడో అతడే మహిమాన్వితుడగు సవితృ దేవత - "సవితా మహిత్వనా"

    7. సవితా! యజ్ఞమును కలిగించుము. యజ్ఞ కర్త యజమానికి సౌభాగ్యములు కలిగించుము. నీవు దేవతల జ్ఞానమును పునీతము చేయువాడవు. వేదవాణిని ధరించు వాడవు. మా జ్ఞానమును పావనము చేయుము. వాచస్పతి వగు నీవు మా స్తుతులను ఆలకింపుము.

    8. సవితా! నీవు దేవతలను సంప్రీతులను చేయువాడవు. యజమానిని మిత్రునివలె ఎరుగువాడవు. సత్యజిత్తువు. ధనజిత్తువు. స్వర్గజిత్తువు. ప్రవర్తమానమగుచున్న ఈ యజ్ఞమును నిర్విఘ్నముగ పరిసమాప్తి చేయించుము. ఋచాదుల ద్వారా మా త్రివృదాది స్తోత్రములను సంపూర్ణముగా వికసింపచేయుము.

    9. అభ్రీ! నేను సవిత అధీనపు వాడను. అశ్వినుల బాహువులతోను - పూషహస్తములతోను పూర్వజ అంగిరుల వలె - గాయత్రి ఛందము పఠించి నిన్ను పట్టుకొనుచున్నాను.

    అభ్రీ! అంగిరుల కొరకు వలె నా కొరకును నేల దిగువన త్రిష్టుప్ ఛందమున జలయుక్త అగ్నిని అగపరచుము.

    10. అభ్రీ! నీవు వెదురుతో చేయబడిన దానవు - స్త్రీలింగమవు. అంగిరులకు వలెనే మాకును జగతీ ఛందమున నేలదిగువనగలఅగ్నిని త్రవ్వితీయు శక్తిని ప్రసాదించుము.

    (అభ్రి కర్రతో చేసిన త్రవ్వు కోల)

    11. సవిత తన స్వర్ణ హస్తములచే అభ్రిని పట్టినాడు. అతడు అంగిరుల వలెనే అనుష్టుప్ ఛందమున పృథ్వి క్రింద అగ్నిజ్యోతిని కనుగొనుటకు నిశ్చయించినాడు. అగ్నిని అచట నుండి వెలువరించినాడు.

    12. (చేత అభ్రిని పట్టి) అశ్వమా! ఇది పాషాణాదులు లేని భూమి. త్రవ్వుటకు సులభ సాధ్యమైనది. దీని మీదికి నీవు వేగముగా విచ్చేయుము.

    అశ్వమా! నీ జన్మము ద్యులోకమునందైనది. నీ నాభి ఉత్కృష్ట అంతరిక్షమున ఉన్నది. నీ యోని ఈ పృథ్వి మీద ఉన్నది.

    13. ధన వర్షక పత్నీ, యజమానులారా! ఈ కర్మ విశేషమున అగ్నిని ఆహరించునదియు- మీ  హితము కోరునదియు అగు గార్దభమును బంధించుడు. (గార్దభమును బంధించవలెను.)

    14. ఆయా కర్మములందు దేవతలకు హవిరన్నము అర్పించుటకు అత్యంత ఉత్సాహము కనబరచు మేకను - ఋత్విజ యజమానులము హవిష అభావరూపము నుండి రక్షించుటకు ఆహ్వానించుచున్నాము.

    15. (అశ్వ, గార్దభములను ముట్టకుండ)

    అశ్వమా! మా శత్రువులు మాకు అపకీర్తులు కలిగించినారు. అట్టి శత్రువులను నీ పాదము చే త్రొక్కుచు వారిని హింసించుచు ముందడుగు వేయుము. నీవు మూడు సుఖములను సంభవము చేయుము. రుద్రుని గణపతిత్వమును అందుకొను కోరికతో - ముందడుగు వేయుము.

    గార్దభమా! నీ మార్గములు శుభంకరములు. నీవు మా భయములను దూరము చేయుము. సహయోగిని పృథ్వి సహితముగ విశాల ఆకాశమును చేరుకొనుము.

    16. అభ్రీ! భూమిలో నుండి జలసహిత అగ్నిని - అంగిరుల కొరకువలె - వెలువరింపుము.

    (యజమానాదులు అశ్వ, గార్దభ, అజ సహితులై అగ్నిత్రయమును ప్రజ్వరిల్లచేసిన పిదప మట్టి ముద్దలవద్దకు చేరవలెను.)

    ఇప్పుడు మేము - అంగిరులవలె - పశువులకు హితకారియగు అగ్నివద్దకు చేరినాము. అంగిరుల వలెనే ఈ పశుహితకారి అగ్నిని సేకరింతుము.

    17. అగ్ని సకల సృష్టిని ఎరిగిన వాడు. వేదిపై సర్వ ప్రథమముగా నిలుచువాడు. అగ్ని ఉషస్సుల అగ్ర భాగములను వీక్షించువాడు. సూర్యుని తొలి కిరణములు నానా విధములై ప్రసరించుటను చూచువాడు. చివరకు అగ్ని స్వయముగా- ద్యావాపృథ్వులకు అనుకూలడై విస్తరించును.

    18. (మట్టి కుప్ప వద్ద నిలిచిన అశ్వ సంబోధన)

    ఈ అశ్వము మార్గములు గడచి వచ్చును. ఇక్కడి బాధించువారినందరిని గడగడలాడించును. తదుపరి పృథ్వియందున్న అగ్నిని తన కంటితో చూచును.

    (వేది నిర్మాణమునకు అనుకూలమగు స్థలమునకు గుర్రమును తీసికొని పోవలెను)

    వేగవంత అశ్వమా! యజ్ఞవేది అగ్ని స్థానమగును. అందుకు అనుకూలమగు భూమిపై అడుగు పెట్టుము. దానిని నిశ్చయించుము.

    (గుర్రపు కుడికాలు ఆ స్థలముపై పెట్టించవలెను)

    అశ్వమా! ఈ నేలను తాకుము. ఆ మట్టిని మాకు సూచింపుము. మేము దానిని పరిశుద్ధమని గ్రహింతుము. త్రవ్వుదుము.

    20. (త్రవ్వుటకు అనుకూలమగు నేలమీద నిలిచిన అశ్వపు వీపు మీద అధ్వర్యు  చేతితో దువ్వవలెను)

    అశ్వమా! ద్యులోకము నీ వెన్ను, పృథ్వి నీ సహస్థానము. అంతరిక్షము నీ ఆత్మ, సముద్రము ఉత్పత్తి స్థానము. అట్లు స్తుతించబడు అశ్వమా! నీ కంటి చూపున త్రవ్వతగిన నేలను  గుర్తింపుము. ఆ మట్టిలో ఉన్న శత్రు భావమును - రాక్షసాదులను నీ కాళ్ళతో త్రొక్కి వేయుము.

    21. (అశ్వమును ఆ నేల తొలగించవలెను)

    అశ్వమా! నీవు వేగవంతవు. శుభములు కలిగింపుము. ఈ మట్టి నుంచి తొలగుము. మేము అధ్వర్యు యజమానాదులము. ఈ మట్టిని త్రవ్వెదము. నేల తల్లి మమ్ము. అనుగ్రహ దృష్టితో చూడవలెను.

    22. ఈ అశ్వము వేగవంతము, ధనమును ఇచ్చునది. మట్టి త్రవ్వ వలసిన చోటు నుంచి దిగినది. దానిని పుణ్యవంతము చేసినది. ఇక అచటి నుండియే - సుముఖుడగు అగ్ని యొక్క వేది కొరకు - మట్టిని త్రవ్వుదుము. పరమపదము చేరు కోరిక గల వారమై త్రవ్వుదుము.

    23. (మట్టి గడ్డమీద కూర్చుని ఆహుతులు ఇవ్వవలెను)

    అగ్నీ! సర్వ భూతములు నీయందే ఉన్నవి. నేను శ్రద్ధగల మనసుతో నీకు ఘృతాహుతి అర్పింతును. నీ జ్యోతి వంకరలు గలది. దానితో నీవు ఎంతో వ్యాపింతువు. ధూమముతో నింగిని చేరుదువు. ఘృతాదుల ఆహుతులచే అత్యంత ప్రకాశవంతుడవు అగుదువు. అట్టి నీవేగదా ప్రత్యక్ష దైవమవు! స్వాహా.

    24. అగ్ని ప్రత్య గాత్మ. సర్వత్ర ప్రతీయమా నుడు. అట్టి అగ్నికి ఘృతాహుతి అర్పించుచున్నాను. అగ్ని దానిని - క్రోధము లేని మనమున స్వీకరించవలెను.

    అగ్ని మానవులకు ఆశ్రయనీయుడు. స్పృహణీయ వర్ణుడు. జ్వాలామయ దేహుడు. ఇటునటు తిరుగువాడు. ఎంతటివాడును అంటలేని వాడు -అగ్నయే స్వాహా.

    25. అగ్ని అన్నపాలకుడు. క్రాంత ద్రష్ట. హవిర్దాత యజమానికి వివిధ రమణీయ ధనములను ఇచ్చువాడు. అగ్ని హవిభక్షణార్థము విచ్చేయవలెను.

    (అభ్రితో ఆ ప్రదేశమును త్రవ్వవలెను)

    26. అగ్ని బలమున మధించిన ఉత్పన్నమగువాడు. సర్వ రక్షక పురమునందున్నవాడు. విప్రుడు, అసాధ్యుడు. నిత్యమూ రాక్షసాదులను వధించువాడు. అతనిని మేము నిశ్చల చిత్తమున ఆరాధింతుము.

    (మరికొంత దూరమున త్రవ్వవలెను)

    27. అగ్నీ! నీవు ఘర్షణమున రోజురోజు జన్మించువాడవు. జలమున విద్యుద్రూపామున జన్మించువాడవు. రాళ్ళ రాపిడికి జన్మించువాడవు. అరణులందు జన్మించువాడవు. మానవ పోషకుడవు. నీ వెలుగున తిమిరాదులను ధ్వంసము చేయువాడవు. ఓషధుల నుంచి జన్మించువాడవు. పావకుడవు.

    (మరికొద్ది దూరమున త్రవ్వవలెను)

    28. (అభ్రితో మట్టిని త్రవ్వ వలెను)

    అభ్రీ! నేను అంగిరులతో సమానుడను. సవితా దేవుని అధీనపువాడను. అశ్వినుల బాహువులతోను, పూషహస్త ములతోను నిన్ను పట్టినాను. నేలను త్రవ్వుచున్నాను.

    అభ్రీ! నీవు జ్వాలాయుక్తుడవు. సుందరముఖివి. సతత తేజోవంతవు. ప్రకాశమానవు. ప్రజలకు నిరంతర కళ్యాణకారివి. అహింసకవు. నిన్ను పశువుల హితకర అగ్నికొరకు -అంగిరసములమై - త్రవ్వుచున్నాము.

    29. (మట్టిగడ్డ ప్రక్కన - ఉత్తర దిక్కున - కృష్ణాజినము పరచవలెను. దాని మీద తామరాకును ఉంచవలెను)

    కమలినీ పత్రమా! నీవు జలముల ప్పష్టమవు. ఈ నేలను మేము అగ్ని కొరకు త్రవ్వుచున్నాము. ఆ మట్టికి నీవే కారణ భూతమవు. సమస్త దిశలందు వృద్ధి చెందు సముద్రమునే వృద్ధి చేయు నీవు మహానుడవు. ద్యులోకపు పరిమాణము ననుసరించి విస్తరించుము.

    30. (కృష్ణాజినము, కమలినీ పత్రము రెండింటిని తాకవలెను.)

    కృష్ణాజిన, కమలినీ పత్రములారా! మీరు ఉభయులు అగ్ని కొరకు సుఖావహులు కండు. కవచ సమాన రక్షకులు కండు. మీరు చిద్ర రహిత ఆకాశసములు. పశుహిత కారి అగ్నిని చక్కగా ఆచ్చాదించండి. మీ యందు ఉంచుకొనండి.

    31. స్వర్గమును తెలిసినవాడు - ఏక మనస్కుడు - జ్యోతిష్మంతుడు- అనుపేక్షనీయుడగు అగ్నిని మీలో దాచుకొనండి - స్వదేహములచే అగ్నిని చక్కగా ఆచ్చాదించండి.

    32. అగ్నీ! నీవు పశుహితకరుడవు. సమస్త విశ్వమును నిలుపువాడవు - పోషించువాడవు. మొట్ట మొదట నిన్ను అథర్వ ఋషి మథించి సృష్టించినాడు.
    (యజమాని మట్టిని తామరాకు మీద ఉంచవలెను)

    అగ్నీ! మొట్ట మొదట అతర్వార్షి నిన్ను జలమును మథించి సృష్టించినాడు. నేడు లోకహితము కోరు ఋత్విజుడు నిన్ను  - అరణిని మథించి - కలిగించుచున్నాడు.

    33. అగ్నీ! ఆ అధర్వుని పుత్రుడు - దధ్యంగుడనువాడు- వృత్రహంతవు, పురవిదారకుడవగు నిన్ను - ప్రజ్వలితుని చేయుచున్నాడు.

    34. అగ్నీ! నీవు శత్రుహంతవు. యుద్ధములందు ధనవిజేతవు. మేము సన్మార్గగాములము. సన్మనస్కులము. నిన్ను సందీప్తుని చేయుచున్నాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.