Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    19. అశ్వినులారా ! మీరు ఉత్తమ పరిపాలకులు. స్తోత్రార్హులు. రోగగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయగలవారు. విశ్పల మిమ్ము ప్రార్థించగా వెళ్లిన రథముమీదనే సర్వరక్షణతో విచ్చేయుడు.

    20. అశ్వినులారా ! మీరు దర్శనీయులు. "శయువు" ఆవు కృశించినది. గొడ్డుపోయినది. పాలు ఇవ్వనిది. అట్టి ఆవును పాలిచ్చు ఆవునుగా చేసినారు. పురుమిత్రుని కూతురును మీ ఉపాయమున విమదుని భార్యనుగా చేసినారు.

    21. అశ్వినులారా ! ఆర్యుడను నరునిచే నాగటితో భూమిని దున్నించినారు. యవధాన్యపు విత్తనాలను చల్లించినారు. దస్యులను వజ్రాయుధమున పరిమార్చినారు. ఇట్లు మీరు పరాక్రమములు కావించినారు.

    22. అధర్వణ పుత్రుడగు దధీచికి ఇంద్రుడు మధు, ప్రవర్గ విద్యలను ప్రసాదించినాడు. అశ్వినులారా ! మీరు కోరినంతనే దధీచి మీకు ఆ విద్యలు బోధింతును అన్నాడు. మీరు దధీచికి గుఱ్ఱపు తలను అమర్చినారు. దధీచివలన రహస్యమగు మధువిద్యను, ప్రవర్గవిద్యను పొందినారు.

    23. అశ్వినులారా ! మీరు బుద్ధిశాలురు. సత్యవచనులు. నేను సర్వదా మీ అనుగ్రహమును అర్థించుచున్నాను. నేను చేయు సకల కార్యములను రక్షించుడు. నాకు పుత్ర పౌత్రాదులతో కూడిన ధనమును ప్రసాదించుము.

    24. అశ్వినులారా ! మీరు దాతలు, సర్వకర్మ ప్రేరకులు. వధ్రిమతి అను బ్రహ్మవాదినికి "హిరణ్యహస్తుడు" అను పుత్రుని ప్రసాదించినారు. మూడు భాగములుగా నరుకబడిన 'శ్యేవు'ని బ్రతికించినారు.

    25. అశ్వినులారా ! ప్రాచీనములగు మీ వీర కృత్యములను మా పూర్వజ్ఞులు మాకు చెప్పినారు. కోరికలను తీర్చగల మిమ్ము మేము మంత్రరూపమయిన స్తోత్రములతో ప్రార్థించుచున్నాము. మాకు పుత్ర పౌత్రాదులను ప్రసాదింపుడు. మేము మిమ్ము యజ్ఞములందు ఆహ్వానించుచుందుము.

                      నూట పదునెనిమిదవ సూక్తము
        ఋషి - కక్షీవంతుడు, దేవత - అశ్వినులు - ఛందస్సు - త్రిష్టుప్.

    1. కోర్కెలు తీర్చునట్టి అశ్వినులారా ! మీరథము మూడు నొగలు కలది. మనోవేగ, వాయువేగములు కలది. ధనప్రదము, సుఖప్రదము అయినది. ఆ రథము మాకు అభిముఖముగా రావలెను.

    2. మూడు నొగలు కలదియు, మూడు విధములుగా తీర్చబడినదియు, మూడు చక్రములు కలదియు, సుఖప్రదము అయినదియు అగు రథమున అశ్వినులు మాకు అభిముఖముగా రావలెను. అశ్వినులారా ! మా ఆవులను పాడిగలవానిని చేయుడు. మాగుఱ్ఱములను విజయవంతములను చేయుడు. మా పుత్ర్ పౌత్రాదులను వర్ధిల్లచేయుడు.

    3. దర్శనీయులగు అశ్వినులారా ! పూర్వకాలపు విద్వాంసులు, తమ దారిద్ర్య నిర్మూలనకు మిమ్ము స్తుతులతో ఆహ్వానించినారు. మాస్తుతులను వినుటకు మీ దృఢమయిన రథమున విచ్చేయుడు.

    4. అశ్వినులారా ! మీ అశ్వములు జలములవలె వేగవంతములు. ఆకసమున ఎగురు డేగలవలె సంచరించగలవి. అట్టి స్తుతింపదగిన అశ్వములను పూన్చిన రథమున మీరు హవిస్సులు అందుకొనుటకు వత్తురు. అట్లే మావద్దకు విచ్చేయగలరు.

    5. అశ్వినులారా ! మీరు సర్వప్రేరకులు. అందవతి యువతి అయిన సూర్యుని కూతురు మీ మీద మక్కువ కలిగి మీ రథమును ఎక్కినది. మంచి రూపముగలవి. ఎగురగలవి, వడిగలవి అగు మీ గుఱ్ఱములు మిమ్ము మావద్దకు తోడ్కొని రావలెను.

    6. అశ్వినులారా ! మీరు వరదులు. దర్శనీయులు. మీ దక్షతతో వందనుని, రేభుని బావినుండి విముక్తి కలిగించినారు. తుగ్ర పుత్రుడు భుజ్యుని సముద్రము నుండి దరిచేర్చినారు. ముదుసలి చ్యవనునకు యవ్వనము కలిగించినారు.

    7. అశ్వినులారా ! మీరు ఉముక నిప్పును చల్లార్చినారు. అత్రిని విముక్తుని చేసినారు. అతనికి సుఖప్రదము, శక్తియుక్తమయిన ఆహారము ప్రసాదించినారు. కణ్వుని పొరలుక్రమ్మిన నేత్రములకు దృష్టి ప్రసాదించినారు. అట్టి మిమ్ము స్తుతించుచున్నాము.

    8. అశ్వినులారా ! శయుడు పూర్వకాలపు వాడు. యాచించువాడు. అతని గోవును పలు ఇచ్చునట్లు చేసినారు. ఆడ పిచ్చుకను బాధనుండి విముక్తము చేసినారు. విశ్పలకు తెగిపోయిన కాలును తగిలించినారు.

    9. అశ్వినులు తమకు ఇంద్రుడు ఇచ్చిన అశ్వమును 'వేదు'నకు ఇచ్చినారు. ఆ గుఱ్ఱము బలమైనది. వయసుది. శత్రుంజయము. అనేక యుద్ధములు చేసినది.

    10. అశ్వినులారా ! మీరు మంచి జన్మలు కలవారు. ప్రసిద్ధులు. మాకు ధనము ప్రసాదించమని యాచించుచున్నాము. రక్షణ కల్పించమని ప్రార్థించుచున్నాము. మా స్తోత్రములు వినుటకు, మీరు ధనము నిండిన రథముమీద విచ్చేయుడు. మాకు సుఖములు సమకూర్చుడు.

    11. అశ్వినులారా ! మీకు హవిస్సులు అందించుచున్నాను. ఉషస్సు ఉడుగునపుడు మిమ్ము ఆహ్వానించుచున్నాను. మీరు నన్ను అనుగ్రహించుడు. వేగవంతములగు అశ్వములమీద విచ్చేయుడు.

        నూట పందొమ్మిదవ సూక్తము - ఋషి - కక్షీవంతుడు
              దేవత - అశ్వినులు, ఛందస్సు - జగతి.   


    1. అశ్వినులారా ! మీ రథము ఆశ్చర్యకరము. మనోవేగముగలది. వేగవంతములయిన అశ్వములు కలది. యాగార్హమయినది. అనేక ధ్వజములు కలది. వర్షించగలది. ధనములు కలది. ధనములు ఇచ్చునది. నేను ఆయువుకోరి మిమ్ము ఆహ్వానించుచున్నాను. మీరు అట్టి రథము మీద విచ్చేయుడు. హవిస్సులు అందుకొనుడు.

    2. అశ్వినులు రథము నడుచుచున్నది. మేము ఊర్ధ్వముఖులమయి, మనస్ఫూర్తిగా స్తుతించుచున్నాము. మా స్తుతులు అశ్వినులను చేరుచున్నవి. నేతితో కూడి రుచిగల హవిస్సులను చేయుచున్నాము. ఋత్విజులు హవిస్సులను సంస్కరించుచున్నారు. అశ్వినులారా ! మీరు ఉషోదయముతో బయలుదేరుడు.

    3. యజ్ఞములు చేయువారు, జయశీలురు, ధనముకొఱకు పోటీలుపడువారు యుద్ధములు చేయుదురు. అప్పుడు అశ్వినుల రథము భూమిమీద అగపడును. అశ్వినులారా ! మిమ్ము స్తుతించువారి వద్దకు ఆ రథము మీద విచ్చేయుడు.

    4. భుజ్యుడు సముద్రమున పడి ఉన్నాడు. అశ్వినులు అతనిని స్వయముగా పూన్చుకొనగల అశ్వములు ఉన్న రథముమీద రక్షించినారు. అతనిని అతని తలిదండ్రులవద్దకు చేర్చినారు. దివోదాసుని అశ్వినులు రక్షించిన వృత్తాంతము మాకు తెలియును.

    5. అశ్వినులారా ! మీ గుఱ్ఱములు స్తవనీయములు. వాటిని మీరు మీ రథమునకు పూన్చినారు. ఆ అశ్వములు మిమ్ము సూర్యుని వద్దకు చేర్చినవి. తదనంతరము సూర్యపుత్రి మిమ్ము ప్రేమించినది. వరించినది. మిమ్ము పతులను జేసికొన్నది.

    6. అశ్వినులు రేభుని ఉపద్రవము నుండి రక్షించినారు. అత్రిని రక్షించుటకు ఉముకనిప్పును చల్లార్చినారు. శయుని ఆవును, పాలు ఇచ్చునట్లు చేసినారు. అవయవములు శిథిలములయిన నందర్షికి దీర్ఘాయువు ప్రసాదించినారు.

    7. అశ్వినులారా ! మీరు అందములగు శిల్పములు మలచుటలో నేర్పరులు. రథమును బాగుచేసినట్లు నందర్షిని ఆరోగ్యవంతుని చేసినారు. తల్లి గర్భమున ఉండి వామదేవుడు మిమ్ము స్తుతించినాడు. మీరు మేధావి అగు వామదేవుని తల్లిగర్భమునుండి పుట్టించినారు. మీ ఈ ఘన కార్యములతో యజమానిని రక్షించగలరు.

    8. తండ్రి విడిచి దూరమున ఉన్న భుజ్యుని మీద, అశ్వినులారా ! మీరు దయతలచినారు. రక్షించుటకు భుజ్యుని సమీపించినారు. మీరు సర్వజనులకు సుఖములను, రక్షణలను ప్రసాదింతురు. అందువలన సమస్త జనులు మిమ్ము ఆపేక్షించుచున్నారు.

    9. అశ్వినులారా ! మధువిద్య కోరి తేనెటీగ మిమ్ము స్తుతించినది. మీరు దధీచిని సేవించినారు. మీరు సమకూర్చిన అశ్వశిరసుధరించి అతడు మీకు మధు విద్య ఉపదేశించినాడు. ఉశిజ పుత్రుడు కక్షీవంతుడు సోమపానము నిమిత్తము మిమ్ము ఆహ్వానించుచున్నాడు.

    10. అశ్వినులారా ! వేదుని కొఱకు మీరు ఒక అశ్వమును సిద్ధము చేసి ఇచ్చినారు. అది అనేకులు కోరదగినది, శత్రుంజయము, శ్వేతము, ప్రకాశవంతము, అజేయము. ఇంద్రుని పోలినది. అన్ని పనులకు ఉపయోగపడునది. అట్టిది మీరు వేదునకు ఇచ్చిన అశ్వము.

        నూట ఇరవదవ సూక్తము - ఋషి - కక్షీవంతుడు, దేవతలు - అశ్వినులు,
        ఛందస్సు- 1. గాయత్రి, 2. కకుప్, 3. కావిరాట్, 4. నష్టరూపి, 5. తనుశిర,
            6. ఉష్ణిక్కు, 7. విస్తారబృహతి, 8. రవివిరాట్టు మిగిలినవి గాయత్రి.


    1. అశ్వినులారా ! మిమ్ము పూజించు స్తవము ఎట్టిది ? మీ ఇరువురిలో ప్రసన్నుడగువాడు ఎవడు ? మీ మహిమలు ఎరుగనివాడు మిమ్ము ఎట్లు భజించవలెను ?

    2. మహిమలు ఎరుగని స్తుతికర్త, సర్వజ్ఞులగు అశ్వినులు శత్రువునకు లోమ్గువారు కారు. భక్తులకు సాక్షాత్కరింతురు.

    3. అశ్వినులారా ! మీరు జ్ఞానులు. విద్వాంసులు. మిమ్ము స్తుతించవలసిన స్తుతిని మీకే తెలుపవలెను. మేము మిమ్ము ఆహ్వానించుచున్నాము. స్తుతించుచున్నాము. హవిస్సులు అర్పించుచున్నాము.

    4. అశ్వినులారా ! మిమ్మే అడుగుచున్నాను. ఇతరులను అడుగను. విషట్ కృతము, రుచ్యము, శక్తిదము అయిన సోమమున మీ భాగము స్వీకరించుడు. మమ్ము ఉద్యోగవంతులను చేయుడు.

    5. అశ్వినులారా ! మిమ్ము ఘోష అనునామె పుత్రుడు సుహస్తుడు, భృగువు స్తుతించినారు. కక్షీవంతుడు ఆ స్తుతులతోనే మిమ్ము ప్రార్థించుచున్నాడు. మీరు అతనిని అనుగ్రహించవలెను. అతనికి అన్నము ప్రసాదించవలెను.

    6. అశ్వినులారా ! ఋజ్రాశ్వుడు గాయత్రీసామమున మిమ్ము భజించి దృష్టి బడసినాడు. ఆ గాయత్రీ సామముననే మిమ్ము నేను భజించుచున్నాను.

    7. అశ్వినులారా ! మీరే ధనదులు. మీరే రక్షకులు. మీరే వినాశకులు. మాకు శుభములు కలిగించుడు. మమ్ము రక్షించుడు. చెడును పోగొట్టుడు. దొంగలనుండి కాపాడుడు.

    8. అశ్వినులారా ! మైత్రిలేని వారిముందు మమ్ము నిలుపవద్దు. గోవులు దూడలను రక్షించునవి. దూడలు లేని గోవులు మా ఇల్లు వదలి పోకుండచూడుము.

    9. అశ్వినులారా ! స్తుతి కర్తలు మిమ్ము స్తుతించుచున్నారు. మిత్రుల పోషణకు తగు ధనమును పొందుచున్నారు. మమ్ము అన్నవంతులను ధనవంతులను చేయగలరు.

    10. బలవంతులగు అశ్వినులయొక్క గుఱ్ఱములులేని రథమును నేను అర్పించినాను. ఆ రథమే నాకు శ్రేయస్సు కలిగించును.

    11. ధనదమగు రథమా ! మాకు పురోభివృద్ధిని ప్రసాదించుము. అశ్వినులు నిన్ను అధిరోహించియే సోమపానమునకుగాను స్తోత్రపాఠకులవద్దకు వెళ్లుదురు.

    12. స్వప్నమును గురించియు, లోభిని తలంచియు దుఃఖించుచున్నాను. స్వప్నము, లోభి ఇరువురు నశించవలెను.

                   (ప్రథమ మండలమున పదిహేడవ అనువాకము సమాప్తము.)

          పదునెనిమిదవ అనువాకము - నూటిరువది ఒకటవ సూక్తము

     ఋషి-కక్షీవంతుడు, దేవత-ఇంద్రుడు లేక విశ్వేదేవతలు, ఛందస్సు-త్రిష్టుప్.


    1. ఇంద్రుడు నరులను రక్షించువాడు. గోరూపమగు ధనములను ఇచ్చువాడు. మేము అంగిరసులము. ఇంద్రుని స్తుతించుచున్నాము. అతడు మా ప్రార్థనలను ఆలకించవలెను. ఇంద్రుని మేడలుగల యజమానులు ఆశ్రయింతురు. వారివద్దకు వచ్చిన ఇంద్రుడు ఈ యజ్ఞమునకు వచ్చును.

    2. ఇంద్రుడు ప్రసిద్ధుడు. ద్యులోకమును శాశ్వతము చేసినాడు. అతడు సూర్యరూపము దాల్చినాడు. జీవనాధారమయిన వర్షమును కలిగించుచున్నాడు. అతడు వర్షాధిదేవత. అతడు గుఱ్ఱమునుండి ఆవును సృష్టించినాడు.

    3. ఇంద్రుడు సూర్యరూపుడు. ఉషస్సును ప్రకాశింప చేయువాడు. అతడు నిత్యము అంగిరసుల స్తుతులు వినును. వారికి ధనములు ప్రసాదించును. అతడు వధార్హుల కొఱకు వజ్రాయుధమును నిర్మించినాడు. సకల ప్రాణుల రక్షణకొఱకు ద్యులోకమును పడకుండ నిలిపినాడు.

    4. ఇంద్రుడు సోమము పానము చేసినాడు. ఉన్మత్తుడు అయినాడు. గుహలో దాచిన గోవులను విడిపించినాడు. ఇంద్రుడు ముల్లోకములకు ప్రభువు. అతడు నరులకు ద్రోహము చేయువారిని కూల్చినాడు.

    5. ఇంద్రుడు శ్రీఘ్రముగ కార్యములు నెరవేర్చువాడు. సర్వజగత్పాలకమగు ద్యావాపృథ్వులు అతని కొరకే సమృద్ధములు అయినవి. జగదుత్పత్తి కారకమగు హవిస్సు ఆవిర్భవించినది. యజమానులు ఇంద్రునకు పరిశుద్ధములయిన గోక్షీరములను సమర్పించినారు.

    6. ఇంద్రుడు మమ్ము బాధలనుండి విముక్తులను చేయవలెను. మాకు ఆనందము కలిగించవలెను. అతడు ఉషవద్ద సూర్యునివలె తేజరిల్లి ఉన్నాడు. ఆహవనీయ స్థానమున సోమము స్రువముతో చల్లబడుచున్నది. అప్పుడు ఇంద్రుడు తన హవిస్సులను అందుకొనును. ఆనందించును.

    7. ఇంద్రుడు సూర్యరూపమున మేఘమును తపింపచేయును. జగత్తునకు వర్షము కలిగించును. ఇంద్రుడు సూర్యరూపమున ప్రకాశించినపుడు అడవికి కట్టెలకు పోవువాడు, పశువులకొఱకు సాగువాడు కార్యోన్ముఖులు అగుదురు.

    8. ఇంద్రా ! మనోహరము, మాదకము, వీర్యవంతము, వాయువేగవంతమగు సోమమును నీ కొఱకు సిద్ధము చేసినాము. నీవు విచ్చేయుము. యజ్ఞమున మిగిలిన సోమమును హరి అను నీ గుఱ్ఱములకు త్రాగించుము. ధనమును అపహరించు శత్రువును పరిమార్చుము.

    9. ఇంద్రా ! నిన్ను అనేకులు ఆహ్వానింతురు. నీ ఆయుధము వజ్రము. అది ఇనుముతో చేయబడినది. ద్యులోకమునకన్న ప్రకాశించునది. శీఘ్రగామి. త్వష్ట నిర్మించినది. దానిని నీవు శుష్ణాసురుని మీద ప్రయోగించినావు. కుత్సుని రక్షించుటకు సకల ఆయుధములతో అతని చుట్టు నిలిచినావు. శుష్ణుని నుండి కాపాడినావు.

    10. పూర్వము శుష్ణాసురుడు చీకటి రూపమునను, మేఘరూపమునను సూర్యుని ఆవరించినాడు. ఇంద్రుడు వజ్రమున ఆ శుష్ణాసురుని అంతమొందించినాడు. అప్పుడు సూర్యుడు తన ప్రకాశమున వెలిగినాడు.

    11. ద్యావా పృథ్వులు గొప్పవి. శక్తిమంతములు. సర్వ వ్యాప్తములు. ఇంద్రుని వీరకృత్యములకు ఆ ద్యావా పృథ్వులు సంతసించినవి. ఇంద్రుడు సర్వత్ర వ్యాపించిన వృత్రుని తన వజ్రాయుధమున ప్రవహించు జలములందు సంహరించినాడు.

    12. ఇంద్రా ! కవిపుత్రుడు శుక్రుడు నీకు వజ్రాయుధమును ఇచ్చినాడు. అది శత్రుసంహారకము. వృత్రుని వధించ తగినది. అట్టి వజ్రాయుధమునకు పదును పెట్టినావు. వేగవంతములయిన నీ అశ్వములను రథమునకు పూన్పుము. రథమును అధిరోహింపుము.

    13. ఇంద్రా ! నీవు సూర్యరూపమున ప్రకాశించినావు. నీ రథాశ్వములను పచ్చనికిరణములవలె విహరింపచేసినావు. నీ రథచక్రములను సూర్యుని అశ్వములవలె వేగవంతములు చేసినావు. తొంబది నదులను దాటినావు. యాగ విరోధులను హతమార్చినావు.

    14. వజ్రాయుధధారీ ! ఇంద్రా ! ఎంతో కష్టపడి పోగొట్టదగిన దారిద్ర్యము నుండి మమ్ము దరి చేర్చుము. పాపము వలన ప్రాప్తించిన యుద్ధములందు మమ్ము రక్షింపుము. మాకు రథములు, అశ్వములు మున్నగువానికొఱకు ధనమును ప్రసాదించుము. మేము ఆధనముతో అన్నమును, కీర్తిని సత్యవాక్యమును సంపాదింతుము.

    15. ఇంద్రా ! నీవు ధనవంతుడవు. పూజ్యుడవు. మేము నిన్ను నుతించుచున్నాము. నీ అనుగ్రహము మా విషయమున తగ్గనీయకుము. మాకు సమృద్ధిగా అన్నములను, గోవులను, పుత్ర పౌత్రాదులను ప్రసాదింపుము. మమ్ము ఆనందింపచేయుము.

    దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ వేంకటార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్ర ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండను, కమలానామ్ని ధర్మపత్ని సహితుండును వివేకానందుడు, శకుంతల, మాళవిక, అగ్నిమిత్రుడు, ఊర్వశి, విక్రముడు, వేంకటేశ్వర మాహాత్మ్యము, మహాత్ముడు ఇత్యాది అనేక బాలసాహిత్య గ్రంథకర్తయు అగు దాశరథి రంగాచార్య విరచితమయిన ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ప్రథమ మండలమున (ఎనిమిదవ అధ్యాయముతో కూడిన) మొదటి అష్టకము సమాప్తము.

                        ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.