Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
తొమ్మిదవ అధ్యాయము
1. దేవసవితః ప్రసువ యజ్ఞం ప్రసువ యజ్ఞపతిం భగాయ |
దివ్యోగంధర్యః కేతపూః కేతం నః
పునాతు వాచస్పతి ర్వాజం నః స్వదతు స్వాహా ||
(ఈ అధ్యాయమున 34వ మంత్రము వరకు వాజపేయ భాగము. ఈ యజ్ఞాంగములకు ఆహుతులు అర్పించబడును)
సవితృదేవా! నీవు దయ ఉంచి వాజపేయ యజ్ఞమును అనుమోదింపుము. యజ్ఞస్వామి యజమానికి సంపదలు కలిగించుము.
సూర్యదేవా! నీవు ద్యులోకమునందు ఉన్నవాడవు. కిరణములు గలవాడవు. అన్నమును పావనము చేయువాడవు. మా హవిరన్నమును పావనము చేయుము. ప్రజాపతి మా హవిరన్నమును ఆస్వాదించును గాత స్వాహా.
2. (ప్రాతస్సవనమున ఆగ్రాయణ గ్రహమును తీసికొన్న తరువాత మూడు అతిగ్రహములను తీసికొనవలెను. తదుపరి షోడశీగ్రహమును తీసికొని ఇంద్రదేవతాక గ్రహమును అందుకొనవలెను)
సోమమా! నీవు ఇంద్రునకు ప్రియతమవు. నిన్ను ఇంద్రుని కొరకు ఉపయామగ్రహమున గ్రహించుచున్నాను. నీవు ధ్రువమగు పృథ్విలోకమున ఉండుదానవు. మానవులందు ఉండుదానవు. మనసులందు ఉన్నదానవు. అటువంటి సోమమవగు నిన్ను నేను అందుకొనుచున్నాను. ఇదినీవు నిలుచు స్థానము.
సోమమా! నీవు ఇంద్రునకు ప్రియతమవు. నిన్ను ఇంద్రుని కొరకు ఉపయామగ్రహమున గ్రహించుచున్నాను. నీవు ధ్రువమగు పృథ్విలోకమున ఉండుదానవు. మానవులందు ఉండుదానవు. మనసులందు ఉన్నదానవు. అటువంటి సోమమవగు నిన్ను నేను అందుకొనుచున్నాను. ఇదినీవు నిలుచు స్థానము.
సోమమా! నీవు ఇంద్రునకుప్రియతమవు. నీవు జలములందు ఉండుదానవు. ఘృతమునందు ఉండుదానవు. అంతరిక్షమందు ఉండుదానవు. అట్టి సోమమవగు నిన్ను నేను అందుకొనుచున్నాను. నీవు ఉపయామ గ్రహమునందు ఉన్నావు.
సోమమా! నీవు ఇంద్రునకు ప్రియతమవు. నిన్ను న్నెఉ ఉపయామగ్రహమున గ్రహించుచున్నాను. నీవు పృథ్వియందు - అంతరిక్షమున - ద్యులోకమున - దేవతలందు -స్వర్గమునందు ఉండుదానవు. ఇది నీ స్థానము.
సోమమా! నీవు ఇంద్రునకు ప్రియతమవు. నిన్ను నేను గ్రహించుచున్నాను.
3.వాయువు జలములకుసారభూతుడు. అన్నమును పచనము చేయువాడు. అతడు సూర్యుని యందు ఉన్నాడు. జలములకు సారము - వాయువునకు సారము అతిశ్రేష్ఠ ప్రజాపతి. దేవతలారా! మీ కొరకు ప్రజాపతి - రూపసోమమును -గ్రహించుచున్నాను.
సోమమా! నీవు ఇంద్రునకు ప్రియతమవు. ఇంద్రుని కొరకు నిన్ను ఉపయామగ్రహమున గ్రహించుచున్నాను. ఇది నీ స్థానము. ఇంద్రునకు ఎంతో ప్రియమైన నిన్ను గ్రహించుచున్నాను.
4. (నాలుగవ ఇంద్ర గ్రహమును తీసికొనవలెను)
అన్న, బలములను ఆహ్వానించువాడు విప్రుడగు యజమాని. అతనికి బుద్ధి ప్రసాదించువాడు ఇంద్రుడు. ఇంద్రుని ప్రియతమ గ్రహమునందలి అన్నమును - సారమును నేను స్వీకరించుచున్నాను. ఇంద్రునకు అత్యంత ప్రీతికరమగు సోమమా! నిన్ను ఇంద్రుని కొరకు ఉపయామ గ్రహమున గ్రహించుచున్నాను. ఇది నీ స్థానము. ఇంద్రునకు అత్యంత ప్రీతికరమగు సోమమును నేను గ్రహించుచున్నాను.
(సోమ గ్రహమును అధ్వర్యు అక్షము మీద - నేష్ఠసురా గ్రహమును అక్షము క్రింద పెట్టవలెను.)
సోమ, సురాగ్రహములారా మీరు ఒకే చోట కలసిపోయినారు.
(అధ్వర్యు, నేష్ఠ రెండు గ్రహమలకు తమ వద్దకు తెచ్చుకొనవలెను.)
సోమ, సురాపాత్రలారా! ఇక మీరు విడిపోయినారు. మీరు నన్ను పాపములనుండి వేరుచేయండి.
5. (మహామరుద్వతీయపు చివరన మహేంద్రగ్రహమును అందుకొనుటకు ముందు - రథమును తెచ్చిన బండినుండి రథమును దింపవలెను)
రథమా! నీవు ఇంద్రుని వజ్రమవు. నీవు జన్మనిచ్చు దానవు. నీవలన ఈజయమానికి అన్నము లభించవలెను. అన్నప్రాప్తి కొరకు మాహామాత అదితిని వేదమంత్రములచే ప్రసన్నను చేయుచున్నాను. ఈసమస్తలోకములు అదితి ద్యావాపృథ్వి - యందు ఇమిడి ఉన్నవి. ఈభూమి మీద సూర్యభగవానుడు నాకు నివాసము ప్రదానము చేయవలెను.
6. జలములందు అమృతము ఉన్నది. జలములందు ఓషధులు ఉన్నవి. అశ్వములారా! మీరు జలపు పాశస్త్యమున చేరుదు. వేగవంతులు కండు.
జలమా! నీ తరంగములు వేగవంతములు. నీవు సమున్నత జలసముచ్చయ యుక్తవు. అన్నము కలుగజేయుదానవు. అన్నదులను ఈయజమానికి సమకూర్చుము.
(అశ్వములు స్నానమాడించవలెను)
7. వాయువు మనస్సగును - ఇరువదియేడు నక్షత్రములు గంధర్వులు. అవియే భూమిని భరించునవి. అవియే ముఖమును ముందు ఏర్పరచినవి. అశ్వములందు వేగమును కల్పించినవి.
(అశ్వమును కుడివైపు కట్టవలెను)
8. అశ్వములారా! మీరు రథమున చేర్చబడినారు. వాయుసమవేగము గలవారలు కండి. దక్షిణమున నిలిచిన మీకు ఇంద్రుని వంటి శోభకలుగును గాత. సర్వధన మరుద్గణములు మిమ్ము పూన్చుదురు గాత. త్వష్ట మీ పాదములకు వేగము కలిగించును గాత. (రెండవ అశ్వమును కట్టవలెను)
9. అశ్వములారా! మీ వేగము మనసునందున్నది. మీ వేగము శ్యేనయానమందున్నది. మీ వేగము వాయువు నందు ఉన్నది. ఈమూడు విధముల వేగములు కలుపుకోని బలవంతులు కండి. మా అన్నములను గెలుచువారలు కండి.
(బృహస్పతి చరును అశ్వమునకు ఆఘ్రాణింప చేయవలెను)
అశ్వములారా! మీరు అన్నమంత్రములు అందుకొనండి. బృహస్పతి చరును ఆఘ్రాణించండి.
(రథపు దక్షిణ దిశన మూడవ గుర్రమును కట్టవలెను. ఒకప్రక్క ఒక అశ్వమును మరొక ప్రక్క రెండు అశ్వములను కట్టినట్లున్నారు. 'తృతీయమశ్వం యునక్తి' అన్నాడు.
10. అనుల్లంఘనీయ - సత్యసవసో - ఆదేశములిచ్చు సవిత అనుజ్ఞవలన బృహస్పతి యొక్క ఉత్తమ స్వర్గమును ఆరోహింతును.
నేను సత్యాదేశ సవితా దేవత అనుజ్ఞవలన ఇంద్రుని ఉత్తమ స్వర్గమును ఆరోహింతును.
(బ్రహ్మయను ఋత్విక్కు యజమానిని రథము మీద ఎక్కించవలెను. పదిహేడు ధనువుల దూరమునకు విసరిన ఔదుంబరశాఖను ప్రదక్షిణము చేసిన పదిహేడు రథముల మీద ఉన్న యజమానులను యజ్ఞస్థలమున బ్రహ్మ దించవలెను)
సత్యాదేశ సవితృదేవత అధీనమున ఉన్న నేను బృహస్పతి యొక్క ఉత్తమస్వర్గమును అధిరోహించినాను.
సత్యాదేశ సవితృదేవత అధీనమున ఉన్న నేను ఇంద్రుని ఉత్తమస్వర్గమును అధిరోహించినాను.
11. (వేది పక్కన నాటి ఉన్న స్తంభమునకు 17 దుందుభులు వ్రేలాడుచుండును. వానినుంచి ఒకదానిని తీసి వాయించవలెను.)
బృహస్పతీ! నీవు అన్నములను జయించుము. దుందుభులారా! మీకు బృహస్పతి కొరకు ద్వనించండి. (ఇది బ్రాహ్మణవాజపేయి కొరకైనది)
ఇంద్రా! నీవు అన్నములను జయింపుము. దుంధుభులారా! మీరు ఇంద్రుని కొరకు మ్రోగండి. ఇంద్రుని అన్న విజయుని చేయండి.
(ఇది క్షత్రియ వాజపేయి కొరకైనది)
12. దుందుభులారా! మీ ధ్వని- వాణి - యథార్థమైనది. మీరు ఇంద్రుని అన్న విజేతను చేసినారు. కర్రతో చేసిన దుందుభులారా! మీరు ఇంద్రుని అన్నవిజేతను చేసినారు. మీరు కట్లనుండి విడిపోండి.
(స్తంభపు దుందుభులను విప్పవలెను)
13. నేను సత్యశాసకుడగు సవిత అధీనమున ఉన్న యజమానిని. బృహస్పతి జయించిన అన్నములను గెలిచినాను. అన్నమును జయించు అశ్వములారా! మీరు కల్లోలము కలిగించుచు- యోజములు లెక్క వేయుచు -అంతిమసీమ వరకు చేరండి.
(సిద్ధమైఉన్న రథము మీద యజమాని ఎక్కవలెను)
14. ఈ గుర్రపు మెడ, నడుము, ముఖమునకు పటకాలు కట్టి ఉన్నవి. ఇది కొరడా చూపగానే వేగముగా పరిగెత్తును. నడుపువాని మనసెరిగి నడుచు గుర్రము గుర్తులను బట్టి దారిమీద సాగిపోవును. అశ్వమునకు ఆహుతి.
15. గుర్రము దారిమీద త్వరితగతిని సాగుచున్నది. లక్ష్యము చేరవలెనని ఉరుకుచున్నది. అప్పుడు దానికి ఉన్న పక్షిరెక్కల అలంకరణముల కదలిక స్వచ్ఛముగా కనిపించుచున్నది. ఇది గద్దవలె ఎగిరిపోవుచున్నది. బలము ప్రదర్శించుచు సాగుచున్నది. దానికి గల చామరాది అలంకారముల కదలిక స్పష్టముగా అగుపించుచున్నది -స్వాహా.
16. అశ్వములు యజ్ఞపు ఆహ్వానములందు పరిమిత వేగవంతములు సుందరవర్ణలు. పాములు, తోడేళ్లు, రాక్షసులను తప్పుకొనిసాగునవి. సర్వరోగములను వ్యధలను దూరము చేయునవి. అట్టి అశ్వములు మాకు శుభంకరములు కావలెను.
17. అశ్వములు మా ఆహ్వానమును వినునవి. పరిమితగాములు. వేలధనములు ఇచ్చునవి. యజ్ఞము లందు బహుమూల్యరత్నాదులు ఇచ్చునవి. అట్టి అశ్వములన్నియు మాఆహ్వానములు వినవలెను.
18. అశ్వములారా! మీరు మెతుకు, మెతుకు అందించువారు. ధనము కలిగించువారు. విప్రులు అమృతములు. ఋతజ్ఞులు. మీరు మమ్ము రక్షించండి. ఈ నీవారచరును పానము చేయండి. ఆనందించండి. తృప్తులు కండి. దేవమార్గమున గమ్యము చేరుకొండి.
19. (యజమాని రథముదిగి నీవారచరును మూర్కొనవలెను)
అన్నపు అపార ఉత్పత్తి మాకు లభించవలెను. అనేక రూపముల ద్యావాపృథ్వులు మాకు లభించవలెను. మాతాపితరుల వాత్సల్యము మాకు లభించవలెను. సోమము అమృతమై మాకు లభించవలెను.
అన్నములను గెలుచు- పావనము చేయు- లభించునట్టి అశ్వములారా! మీరు-బృహస్పతి భాగమగు- ఈ నీవారచరును ఆఘ్రాణించండి.
(గుర్రములకు నీవారచరువాసన చూపవలెను)
20. (ఇది సంవత్సరాభిమాని ప్రజాపతి స్తుతి. ఆహుతులు ఇవ్వవలెను)
అందరియందున్న ప్రజాపతికి స్వాహా. అందరకు శుభముల నిచ్చు ప్రజాపతికి స్వాహా. మరల పుట్టునట్టి ప్రజాపతికి స్వాహా. యజ్ఞస్వరూప ప్రజాపతికి స్వాహా. నివాసకారణుడు- దినముల స్వామి- దినములందు, ముగ్ధపదార్థము లందు- వినాశ్యా వస్తువులందు ఉన్నవాడు- అంత్యస్థానమున ఉత్పన్నుడు- భువనములస్రష్ట- భువనస్వామి- జగముల అధిపతి ప్రజాపతికి స్వాహా.
21. యజ్ఞమున ఆయువు కలుగవలెను. ప్రాణము కలుగవలెను. నేత్రములు కలుగవలెను. శ్రోత్రములు కలుగవలెను. వెన్ను కలుగవలెను. యజ్ఞమునుండి యజ్ఞము కలుగవలెను. యజ్ఞమున యజ్ఞపతి కలుగవలెను.
(యజమానియు, అతని పత్నియు మెట్ల మీద నుంచి యూపము ఎక్కవలెను)
మేము ప్రజాపతి ప్రజలము అయినాము.
(గోధుమ పిండితో చేసిన అప్పమును యజమాని తాకవలెను)
దేవతలారా! మేము స్వర్గమునకు చేరుకున్నాము. మేము అమరులము అయినాము.
(యూపము మీది శిరమును తొలగించవలెను)
22. (యూపము మీద ఉన్న యజమానులుదిశలను చూచుచు)
దిశలారా! మీయందున్న బలవీర్యములు మాకు కలుగవలెను. మీయందున్న ధనము, సంకల్పము, అనేక తేజస్సులు మాకు కలుగవలెను. (యూపమునుండి నేలను చూచి) తల్లీ భూమీ! నీకు నమస్కారము. వందనము. (చర్యము మీద ఔదుంబర ఆసనమును ఉంచవలెను) అసనమా! ఇది నీ రాజ్యము. (ఆసనము మీద యజమానిని ఆసీనుని చేయవలెను) యజమానీ! నీవు అందరిని నియమించువాడవు. స్వయముగా నిన్ను నియమించుకొనువాడవు. నీవే ధ్రువమవు ధారకుడవు. నీవు కృషి- వ్యవసాయము- చేయుటకు నిన్ను ఈ ఆసనము మీద ఆసీనుని చేయుచున్నాను. పరిపాలనా లబ్ధికొరకు-ధనము కొరకు -పుత్ర, పశువుల కొరకు నిన్ను ఈ ఆసనము మీద కూర్చుండపెట్టుచున్నాను.





