Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    10. కోరికలు తీర్చు అగ్ని, వాయు, సూర్య, చంద్ర నక్షత్రములను అయిదుగురు దేవతలు ఆకాశమున ఉన్నారు. దేవతలందరు నా స్తుతులను గ్రహించుచున్నారు. తృప్తి చెందుచున్నారు. మరలిపోవుచున్నారు. విత్తంమే అస్యరోదసీ.

    11. సర్వవ్యాపకామగు అంతరిక్షము మధ్యన సూర్యకిరణములు ఉన్నవి. ఈ త్రితర్షి ఆ కిరణముల మార్గమందలి జలమును దాచుచున్నాడు. అతనిని తోడేళ్లు అడ్డగించుచున్నవి. విత్తంమే అస్యరోదసీ. 

    12. దేవతలారా ! మీ బలము అపారము. మీ బలములు నిత్యనూతనము, స్తవనీయము, ఋత్విజులచే కీర్తినీయము. మీ బలముల వలననే నదులు ప్రవహించుచున్నవి. సూర్యుడు వెలుగుచున్నాడు. విత్తంమే అస్యరోదసీ.

    13. అగ్నీ ! నీవు గణనీయుడవు. ప్రసిద్ధుడవు. దేవతలందు బంధుత్వము కలవాడవు. నీవు మాయజ్ఞమందు ఉండుము. పూర్వము మనువు యాగమునకువలె దేవతలను విధిపూర్వకముగ పూజింపుము. విత్తంమే అస్యరోదసీ.

    14. అగ్ని అధిక జ్ఞానవంతుడు. దేవతలలో మేధావి. అతడు పూర్వము మనువు యజ్ఞమునందువలె మా యజ్ఞమున ఆసీనుడు అయినాడు. అగ్ని దేవతలకు అభిముఖముగా హవిస్సులను ఇచ్చుచున్నాడు. విత్తంమే అస్యరోదసీ.

    15. వరుణుడు రక్షించు మార్గమును ఎరుగును. ఆ వరుణుని ప్రార్థింతుము. స్తుతి కర్త మనసా స్తవములను ప్రకటించుచున్నాడు. వరుణుడు ఫలములు ప్రసాదించవలెను. విత్తంమే అస్యరోదసీ.

    16. సూర్యుడు మార్గభూతుడు. స్తుతింపదగినవాడు. ద్యులోకమున ఉన్నాడు. సూర్యుని దేవతలు అతిక్రమింపజాలరు. ఏకత, ద్వితులారా ! మీరు ఎరుగలేక పోయినారు. విత్తంమే అస్యరోదసీ.

    17. బావిలోనికి త్రోయబడిన త్రితర్షి తన రక్షణ కొఱకు దేవతలను పిలిచినాడు. బృహస్పతి ఆ కేక విన్నాడు. త్రితర్షని పాపరూపమున బావినుండి తీసినాడు. మేలు చేసినాడు. విత్తంమే అస్యరోదసీ.

    18. ఒకసారి మార్గమున నడుచుచున్న నన్ను ఎర్రని తోడేలు చూచినది. వీపునొప్పి లేచిన వడ్రంగివలె మీదికి లేచినది. విత్తంమే అస్యరోదసీ.

    మరొక అర్ధము :- మాసములను కలిగించు చంద్రుడు నక్షత్రములను చూచినాడు. నక్షత్రము మీదకు పోవుచున్నాడు.

    19. మేము ఇంద్రుడు గలవారము. పుత్ర పౌత్రులు గలవారము. ఈ స్తోత్రము చదివి శత్రువును తిరస్కరింతుము. ఆ స్తోత్రమును మిత్రుడు, వరుణుడు, అదితి, సింధు, భూమి, ద్యులోకము అర్చించవలెను.

                         (ప్రథమ మండలమున పదిహేనవ అనువాకము సమాప్తము.)

    ఆలోచనామృతము :

    త్రితుని వృత్తాంతము ఇంతకుముందు వచ్చినది. మూడు మూతలు బద్దలుకొట్టి ఇంద్రుడు రక్షించినట్లుగా చెప్పబడినది.

    ఏకతుడు, ద్వితుడు, త్రితుడు ముగ్గురు ఋషులు నిర్జలారణ్యమున ఉండిరి. నీటికై వెదకుచుండగా ఒకబావి కనిపించినది. త్రితుడు మిగిలిన ఇద్దరికి నీరు తెచ్చి ఇచ్చినాడు. వారు ఆ నీరు త్రాగినారు. త్రితుని బావిలోనికి త్రోసినారు. మూతపెట్టి వెళ్లిపోయినారు. త్రితుని తన రక్షణకొఱకు ఈ స్తోత్రమున స్తుతించినాడు.

    ఇందు నిరాశా నిస్పృహలు కనిపించుచున్నవి. ఎందరో దేవుళ్లకు చెప్పుకొని విసిగి భూమికి, ఆకాశమునకు చెప్పుకున్నాడు.

    ఇది అజ్ఞానాంధకారంము నుండి బయటపడుట కావచ్చును.

                  పదునారవ అనువాకము - నూట ఆరవసూక్తము
                  ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు, దేవత - విశ్వేదేవతలు,
                              ఛందస్సు - 1-6 జగతి, 7 త్రిష్టుప్.

    1. ఇంద్రుని, మిత్రుని, వరుణుని, అగ్నిని, మరుద్గణములను మమ్ము రక్షించవలసినదిగా ప్రార్థించుచున్నాము.

    ఇంద్రాది దేవతలు మా ఉనికికి కారణభూతులు. మంచిదాతలు. దుర్గమ ప్రదేశమునుండి రథమును ఉద్దరించినట్లు వారు మమ్ము సమస్త పాపములనుండి రక్షించవలెను. అహం పో విష్పిపర్తన.

    2. అదితి పుత్రులగు దేవతలారా ! సకల శూరులుగల యుద్ధములందు మాకు సాయపడుటకు విచ్చేయుడు. యుద్ధములందు మాకు సుఖములు కలిగించుడు. అహం పో విష్పిపర్తన.

    3. స్తుతి యోగ్యులగు పితృదేవతలు మమ్ము అనాయాసముగ రక్షించవలెను. యజ్ఞమును అభివృద్ధి పరచునట్టి భూలోక, ద్యులోక దేవతలు మమ్ము రక్షించవలె అహం పో విష్పిపర్తన.

    4. అగ్ని నరాశంసుడు. నరులచే స్తుతించబడువాడు. అన్నవంతుడు. అగ్నిని ప్రజ్వలింపచేయుచున్నాము. నుతించుచున్నాము. అట్లే పూషదేవుని ప్రార్థించుచున్నాము అహం పో విష్పిపర్తన.

    5. బృహస్పతీ ! మాకు సర్వదా సుఖము కలిగించుము. రోగశాంతి సాధనమును బ్రహ్మ నీవద్ద ఉంచినాడు. దానిని మాకు ప్రసాదించుము. అహం పో విష్పిపర్తన.

    6. కుత్సుడు నూతిలో త్రోయబడినాడు. అతడు తనను రక్షించవలసినదని శత్రునాశకుడు సర్వకార్యములకు ప్రభువు అయిన ఇంద్రుని పిలిచినాడు. అహం పో విష్పిపర్తన.

    7. అదితి తన పుత్రులయిన దేవతల సహితముగా మమ్ము రక్షించవలెను. సర్వరక్షకుడు సూర్యదేవుడు అప్రమత్తుడయి రక్షించవలెను. ఈ సూక్తమునందలి ప్రార్థనను మిత్రుడు, వరుణుడు, అదితి, సింధువు, పృథ్వి, ద్యులోకము మన్నించవలెను.

                                             నూట ఏడవ సూక్తము

        ఋషి-అంగిరస పుత్రుడు కుత్సుడు, దేవత-విశ్వేదేవతలు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. దేవతల సుఖము యజ్ఞమును చేరవలెను. దేవతలారా ! మమ్ము అనుగ్రహించుడు. ధనమును అధికముగా ప్రసాదించుడు.

    2. అంగిరో ఋషులు స్తుతించిన దేవతలందరు మమ్ము రక్షించవలెను. ఇంద్రుడు ధనమును, మరుత్తులు ప్రాణాది వాయువులను, పుత్రసహిత అయిన అదితి మాకు సుఖములు ప్రసాదించవలెను.

    3. మేము అన్నముల కొఱకు ప్రార్థించినాము. ఇంద్రుడు, అగ్ని, అర్యముడు, సవితృదేవతలు మాకు అన్నములు ప్రసాదించవలెను. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, పృథ్వి, ద్యులోకము ఈ స్తోత్రమును మన్నించవలెను.

                                           నూట ఎనిమిదవ సూక్తము

        ఋషి-అంగిరసపుత్రుడు కుత్సుడు, దేవత-ఇంద్రాగ్నులు. ఛందస్సు-త్రిష్టుప్.


    1. ఇంద్రాగ్నులారా ! మీరు స్తవనీయులు. నీ రథములు లోకములను ప్రకాశింపచేయును. ఆ రథములమీద విచ్చేయుడు. సోమరసము స్వీకరించుడు.

    2. ఈ విశ్వము విస్తారము, గంభీరము. మీరు సేవించు సోమరసము మీ మనసులకు విశ్వమంతటి తృప్తిని ఇవ్వవలెను.

    3. ఇంద్రాగ్నులారా ! మీ పేరులు కలిసి ఉన్నవి. మీరు కలిసి విహరింతురు. కలిసి వర్షము కలిగింతురు. ఇప్పుడు కలిసి వేదికపై ఆసీనులు కండు. సోమరసమును హాయిగా సేవింపుడు.   

    4. అగ్నులు జ్వలించుచున్నవి. అధ్వర్యు, ప్రతిష్ఠాతలు దర్భాసనములమీద కూర్చున్నారు. స్రుక్కులతో ఆజ్య హవిస్సులు అర్పించుచున్నారు. ఇంద్రాగ్నులారా ! వేగముగా రండు. పాత్రలలో సోమము సిద్ధముగా ఉన్నది. మమ్ము అనుగ్రహింపుడు. సేవింపుడు.

    5. ఇంద్రాగ్నులారా ! మీరు కలిసి వృత్రవధాది వీరకృత్యములు చేసినారు. కలిసి అశ్వగోధనములను కల్పించినారు. కలిసి వర్షములు కలిగించినారు. మీ స్నేహము పురాతనము, మంగళకరము, భావసారూప్యత గలది. అట్టి స్నేహ భావమున విచ్చేయుడు. సోమరసమును సేవింపుడు. సోమస్య పిబతం సుతస్య.

    6. ఇంద్రాగ్నులారా ! కర్మలు ప్రారంభించినపుడే మిమ్ము వరించినాము. అప్పుడే మీకు సోమము సమర్పించవలెనని సంకల్పించినాము. మా సంకల్పము సత్యమయినది. శ్రద్ధకలది. ఋత్విజులు సోమము సిద్ధముచేసినారు. విచ్చేయుడు సోమస్య పిబతం సుతస్య.

    7. పూజ్యులగు ఇంద్రాగ్నులారా ! మీ నివాసములందు ఆనందముగా ఉన్నను యజ్ఞస్థలములందు తృప్తులయి ఉన్నను ఏరాజులవద్ద ఉన్నను ఎచ్చటి నుండి అయినను తప్పక విచ్చేయుడు. సోమస్య పిబతం సుతస్య.

    8. ఇంద్రాగ్నులారా ! మీరు యదువులవద్ద, తుర్వశులవద్ద, ద్రుహ్యులవద్ద; పురువంశస్థులవద్ద, అనువంశస్థులవద్ద ఉన్నను మా యజ్ఞమునకు విచ్చేయుడు. సోమస్య పిబతం సుతస్య.

    (యదువు మున్నగునవి యయాతి పుత్రుల పేర్లు. వాటికి వేరు అర్థములు చెప్పినారు. యదు హింసలేని నరులు. తుర్వశు - హింసగల నరులు. ద్రుహ్యులు - ద్రోహులగు నరులు. అనుజ్ఞాతులు. పూరు - కోర్కెలు పూరించువారు.)

    9. ఇంద్రాగ్నులారా ! మీరు దూరమున ఉన్నను, దగ్గర ఉన్నను, ద్యులోకమున ఉన్నను, అంతరిక్షమున ఉన్నను మా యాగమునకు విచ్చేయగలరు. సోమస్య పిబతం సుతస్య.

    10. మీరు ఎక్కడ ఉన్నను విచ్చేయుడు. సోమస్య పిబతం సుతస్య.

    11. ఇంద్రాగ్నులారా ! ద్యులోకమున, భూలోకమున, పర్వతములందు, సస్యములందు, జలములందు ఎక్కడ ఉన్నను వర్షించుచు రావలెను. సోమస్య పిబతం సుతస్య.

`    12. ఇంద్రాగ్నులారా ! మీరు ఉదయభానుని కాంతులచే ప్రకాశవంతమయిన అంతరిక్షమున ఆనందముగా ఉండవచ్చును. అయినను మా యాగమునకు విచ్చేయుడు. సోమస్య పిబతం సుతస్య.

    13. ఇంద్రాగ్నులారా ! మీరు మేము పిండిన సోమరసము సేవించినారు. మాకు సర్వవిధముల ధనములను ప్రసాదించుడు. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రము, భూమి, ద్యులోకము మమ్ము రక్షించవలెను.

                                                 నూట తొమ్మిదవ సూక్తము

        ఋషి-అంగిరస పుత్రుడు కుత్సుడు, దేవతలు-ఇంద్రాగ్నులు, ఛందస్సు-త్రిష్టుప్.


    1. ఇంద్రాగ్నులారా ! నేను జ్ఞాతులను ఎరిగినాను. జ్ఞాతులుకాని వారిని ఎరిగినాను. నాకు గల ఈ బుద్ధి మీరు ప్రసాదించినదే. శ్రేష్ఠమయిన ధనము, అన్నము కొఱకు మిమ్ము ప్రార్థించుచున్నాను.

    2. ఇంద్రాగ్నులారా ! మీరు మేనమామలకంటెను, బావమరదులకంటెను అధిక ధనము ఇచ్చువారని మేము విన్నాము. మీ కొఱకు సోమరసమును, నూతన స్తుతిని రచించుచున్నాను.

    3. ఇంద్రాగ్నులారా ! శత్రువులను హింసించువారు. వారు స్తుతించువారి దరి చేరుదురు. తాడువలె తెగని సంతానమును తాత తండ్రులవంటి తరగని శక్తిగల పుత్రులను పౌత్రులను ప్రసాదించమని యజమాని ఇంద్రాగ్నులను స్తుతించుచున్నాడు.
`   
    4. ఇంద్రాగ్నులారా ! మీరు మంచి అశ్వములు, మంచి భుజములు, మంచి సోమరసమును సిద్ధము చేసినాము. వేగముగ రండు. సోమమును స్వీకరించుడు.

    5. ఇంద్రాగ్నులారా ! మీరు ధనమును ఏర్పరచినవారు. బలవంతులు. వృత్ర సంహారకులు. సర్వము చూడగలవారు. మీరు విచ్చేయుడు. దర్భాసనముపై ఆసీనులు కండు. సోమరసము సేవింపుడు.

    6. ఇంద్రాగ్నులారా ! యుద్ధములకు పిలుపు వచ్చినపుడు మీరు సమస్త నరులకన్న, ద్యులోకముకన్న, జలములకన్న, పర్వతములకన్న, సమస్త భూతములకన్నను మహిమాన్వితులు అగుదురు.

    7. వజ్రహస్తులగు ఇంద్రాగ్నులారా ! మా కర్మలను రక్షింపుడు. మాకు ధనములు ప్రసాదించుడు. ఇంద్రరూపుడగు సూర్యుని కిరణములే మా పితరులకు బ్రహ్మలోకమును ప్రసాదించినవి.

    8. వజ్రహస్తులగు ఇంద్రాగ్నులారా ! మీరు శత్రుపురధ్వంసకులు. మాకు ధనము ప్రసాదించుడు. యుద్ధములందు మమ్ము రక్షింపుడు. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, పృథ్వి, ద్యులోకము మమ్ము రక్షించవలెను.

        నూట పదవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు
        దేవత - ఋభువు. ఛందస్సు -5,9 త్రిష్టుప్, మిగిలినవి జగతి.


    1. ఋభుదేవతలారా ! మేము కర్మలు చేయుచున్నాము. మరలమరల చేయుచున్నాము. మీకు ప్రీతి కలిగించు స్తవములు గానము చేయుచున్నాము. ఈ యజ్ఞమునందు సోమము సముద్రమువలె సమృద్ధముగా ఉన్నది. 'స్వాహా' అని హోమము చేసి సోమముతో తృప్తిచెందుడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.