Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    కర్ర ఊతమీద నడుస్తూంటే ముసలిది ఊగిపోతూంది. లేఖ చేయిపట్టుకుందామని పరుగెత్తింది.
    ముసల్ది వణికిపోతూ వెనక్కు తగ్గి "నేను మాలదాన్ని. అంతరానిదాన్ని" అన్నది.
    మాలది. అంటరానిది. లేఖ ఆమాటలెక్క చేయకుండా ముసలిదాని కాళ్ళమీదపడి మొక్కింది.
    తాను దొంగలించకముందే పట్టుపడింది. అయినా అదీ దొంగతనమే. ఆకలికి అర్ధంతెలియని మేజిస్ట్రేటు తన్నుకూడా జేలుకు పంపిఉండును.
    తండ్రి దగ్గరనుంచి రెండురూపాయలూ అందగానే ముసలిదాని రుణం తీర్చుకోవడానికి సంచిలో కాసిన్నిబియ్యం తీసుకొని వెంటనే మాలగూడెం పరిగెత్తింది.
    ముసల్ధానిజాడ కనిపించలేదు. ఎక్కడా సడీచప్పుడూలేదు. గూడెం పిట్టలేని గూడులా ఉంది. గుమ్మడితీగ చచ్చిపోయింది.
    ముసల్ది చచ్చిపోయి ఉంటుందని లేఖ ఊహించింది. తాను ముసలిదాని రుణం తీర్చుకోలేకపోయినందుకు బాధపడ్డది.
    తాను ఆ ముసలిదాని గుమ్మడిపండు తెంపుదామనుకుంది. అలాంటి ముసలి ప్రాణం పోయింది. తన నేరం వందరెట్లు పెరిగింది అనుకుంది.
    ఒకనాడు లేఖ "బాబూ జేల్లో చాలా కష్టంగా ఉండేదా?" అని అడిగింది.
    "అది భూలోకనరకం. లేఖా! నాకోవిషయం అర్ధంకాకుండా ఉంది. ఖైదీని సంస్కరించి మంచివాణ్ణి చేయడమే కదా జేల్లో ఉంచడంలోని ఉద్దేశం? కాని జేలువాళ్ళు ఖైదీల్తో మహా అసహ్యంగా ప్రవర్తిస్తారు. ఖైదీలు తమను తాము అసహ్యించుకునేంత క్రూరంగా ప్రవర్తిస్తారు."
    "ఎలా?"
    "అందుకు వారు రకరకాల పద్దతులు అవలంబిస్తారు. నిష్కారణంగా తిడ్తారు. అనరానిమాటలంటారు. ఎవడైనా ఎదిరించే ధైర్యం చేస్తే తంతాడు, గుద్దుతారు. పాడు తిట్లన్నీ తిడ్తారు. మానవత్వాన్ని తిరగలిలో వేసి అది పిండిఅయి గాలికి ఎగిరిపోయేదాకా విసురుతారు."
    "జేలు అంటే కంపరం పుట్టేటట్లుచేస్తే మళ్ళీ నేరం చేయరని వారి ఉద్దేశం కావచ్చు."
    "ఆఁ అదే ఉద్దేశం అయివుండవచ్చు. కాని అది వేరేతీరుగా పనిచేస్తుంది. జేలు అంటే ఖైదీకి ఉన్న భయం రోజురోజుకూ రాలిపోతుంది. క్రమక్రమంగా ద్వేషం పెరుగుతుంది. మనిషి పూర్తిగా ద్వేషపూరితుడు అయిపోతాడు. వార్డనును మాత్రమే కాక అతన్ని సిద్దంచేస్తున్న సిద్దాంతంమీద ద్వేషం జనిస్తుంది. ద్వేషం ప్రతిదాన్నీ ద్వేషించడం అలవాటు అవుతుంది."
    కాలూ ముఖం మొద్దుబారిపోవడం లేఖ కనిపెట్టి "బాబూ, చాలు. ఇంకేమీ చెప్పకు" అన్నది.
    "ఎద్దులా పనిచేసే ఖైదీల పదంలో వ్యక్తం అయ్యేబాద నీకు తెలుసా? నుదుటి చెమట చేతికి తీసుకొని 'త్రాగండి. త్రాగండి. మా ఎముకలనూనే త్రాగండి. చేపల్ను వేపండి, కూరల్ను వేపండి' ఇదీ ఖైదీల పదం. ఆ పాట వారి గుండెల్లో ద్వేషబీజాల్ను నాటుతుంది."
    లేఖ అర్ధం చేసుకుంది. ఆ పదం ఆమెను కదిలించివేసింది. అప్పుడప్పుడూ ఆమె ఆ పదాన్ని ఆలాపిస్తూ ఉండేది. అలా ఆలాపిస్తున్నప్పుడల్లా ఆమె ముఖం మండిపోయేది. నాసికాపుటాలు ఉబ్బేవి. 'మా ఎముకలనూనే త్రాగండి.'
    ఆ పదంలోంచి పోరాటం పుట్టింది. దేవాలయం లేచింది. కొత్త దశకు అంకురార్పణం అయింది. పోరాటం తిండికోసంకాదు. ఎదురుదెబ్బ తీయడానికి!
    లేఖ తండ్రి తిరుగుబాటు అంగీకరించింది. అయితే ఇది మంచిమార్గమేనా? అతడు నిజంగా ఎదురుదెబ్బ తీస్తున్నాడా? అనే విషయం తల్చుకున్నప్పుడు ఆమె కలతచెందేది. కలవరపడేది.
    పొట్టకూటికోసం అతనిలో ద్వేషం అంకురించింది. ఆ ద్వేషం ప్రథమపర్యాయం శక్తినీ సంపదనూ సమకూర్చింది. నేడు అతడు సంపన్నుడు. అతడు భౌతిక సంపదనేకాక. పరమశివునికూడా తన ఆస్తిగా చేసుకున్నాడు. అందువల్ల అతనికి ఉన్నతవర్గాల్లో గౌరవం కలిగింది. ఏదో కొందరు అతనికి దూరంగా ఉన్నమాట వాస్తవం. కాని చాలామంది పాత విశ్వాసాల కట్టుగొయ్యకు కట్టుబడినవారే. వారి వెర్ర్రినమ్మకమే వారికి శిక్ష. ఈ మూఢవిశ్వాసాలు, పిచ్చిదాతృత్వమే వారిని దైవద్రోహంలోకి తోసేస్తాయి. సజీవుడైన శివునిలా మృతపాషాణాన్ని పూజించేవారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటి?
    తండ్రికీ తనకూ జరిగిన ద్రోహాలకుగాను పగ తీర్చుకుంటున్న కాలూలో తనకు అర్ధంకానిది ఏదో ఉన్నట్లు అనిపించింది లేఖకు. ఝార్నాలో అయితే వంట వండేది. తండ్రి చిరిగినబట్టలు కుట్టేది. అప్పుడప్పుడూ తాను కమ్మరి అయి నిప్పురవ్వలు లేపుతూంటే కాలూ పుస్తకంలో మునిగి విద్వాంసునిలా పోజుపెట్టేవాడు. అతడు ఎప్పుడైనా చక్కని పనిచేసినపుడు లేఖకు చూపి, ఇదిగో ఇటుచూడు. ఇప్పుడు తెలిసిందా నీ తండ్రి విషయం, అనేవాడు. ఒకసారి లేఖ స్కూలు ప్రగతి నివేదిక తెచ్చింది. రిపోర్టు అంతా బాగానే ఉంది. కాని ప్రవర్తన విషయంలో 'మాటకారి' అని ఉంది. దాన్ని చూచి అతని కళ్ళు చెమక్కుమన్నాయి. అతడు నవ్వుతూ "ఎందుకూ నీస్థానంలో నేనున్నా మాటకారి అనే మాట తెచ్చుకునేవాణ్ణి గంటలతరబడి నోరు కట్టుకొని ఎవరూ కూర్చోగలరు?"
    కూతురంటే అతనికి అంతప్రాణం. మంచి చెడుల్తో సంబంధం లేకుండా ఆమెచేసిందాన్నల్లా బలపర్చేవాడు. నేడు అతనికి ఆమెమీద ఉండే విశ్వాసం పోయింది. అతడు ఆమెమీద ఆధారపడ్డం కూడా పోయింది. తన ఆజ్ఞల్ను అందుకొని యంత్రంలా అనుసరించాలని నేటి మంగల్ అధికారి కోరిక.
    చెమటోడ్చి డబ్బు సంపాదించిన్నాటికంటే నేడు అతడు డబ్బు విషయంలో జాగ్రత్తపడుతున్నాడు. రోజుటి ఆదాయాన్ని లెక్కించి, బిల్లుల  వెనుకా రశీదుల వెనుకా ఏదో గిలుకుతుండేవాడు.
    "నీ పుస్తకాలనుంచి ఊరికేనే లెక్కలు నేర్చుకున్నానా?" అన్నాడు ఒకనాడు అతని కళ్ళల్లో సంతృప్తిగోచరిస్తూ ఉండగా.
    అతడు లెక్కలు నేర్చుకున్నది ఇందుకైతే కాదు. అందుకు కారణం ఆమెకు తెలుసు.
    కాలూ బ్రాహ్మణపాత్రను చక్కగా అభినయిస్తున్నాడు. కులాలూ, వాటి వ్యత్యాసాలూ ఆయనచేతి కీలుబొమ్మలు అయినాయి. అతడూ అలాంటి మూఢ విశ్వాసాల్ను గట్టి పడేయడానికే ప్రయత్నిస్తున్నాడు. అది ఆత్మవంచనకు కవచమా? లేక తాను భుజానికి తగిలించుకున్న జందెం ఆత్మనుకూడా చుట్టివేసిందా?
    ఒకనాటి మధ్యాహ్నం కాలూ  గుడిముందు పచార్లు చేస్తున్నాడు. డొక్క వెన్నుకు అంటుకున్న ఒక ముసలివాడు వచ్చి "బాబూ రెండురోజుల్నుంచి ఆకలితో చచ్చిపోతున్నా. బుక్కెడు అన్నం పెట్టించుబాబూ" అడుగుతూ ఉండగా చేయి బ్రాహ్మడి చేతికి తాకింది. మంగల్ అధికారిలో ఉన్న కాలూ వెనక్కు తగ్గాడు.
    "ఓరి దుర్మార్గుడా! తాకనే తాకావ్. మిట్టమధ్యాహ్నం మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చిందే" అని అరచాడు.
    గేటుదగ్గర నుంచొని ఆ అరుపువిన్న లేఖకు తన తండ్రి రూపంలో ఎవరో ఆగంతకుడు కనిపించాడు.
    అసమ్మతి తెలియపరుస్తున్నట్లు ఆమె వ్యాధిత హృదయం 'బాబూ' అని కేక వేసింది.
    కాలూ గిరుక్కున ఆమెవైపు తిరిగాడు. అతనికి ఆమె బాధలు అర్ధం అయ్యేట్లు లేవు. నీచకులంవాడి చేయి తగలడంవల్ల మైలపడ్డ కాలూ స్నానం చేయాల్సివచ్చింది కదా అని మండిపోతున్నాడు. మంగల్ అధికారిలో ఉన్న కమ్మరి కాలూ ప్రతిక్షణమూ అతన్ని అపవిత్రం చేయడంలేదూ? లేక ఛాయసహితం లేకుండా కాలూ, అధికారిని వదిలిపోయాడా?
    వెంటనే అతనిలో మార్పు వచ్చింది. తానుచేసిన పనికి సిగ్గుపడ్డాడు. రోడ్డువెంట సాగిపోతున్న అన్నార్తున్ని కేకవేసి పిలిచాడు. అతడు కేకవిని ఆగిపోయాడు. కాలూ అతని దగ్గరికి నడిచిపోయి "తమ్ముడూ, ఇతరుల కోపాన్ని లెక్కచేయకూడదు" అని "నీ ఇల్లెక్కడ?" అని అడిగాడు.
    "తప్పునాదే. నాబుద్ధి గడ్డితిన్నది" అని ముసలివాడు ఏడ్చాడు.
    కాలూ ఉద్దేశపూర్వకంగానే అతని నగ్నస్కందం మీద చేయివేసేశాడు.
    తన తప్పు దిద్దుకుంటున్న స్వరంలో "ఆ పరమాత్ముడు అందరినీ ఒకేరకంగా సృష్టించాడు" అని "నీవేంపని చేస్తావు?" అని అడిగాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.