Home » Sri N T Rama Rao » Sri N T Rama Rao Prasangalu


 

మన విధానం......

    నూతన ప్రభుత్వ అధికారాన్ని చేపట్టాక జరుగుచున్న ప్రధమ కలెక్టర్ల సమావేశామిది. ఎన్నికలను, ప్రశాంతంగా, నిష్పాక్షపాటంగా నిర్వహించిన మీకూ, మిగతా ఉద్యోగులకూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేనూ ఒకనాడు ప్రభుత్యోద్యోగినే. ఉత్తమమైన పరిపాలనను ప్రజలకు అందివ్వాలన్నా, వారి ఆశలను తీర్చాలన్నా, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వోద్యోగులకు మధ్య చక్కని సంబంధాలు, సదవగాహన వుండాలని నా నమ్మకం.
    శాంతి భద్రతల నిర్వహణ మన ప్రధాన కర్తవ్యమని మీకందరికీ కూడా తెలుసు. అవి సక్రమంగా వుంటేనే మనం సర్వ శక్తులు వినియోగించి ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించగలం..... అమలు పరచగలం . ప్రజా జీవితాన్ని కలవరపరచే రాజకీయ కుమ్ములాటలు, ముఠాతగాదాలు, మాతోన్మాద అల్లర్లను కఠినంగా అణచివేయాలి. స్వల్ప సంఘటనలను స్వార్ధానికి ఉపయోగించుకుని సంఘ వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టే నకిలీ మత శక్తులను, బూటకపు రాజకీయ శక్తులను ఒక కంట కనిపెట్టి ఉండాలి. పాలనా యంత్రాంగం పాక్షిక ప్రయోజనాలకు దూరంగా వుండాలి. ప్రజల ఆశలను నెరవేర్చటానికి వేళలా సంసిద్దులమై వుంటామని, లక్ష్యశుద్దితో నిష్పాక్షపాతంగా పనిచేస్తామని నిరూపించాలి. పాలనా యంత్రాంగం ఏ పనిచేసినా మానవతా దృక్పధం ప్రతిబింబిచేలా వుండాలన్నది నా అభిమతం. ఎవరికీ ఎప్పుడూ , ఎట్టి భయం లేకుండా వుండే విధంగా శాంతి భద్రతలను కాపాడటానికి జాగ్రత్త వహించాలి. ఆడపడుచులు అర్ధరాత్రైనా నిర్భయంగా నడి వీధిలో వెళ్ళగలగాలి. దుష్ట శక్తులను అరికట్టి, నేరాలు తగ్గించి, పరిపూర్ణమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడానికి చర్యలు తీసుకోవాలి.

            

    1983 జనవరి 9 న హైదరాబాద్, లాల్ బహుదూర్ స్టేడియంలో గవర్నరు సమక్షంలో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం

           

    ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం అశేష ప్రజావాహిని ఉద్దేశించి తమ ప్రభుత్వం ఆశయాల్ని వివరిస్తూ ---


            


    భారత రాష్ట్రపతి శ్రీ బైల్ సింగ్ తో స్నేహ కరచాలనం


            


    భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి తో అభిభాషణం
    ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన ప్రణాళికా ప్రయోజనాలు అట్టడుగున వున్నవారికి చేరలేదని పరిశీలన లో విదితమైంది. గత ప్రణాళికల'లో సాంఘిక , గ్రామీణ రంగాలకు సరైన న్యాయం జరుగలేదు. రక్షిత మంచి నీటి సరఫరా , పారిశుద్యం విద్య, ప్రజారోగ్యం, వైద్యం మున్నగువాటికి ప్రాధాన్యత లేకపోయింది. ఫలితంగా కాలక్రమంలో ప్రజలకో అసంతృప్తి పెరిగింది. మన ప్రణాళికా రూపకల్పన లో మార్పు అవసరమని దీనిని బట్టి విదితమవుతున్నది. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి కాక, పట్టణాల సౌభాగ్యానికి పనికి వస్తున్న ప్రణాళికల పద్దతిని సరిదిద్దే చర్యల గురించి మా ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామీణ మంచినీటి సరఫరా , సార్వజనిక విద్య, ఆరోగ్యం ,  గృహనిర్మాణం , గ్రామీణ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం యిస్తుంది.
    ఇప్పటికీ మన రాష్ట్ర జనాభాలో 80 శాతం గ్రామీణ ప్రాంతాలలో వున్నారు. రాష్ట్రం లలో 27,221 గ్రామాలు, 32,750 పల్లెలు వున్నాయి. అనేక గ్రామాలలో కుండెడు మంచినీళ్ళ కోసం మహిళలు మండు టెండలో మైళ్ళ కొలదీ నడిచి వెళ్ళవలసిన దురవస్థ నేటికీ కొనసాగుతోంది. మంచినీటి సరఫరా సమస్య వున్న 12,269 గ్రామాలలో ఐదవ పంచవర్ష ప్రణాళిక ఆఖరువరకూ 4,063 గ్రామాలకు మాత్రమే మంచినీరు అందివ్వగలిగారు. అరవ ప్రణాళికా కాలంలో 1983 మర్చి ఆఖరు వరకు 3,851 గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా లభిస్తుందని భావిస్తున్నాం. సత్వరం రక్షిత మంచినీటి పధకాలు సమకూర్చవలసిన గ్రామాలు ఇంకా 4,355 వుంటాయి. 1983-84 లో ఈ గ్రామాలకు కనీసం ఒకో జలనిక్షేపాన్నైనా తప్పనిసరిగా సమకూర్చాలి. అందుకు  అనుగుణంగా  పధకాలు రూపిందించి వెంటనే అమలు జరపాలని మిమ్మల్ని కోరుతున్నాను. లేక్కవేసిన గ్రామాలే కాక రక్షిత మంచినీటి సరఫరా అందవలసిన మరికొన్ని ముఖ్యమైన గ్రామాలు కూడా వున్నాయని నే నెరుగుదును. ఈ గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరాకు అనావృష్టి ప్రాంతాల సహాయ నిధులను సకాలంలో ఉపయోగించాలి. అత్యధిక జిల్లాలలో ఈ కార్యక్రమం సంతృప్తి కరంగా వున్నా రెండు మూడు జిల్లాలలో మందకొడిగా వుంది. అన్నింటి వివరాలని మీకు అందజేశాం. కార్యక్రమం మందకొడిగా వున్న జిల్లాలు మనం మరోసారి సమావేశమయ్యే లోగా పనిని వేగిరపరచి ఫలితాలు సాధిస్తాయని విశ్వసిస్తున్నాను.

రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి చాలా తీవ్రంగా వున్నదని మీ అందరికీ తెలుసు. వేసవి రోజులలో ఇది మరీ గడ్డుగా వుంటుంది. కరువు నివారణకు 58 కోట్ల 77 లక్షల రూపాయలు విడుదల చేస్తే 1982 డిసెంబరు ఆఖరు నాటికి 23 కోట్ల 40 లక్షలు మాత్రమే ఖర్చయింది. ఇది చాలా శోచనీయమైన విషయం. ఈ కార్యక్రమాల అమలును ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదని , ఇందుకోసం కేటాయించిన నిధులను ఈ ఆర్ధిక సంవత్సరం ఆఖరు లోగా పూర్తిగా ఖర్చు చేసి తీరాలని చెప్పదలచుకున్నాను. అంతేకాక వేసవి గడ్డు రోజుల నేడుర్కోటానికి మరిన్ని పధకాలను రూపొందించాలి. అవసరమైతే అదనపు నిధుల కోసం అడగాలి. ఈ కార్యక్రమాలను దూపొందించేటప్పుడు , అనావృష్టి ప్రాంతాల సహాయ పధకాలను , సమగ్ర గ్రామీణ అభివృద్ధి పధకాలను , జాతీయ గ్రామీణ ఉపాధి పధకాలను కూడా దృష్టిలో ఉంచుకొని సమన్వయ పరచుకోవాలి. సత్వర చర్యలతో ఈ ఆర్ధిక సంవత్సరం ఆఖరుకు నిధులు పూర్తిగా ఖర్చు అయ్యేలా చూస్తె, కేంద్ర సహాయం లభించే ఇటువంటి పధకాల కోసం భారత ప్రభుత్వం నుంచి అదనపు నిధులు అడగడానికి వీలుంటుంది.
    భూ సంస్కరణలు ఎన్నో సదుద్దేశాలతో ప్రవేశ పెట్టబడినాయి. కాని ఈ అభ్యుదయ కార్యక్రమం నత్తనడకతో అమలు జరుగుతోంది. దీని ఫలితాలు అందుకోసం పెట్టిన ఖర్చుకు ఏ మాత్రం అనుగుణంగా లేవు. 23,942 ఎకరాల మాగాణి భూమిని, 4,18,824 ఎకరాల మెట్ట భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో 568 ఎకరాల మాగాణి, 63,034 ఎకరాల మెట్ట భూమి వ్యవసాయానికి పనికి రాదనీ కలెక్టర్ల నివేదిక ద్వారా తెలిసింది. 1,94.9 ఎకరాల మాగాణి, 32,504 ఎలరాల మెట్ట ఇంకా వివాదగ్రస్తమై వుందని తెలిసింది. అందువల్ల 21,425 ఎకరాల మాగాణి, 3,23,286 ఎకరాల మెట్ట మాత్రమే పేదలకు పంచటానికి లభ్యమైంది. ఇందులో కూడా 1,285 ఎకరాల మాగాణి, 23,483 ఎకరాల మెట్ట యింకా పంపిణీ కాలేదని తెలిసి విస్మయం చెందాను. కనీసం వచ్చే పంటకాలం నుంచైనా సాగు చేయటానికి వీలుగా ఈ భూమిని బలహీన వర్గాలకు వెంటనే పంపిణీ చేయటానికి మీరంతా ప్రత్యెక శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. అనావృష్టి ప్రాంతాల సహాయ పధకాలు, సమగ్ర గ్రామీణ అభివృద్ధి పధకాలు రూపొందించేటప్పుడు ఈ భూములకు నీటి పారుదల సౌకర్యాలు కల్పించటానికి ప్రాధాన్యత యివ్వాలి.
    అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనం అసలైన వారికే అందేలా జాగ్రత్త తీసుకోవాలి. 1982-83 సంవత్సరంలో బలహీన వర్గాల కోసం 2 లక్షల ఇళ్ళ నిర్మాణానికి లక్ష్యం పెట్టుకుని 18 కోట్ల 33 లక్షల రూపాయలు విడుదల చేస్తే 1982 డిసెంబరు ఆఖరు నాటికి, వెయ్యి రూపాయల వ్యయం చొప్పున నిర్మించే ఇల్లు 4,686 ; నాలుగువేల రూపాయల వ్యయం చొప్పున నిర్మించే ఇళ్ళు 57 మాత్రమే పూర్తయ్యాయని తెలిసింది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ఇలా అయితే ఏం ప్రగతి సాధించగలం? ఇళ్ళ స్థలాల కేటాయింపును, గృహ నిర్మాణ కార్యక్రమాన్ని తగినంతగా వేగిర పరచాలి. మురికివాడలలో దౌర్భాగ్యకర వాతావరణంలో కొట్టు మిట్టాడుతున్న నిరుపేదల కోసం అన్ని సౌకర్యాలు గల పక్కా ఇల్లు వుండే కాలనీల నిర్మాణానికి నమూనాలు తయారయ్యాయి. వాటిని మీకు అందజేస్తున్నాను. బడ్జెటు కేటాయింపులు మురిగిపోని విధంగా గృహ నిర్మాణ పధకాలు అమలు జరిగేలా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కట్టిన ఇళ్ళు మన్నికగా, వాటిలో నివసించే ప్రజలకు పూర్తి సంతృప్తికరంగా వుండేలా జాగ్రత్త వహించాలి. ఇంతవరకు మీకు లభించిన అనుభవాలను దృష్టిలో వుంచుకొని ఈ పధకాలలో ఏమైనా మార్పులు అవసరమనుకుంటే నిర్మాణాత్మకమైన సూచనలు చేయవచ్చు. స్థానిక పరిష్టితులను బట్టి అవసరం అనుకుంటే , ఒకో జిల్లా, పధకాలలో కొన్ని మార్పులుండవచ్చు. వీటిని అమలు చేసేటప్పుడు వాటిలో నివసిన్చాబోయే వారితో సంప్రదించాలి.
    నిత్యావసర వస్తువుల ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులో వుండేలా అదుపు చేయటానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. బియ్యం, చక్కర, కిరోసిన్ వంటి వస్తువుల పంపిణీ వ్యవస్థను మెరుగు పరచడమే గాక, వంటనూనెలు, పప్పులు, మిరపకాయలు, చింతపండు వంటి వస్తువుల పంపిణీని విసృతపరచాలని కూడా భావిస్తున్నాం. ధరల అడుపుదల కోసం ప్రభుత్వం ఒక రాష్ట్రస్థాయి కమిటీని కూడా నియమించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి అధ్యక్షతన గల ఈ కమిటీలో వర్తకులు, వినియోగదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కూడా ఇటు వంటి సంఘాలు ఏర్పాటు చేయాలనీ, హోటళ్ళలో సరఫరా చేసే పదార్ధాలతో సహా నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని కోరుతున్నాను. జిల్లా అధికారులు పర్యటనలకు వెళ్ళినపుడు గ్రామాలలోని చవక డిపోలను తనిఖీ చేసి అవి సరిగా, సమర్ధవంతంగా పనిచేసేలా , బలహీన వర్గాల వారికి నిత్యావసర వస్తువులు సక్రమంగా అందేలా చూడాలి. బియ్యం సబ్సిడీ పధకాన్ని సామాన్య ప్రజలకు ప్రయోజనకరమైన రీతిలో రూపొందించే నిమిత్తం కలెక్టర్లు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాను. నిత్యావసరవస్తువుల పంపిణీ మెరుగుపరచి, మర్చి నెలాఖరు నుంచి అమలు పరిచే నిమిత్తం , 5,6 వారాలలోగా కుటుంబాల లెక్కల వివరాలు సేకరించి కొత్త రేషన్ కార్డులు అందజేయాలని నేను ఉత్తరువులు జారీచేశాను. కంట్రోల్ వస్త్రాలను చౌక డిపోల ద్వారా పంపిణీ చేయడానికి కూడా కాల క్రమంలో పధకాలు దూపొందించాలి. సామాన్య ప్రజలకు సరైన వసతి, సరసమైన ధరలకు తిండి, బట్ట సమకూర్చడం మా ప్రభుత్వం కర్తవ్యంగా పెట్టుకుంది.

అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలోని 22 రాష్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలలో 24 వ స్తానాని అక్రమిస్తున్నదని మీ అందరికీ తెలిసే వుంటుంది. ఇది చాలా అవమానకరం. ఈ దురదృష్టకరమైన పరిస్థితి ఇలాగే కొనసాగడానికి వీల్లేదు. నిరక్షరాస్యతలో మగ్గినంత కాలం ప్రజా జీవితానికి తగిన విలువ వుండదు. నిర్భంధ ప్రాధమిక విద్య మన రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలలో ఒకటిగా పొందుపరచబడినప్పటికీ 35 ఏళ్ళ స్వతంత్యం తరువాత కూడా మనం గమ్యానికి చేరువలో లెం. అందువల్ల వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠాశాలలో పిల్లలను - ముఖ్యంగా బాలికలను ఎక్కువగా చేర్పించే కార్యక్రమానికి లక్ష్యాలు నిర్ణయించుకొని విద్యా వ్యాప్తికి ఉద్యమించాలని కలెక్టర్ల ను కోరుతున్నాను. రాష్ట్ర పధకాలను, జాతీయ పధకాలను చేపట్టేటప్పుడు పాఠాశాల భవన నిర్మాణానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. పేద పిల్లలను సరైన విద్యా బోధనతో చైతన్యవంతులను గావించి ఆదర్శ పౌరులుగా తీర్చి దిద్దటం మా ప్రభుత్వ లక్ష్యం. అంతేకాదు వారు ఆరోగ్యవంతంగా వుండటానికి తగిన పౌష్టికాహారం సమకూర్చడం కూడా మా లక్ష్యం. ప్రస్తుతం బియ్యం, పప్పు, నూనెలతో పెడుతున్న మధ్యాహ్న భోజన పధకం స్థానే పాలు, రొట్టె యిచ్చే నూతన ప్రతిపాదన అమలుకు సరైన మార్గాలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను.
    ప్రజా సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పధకాలు మా ఆలోచనలో ఉన్నాయి. ఆ పదకాలన్నింటిని చేపట్టడానికి వనరుల పరిస్థితి ఏమీ సంతోషకరంగా లేదని చెప్పదలచుకున్నాను. అందువల్ల అన్ని స్థాయిలలో పన్నుల వసూళ్ళను కట్టుదిట్టం చేయాలి. కలెక్టర్లు కేవలం భూమిశిస్తు వసూలుకే పరిమితం కారాదు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , మార్కెటు ఫీజు మున్నగు వాటి వసూలును మెరుగుపరచి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచటానికి కూడా ఆసక్తి చూపాలి. చిన్నతరహ పొదుపు ఉద్యమానికి లక్ష్యాలు నిర్ణయించాలి. వనరులను పెంచే ప్రయత్నాలు ఒకవంక సాగిస్తూనే మరోవంక వాహనాలను స్వప్రయోజనాకు వాడకుండా అదుపు చేయడం ద్వారా, ఫోనుల బిల్లులు తగ్గించటం ద్వారా పొదుపును పాటించాలి. ప్రముఖులు జిల్లాలలో పర్యటించేటప్పుడు వారి వెంట వెళ్ళే వాహనాలను తగ్గించడం ద్వారాను, అధిక వ్యయమయ్యే విందులు లేకుండా చూడడం ద్వారాను పొదుపు అమలు చేయాలి. ప్రజా ప్రభుత్వ పనితీరు అన్నివేళలా , అన్ని సందర్భాలలో ప్రజల ఆశలకు , ఆకాంక్షలకు అనుగుణంగా , వుండాలి. పాలనా యంత్రాంగానికి ప్రజలతో సన్నిహిత సంబంధాలుండాలని , మీరంతా సామాన్య ప్రజల గోడు విని వారికి అండదండలుగా వుండాలని , దారిద్ర్య రేఖకు అట్టడుగున వున్న హరిజన గిరిజన వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను. జిల్లా , తాలూకాలలోని పిర్యాదుల విభాగాలను చురుకుగా పని చేయించాలి. ప్రజల ఇక్కట్లను తీర్చటానికి, సత్వర చర్యలు గైకొనాలి. వృద్ధాప్యపు ఫించన్లు, వికలాంగులకు సహాయం బలహీన వర్గాలకు భద్రత మున్నగు విషయాలలో మానవతా దృక్పధం ప్రతిబింబించాలి. వరదలు, అగ్ని ప్రమాదాలు మున్నగు వైపరీత్యాల సమయంలో సహాయ కార్యక్రమాల ఫలితాలు నిజమైన బాధితులకే అందేలా చూడాలి. సహాయ కార్యక్రమాలు బహుళార్ధ ప్రయోజనకారులుగా శాశ్వత ప్రాతిపదికపై రూపొందించబడాలి. చిత్తశుద్దితో ఉద్యోగ ధర్మానికి అంకితం కావడమే దీన్ని సాధించే మార్గం అని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారి పట్ల మర్యాదతో వ్యవహరించాలి. ప్రజలకు ముఖ్యంగా ఆర్తితో వచ్చినవారికి వెంటనే సాయమండించాలి. వారి కష్టాలు తొలగించాలి. అన్యాయాన్ని నివారించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో క్రమశిక్షణ ప్రతిబింబించాలి.
    అక్రమ నిల్వలు నిరోధించాలి. దొంగ వ్యాపారాన్ని అరికట్టాలి. భాధ్యతా యుతమైన పదవులలో వున్న అధికారులు తాము ప్రజా సేవకులనుని గుర్తించాలి. అవసరం కొద్ది వచ్చే ప్రజలతో అక్రమ మార్గాలలో , లంచ గొండితనంతో వ్యవహరించటం ప్రజా పరిపాలనకే మాయని మచ్చ. ఇటువంటి పద్దతులను ప్రభుత్వం ఎన్నడూ సహించదు. పరిపూర్ణమైన పటిష్ట మైన నిఘాతో ఇటువంటి శక్తులను ఏరివేసి, పాలనా యంత్రాంగాన్ని పరిశుద్ధం చేయాలని కోరుతున్నాను. అధికారమంటే అహంకారం కాదని పాలనా యంత్రాంగంలో వున్న ప్రతి ఒక్కరు గుర్తించాలి. తాము ఆదర్శంగా వుండి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయగలగాలి. తుష్టితో, పరిపుష్టి తో ఆనంద నిలయంగా విలసిల్లె లా ఆదర్శవంతమైన రాష్ట్రంగా రూపొందేలా మీరంతా కృషి చేయాలని కోరుతున్నాను.

    1983 జనవరి 23 న హైదరాబాద్ లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో 

 




Related Novels


40 Years of TDP

Sri N T Rama Rao Prasangalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.