Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    "ఆచార్యా! పక్షిని చూచుచున్నాను."
    "ధర్మరాజా! నీకు పక్షి శిరసు కనిపించుచున్నది అన్నావు. నేను కనిపించుచున్నానా? పరిసరములు కనిపించుచున్నవా? భీమార్జునులు మున్నగు నీ సోదరులు కనిపించుచున్నారా?"
    "ఆచార్యా! పక్షి కనిపించుచున్నది. పరిసరములు కనిపించుచున్నవి. మీరు కనిపించుచున్నారు. నా తమ్ములు కనిపించుచున్నారు."
    "ధర్మరాజా! నీవు వ్యర్దుడవు. నీ దృష్టి చెదరినది. నీవు పక్షిని కొట్టలేవు. అని ధర్మరాజును పంపించినాడు.
    ద్రోణుడు ధర్మరాజు తరువాత రాజకుమారులను ఒకరి తరువాత ఒకరిని పిలిచినాడు. అందరిని ధర్మరాజు అడిగినట్లే అడిగినాడు. అందరు ధర్మరాజువలెనె సమాధానము చెప్పినారు. అందరిని "నీవు వ్యర్దుడవు నీ దృష్టి చెదరినది. నీవు పక్షిని కొట్టలేవు" అని పంపించినాడు.
    అప్పుడు ద్రోణుడు అర్జునుని పిలిచినాడు. బాణము ఎక్కు పెట్టుమన్నాడు. అర్జుండు ఎక్కు పెట్టినాడు.
    రాజకుమారులందరు రెప్పవాల్చక చూచినారు. చెవులు రిక్కించుకొని విన్నారు.
    ద్రోణుడు అర్జునుని అడిగినాడు :-
    "అర్జునా! కొమ్మ కొననున్న పక్షిని చూచుచున్నావా?"
    "ఆచార్యవర్యా! నాకు పక్షి శిరసు మాత్రము కనిపించుచున్నది."
    "అర్జునా! నీవు పక్షి శిరసు కనిపించుచున్నది అన్నావు. నేను కనిపించుచున్నానా? పరిసరములు కనిపించుచున్నావా? ధర్మరాజుదులగు నీ సోదరులు కనిపించుచున్నారా?"
    "ఆచార్యవర్యా! నాకు పక్షి శిరస్సు మాత్రమే" కనిపించుచున్నది. మీరు కనిపించుట లేదు. పరిసరములు కనిపించుట లేదు. ధర్మరాజదిసోదరులు కనిపించుటలేదు.
    ద్రోణుడు అర్జునుని మాటలు విన్నాడు. ఆనందమున తబ్బిబ్బఅయినాడు. అయినను వెల్లడికానివ్వలేదు. రాజుమారులను చూచినాడు. అందరు అటువైపే చూచున్నారు. చీమ చిటుక్కుమన్న వినిపించెడి మౌనము వహించినారు.అప్పుడు ద్రోణుడు పలికినాడు. అతని ధ్వని పరిసరములందు ప్రతిధ్వనించినది.
    "అర్జునా!" ద్రోణుని కనులు చెమ్మగిల్లినవి. "నీవు ఏకాగ్రత కలిగి ఉన్నావు." ద్రోణుడు గొంతు జీరపోయినది. "నీ గురి తప్పదు. బాణము కొట్టుము" అన్నాడు.
    అర్జునుడు బాణము విడిచినాడు.
    "భాసము" తలతెగినది నేలకూలినది.
    ద్రోణుడు పొంగిపోయినాడు. అర్జునుని కౌగలించుకొనివలెనుకున్నాడు. దుర్యోధనాదులను చూచినాడు. నిగ్రహించుకున్నాడు. అనందాశ్రువులతో ఆశీర్వదించినాడు.
    పాండవుల గుండెలు పొంగినవి.
    కౌరవుల గుండెలు కుంగినవి.
    మరోకనాటి మాట. ద్రోణుడు రాజకుమారులను వెంట బెట్టుకున్నాడు. గంగానదికి వెళ్ళినాడు. ద్రోణుడు గంగలోనికి దిగినాడు. మహా నియమవంతుడు అయినాడు. స్నానము చేయుచున్నాడు. ఒక మొసలి వచ్చినది. ద్రోణుని పిక్క పట్టినది. ద్రోణుడు రాజకుమారులను పిలిచినాడు. వారందరు ధనుర్భాణములు ధరించి వచ్చినారు. ద్రోణుని బాధ చూచినారు. మొసలిని చూడలేకపోయినారు. బాణము వేయలేకపోయినారు. తలలు వంచుకున్నారు. వెనుకంజ వేసినారు.
    అందరు విఫలులు అయినారు.
    అప్పుడు అర్జునుడు ముందుకు వచ్చినాడు. బాణము సంధించినాడు. నీటిలోనికి విడిచినాడు. అట్లు అయిదు బాణములు విడిచినాడు. మొసలి ద్రోణుని పిక్క వదలినది. చచ్చినది. నీటి మీద తేలినది.
    ద్రోణుడు దుర్యోధనాది కౌరవులను చూచినాడు. వారి ముఖములు మాదినవి. తలలు వంచుకున్నారు. ద్రోణుడు ధర్మరాజాది పాండవులను చూచినాడు. వారి ముఖములు విప్పారినవి. వెలుగుచున్నవి.
    ద్రోణుడు ఎంతో సంతసించినాడు. ద్రుపదుడు బంధు జన సహితముగా పట్టుపడినాడనుకున్నాడు. అతడు అర్జునునకు మరిన్ని రహస్యములు ఉపదేశించినాడు.

                                                            ఆలోచనామృతము


1. ద్రోణుడు హస్తినకు రాకముందరి విద్యకు వచ్చిన తరువాత విద్యకు అనంత భేదము గోచరించుచున్నది. అంతకు ముందు భీముడు బలవంతుడు. అతనిది దేహబలము. దేహబలమున మిగిలిన వారిని భయపెట్టినాడు గెలిచినాడు.
    ద్రోణుడు రంగమున ప్రవేశించినాడు. అతడు బుద్ది బలమును ప్రవేశపెట్టినాడు. బుద్దిబలము దేహబలమును మించినది. అందుకే ఆస్థానమున స్థానము లభించినది.
2. ద్రోణుడు గురుకులమున క్రమశిక్షణ నెలకొల్పినాడు. అంతకుముందు భీముని చంపుటకు అనేక ప్రయత్నములు జరిగినవి. అటు తరువాత అట్టి ప్రయత్నములు జరుగలేదు. అది ద్రోణుడు ఏర్పరచిన క్రమశిక్షణకు గుర్తు.
3. ద్రోణుడు ద్రుపదుని వద్దకు తిండి కొఱకు వెళ్ళినాడు. అది దొరకలేదు. అవమానము లభించినది. అవమాన మనస్కుడయి హస్తిన చేరినాడు. అతని దారిద్ర్యము తీరినది. ఆచార్య పదవి లభించినది. గౌరవము పెరిగినది. కీర్తి వ్యాపించినది. అనేక దేశముల రాకుమారులు అతని గురుకులమున చేరినారు.
    అప్పుడు ద్రోణునిలో ప్రతీకార జ్వాల చెలరేగినది. ద్రుపదుని ఓడించవలె. అతని తల నేలకు వేయించవలె . అట్టి సమర్దునికై వెదకినాడు. అతనికి అర్జుండు కనిపించినాడు.
4. విద్య అందరకు అందునది కాదు. అది ఏ కొందరికో అబ్బునది. మంచి ఆచార్యుడు దొరుకుట దుర్లభము. అట్టివాడు కౌరవ పాండవులకు లభించినాడు.
    ఆచార్యుడు అందరికీ సమానముగా బోధించెను. అందరికి సమానముగా విద్య రాదు. విద్య దానిని గ్రహించువానిపై అధారపడును. అందుకు ఏకాగ్రత, లక్ష్యశుద్ధి, క్రమ శిక్షణ అవసరము.
    ఒకే రకమగు వర్ద్ష బిందువు కొండ, కొనలపడి వృధా యగును. "ఆ నీరమే శుక్త్రీలో పడి మణిత్వముగాంచు" నీరు ఒక్కటే అయినను అందుకొను స్థానమును బట్టి విలువ మారును."
    అర్జునుడు అందరితో బాటు విద్య నేర్చుకున్నాడు. అయినను అతనిలో ఆసక్తి ఎక్కువ. అందుకు నిదర్శనము చీకటిలో బాణములు వేయుట.
    అర్జునునకు ఏకాగ్రత ఎక్కువ. అందుకు నిదర్శనము పక్షిని చూచుట - కొట్టుట.
    అర్జునునకు లక్ష్య శుద్ధి ఉన్నది. అందుకు నిదర్శనము . అతడు నీటిలోనికి బాణములు కొట్టి మొసలిని చంపుట.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.