Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
ముప్పది ఎనిమిదవ అనువాకము
ఋషుల మంత్రస్తుతులను - మానవుల యజ్ఞాదులను ఇంద్రుడు అందుకొనుచున్నాడు. అట్లయి అతడు మహా బలవంతుడైనాడు. అతనిని ఎదిరించగలవారు లేక పోయినారు.
ఉపయామగృహీతోసేన్ద్రాయత్వాషోడశిన ఏషతే యోని రిన్ద్రాయ త్వా షోడశినే
(అర్థమునకు పూర్వమంత్రపు 3,4 పరిచ్ఛేదములు.)
ముప్పది తొమ్మిదవ అనువాకము
ఇంద్రా! నీవు అందరను మించిన బలవంతుడవు. రమ్ము. సోమము అభిషుతమై ఉన్నది.
సూర్యకిరణములు జలమును పీల్చును. సూర్యుని ఆవరించును. అట్లే ఇంద్రియశక్తి ఇంద్రుని ఆవరించును గాత.
"ఉపయామగృహీతోసేన్ద్రాయత్వాషోడశిన ఏషతే యోని రిన్ద్రాయ త్వా షోడశినే"
నలుబదవ అనువాకము
ఇంద్రా! ఈ భూమండలము సకల ప్రాణులకు అభిముఖముగా ఉన్నది. అది నిన్ను ఉపరి స్థానమున నిలుపును గాత.
భూమీ! అస్మైస్యోనా సుషదాభవ - ఈ ఇంద్రునకు సుఖప్రదవు, మంగళనివాసమవు అగుము. యజమానికి విశాల సుఖములను కలిగించుము.
"ఉపయామగృహీతోసేన్ద్రాయత్వాషోడశిన ఏషతే యోని రిన్ద్రాయ త్వా షోడశినే"
నలుబది ఒకటవ అనువాకము
మహాగం ఇన్ద్రో వజ్రబాహు షోడశీ శర్మయచ్చత. మహేంద్రుడు వజ్రబాహువు. పదహారు శస్త్రస్తోత్రములవాడు. అతడు సుఖములను ఇచ్చును గాత.
స్వస్తినో మఘవా కరోతు హన్తు పౌప్మానం యో అస్మాన్ద్వేష్టి.
మఘవుడు మాకు శుభములు కలిగించును గాక. మమ్ము ద్వేషించు పాపములను హతమార్చునుగాక.
ఉపయామగృహీతోసేన్ద్రాయత్వాషోడశిన ఏషతే యోని రిన్ద్రాయ త్వా షోడశినే.
నలుబది రెండవ అనువాకము
ఇంద్రా! నీవు వృత్రహంతవు. శూరుడవు. ప్రీతియుక్తుడవు. మరుత్సహితుడవు. విద్వాంసుడవు. నీవు యజమాని నిష్ఠను ఎరుంగుము. సోమపానము చేయుము. మమ్ము చంప దలచిన శత్రువును చంపుము. ఇతర శత్రువులను దూరము చేయుము. మమ్ము సర్వత్ర నిర్భయులను చేయుము.
"ఉపయామగృహీతోసేన్ద్రాయత్వాషోడశిన ఏషతే యోని రిన్ద్రాయ త్వా షోడశినే"
నలుబది మూడవ అనువాకము
(37 నుండి 42 వరకు గల అనువాకము ఆరణ్యకములు. వానిని తొలగించిన ఇది 37 వ అనువాకము అగును.)
(ఈ అనువాకమునందు దక్షిణ చెప్పబడుచున్నది.)
1. సూర్యుడు అగ్ని వంటివాడు. అతడు జగములను చూచును. అందుకని అతని కిరణములు పైన వ్యాపించి ఉన్నవి.
2. అతడు చిత్రవర్ణుడు. మిత్రుడు, వరుణుడు, అగ్నికి నేత్రమైనవాడు. అతడు కిరణ సేనాయుతుడై ఉదయించుచున్నాడు. అతడు సూర్యుడు. సకల స్థావర జంగమాత్మక లోకములకు ఆత్మవంటివాడు. అతడు ముల్లోకములందు వ్యాపించి ఉన్నాడు.
(దక్షిణగా ఈయదగిన హిరణ్యమును మూటకట్టి గార్హ పత్యాగ్నియందు హోమము చేయవలెను.)
3. అగ్నీ! ధనము కొరకు మమ్ము సన్మార్గమున నడిపించుము. స్వామీ! నీవు సకల మార్గములు తెలిసిన వాడవు. మానుండి పాపములను దూరము చేయుము. నీకు మంచి స్తుతులచే గొప్పగా నమస్కరించుచున్నాము.
(అగ్నీధ్రుని వద్దకు వచ్చి దాక్షిణ హోమము చేయవలెను.)
4. హిరణ్యమా! ఆకసము వైపుసాగుము. స్వర్గమును చేరుము.
(హిరణ్యమును హోమ కుండమునుండి బయటకు తీయవలెను.)
5. దక్షిణ హిరణ్యమా! నీవు తొలుత హోమము చేయబడినావు. మరల తీయబడినావు. దక్షిణ వేదియందున్న నీవు ఎంతో కమనీయముగ ఉన్నావు.
(బంగారమును తీసికొనవలెను.)
6. దక్షిణహిరణ్యమా! స్వర్గమునందున్న వాడును, సర్వజ్ఞుడును అగు తుధదేవత మిమ్ము విభజించును గాత.
(ఋత్విజులకు ఇచ్చు బంగారు భాగములను విభజించవలెను.)
7. అగ్నీ! నీవు సమృద్ధికి కారణమవు అగుదువు. సోమయాగమునందు ఈ ద్రవ్యము లభించినది.
యజ్ఞపరుషుడు సన్మార్గగామి. అతడే నడిపించుచున్న సువర్ణాదులారా! సత్యమార్గమున పయనించండి.
(ఇది దక్షిణలిచ్చు మంత్రము. 2. దక్షిణగా ఇచ్చినది సదుపయోగము కావలెననుట.)
8. నేను యజమానిని. అత్రిగోత్రమున పుట్టిన బ్రాహ్మణునకు హిరణ్యము ఇచ్చెదను. అతనిని సంతోషపెట్టెదను.
దక్షిణ అందుకొను బ్రాహ్మణుడు వేదార్థవేత్త. వేదార్థవిదుని పుత్రుడు - పితృశిక్షణ కలవాడు - పతివ్రత పుత్రుడు - దక్షిణకు అర్హుడు అయి ఉండవలెను.
9. యజమానీ! సువః విపశ్య - స్వర్గమును చక్కగా చూడుము. అంతరిక్షమ్ విపశ్య. సదస్యైః యతస్వ - సభవారిని అనుసరించుము.
(యజమాని సభను చూడవలెను.)
10. దక్షిణ హిరణ్యాదులారా! మేము మిమ్ము ఇచ్చుచున్నాము. మీరు దేవస్వరూపులు కండి. ఋత్విజులందు చేరండి.
గోవులారా! మీరు మధుర క్షీరవతులు కండి. పరలోకమందు యజమానిగ రూపాంతర మొందండి. మమ్ము విడువకండి. దేవయాన మార్గమున వెళ్లండి. అచట పుణ్యాత్ముల స్థానములందు ఆసీనులు కండి.
తవ్న స్పగంస్కృతమ్. ఆ స్థానము మాకొరకు అలంకరించబడినది.
నలుబది నాలుగవ అనువాకము
1. దాతయగు బ్రహ్మయు, సవితయు, నిధిపతియగు ప్రజాపతియు, అగ్నియు, త్వష్టయు, విష్ణువును మా హవిస్సులను అందుకుందురుగాక. ఈ ఆరుగురు దేవతలు యజమాని సంతానముతో ఆడుకొనుచు, యజమానికి ధనసమృద్ధి కలిగింతురుగాక.
(తొమ్మిది మారులు ఈ తొమ్మిది మంత్రములతో ఆహుతులు అర్పించవలెను.)
2. ఇంద్రా! నీ మనసు కరుణామయము. మాకు గోవులను ప్రసాదించుము. మమ్ము హోత్రాది విద్వాంసులతో కలుపుము. మాతో దేవతల కర్మలు చేయించుము. యజ్ఞ సంబంధులగు దేవతల అనుగ్రహము కలిగించుము.
3. మేము దేవతల అనుగ్రహము కలవారలము అయినాము. అట్లయి బలము, క్షీరాదులు, శోభన శరీరము, శ్రద్ధగల మనసు గలవారలమైనాము. త్వష్ట ఈ యజ్ఞమును స్వీకరించునుగాక. కోరిన ధనమును ప్రసాదించును గాత. మాదేహములను శుద్ధము చేయునుగాక. పాపములను దూరము చేయును గాత.
4. అగ్నీ! ఈనాడు - ఈ యాగస్థలమున - ఈ యజ్ఞము జరుగుచుండగా నిన్ను హోతగా వరించినాము. నీవు యజ్ఞమును సమృద్ధముగా నిర్వర్తించినావు. యజ్ఞమును ఎరిగినావు. విఘ్నశాంతి చేసినావు. ఇక మా శ్రద్ధను గ్రహించుము. మాయజ్ఞమును స్వీకరించుము.
5. దేవతలారా! మీరు మమ్ము కరుణించినారు. వచ్చినారు. ఆసీనులయినారు. పురోడాశములు ఆరగించినారు. సోమపానము చేసినారు. వెళ్లినారు. మీ ఆసనములు మాకు దక్కినవి. అస్మేధత్త వసవో వసూని - దేవతలారా! మాకు సంపదలు కలుగ చేయండి.
6. అగ్నీ! నీవు దేవతలను ఆహ్వానించినావు. వారు హవిష్కాములు. విచ్చేసినారు. వారిని ఆసీనులను చేయుము.
దేవతలారా! మీరు రథముల మీద వచ్చినారు. హవిస్సును వహించుచున్నారు. పోషించుచున్నారు. మీరు ఆదిత్యుని నుండి రండి. స్వర్గము నుండి రండి.
7. యజ్ఞమా! యజ్ఞార్థము యజ్ఞస్వరూపుడగు విష్ణువును చేరుము. యజ్ఞఫలమును ఇచ్చుటకు యజ్ఞపతిని చేరుము. నీవు యోని భూతమగు కర్మను చేరుము. స్వాహా.
8. అగ్నీ! నీవు యజ్ఞస్వామివి. ఈ యజ్ఞము స్తోత్రసహితము ఋత్విజ సహితము - స్వాహా.
9. దేవతలారా! మీకు వచ్చిన మార్గము తెలియును. యజ్ఞము ముగిసినంత ఆమార్గముననే తిరిగి వెళ్లండి.
మనస్పతివగు దేవరా! మాయజ్ఞమును హవిర్భోక్తలగు దేవతలకు అందించుము. స్వాహా. వాగ్దేవతకు అందించుము - స్వాహా. తదుపరి క్రియా ప్రవర్తకుడగు దేవతకు అందించుము.
నలుబది అయిదవ అనువాకము
(అవభృధము చెప్పబడినది.)
1. వరుణరాజు సూర్యుని కొరకు నిరాధార అంతరిక్షమున విశాల మార్గమును ఏర్పరచినాడు. మాకు సహితము అడుగు - మోపుటకు దారి కల్పించును గాత. నిందకుడు, బాధించు శత్రువు సహితము మాకు దారి ఇచ్చునుగాక.
(యజమానాదులు వేదినుండి బయలుదేరవలెను.)
2. వరుణరాజా! నీవద్ద వందలవేల ఉపద్రవ నివారకులు ఉన్నారు. నీ బుద్ధి ఆదరయుక్తము. సర్వకాలీనము. అనుగ్రహయుతము. ఆ బుద్ధియందు మమ్ము చేర్చికొనుము. మా శత్రువులను బాధించుము. యజ్ఞవిఘాతి రాక్షసిని పారద్రోలుము. మమ్ము పాపవిముక్తులను చేయుము.
3. అభిష్ఠితో వరుణస్య పాశో - వరుణపాశము వదిలినది.
(యజమానాదులు వేదినుండి సాగవలెను.)
4. అగ్నిముఖము జలములందు చేరినది. అపాంనపాతాగ్నీ! ఇంటింట అసురులు చేయు విఘ్నములను మాన్పుము. యజ్ఞములను రక్షించుము. జ్వలన సాధనమగు ఆజ్యమును అందుకొనుము. నీనాలుక ఆజ్యమును అందుకొనుటకు ఆరాటపడును గాత.
5. జుహువా! నీ హృదయము సాగరమంతటి నీట చేరును గాత. ఋజీష రూపములగు ఓషధులు, జలములు నీయందు చేరును గాత.
యజ్ఞపతీ! నీ యొక్క యజ్ఞ హవిస్సులచే దేవతలను సంతృప్తులను చేసినాము. సూక్తవాక, నమోవాక ఫలమును నీకు కలిగించినాము.
(యజమానాదులు స్రుచమును నీట వేయవలెను.)
6. అవభృధాత్మక వరుణరాజా! నీవు రాక్షస నివృత్తికి మహారావము చేయుచున్నావు. నీవు నిగూఢముగ సంచరించువాడవు. మేము దేవతలకును, ఋత్విజులకును అపరాధములు చేసి ఉండవచ్చును. వానిని దేవతలతోను, ఋత్విజులతోను మన్నింపచేయుము. మహా హింసల నుండి మమ్ము పాహి.
7. సుమిత్రాన ఆప ఓషధయః జలములు, ఓషధులు మాకు మంచి మిత్రులు కావలెను. మమ్ము ద్వేషించు వారికిని - మేము ద్వేషించువారికిని జలములు, ఓషధులు దుష్టమిత్రులు కావలెను.
(దోసిలితో నీరు తీసుకొని పడమటి దిక్కున విడువ వలెను.)
8. జలములారా! వరుణరాజు మీ గర్భములందు ఉన్నవాడు. కావున మిమ్ము సంతోషపెట్టుటకు వరుణ దేవునకు హవిస్సులు అర్పించినాము. అతనికి పుష్టియు తుష్టియు కలిగించినాము. వరుణుడు మా అనుష్ఠానమును గురించి దేవతలకు తెలియపరచును గాత.
9. వరుణపాశము విడిపోయినది. వరుణపాశము నశించినది.
(యజమాని నీట చేరవలెను.)
10. సమిధా! నీవు అభ్యుదయ కారణమవు. కాంతి సాధనమవు. మేము వర్థిల్లినాము. మాకు కాంతి కలుగచేయుము.
నేను జలములందు అవభృథమును ఆచరించినాను. ఫలములు కలవాడను అయినాను. క్షీరాది సమృద్ధి కలవాడను అయినాను. వచ్చినాను. నాకు బలములను ఇమ్ము.
(యజమాని ఆహవనీయాగ్ని యందు సమిద వేసి అగ్ని వద్ద ఉండవలెను.)
సోమయాగము సమాప్తము
నలుబది ఆరవ అనువాకము
(యాజ్యాపురోనువాకములు.)
1. అగ్నీ! నేను మర్త్యుడను. మంచి మనసున్నవాడను. నిన్ను అమర్త్యునిగా ఎరిగినాను. ఆహ్వానించుచున్నాను. మాకు పుత్ర పౌత్రులనిమ్ము. కీర్తి కలిగింపుము. అగ్నే అమృతత్వ మశ్యామ్. అగ్నీ! మేము అమృతత్వమును అందుకొందుము. (ఇది పురోనువాక్యము.)
2. జాతవేద అగ్నీ! నీవు మంచి కర్మల యజమానులకు ఉన్నత స్థానములు కల్పించుచున్నావు. అందువలన వారు అశ్వవంతులు, పుత్రవంతులు, వీరవంతులు, గోమంతులు, ధనవంతులు అగుచున్నారు. (ఇది యాజ్య.)
3. బలపుత్ర ఇంద్రా! సుఖముల నిచ్చు స్తుతులన్నియు నీయందే ఉన్నవి. ఒక్కటి సహితము నిన్ను అతిక్రమించుట లేదు. (ఇది పురోనువాక్య.)
4. ఇది సోమయాగము. ఇందలి శస్త్రము - శస్త్రము నందలి సోమము ఇంద్రుని ఆనందపరచిన ఈ యజమాని, యజమానులందు నేర్పరి. ఇతడు కొడుకు వంటివాడు. ఇంద్రుడు తండ్రి వంటివాడు. ఇంద్రుడు శత్రు సంహారకుడు కదా! అందువలన కొడుకు తండ్రిని - కాపాడమని పిలిచినట్లు - యజమాని ఇంద్రుని కేక వేయుచున్నాడు. (ఇది యాజ్య.)
5. జాతవేదాగ్నీ! నీవు తేజస్సున ఎంతో వెలుగుచున్నావు. నీవు యజ్ఞ స్థానమునందలి రాక్షసులను సంహరించువాడవు. దేహమునందలి అంతర వ్యాధులను అంతమొందించువాడవు. మాకు బలము కలిగించుము. (ఇది పురోనువాక్య.)
6. 45 - 10 చూడండి.
7. జాతవేదాగ్నీ! నీవు లోకస్థితి కారకుడవు. ధనపతివి. తేజోధనుడవు. కావున మమ్ము సహితము నీ అనుగ్రహ బుద్ధియందు ఉంచుకొనుము. (యాజ్య.)
8. ప్రకాశమాన అగ్నీ! ధనములందు శ్రేష్ఠ ధనములకు నీవు అధిపతివి. కావున నిన్ను అన్ని యజ్ఞములందు సంతోష పెట్టుచున్నాను. మేము అన్నము కోరువారలము. నీ దయ వలన అన్నము పొందుచున్నాము. శత్రుసేనలను ఛేదించగలవారలమగుదుము. (పురోనువాక్య.)
9. అగ్నీ! నీవు అన్నమును అధికముగ ఇచ్చువాడవు. నీవు స్తోత్రములచే స్తుతించబడుచున్నావు. యజ్ఞకర్తలు నిన్ను వర్థిల్ల చేయుచున్నారు. మాకు మంచి బలము నొసగుము. (యాజ్య.)
10. అగ్ని మాకు పరిచారకులను ప్రసాదించును గాత. శత్రువులను దునుమాడుచు అగ్రగామి అగును గాత. శత్రువులను హింసించి జయించును గాత. మేము అన్నదానము చేయుటకు ఇతరుల అన్నము అందించును గాత. (యాజ్య.)
11. తొలి అగ్ని మలి అగ్నితో కలిసి మండిపోవుచున్నాడు. అగ్ని విద్వాంసుడు. గృహములకు యజమాని వంటివాడు. ధగ ధగ మండుచు పడుచువాడై ఉన్నాడు. అతడు హవ్యవాహనుడు. జుహువు నోటివాడు.
12. తొలి అగ్నీ! నీవు తరువాతి అగ్నితో కలిసినావు. జాజ్జ్వల్యమానముగ ప్రకాశించుచున్నావు.
అగ్నీ నీవు విప్రులకు విప్రుడవు, మిత్రులకు మిత్రుడవు అగుచున్నావు.
13. ఉదగ్నే శుచయన్తవ విజ్యోతిషా - అగ్నీ! నీ కాంతులు పరిశుద్ధములు. అవి పైపైకి ఎగయుచున్నవి.
శ్రీమదాంధ్రవచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
మొదటి కాండమునందలి నాలుగవ ప్రపాఠకము సమాప్తము.





