Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    కాలూ జందెం బొటనవ్రేలుకు చుట్టుకొని వణికిపోతున్న చేతిని పొట్టమీద పెట్టుకున్నాడు.
    బ్రాహ్మడి పవిత్ర చిహ్నం అయిన తొమ్మిదిపోగుల తెల్లని సరికొత్తజందెం కాలూ బుజానవ్రేలాడుతూంది. అదివేసుకోవడమే ఒక నైతికపోరాటం. నిన్నటివరకూ నీచకులంలో ఉండి, నేడు అత్యున్నత వర్గం నటించడమే పెద్దమోసం. వంగదేశంలో నేటివరకూ ఎవడికీ అంతధైర్యం కలుగలేదు. ఆ భయం అతని మనస్సును పర్రున చీల్చింది. దీని అంతం ఎక్కడ? బి.10 ఏమైనా మరిచిపోలేదుకదా? అతడు చేతిలో జందెంపట్టుకుని మౌనముద్రలో కూర్చున్నాడు. తాను ఇంత ధైర్యం చేయగలడనే విశ్వాసంలేని బి.10 శివావతరణానికి సంబంధించిన కొన్ని వివరాలు తనకు చెప్పకుండా ఉండలేదు కదా? మోసాన్ని ముసుగులో ఉంచడానికి అవసరం అయినవన్నీ చెప్పాడా? ఆనాడు ఆ మాటలన్నీ తమాషాగా అనిపించాయి. నీతిగా చెమటోడ్చి పొట్టనింపుకోగలమనే ధైర్యం ఇంకా గుండెలో మిణుకు మిణుకుమంటోంది కాబట్టి ఆ మాటలమీద అట్టేనమ్మకం కుదరలేదు.
    రెండు జీవితపథాలమధ్య నిలిచి కాలూ దిగ్భ్రాంతుడై ఆలోచనామగ్నుడైపోయాడు. ఆత్మను వంచించకుండా రెండు ముఖాలాట ఎలా ఆడ్తాడు?
    మార్గాంతరం? దుఃఖపరితప్తమైన వంగదేశపు హృదయనాదం అతనిలో మారు మోగింది. అతనిలోని తిరుగుబాటు నాగసర్పంలా పడగవిప్పింది.
    కాలూ కళ్ళు మూసుకొని శ్వాస బిగపట్టాడు. జందాన్ని గట్టిగా పట్టుకొని నగ్నభుజం మీదా, వక్షంమీదా గబగబా త్రిప్పాడు. ఆ నటనతో అతడు ఆపాదమస్తకం వణికిపోయాడు. అతని మూడువేల సంవత్సరాల విశ్వాసభారాన్ని కూల్చివేసింది. జందెం కాలూను వ్రేళ్ళులేని చెట్టును చేసింది.
    భయం దానివెంటనే విముక్తి అవి రెండూ పెనగొని రక్తంలో మహావేగంగా ప్రవహించాయి. జన్మతోనూ రక్తంతోనూ వచ్చిన కులాన్ని అతడు అధిగమించాడు. భయం మాయమైంది. అతని ఉచ్చ్వాస నిశ్వాసాల్లో ఉత్సాహం ఉప్పొంగింది.
    కాలూ చేసే మాయాజాలం ఎలాంటిదో అతనికి తెలుసు. అనాదిగా వస్తూఉన్న పాతవిశ్వాసాల్ను గురించికూడా అతనికి తెలుసు. అన్నీతెలిసే అతడు శివుని పుట్టించడానికి ప్లానువేశాడు. కాలూ గుడిముందునుంచి వెళ్ళడం సంభవిస్తే అనుకోకుండానే అతని చేతులు రెండు జోడించుకొని మొక్కుతాయి. లేఖ జబ్బునపడ్డప్పుడల్లా అతని హృదయం అన్యప్రేరణ లేకుండానే ప్రార్ధన చేసేది. దేవాలయానికి పండ్లూ, పూలూ, సంభావనా పంపేవాడు. దేవునిపేరిట మోసం చేస్తున్నాడంటే అతనివళ్ళు జలదరించింది. కాలూ స్వయంగా పూజారికాబోతున్నాడు. అతనిగుండెమెత్తపడింది. కాని అతనిలోని తిరుగుబాటు గుండెను కరుకుచేసింది. పదునుపెట్టింది. న్యాయం. ధర్మం- ఇవే అతనికి కావాల్సినవి. అందుకే అతడు మరోజన్మం ఎత్తాడు. గమ్యాన్ని చేరడానికి బ్రాహ్మణవేషం సోపానం మాత్రమే.
    అనిష్టంగానూ, హీనస్వరంతోనూ తన కలనుగురించి లేఖ చెప్పింది. తాను కలగన్నది అబద్దమేమీకాదు. అయితే శివునిద్వారా మాత్రం కాదు. భయం స్వప్నరూపం దాల్చింది. అంతే భేదం.
    భీతాహం కాలూను పీక్కొని తిన్నది. అతడు నీరసంగా వణికిపోయాడు. అతని మీద ప్రశ్నలవర్షం కురుస్తూంది. ఎవరో కురిపించడం లేదు. తనే కురిపించుకుంటున్నాడు. కాని సమాధానం మాత్రం ఒక్క ప్రశ్నకుకూడా లభించడంలేదు. ఏనాడో ఒకనాడు ఝార్నానుంచి ఎవడైనా ఇటువస్తే? వాడు తనను మామూలు కమ్మరిగా గుర్తిస్తే? ఆ వార్త గాలిలో ప్రయాణంచేసి అగ్గిముట్టిస్తుంది. కోపంతో వళ్ళుమరిచిన జనం తనను చావమోదుతారు.
    దేవాలయపు బావిదగ్గర కాలూ స్నానంచేస్తూ ఉండగా గంగూ అనే జేలుగార్డు అటునుంచివెళ్తూ కాలూను చూశాడు. అతడు గుడ్లుమిటకరించి "వీడు మూడు నాలుగు నెల్లక్రితం జేలునుంచి బైటపడ్డవానిలా ఉన్నాడే! మీసాలుమాత్రం లేవు. తేడా అంతకంటే ఏమీ కనిపించడంలేదు. నున్నటితల ఉంటేమాత్రం? అంతటితో మనిషి మారిపోతాడా?" అనుకున్నాడు.
    ఆ తరువాత గంగూకు కాలూ భుజంమీద ఉన్న తెల్లని జందెం కనిపించింది. అంతటితో నోరుమూతపడింది.
    ఈ పాడుమాట అగ్గిలా పాకిపోతుంది. గార్డును మంచిమాటల్తో బావిదగ్గరకి తీసుకెళ్ళి బావిలో తోసెయ్యాలి. సాక్షులు ఎవరూ లేరు. అలాంటప్పుడు అతనికి అయ్యేది ఏముంది? గంగూ కవచంలాంటి నల్లనిగడ్డం ఊపుతూ "చీమకు రెక్కలువస్తే ఏమి అవుతుందో దొంగపూజారి అవుతే అదే అవుతుంది." అని గొణుగుతూ వెళ్ళిపోయాడు.
    ఇంతలో కాలూకు మేలికవచ్చింది. అతని శరీరం యావత్తూ చెమటలో స్నానంచేస్తూంది. "నేను షాషాణాన్ని. కొత్తజీవితపు రంగులకుగాను పాతవాసనలన్నింటినీ హత్యచేశాను. అలాంటప్పుడు నా గతజీవితపు అంధకారంనుంచి వచ్చే ఒక్కవ్యక్తిని తుదముట్టించలేనా? వాడి మీద దయతలుస్తే వాడు నన్నే మోసం చేస్తాడు" అనుకున్నాడు.
    ఎందుకూ ఇదంతా. అది వట్టికల. కలమాత్రమే.
    సూర్యుడు పశ్చిమద్రిచేరాడు. సాంధ్య శ్రీ కుంకుమజల్లు కురిపిస్తుంది. ఉదయంనుంచీ కాలూ నీళ్ళుచల్లుతున్న భూభాగం పగిలింది. శివలింగం శీర్షం కనిపించింది. క్రమం క్రమంగా అది బైటికి వస్తూంది. దగ్గరి ప్రేక్షకులు ఆ అద్భుతాన్ని చూచారు. వారినోట మాటపెకల్లేదు. మరుక్షణంలో ముక్తకంఠంతో జనంయావత్తూ ఒకేసారి "నమఃశివాయ" అని అరిచారు.
    పరమేశుడు ప్రత్యక్షం అయినాడు.
    భక్తులనరాల్లో విద్యుత్తు ప్రవహించింది. శివావతరణం వారిలో నూతనోత్తేజం కలిగించింది. వారినినాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లోకమంతా వినేట్లు అరచారు. గొంతుకలు పగిలేదాకా అరిచారు.
    ప్రజలు దర్శనంకోసం నెట్టుకుంటున్నారు. పిల్లవాళ్ళను తొక్కేశారు. స్త్రీలు కెవ్వున కేకలువేశారు. వృద్ధులూ, అశక్తులూ వగర్చారు. అలా వగరుస్తూనే నెట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించారు. కాని వారికి విజయంలభించలేదు. నెత్తురు మండేవాళ్ళంతా మర్రిచెట్టెక్కారు. వయసుమళ్ళి నెత్తురు చచ్చిన వృద్ధులు ఓడిపోయారు. ఓడిపోయినవృద్ధులు నిరుత్సాహంతో "ఈ గడియకోసం పొద్దస్తమానం కూర్చున్నాం. తీరా భగవంతుడు దర్శనం ఇచ్చేసమయం వచ్చేవరకు దర్శనం లభించకుండా పోయింది. ఏమిటి ఈ దౌర్భాగ్యం. జీవితం మొత్తంలోనూ ఒకేసారి ఇలాంటి అవకాశం లభించేది. ఈ అవకాశం జారవిడుచుకోవాల్సిందేనా?" అని గొణుక్కున్నారు.
    తనకు లభించిన విజయంచూసి కాలూ పొంగిపోయాడు. నిశ్చలంగా కూర్చున్న కాలూ మోకాళ్ళమీద లేచి, చుట్టూ కలయచూచి అధికారస్వరంలో ఆదేశించాడు.
    "శివుడు అవతరించాడు. ఇంక మాయంకాడు. స్వామిని అందరూ దర్శనంచేసుకోవాలి. నెట్టుకోకండి. దర్శనంచేసుకొని కదలండి. పక్కవారికి అవకాశం ఇవ్వండి. ఇలాంటి పుణ్యసమయంలో ఒక్కసారి దర్శనంచేసుకుంటేచాలు. ఒక్క దర్శనం. అంతే."
    జనం తొక్కిడి తగ్గింది. శ్రేణులు క్రమబద్దంగా కదిలాయి. శివుని దర్శించుకొని సాగిపోతున్నారు. లింగంమీద నాణాలవర్షం కురిసింది. ఎక్కువవెండివే. స్త్రీలు బంగారు గాజులు వేశారు. ఒక స్త్రీ రాళ్ళకంఠాభరణం లింగంమీద విసిరింది.
    వెక్కిరించినవాళ్ళంతా భక్తులుగామారిపోయారు. "స్వామి చెక్కు స్వీకరిస్తాడా?" అని అడిగాడు ఒక వ్యక్తి. చెక్కు విలువ తెలిసిన కాలూ "ఎందుకు తీసుకోడు?" అంటూ ఒక చురకుచూపు విసిరాడు.
    కనకవర్షం కురిసింది. కాలూ పులికండ్లతో ధనరాసిని కాపాడుతున్నాడు. ఆశ దేవునిసొమ్మునుకూడా అపహరించ జేయవచ్చు. కనకరాసినిచూచి కళ్ళుజిగేలుమన్నాయి. వళ్ళు జల్లుమంది. అధ్భుతాన్ని చూచి అబ్బురపాటుతో జనం అక్కడినుంచి కదలలేకుండా నుంచుండిపోయారు. జనం గుంపులుగా తనచుట్టూమూగాలని మౌనంగా ప్రార్ధించిన కాలూ ఇప్పుడు ప్రేక్షకజనాన్ని అసహ్యించుకుంటున్నాడు. వట్టివెధవలు. తాను చేసిన మోసాన్ని గ్రహించకపోగా ముగ్ధులు అవుతున్నారు. తాను దేవున్నే సృష్టించాడు. ఒక గాధ కల్పించాడు. అది తరతరాలు నిల్చిపోయేగాధ. నవ్వేద్దామనుకున్నాడు.
    తినుబండారాలు కుప్పలుతిప్పలుగా పడ్డాయి. కాలూ పుణ్యం ప్రసాదించినవారంతా రకరకాల ఆహారపదార్ధాలు ఆయనకు సమర్పించారు. లేఖ అంటలేదు. ఆడింది. ఆమె ఆకలి చచ్చింది. కాలూ తన దాపరికంలోంచి బాగ్ బజారునుంచి  సందేశ్ అనే మిఠాయి తెచ్చి పెట్టాడు. ఆమె అంటలేదు. మొన్నటిదాకా పాలపేరుచెపుతేనే నోట్లో నీరు ఊరేది. ఇప్పుడు తిండిఅంటే లక్ష్యం లేకుండాపోయింది. ఆమె నోటికి ఏదీరుచిలేదు. జీవితపు ఆశ అంతరించింది. అంతటితో అయిపోయిందా? కాదు. అంకురార్పణంఅయిన దేవాలయానికి ఆమె భాగస్వామిని కావాలి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.