Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    9.ఇంద్రా ! నీవు మాకు ప్రసాదించు అభీష్టవరద బలము పడమర, ఉత్తరము, దక్షిణము, తూర్పు నలుదిశలనుండి మమ్ము చేరుకొనవలెను. అది ఒకే దిశనుండి అయినను మీ వద్దకు రావలెను. మాకు సర్వవిధ ధనమును ప్రదానము చేయుము.

    10. ఇంద్రా ! నీ రక్షణలు మాకున్నవి. పరిచారక యుక్తము, వినదగు కీర్తి సహితమగు శ్రేష్ఠధనమును నీరక్షణల నీడన అనుభవింతుము. నీవు పార్థివ, దివ్య ధనములకు అధిపతివి. మాకు గొప్పవి, అంతులేని, గుణయుక్త రత్నములను ప్రసాదించుము.

    11. అభినవ రక్షణలకుగాను ఈ యజ్ఞమునకు, ప్రసిద్ధ ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. ఇంద్రుడు మరుత్ యుక్తుడు. అభీష్టవర్షి. సమృద్దుడు. శత్రుపరాభవకర్త. దీప్తిమంతుడు. శాసనకారి. లోకమును అభినందించువాడు ప్రచండుడు. బలప్రదుడు.

    12. వజ్రధర ఇంద్రా ! మానవులందు తమనుతాము అధికులముగా భావించువారిని వశీభూతులను చేసికొనుము. మేము ఈ లోకమున, ఇప్పుడు, యుద్ధసమయమందును పుత్ర, పౌత్ర, జలలాభమునకును నిన్ను ఆహ్వానింతుము.

    13. బహుజన ఆహూతుడవగు ఇంద్రా ! స్తోత్ర రూప స్నేహమున నీతో కలిసి తలెత్తిన శత్రువులను వధించవలెను. వారికన్న బలవంతులము కావలెను. నీవు మమ్ము రక్షించవలెను. మేము మహాధనమున ప్రసన్నులము కావలెను.

                                        ఇరువదవ సూక్తము

         ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. బలపుత్ర ఇంద్రా ! సూర్యుడు తన తేజస్సుతో భువిని ఆక్రమించిన రీతి యుద్ధమున శత్రువును ఆక్రమించగల పుత్ర ధనమును ప్రసాదించవలెను. ఆ పుత్రుడు వేనవేల విధముల ధనములకు స్వామి, సత్యపూర్ణ భూమికి అధిపతి, శత్రునిహంత కావలెను.

    2. ఇంద్రా ! నీవు సూర్యుని వంటివాడవు. స్తోతలు స్తోత్రములతో సముచిత సంపూర్ణ బలములను నీకు అర్పించినారు. తక్కువ రసముగల సోమపానముచేయు ఇంద్రా ! నీవు విష్ణు సహితుడవయి నీ బలమున జలనిరోధకుడగు వృత్రుని వధించినావు.

    3. సంపూర్ణ శత్రునగరములను భగ్నము చేయు వజ్రము ఇంద్రునకు అందినది. అప్పుడు అతడు మధుర సోమరసమునకు స్వామి అయినాడు.

    ఇంద్రుడు హింసకుల హింసకుడు. అతిశయ ఓజస్వి. బలశాలి - అన్నప్రదాత - ప్రవృద్ధ తేజోవంతుడు.

    4. ఇంద్రా ! మేధావి కుత్సుడు యుద్ధములందు బృహత్ అన్నదాత. నీకు సాయము చేయువాడు. కుత్సుని ఫణినామక అసురుడు చూచినాడు. తన శతసంఖ్యాక సైన్యముతో పలాయనము చిత్తగించినాడు. నీవు శుష్ణునామక అసురుని కాపట్యమును ఆయుధమును అంతమొందించినావు. వాని సమస్త అన్నములను అపహరించినావు.

    5. ఇంద్రుడు వజ్రము పడినది. శుష్ణుడు ప్రాణములు వదిలినాడు. అప్పుడుగాని ద్రోహియగు శుష్ణుని సమస్త బలములు అంతముకాలేదు. ఇంద్రుడు సూర్యుని భజించదలచినాడు. సారథివంటి కుత్సుని తన రథమును విస్తరింపచేయుమన్నాడు.

    6. ఇంద్రుడు ప్రాణులకు ఉపద్రవము కలిగించు నముచి అసురుని మస్తకమును చూర్ణము చేసినాడు. 'సప' పుత్రుడు 'నమి' ని రక్షించుటకుగాను పశువులు మున్నగు ధనమును, అన్నమును ప్రసాదించినాడు. అప్పుడు శ్యేనపక్షి ఇంద్రుని కొఱకు మాదక సోమము తెచ్చి ఇచ్చినది.

    అపాం ఫేనేన నముచి జలముల నురుగు నముచి, "పాప్మావై నముచిః" పాపమే నముచి.

    (నామీసాప్య - నముచితో తలపడినవాడు. పంచవింశ బ్రాహ్మణమున విదేహరాజుగా చెప్పబడినాడు)

    7. వజ్రధర ఇంద్రా ! 'పిప్రు' అసురుడు మాయావి. వాని దుర్గములను నీవు నీ బలమున బ్రద్దలు కొట్టినావు. శోభన దానసంపన్న ఇంద్రా ! హవ్యరూప ధనము సమర్పించు ఋజిశ్వునకు అనంత ధనము ప్రసాదించినావు.

    ("పిప్రు" పదము 'పృ' ధాతుజన్యము. అట్లు "పిప్రు" అవరోధములు కలిగించువాడు అగును. ఇంద్రుడు ఋజశ్వుని కొఱకుగాను పిప్రుని అనేకమార్లు పరాజితుని చేసినాడు.

    ఋజిశ్వుడు విదథివంశపురాజు. ఇది అస్పష్టమగు ప్రాచీన నామము. అతడు పిప్రుని వధించుటకు ఇంద్రునకు సాయము చేసినట్లు చెప్పబడినది)

    8. ఇంద్రుడు అభిలషిత సుఖప్రదాత. అతడు 'ద్యోతను'ని వద్దకు వెళ్లదలచినాడు. వేతసు, దశోణి, తూతిజ, తుగ్రాసులు అడ్డముగా నిలిచినారు. తల్లికి పుత్రుడు వశీభూతుడయినట్లు ఇంద్రుడు ఆయా అసురులను వశీభూతులను చేసికొన్నాడు.

    (శాయణుడు ద్యోతనుని రాజునుగా పేర్కొన్నాడు. ఈ పదమునకు 'తేజస్వీకరణము' అని అర్థము. ద్యోతనునకు వేతసాది అసురులకున్న వైరము తెలియదు)

    9. ఇంద్రుడు అజేయుడు. శత్రువులను పరిమార్చు ఆయుధము ధరించువాడు. తనకు ఎదురయిన వృత్రాది రాక్షసులను హతమార్చినవాడు. శూరుడు రథమును ఎక్కినట్లు ఇంద్రుడు తన అశ్వములను అధిరోహించును. వచన మాత్రమున పూజితులగు ఆ రెండు అశ్వములు ఇంద్రుని వహింపవలెను.

    10. ఇంద్రా ! మేము స్తోతలము. నీ రక్షణలు అర్థించుచున్నాము. నవీన ధనము కొరకు నిన్ను భజించుచున్నాము. యజ్ఞద్వేషులగు ప్రజలను బాధించి పురుకుత్సరాజునకు ధనము ప్రదానము చేసినావు. అట్టి నీ ఘనకార్యములను యజ్ఞములందు స్తుతింతుము. నీవు 'శరత్' నామకు అసురుని ఏడు పురములను ధ్వంసము చేసినావు.

    11. ఇంద్రా ! కవిపుత్ర ఉశనుడు, ధనాభిలాషి. అతనికి నీవు ప్రాచీన ఉపకారివి. నవవాస్త్వుడను అసురుని వధించినావు. క్షమతాశీల పిత ఉశనుని వద్దకు శత్రువులు అపహరించిన పుత్రుని చేర్చినావు.

    (కావ్య ఉశనుడు ఋగ్వేదమున ప్రాచీనద్రష్ట. తరువాత అసురుల పురోహితుడు అగును.)

    12. ఇంద్రా ! నీవు శత్రు కంపనుడవు. ధుని అను అసురుడు జలములను కట్టి పెట్టినాడు. నీవు ఆ జలములను విడిపించినావు. ప్రవహింప చేసినావు. నీవు సముద్రములను దాటిపోయినపుడు యదు, తుర్వశులను సముద్రము దాటించినావు.

    13. ఇంద్రా ! యుద్ధములందు, ధుని, చుమురి అసురులను హతమార్చినావు. అప్పుడు హవ్యపాకము చేయువాడు, ఇంధనస్వామి, నీ కొఱకు సోమభిషవము చేయు రాజు "దభీతుడు" హవిరూప అన్నము సమర్పించి నిన్ను ప్రదీప్తుని చేసినాడు.

                                       ఇరువది ఒకటవ సూక్తము

            ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. శూరఇంద్రా ! బహుకార్యాభిలాషియు, స్తోతయు అగు భరద్వాజుని ప్రశంసనీయ స్తుతులు నిన్ను ఆహ్వానించును. ఇంద్రుడు రథారూఢుడు. జరారహితుడు. నవీనతరుడు. శ్రేష్ఠములగు ఐశ్వర్యములు ఇంద్రుని అనుసరించును.

    2. ఇంద్రుడు అందరు ఎరిగినవాడు. స్తుతులద్వారా ప్రాపణీయుడు. యజ్ఞములద్వారా ప్రవర్ధమానుడు. అట్టి ఇంద్రుని మేము స్తుతింతుము. ఇంద్రుడు అనంత ప్రజ్ఞావంతుడు. అతని మాహాత్మ్యము ద్యావాపృథ్వులను అతిక్రమించును.

    3. వృత్రుడు విస్తీర్ణము, అప్రకాశితమగు అంధకారమును పరచినాడు. ఇంద్రుడు సూర్యుని ద్వారా ఆ అంధకారమును ప్రకాశింప చేసినాడు. ఇంద్రా ! నీవు బలశాలివి. అమరుడవు. మానవులు నీనివాసమగు స్వర్గమును సర్వదా భజింతురు. వారు ఏ ప్రాణినీ హింసించరు "యక్షన్తో న మినన్తి స్వధావః"

    4. వృత్రవదాది ప్రసిద్ధ కార్యములు. నిర్వహించిన ఇంద్రుడు ఇప్పుడు ఎక్కడ ఉండును? ఏ దేశమున ఉండును? ఏ ప్రజల మధ్య ఉండును? ఇంద్రా ! ఏవిధమగు యజ్ఞము నీ చిత్తమునకు సుఖకరమగును? నిన్ను ప్రసన్నుని చేయుటకు ఎట్టి మంత్రము సమర్ధమగును? నిన్ను ప్రసన్నుని చేయదగు సమర్థుడు ఎవడు? వాడు ఎటువంటివాడు?

    5. బహుకార్యములు నిర్వహించు ఇంద్రా ! పూర్వకాలపు అంగిరాదులు నేటివారివలెనే పనులు చేయుచునే నీ స్తోతలయినారు. మధ్యకాలపువారు, నవీనులు కూడ నీ స్తోతలు అయినారు. బహుజన ఆహూత ఇంద్రా ! ఆర్వాచీనుడనగు నా స్తుతిని ఆలకింపుము.

    6. ఇంద్రా ! నీవు శూరుడవు. మంత్రములతో ప్రాపణీయుడవు. అర్వాచీనులు నీ సుగుణములను అర్చింతురు. ప్రాచీనములగు నీ ఘనకార్యములను స్తోత్రములందు కట్టిపెట్టెదరు. నీవు చేసిన కార్యములలో మాకు తెలిసిన వానినే మేము అర్చింతుము. ఇంద్రా ! నీవు మహామహుడవు.

    7. ఇంద్రా ! రాక్షసుల బలము నీముందు నిలిచి ఉన్నది. ప్రాదుర్భూతమగు ఆ మహాబలము ముందు స్థిరముగా నిలువుము. స్థిరముగా నిలిచి, నీ వజ్రమున, ఆ బలమును ఓడింపుము. నీ వజ్రము పురాతనము, యజనీయము. నిత్య సహాయకము.

    8. ఇంద్రా ! నీవు వీరుడవు. స్తోతలను పోషించువాడవు. మా స్తోత్రములను త్వరగా వినుము. మేము ఆధునికులము నిన్ను స్తుతించు కోరిక గలవారము. యజ్ఞమున శోభన ఆహ్వానవంతుడవై అంగిరులకై చిరకాల బంధువవు అయినావు. కావున ఇప్పుడు మా స్తుతులను ఆలకింపుము.

    9. భరద్వాజా ! నీవు ఇప్పుడే మా తృప్తికొఱకును, రక్షణల కొఱకును రాజ్యాభిమాని వరుణుని, దానాభిమానులు మిత్ర, ఇంద్ర, మరుద్గణ, పూష, సర్వవ్యాపి విష్ణు, బహుకర్మకారి అగ్నిని, ఓషధుల దేవతను, పర్వతములను స్తుతించుము. వారిని అభిముఖులను చేయుము.

    10. ఇంద్రా ! నీవు బహుశక్తిమంతుడవు. అతిశయ యజనీయుడవు. స్తోతలు అర్చనీయ స్తోత్రములతో నిన్ను స్తుతింతురు. అమర ఇంద్రా ! స్తూయమానుడవగుము. స్తుతించువారి, నా స్తుతులను వినుము. నీకు సమానుడయిన మరొక దేవత లేడు "అనయో అమృత త్వదస్తి".

    11. బలపుత్ర ఇంద్రా ! నీవు సర్వజ్ఞుడవు. నీవు సమస్త యజనీయ దేవతల సహితుడవై నా స్తుతిరూప వచనములకు అభిముఖుడవై విచ్చేయుము. ఎవరు అగ్ని జిహ్వగలవారో ఎవరు యజ్ఞభోజనులో ఎవరు రాజర్షి మనువును శత్రువులను నష్టపరచుటకు దస్యులపైకి పంపినారో వారి సహితముగా విచ్చేయుము.

                                      ఇరువది రెండవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు  ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు ప్రజల ఆపదలందు ఏకమాత్ర ఆహవనీయుడు. స్తోతల వద్దకు వచ్చువాడు. అభీష్టవర్షి. బలశాలి. సత్యవాది. శత్రుహింసకుడు. బహుప్రజ్ఞావంతుడు. అట్టి ఇంద్రుని స్తోత్రములతో స్తుతింతుము.

    2. పురాతనులు, నవగ్వులు, సప్తవిప్రులు, మా పితరులు అంగిరాదులు ఇంద్రుని బలవంతుని అన్నవంతునిచేసి స్తుతులద్వారా అతనిని స్తుతించినారు. ఇంద్రుడు గమనశీలుడు, శత్రుహింసకుడు, పర్వతములందు ఉండువాడు, అనుల్లంఘనీయ శాసకుడు.

    3. బహుపుత్రయుక్తులమై, పరిచారకుల సహితులమై, పశువులతోకూడ ఇంద్రునివద్ద కేగి అవిచ్చిన్న, అక్షయ, సుఖదాయకధనమునకై ప్రార్థింతుము. అశ్వాధిపతి ఇంద్రా ! మమ్ము సుఖవంతులను చేయుటకు అట్టి ధనము ప్రసాదించుము.

    4. ఇంద్రా ! పూర్వకాలమున నీ స్తోతలు సుఖలాభము పొందినారు. మాకు సహితము ఆ సుఖములను చూపుము. నీవు దుర్ధర్షుడవు. శత్రువిజయవి. ఐశ్వర్యశాలివి. బహుజన ఆహూతుడవు. అసురహంతవు. నీ కొఱకు యజ్ఞమున ఏ భాగము ఏ హవ్యము సమర్పితమగును?

    5. ఇంద్రుడు వజ్రధారి. రథారూఢుడు. ఆశ్రయదాత. బహుకర్మకర్త. బలదాత. యుగాది లక్షణకర్మయుక్తులు. సద్గుణస్తుతులు చేయు యజమానులు అట్టి ఇంద్రుని అర్చింతురు. ఆ యజమానికి సుఖప్రాప్తి కలుగును. శత్రువునకు అభిముఖుడగును.

    6. నిజబలమున బలవానుడవగు ఇంద్రా ! నీ వజ్రము మనోవేగవంతము. వేయి గణుపులు కలది. వజ్రాయుధమున మాయతో పెరిగిన వృత్రుని పరిమార్చినావు. శోభన తేజోవంతుడవగు మహా ఇంద్రా ! నీవు ఘర్షకములు, వజ్రముద్వారా నాశరహితములు, కూలనట్టివి, ధృడములగు అసురపురములను భగ్నము చేసినావు.

    7. ఇంద్రా ! పూర్వకాలపు ఋషులవలె నవీన స్తుతుల ద్వారా నీ కీర్తిని పెంపొందింతుము. నీవు అత్యంత బలశాలివి. ప్రాచీనుడవు. అపరిమిత శుభములు వహించు ఇంద్రుడవైన నీవు మమ్ము సమస్త విఘ్నములనుండి కాపాడవలెను.

    8. ఇంద్రా ! సాధుద్రోహులైన రాక్షసులను పరిమార్చుటకుగాను ద్యావాపృథ్వులను, అంతరిక్షమును సంతప్తింప చేతువు. కోరికలు తీర్చు ఇంద్రా ! నీ దీప్తితో సర్వత్ర వర్తమానులగు రాక్షసులను భస్మీభూతులను చేయుము. బ్రాహ్మణ ద్వేషి రాక్షసులను కాల్చుటకుగను పృథ్వి, అంతరిక్షములను ప్రదీప్తములు చేయుము.

    9. దీప్యదర్శన ఇంద్రా ! నీవు స్వర్గజనులకు, భూలోకవాసులకు ఈశ్వరుడవు. అతిశయ స్తవనీయ ఇంద్రా ! నీవు కుడిచేత వజ్రము ధరించి అసురమాయలను విచ్చిన్నము చేసెదవు.

    10. ఇంద్రా ! మాకు మహంతము, ఆహింసితము, సంగచ్చమనము, కళ్యాణయుక్తమగు సంపద ప్రసాదించుము. అందువలన శత్రువులను బాధింపనలవికాకుండును. నీ కళ్యాణ గుణములతో కర్మహీనులగు మానవులను కర్మ యుక్తులను చేసినావు. మానవశత్రువులను హింసా సంబంధులను చేసినావు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.