Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    13. దేవతల ఆహ్వానకర్త. దీప్తిమంతుడగు అగ్ని గృహమునకు అధిపతి. సర్వజ్ఞుడు. అందువలన అగ్ని సమస్తప్రాణులను ఎరుగును. అగ్ని దేవతలలోను మానవులలో అతిశయ యజ్ఞకారి. సత్యసంపన్నుడగు అగ్ని ఉత్తమరూపమున యజ్ఞము చేయవలెను.

    14. అగ్ని యజ్ఞనిష్పాదకుడు. శోధక దీప్తిమంతుడు అగ్నీ ! ఈ సమయమున ఇప్పుడు యజమాని హవ్య నిర్వహణను ఆశింపుము. నీవు దేవతల యజనము చేయువాడవు. కావున యజ్ఞమున దేవతలను యజింపుము. యువతమ అగ్నీ ! నీవు నీ మాహాత్మ్యముననే సర్వవ్యాపకుడవు. నేటి దినమున్ మేము నీకు సమర్పించు హవ్యమును స్వీకరింపుము.

    15. అగ్నీ ! వేదిమీద యథావిధిగ ఉంచిన హవ్యమును అవలోకింపుము. యజమాని నిన్ను యజ్ఞమునకుగాను ద్యావాపృథ్వులందు స్థాపించినాడు. ఐశ్వర్య సంపన్న అగ్నీ ! మమ్ము యుద్ధమున రక్షింపుము. అందువలన మేము సమస్త పాపములనుండి విముక్తులమగుదుము.

    16. సుందర శిఖాసంపన్న అగ్నీ ! సమస్త దేవతలందు సర్వాగ్ర గణ్యుడవగుము. ఉర్ణ - కంబళి యుక్తమగు కులాయ గూటి వంటి ఘృతసంయుక్త ఉత్తరవేదిన నిలువుము. హవ్యదాత యజమాని యజ్ఞమును సముచిత రీతిన దేవతల వద్దకు చేర్చుము.

    17. కర్మ విధానమును నిర్వహించు ఋత్విక్కులు అధ్వర్యఋషివలె అగ్నిమంథనము చేసినారు. దేవతల నుంచి బయలుదేరి అటునిటు పరుగులెత్తు, బుద్ధిమంతుడగు అగ్నిని రాత్రిళ్లు అంధకారమున ఆహ్వానించినారు.

    18. అగ్నీ ! దేవాభిలాషులగు యజమానుల శుభములను అనంతము చేయుటకుగను యజ్ఞమందు మథనమున ఉద్భవించుము. యజ్ఞవర్ధకులు, అమరులగు దేవతలను ఆహ్వానించుము. వారివద్దకు మా యజ్ఞమును చేర్చుము.

    19. యజ్ఞపాలక అగ్నీ ! ప్రాణులందు మానవులమగు మేమే నీకు ఇంధనము అథ్చించి మహానుని చేయుదుము. అందువలన గార్హపత్య అగ్ని మాపుత్ర, పౌత్ర, ధనాదులను పరిపూర్ణము చేయవలెను. తీక్ష్ణ తేజమున మమ్ము నియోజింపుము.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకము ఆరవ మండలమున నాలుగువ అధ్యాయమున మొదటి అనువాకము సమాప్తము)


               రెండవ అనువాకము             పదహారవ సూక్తము

         ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - వివిధములు.

    1. అగ్నీ ! నీవు దేవతల ఆహ్వానకర్తవు. మనుసంబంధి మనుష్యుల యజ్ఞమున దేవతలద్వారా హోతకార్యమున నియుక్తుడవగుము.

    2. అగ్నీ ! మా యజ్ఞమున మదించిన జ్వాలలతో గొప్పగొప్ప దేవతలను భజింపుము. ఇంద్రాది దేవతలను పిలువుము, వారికి హవ్యము అర్పింపుము.

    3. విధాతా ! శోభన కర్మకారీ ! దానాదిగుణవిశిష్టా ! అగ్నీ ! దశపూర్ణమాసాది. యజ్ఞములందు గొప్పమార్గములను హీనమార్గములను త్వరగా ఎరుగుదువు. అందువలన యజ్ఞమార్గమున భ్రష్టుడగు యజమానిని సన్మార్గగామిని చేయుము.

    4. దుష్యంత పుత్రుడు భరతుడు హవ్యదాతలు. ఋత్విక్కుల సహితుడయి అగ్నీ ! నిన్ను స్తుతించును. నీ వలన ఇష్టప్రాప్తి అనిష్ట నివారణము జరుగును. నీవు యాగ యోగ్యుడవు. నిన్ను స్తుతించిన పిదప భజింతురు.

    (భరతుడు కాళిదాసు మహానాటకము అభిజ్ఞాన శాకుంతలమునందలి వానికి బీజప్రాయుడుగా అగుపించుచున్నాడు)

    5. అగ్నీ ! సోమాభిషవకారి దివోదాసునకు బహువిధరమణీయ ధనమును ప్రసాదించి ఉన్నావు. హవ్యప్రదానము చేయు భరద్వాజ ఋషికి అటువంటి బహువిధ రమణీయ ధనమును ప్రసాదించుము.

    6. అగ్నీ ! నీవు అమరుడవు. దూతవు. మేధావివి. భరద్వాజుని స్తుతిని ఆలకింపుము. మా యజ్ఞమునకు దేవతలను కొనితెమ్ము.

    7. ద్యుతిమంత అగ్నీ ! సదాలోచనగల మానవులు దేవతలను తృప్తిచెందించుటకుగాను యజ్ఞమున నిన్ను స్తుతింతురు. యాచింతురు.

    8. అగ్నీ ! మేము దర్శనీయమగు నీ తేజస్సును చక్కగా పూజింతుము. మేము ఒక్కరమేకాదు. ఇతర యజమానులు కూడా నీ అనుగ్రహమున సఫలాభిలాషులు అగుటకు నిన్ను సేవింతురు.

    9. అగ్నీ ! మనవు నిన్ను హోతృకార్యమున నియమించినాడు. నీవు జ్వాలాముఖమున హవ్యము వహించువాడవు. విద్వాంసుడవు. ద్యులోకసంబంధజనుల దేవతలను యజింపుము.

    10. అగ్నీ ! నీవు హవ్యభక్షణకు రమ్ము. దేవతల వద్దకు హవ్యము వహించుటకు రమ్ము. స్తుతి భాజనుడవై హోతరూపమున కుశలపై ఆసీనుడవగుము.

    11. అంగారరూప అగ్నీ ! మేము కట్టెలు, నేతితో నిన్ను ప్రవర్ధుని చేయుదుము. అందువల్ల తరుణారుణ అగ్నీ దీప్తిమంతుడవగుము.

    12. ద్యుతిమాన్ అగ్నీ ! మాకు విస్తీర్ణము, ప్రశంసనీయము మహంతమగు ధనమును ప్రసాదించుము.

    13. అగ్నీ ! మస్తకమువలె లోకములను ధరించిన పుష్కర పుత్రునిమీద అరణిద్వయ మధ్యమున అధర్వఋషి నిన్ను ఉత్పత్తి చేసినాడు.

    ("అధర్వా" అధర్వవేదపు యౌగికనామముని మేకొనల్, కీత్ అభిప్రాయము. మంత్రమున "అధర్వా" ఉన్నది. ఇది ఋషి పేరని శాయణుడు)

    14. అగ్నీ ! అధర్వపుత్రుడు దధ్యంగుడు నిన్ను సముజ్వలితము చేసినాడు. నీవు ఆక్రమించునట్టి శత్రువుల సంహారకుడవు. అసుర నగర వినాశకుడవు.

    (దధ్యంగుడు ఒక పౌరాణిక ఋషి. ఇతడు అధర్వణుడు. ఋగ్వేదమున ఇతడు దివ్యపురుషుడు.)

    15. అగ్నీ ! పాథ్యవృషుడను ఋషి నిన్ను సముద్దీపుని చేసినాడు. నీవు దస్యుహంతవు. విశేష యుద్ధములందు ధనవిజేతవు.

    (యజుర్వేదమున "మనోవైపాథ్యోవృషా" అన్నాడు. అతడు మనువుకు సంబంధించినవాడు కావచ్చును. మనసే కావచ్చును)

    16. అగ్నీ ఇచటికి విచ్చేయుము. మేము నీ గురించి ఉచ్చరించు స్తోత్రములను వినుము. ఇచటికి వచ్చి నీవు సోమరసమున వర్థిల్లుము.

    17. అగ్నీ ! నీ అనుగ్రహ పాత్రములగు దేశము, యజమాని శ్రేష్ఠబల సంపన్నులు అగుదురు. నీవు ఆయజమానినే నీ తావరము చేసికొందువు.

    18. అగ్నీ ! దీప్తిపుంజమగు నీ నేత్రమునకు విఘాతము కలుగరాదు. అది మమ్ము సదా దర్శన సమర్థులను చేయవలెను. కొద్దిమంది యజమానులకు గృహములు కల్పించు అగ్నీ ! యజమానులమగు మేము చేయు పరిచర్యలు గ్రహింపుము.

    19. స్తుతులు ఉచ్ఛరించుచు మేము అగ్నికి ఎదురేగుదుము. అగ్ని హవి స్వామి దివోదాసుని శత్రువుల పరిమార్చువాడు, సర్వజ్ఞుడు, యజమానుల పాలకుడు.

    20. అగ్ని తన మహిమతో మాకు సంపూర్ణ పార్థివ ధనమును మరింతగా ప్రసాదించును. అగ్ని తన తేజమున శత్రువుల నాశనము చేయును. అగ్ని శత్రువులకు అజేయుడు. అతనిని ఎవరును హింసింపజాలరు.

    21. అగ్నీ ! ప్రాచీనవంతమగు నవీన దీప్తితో విస్తీర్ణ అంతరిక్షమును మరింత విస్తరింపచేయుదువు.

    22. మిత్రులగు ఋత్విక్కులారా ! శత్రుహంత, విధాతస్వరూప అగ్నిని స్తుతించు గానము చేయండి. యజ్ఞసాధన హవ్యమును సమర్పించండి.

    23. అగ్ని దేవతల ఆహ్వాత. అతిశయ బుద్ధిమంతుడు. మానవ యజ్ఞములందు దేవదూత. హవ్యవాహకుడు. అట్టి అగ్నిమా యజ్ఞమునకు విచ్చేయవలెను. కుశలపై ఆసీనుడు కావలెను.

    24. గృహప్రదాతవగు అగ్నీ ! ఈ యజ్ఞమున ప్రసిద్ధులు, రాజమానులు, సుందర కర్మవంతులు మిత్రావరుణులు, అదితిపుత్రులు, మరుద్గణములు ద్యావా పృథ్వులను యజింపుము.

    25. బలపుత్రా ! అగ్నీ ! నీవు మరణ రహితుడవు. నీదు ప్రశస్తమగు దీప్తి మానవ యజమానులకు అన్నప్రదానము చేయును.

    26. అగ్నీ ! హవి ఇచ్చు యజమానులు నిన్ను సేవింతురు. భజింతురు. వారు అత్యంత ప్రశంసనీయము. శోభనమగు ధనవంతులు కావలెను. వారు నిన్ను సర్వదా స్తుతించువారగుదురు.

    27. అగ్నీ ! నీ స్తోతలు నీవలన రక్షణ పొందుదురు. అభిలాషలు అన్నిపూర్తి అగును. సంపూర్ణ అన్నవంతుడు, ఆయుష్కుడు అగును. తనను ఆక్రమించ తల పెట్టిన శత్రువును పరాజితునిచేసి, నష్టపరచును.

    28. అగ్ని తన తీక్ష్ణ తేజమున సర్వభోజనుడు, రాక్షస సంహారకుడు, మాకు ధనప్రదాత అగును.

    29. జాతవేద అగ్నీ ! శోభన పుత్ర పౌత్రాదియుక్త ధనమును కూర్చుము. రాక్షసులను నాశము చేయుము.

    30. జాతవేదాగ్నీ ! మమ్ము పాపములనుండి రక్షింపుము. స్తుతిరూపమంత్రకర్తా అగ్నీ విద్వేషకారులనుండి మమ్ము కాపాడుము.

    31. అగ్నీ ! దురభిప్రాయమున మమ్ము బాధించుటకు ఆయుధము ఎత్తువానినుండి, పాపములనుంచి మమ్ము రక్షింపుము.

    32. ద్యుతిమాన్ అగ్నీ ! మమ్ము హింసించకోరు దుర్మార్గుని నీ జ్వాలలతో బాధించుము.

    33. శత్రువులను పరాభవించు అగ్నీ ! మాకు - భరద్వాజునకు మరింత సుఖము, గృహము, వరణీయ ధనము ప్రసాదించుము.

    34. అగ్ని చక్కని దీప్తిగలవాడు. శుక్లవర్ణుడు. హవిద్వారా ఆహూతుడు. స్తుతులతో నుతుడయి హవిని ఆశించును. అగ్ని శత్రువులను చీకట్లను నష్టపరచును.

    35. నేలతల్లి కడుపున అక్షయవేదిమీద అగ్ని విద్యుతమానుడగును. "విదిద్యుతానో" ద్యులోకపాలకుడగు అగ్ని హవిద్వారా యజ్ఞపు ఉత్తరవేదిమీద వేంచేయును. శత్రువులను నాశము చేయును.

    36. అగ్నీ ! నీవు జాతవేదవు. సర్వదర్శివి. పుత్ర పౌత్రసహితమగు అన్నమును సముపార్జించుము. అది ద్యులోకమున దేవతల మధ్య ప్రశస్తమై శోభాయమగునదిగా ఉండవలెను.

    37. బలమునుంచి పుట్టిన అగ్నీ ! నీ దర్శనము అత్యంత రమణీయము. హవిరూప అన్నముతో వచ్చి నీవద్ద స్తోత్రములు ఉచ్ఛరింతుము.

    38. అగ్నీ ! నీ తేజము బంగారమువలె మెరియునది. నీవు దీప్తి సంపన్నుడవు. ఎండకు తపించినవాడు నీడను ఆశ్రయించినట్లు మేము నీశరణు కోరుదుము.

    39. ప్రచండ బలశాలియగు ధనుర్దారివలె అగ్ని బాణములతో శత్రువులను హతమార్చును. అగ్ని వాడి కొమ్ములుగల ఆభోతువంటివాడు.

    అగ్నీ ! నీవు త్రిపురాసురుని మూడు నగరములను ధ్వంసము చేసినావు.

    40. అధ్వర్యులు అరణి మంథనమున అగ్నిని కలిగించినారు. పసి పుత్రునివలె చేతిలోనికి తీసికున్నారు.

    ఋత్విక్కులారా ! హవ్య భక్షకుడు మానవుల శోభన యజ్ఞనిష్పాదకుడగు అగ్నిని సేవించుడు.

    41. అధ్వర్యులారా ! దేవతల ఆరగింపునకు సమర్పించు భక్ష్యము అగ్నియందు అర్పించండి. అగ్ని ద్యుతిమంతుడు. ధనముల జ్ఞాత. అగ్ని తన ఆహవనీయ స్థానమున విరాజిల్లవలెను.

    42. అధ్వర్యులారా ! ప్రాదుర్భూతుడు. అతిథివంటి ప్రియుడు, గృహస్వామి అయిన అగ్నిని జ్ఞానప్రదాయకుడు, సుఖకర ఆహవనీయ అగ్నిలో సంస్థాపించండి.

    (గృహాగ్నిని - జ్ఞానాగ్నిలో ప్రవేశపెట్టుమని గృహము జ్ఞానమయము కావలెనని)

    43. ద్యుతిమంతుడవగు అగ్నీ ! నిన్ను యజ్ఞమునకు సరిగా చేర్చగల సమస్త సుశీల అశ్వములను నీ రథమునకు జోడించుము.

    44. అగ్నీ ! నీవు మాకు అభిముఖముగా విచ్చేయుము. హవ్య భోజనము సోమపానమునకు దేవతలతో విచ్చేయుము.

    45. హవ్యవాహక అగ్నీ ! నీవు అత్యంత ఊర్ధ్వ తేజుడవయి దీప్యమానుడవగుము. జరారహిత అగ్నీ ! అజస్ర ద్యుతిమంత తేజమున ప్రకాశితుడవగుము. ముందు ఉద్దీప్తుడవగుము. తదుపరి నీ తేజమున సమస్త జగములను ప్రకాశింప చేయుము.

    46. హవియుక్త యజమాని హవిర్లక్షణ అన్నమున ఏ దేవతను సేవించినను ఆ యజ్ఞమున అగ్నిని అర్చించుట జరుగును. ద్యావాపృథ్వులందున్న దేవతలకు అగ్ని ఆహ్వానకర్త. సత్యరూపమున పూజ్యుడు. యజమానులు చేతులు జోడించి నమస్కార పూర్వకముగా అగ్నిని భజింతురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.