Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
తొమ్మిదవ అనువాకము
(వపను తీయుట చెప్పబడుచున్నది.)
1. యజ్ఞపశువా! నీ ఇంద్రియములు నిన్ను విడిచినవి. నీ ప్రాణములు నిన్ను విడిచినవి. ఆ దుఃఖమును వదలుము. నీవు ధరింపనున్న దేవతా శరీరమునందు సుఖముగా వర్థిల్లుము. మేము నిన్ను కట్టినాము. ముఖాదులను నిరోధించినాము. ఇప్పుడు హృదయాది ఛేదనము చేయబోవుచున్నాము. అవన్నియు శాంతించును గాత.
నిన్ను ప్రోక్షించిన ఉదకములు శాంతించునుగాక. పరచబడిన దర్భలు శాంతించునుగాక. చనిపోయినపుడు నీ భారము వహించిన భూమి శాంతించునుగాక. సాక్షులైన అహోరాత్రులు శాంతించునుగాక.
2. ఓషధీ! పశువును రక్షింపుము. స్వధితీ! పశువును హింసించకుము.
(అధ్వర్యుడు నాభి దక్షిణభాగమును అడ్డముగా కోయవలెను.)
3. నెత్తుట తడిసిన దర్భా! నీవు రాక్షసుల భాగమవు. మమ్ము ద్వేషించు రాక్షసులకు, మేము ద్వేషించు శత్రువులకు మహా దుఃఖము కలుగచేయుచున్నాను.
(అధ్వర్యుడు దర్భను రక్తమున తడిపి దక్షిణమున వేసి కుడికాలితో తొక్కవలెను.)
4. వపా! దేవతలకు హవిస్సు కొరకు నిన్ను పశు శరీరము నుండి వెలుపలికి తీయుచున్నాను.
వపాశ్రవణులారా! మీరు ద్యావాపృథ్వుల వంటివారు. వపను కప్పివేయుడు.
(1. వపను వండు రెండు పనిముట్లు వపాశ్రవణులు. 2. అధ్వర్యుడు వపను వపాశ్రవణుల పై ఉంచవలెను.)
5. ఈ వప అచ్చిన్నము. ఇది యజమానికి మంచి సంతానమును, సంపదను కలుగచేయును గాత.
6. వపా! నీవు విశాల అంతరిక్షమున ప్రవేశించి సాగిపొమ్ము.
(అధ్వర్యుడు శూలద్వయమును తీసికొని ఆహవనీయ స్థలమునకు చేరవలెను.)
7. వాయువా! ఆజ్య బిందువులను విడగొట్టుము.
(నిప్పు కణికలపై వపను కాల్చవలెను.)
8. వపాశ్రవణులారా! వప ఆహుతి యగునపుడు మీరు ఊర్ధ్వనభోనామక మరుత్పుత్రుని చేరండి.
(వపాశ్రవణులను ఆహవనీయాగ్ని యందు వేయవలెను.)
పదవ అనువాకము
(వపాహోమము చెప్పబడుచున్నది.)
1. వృషదాజ్యము పశువు మనసునకు బదులైనది. అది దేవతల మనసులందు చేరును గాత. ఈ వృషదాజ్యము ప్రాణమునకు ప్రత్యామ్నాయము. అది దేవతల ప్రాణములందు చేరును గాత. హవిస్సుగానున్న నిన్ను దేవతలకు - ప్రియమగు ఘృతమువలె - సమర్పించుచున్నాను - స్వాహా.
(1. పెరుగు కలిపిన నేయి వృషదాజ్యము. 2. అధ్వర్యుడు గుండెను వృషదాజ్యముచే అభిఘరించవలెను.)
2. ఇంద్రదేవతాక మగు ప్రాణము పశువు యొక్క అంగాంగము లందు చక్కగా నిలుచును గాత.
త్వష్టా! భూరియగు ఈ పశువు అవయవములు ఛిన్నా భిన్నములు కాకుండునుగాక.
అవయవములారా! మీది విలక్షణ రూపమగును. అయినను హవిరూపమున సమాన లక్షణములవారు కండు.
పశువా! నీవు దేవతలలో చేరుచున్నావు. అందుకు నీమిత్రులు, తల్లిదండ్రులు ఆమోదింతురు గాక.
(అధ్వర్యుడు గుండె మున్నగు హవిస్సులను ముట్టవలెను.)
3. వపా! నీవు ఆశ్రయణీయవు అగుచున్నావు. ఆహవనీయాగ్ని నిన్ను ఆశ్రయించునుగాక. జలములు నిన్ను చేరును గాత. నిన్ను వాయుగతి కొరకు కప్పుచున్నాను. సూర్యుని గమనము కొరకు కప్పుచున్నాను. జలసంబంధ ఓషధులు మొలుచుట కొరకు కప్పుచున్నాను.
(అధ్వర్యుడు పాత్రలోని వపను ఎముకచే కలియబెట్టవలెను.)
4. నేయిత్రాగు దేవతలారా! నేయి త్రాగండి. వపత్రాగు దేవతలారా! వపను త్రాగండి.
పశువా! నీవు ఆకాశవాసులకు హవివి అగుచున్నావు. అంతరిక్షాయ స్వాహా. ప్రాగ్దిశకు స్వాహా. దక్షిణదిశకు స్వాహా. పశ్చిమదిశకు స్వాహా. ఉత్తరదిశకు స్వాహా. సర్వదిశలకు స్వాహా.
నమోదిగ్భ్యః - సకల దిక్కులకు నమస్తే.
(ప్రతి ప్రస్థాత వసను దేవతల దిక్కులకు హోమము చేసి నమస్కరించవలెను.)
పదకొండవ అనువాకము
(ఉపయట్ హోమము చెప్పబడుచున్నది.)
1. హవ్యమా! సముద్రం గచ్ఛ వెళ్ళుము - స్వాహా. అన్తరిక్షంగచ్ఛ స్వాహా. దేవం సవితారం గచ్ఛ స్వాహా. అహోరాత్రీ గచ్ఛ స్వాహా. మిత్రావరుణౌ గచ్ఛ స్వాహా. సోమంగచ్ఛ స్వాహా. యజ్ఞం గచ్ఛ స్వాహా. ఛన్దాంసి గచ్ఛ స్వాహా. ద్యావాపృథివీ గచ్ఛ స్వాహా. నభోదివ్యం గచ్ఛ స్వాహా. అగ్ని వైశ్వానరం గచ్ఛ స్వాహా.
హవిర్లేపమా! నిన్ను ఉదకమూలములైన ఓషధుల కొరకు మార్జనము చేయుచున్నాను.
సముద్రాది దేవతలారా! నాకు ఆనందకరమగు మనస్సును ఇవ్వండి. మీ అనుగ్రహమున నాకు ఉత్తమ దేహము, కాంతివంతమగు రూపము, పుత్ర, పౌత్రులు లభించగలరు.
2. హృదయశూలమా! నీవు దుఃఖరూపము కలదానవు. మమ్ము ద్వేషించు వారిని, మేము ద్వేషించు వారిని దుఃఖముల పాల్జేయము.
వరుణరాజా! నీవు శోకము కలిగించు స్థానములను - ద్వేషము కలిగించు స్థానములను విడువుము.
ఉదకములారా! గోవులారా! వరుణదేవా! మాకోర్కెలు తీర్చమని మిమ్ము బాధించుచున్నాము. ఆ పాపముల నుండి మమ్ము విముక్తులను చేయండి.
(హృదయశూలమును తొలగించవలెను.)
అగ్నిషోమీయ పశువు సమాప్తము
పన్నెండవ అనువాకము
(వసతీవరీ జలములను గ్రహించుట చెప్పుచున్నాడు.)
1. వసతీవరీ జలములు హవిస్సు కలవి అగునుగాక. ఇంద్రుడు హవిష్మంతుడు అగును గాత. యాగము హవిష్మంతమై సర్వత్ర ప్రవర్తిల్లును గాత. సూర్యః హవిష్మాన్ అస్తు.
2. వసతీ వరులారా! మిమ్ము నశించనట్టి అగ్ని గృహమున స్థాపించుచున్నాను.
ఉదకములారా! మీరు సుఖించువారు. ప్రాణులకు సుఖము కలిగించువారు. మమ్ము సుఖములందు నిలుపండి. మీరు ఇంద్రాగ్నులకు భాగస్వాములు అగుచున్నారు. మిత్రావరుణులకు భాగస్వాములు అగుచున్నారు. విశ్వేదేవతలకు భాగస్వాములు అగుచున్నారు. యజ్ఞేజాగృత. యజ్ఞమునందు అప్రమత్తులై ఉండండి.
పదమూడవ అనువాకము
(అభిషోతవ్య సోమమును బండినుంచి దించుట.)
1. సోమమా! నిన్ను మనసుగల మనుషుల కొరకు - మనసుగల పితృదేవతల కొరకు - ద్యులోకవాసదేవతల కొరకు - సూర్యుని కొరకు గృహ్ణోమి - తీసికొనుచున్నాను. నీవు ఈ యజ్ఞమును మహోన్నతమును చేయుము.
ఈ సోమమును ద్యులోకమందు - దేవతలయందు - స్తోత్రరూప ఆహ్వానములందు స్థాపించుము.
సోమప్రభువా! రమ్ము. బండిదిగుము. భయపడకుము. కంపించకుము. మేము నిన్ను బాధించము. నీవు దేవతలను చేరుకొనుము. నిన్ను దేవతలు చేరుకొందురు గాత.
2. సమిధాగ్ని నా ఆహ్వానమును వినును గాత. విద్యావంతులు, దేవతారూపులగు జలములారా! మీరు కూడ వినండి. గ్రావాణములారా! మీరు సోమాభిషవమునకు విచ్చేసి ఉన్నారు. మీరు విద్వాంసులు కండి. యజ్ఞమంత్రములు వినండి.
శృణోతు దేవస్సవితా హవంమే - సవితా దేవత నా ఆహ్వానమును ఆలకించవలెను.
(అధ్వర్యుడు హోమము చేయవలెను.)
3. జలదేవతలారా! అపాంనపాతాగ్నీ! దేవతలను గురించిన హోమములందు మీ తరంగములను చేర్చండి. జలతరంగము సోమమునకు హితకరము. త్రాగినంత బలమును పెంచును - సంతసము కలిగించును. దీప్తి మంతము. దేవతలు సోమపానము చేయువారు కదా! అందువలన మీరు వారికి భాగధేయులై ఉన్నారు. మీకు స్వాహా.
(నాలుగు మారులు ఆజ్యహోమము చేయవలెను.)
4. ఆజ్యమా! నీవు జలమునకు ఇష్టము కాకున్నావు. నిన్ను తొలగించుచున్నాను.
(దర్భచే ఉదకముపై హోమము చేసిన నేతిని తొలగించవలెను.)
5. జలములారా! సముద్రమువలె మీరు అక్షీణులై ఉండుటకు ఎత్తుచున్నాను.
(వసతీవరిని మైత్రావరుణచమసమున తీసికొనవలెను.)
6. అగ్నీ! నీవు యుద్ధములందు ఎవనిని రక్షించుచున్నావో - ఎవనినుండి హవిస్సులు అందుకొనుటకు వెళ్లుచున్నావో - అతడు శాశ్వతములగు ధనములు, అన్నములు కలవాడగుచున్నాడు.
పదునాలుగవ అనువాకము
(యాజ్యా, పురోనువాకము ప్రపాఠకాంతమున చెప్పబడుచున్నవి.)
1. పురోనువాక్య - అగ్నీ! నీవు భయంకరుడవు. శత్రువును నిరసించువాడవు. హవ్యవాహనుడవు. మరుత్తులకు బలమవు. మరుత్తులతో కూడుము. మరుత్తుల సైన్యమును నియంత్రించుము. నీ అశ్వములు వాయువేగములు. నీవు వాని మీద స్వారి చేయుచున్నావు. నీవు పోషకుడవు. యజమానులను పోషించుచున్నావు.
2. యాజ్య. అగ్ని యజ్ఞముల స్వామి. అరిభయంకరుడు. హోత. భూలోక, ద్యులోకములందు కర్మఫలమును ప్రసాదించువాడు. హిరణ్యరూపుడు.
ఋత్విజులారా! శత్రువు బారిన పడకమున్నే - మరణము దరిచేరకమున్నే అగ్నిని ఆశ్రయించండి.
3. పురోనువాక్య. అగ్నిహోత. యాగకర్త. యువకుడు. కవి. అగ్ని స్థానవాసి. సత్యవంతుడు. మానవులను పోషించువాడు. జఠరాగ్ని.
వేదికి దగ్గరలోని సుగంధస్థానమునందు అగ్ని ఆసీనుడై ఉన్నాడు.
4. యాజ్య. మేము నేడు దేవతలకు హవిస్సులు అర్పించినాము.అగ్ని వానిని మరింత రుచిగల వానిగా చేసినాడు. అగ్ని యజ్ఞజిహ్వుడు. అగ్ని మాకు లభించినాడు. పరిమళుడగు అగ్ని మా ఆయువును రక్షించవలెను. మా దరికి చేరవలెను.
5. పురోనువాక్య. అగ్ని ఆకసపు ఉరుమువలె గర్జించును. కాలుచున్న వాటిని ఆర్పుచు - పుష్పలతా గుల్మాదులను కలిగించుచు అగ్ని ఉరుమును గాత. అగ్ని పుట్టినంతనే దీపించినాడు. జగములను వ్యక్తము చేసినాడు. ద్యావాపృథ్వుల మధ్య సూర్యుడై ప్రకాశించుచున్నాడు.
6. యాజ్య అగ్నీ! నీవు ఘనుడవు. దేవతల ఆహ్వాతవు. రాత్రింబవళ్లు యజ్ఞహవిస్సులను ఏర్పరచుచున్నావు. నీ అనుగ్రహము లేనపుడు లోకములు - కాలిన పదార్థములవలె - నిస్సారములగును. నీ అనుగ్రహము కలిగినంత సకలలోకములు సౌభాగ్యవంతములగును.
7. పురోనువాక్య. అగ్నీ! నీ అవయవములు సారవంతములు. ఈ భూలోకము నందున్న ప్రజలకు ఎన్నో కోరికలు ఉన్నవి. అవి తీరుటకు ప్రజలు నీ వ్రతము చేయుచున్నారు.
8. యాజ్య. అగ్నీ! నీ రక్షణలందు మేము కామమ్ - కోరికలను అశ్యామ - పొందుచున్నాము. ధనిక అగ్నీ! సువీరలరయిన - సుపుత్రులను ధనమును అశ్యామ. వాజయన్తః - అన్నములను కోరునట్టి మేము వాజమ్ అభ్యశ్యామ.
జరారహిత అగ్నీ! నీ అనుగ్రహమున అక్షయకీర్తిని పొందుచున్నాము.





