Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    10. హిరణ్యహస్తుడు జగములకు ప్రాణదాత అగును. ప్రాణములు నిలుపువాడు అగును. ధనవంతుడు అగును. అతనిని ప్రతిరాత్రి స్తుతింతుము. అతడు అసురులను యాతుధానులను నిరాకరించును. యజనమునకు అభిముఖుడయి విచ్చేయును.

    (రాక్షస గుణముగలవారు రాక్షసులు. యాతుధానులు మాయావులు)

    11. సవితా ! నీ మార్గములు పూర్వ సిద్ధములు. వాటిమీద దుమ్ములేదు. అవి సుఖప్రయాణమునకు తగినవి. నీవు అట్టి చక్కని మార్గముల మీద రావలసినది. మమ్ము రక్షించవలసినది. మా గురించి దేవతలకు తెలియచెప్పవలసినది. ఇది మా ప్రార్థన.

        (ప్రథమ మండలమున ఏడవ అనువాకము సమాప్తము.)

                   ఎనిమిదవ అనువాకము - ముప్పది ఆరవ సూక్తము

              ఋషి - ఘోరపుత్రుడు కణ్వుడు, దేవత - అగ్ని, ఛందస్సు - బృహతి.   

    1. అగ్నిని నలుదిశల నుండి అనేకులు నుతింతురు. ఋత్విక్కులారా ! యజమానులారా ! బహుసంఖ్యాకులయిన మీ ప్రజల కొఱకు "మహ్యమ్ అగ్నిం" మహిమాన్వితమయిన అగ్నిని స్తుతులతోను, మంత్రములతోను పూజింపుడు. సూక్తేభిః వచోభి రీమహే    

    2. జవాపో అగ్నిం దధిరే జనులారా ! అగ్నిని నిర్వహించుడు. అగ్నీ ! మేము హవిస్సులతో కూడి నిన్ను యజింతుము. నీవు అన్నదాతవు. మా విషయమున మంచిమనసు కలవాడవు అగుము. మమ్ము రక్షించుము.

    3. అగ్నీ ! నీవు హోతవు. విశ్వవేదివి. దేవదూతవు. నీ కిరణములు ద్యులోకమును అంటుచున్నవి. నిన్ను గొంతెత్తి ప్రార్థించుచున్నాము. నీ వెలుగులతో లోకములు నింపుము.

    4. అగ్నీ ! వరుణుడు, మిత్రుడు, అర్యముడు దేవదూతవగు నిన్ను ప్రకాశింప చేయుచున్నారు. నీకు హవిస్సులు ఇచ్చు యజమానికి నీ సాయము లభించును. సంపదలు కలుగును.

    5. అగ్నీ ! నీవు హర్షకారణమవు దేవదూతవు. యజమానులకు ప్రభువవు. సకల కర్మలు నీయందే ఉన్నవి. దేవకర్మలన్నియు నీయందున్నవి.

    6. అగ్నీ ! నీవు యవ్వనవంతుడవు. భాగ్యవంతుడవు. సకల హవిస్సులు నీహోమమునకే అగుచున్నవి. నీవు మాకు సుమనస్కుడవు కమ్ము. వీరులయిన దేవతలను యజింపుము.

    7. అగ్నీ ! నీవు స్వప్రకాశకుడవు. యజమానులు నీకు నమస్కరించుచున్నారు. ఉపాసించుచున్నారు. శత్రువులను జయించుటకు ఏడుగురు హోతలచే నిన్ను జ్వలింప చేయుచున్నారు.

    8. అగ్నీ ! నీవు ధనవంతుడవు. హోమవంతుడవు. కణ్వ మహర్షి కోర్కెలను తీర్చినావు. దేవతలు శత్రువులను పారదోలినారు. శత్రువులను జయించినారు. గోవిషయమయిన యుద్ధములందు గుఱ్ఱముల ధ్వనివలె మాకు సంపదలు ప్రసాదించుము.

    9. అగ్నీ ! నీవు గుణాధికుడవు. దర్భలమీద ఆసీనుడవగుము. దేవతలకొఱకు ప్రజ్వరిల్లుము. మహాత్మా ! ధూమములేని వాడవయి ప్రశస్త దర్శకుడవు అగుము. "ప్రశస్త దర్శతమ్".

    10. అగ్నీ ! నీవు హవ్య వాహనుడవు. దేవతలు మనువును అనుగ్రహించినారు. నిన్ను మనువు యజ్ఞమున నిలిపినాడు. మేధావులయిన అతిథుల కూడినవాడు కణ్వుడు. అతడు ధనదాతవగు నిన్ను, వర్షదాతవగు ఇంద్రుని తన యజ్ఞమున నిలిపినాడు. ఇతర యజమానులు కూడ నిన్ను యజ్ఞములందు నిలిపినారు. స్తుతించినారు.

    11. మేధాతిథియగు కణ్వుడు సూర్యుని నుండి తెచ్చి అగ్నిని వెలిగించినాడు. ఆ అగ్ని అనేక కిరణములతో ప్రకాశించుచున్నది. అది మా ఋక్కులను, మమ్ము అభివృద్ధి చేయుచున్నది.

    12. అగ్నీ ! నీవు అన్నవంతుడవు. గుణవంతుడవు. దేవతల స్నేహము కలవాడవు. మాకు సుఖములను ప్రసాదించుము.

    13. యూప స్తంభమా? సూర్యునంతటి ఎత్తుగలదానవు అగుము. మాకు అన్నములు ప్రసాదించుము. నీకు నేయి పూయుచున్న ఋత్వికులు సహితముగా నిన్ను ఆహ్వానించుచున్నాము.

    14. యూపస్తంభమా ! ఉన్నతమైన దానవు అగుము. మాకు జ్ఞానము ప్రసాదించుము. పాపముల నుండి రక్షింపుము. "సమత్రిణందహ" రాక్షసులను దహింపుము. లోకమున సంచరించుటకు జీవించుటకు మమ్ము సమున్నతులను చేయుము. హవీ రూపధనమును దేవతలకు అందించుము.

    15. అగ్నీ ! నీవు పడుచువాడవు. "బృహద్భానో" గొప్పకిరణములు కలవాడవు. మాకు ఇవ్వవలసిన ధనము ఇవ్వక బాధించువారి నుండియు, రాక్షసులనుండియు, క్రూరజంతువులనుండియు, శత్రువులనుండియు మమ్ముకాపాడుము.

    16. అగ్నీ ! నీవు తపింపచేయు కిరణములు కలవాడవు. రాలతోను, కర్రలతోను కుండలను బద్దలు కొట్టుదురు. అట్లే మాకు ఇవ్వవలసిన ధనము ఇవ్వక బాధించువారిని కొట్టుము. ఆయుధములతో మామీదికి వచ్చు శత్రువులను బలమున మమ్ముమించకుండ చేయుము.

    17. అగ్ని వీర్యవంతుడు. అతడు మా మిత్రులను రక్షించినాడు. మేధావులు అతిథులుగాగల కణ్వునకు మంచి భాగ్యములు ప్రసాదించినాడు. అగ్నిని స్తుతించు యజమానులను అనుగ్రహించినాడు.

    18. తుర్వశుని, యదువును, ఉగ్రదేవునితో కూడిన అగ్నిని ఆహ్వానించుచున్నాము. శత్రుంజయుడయిన అగ్ని వాస్త్వుని, బృహద్రథుని, తుర్వీతుని ఇచటికి తీసికొని రావలెను.

    19. అగ్నీ ! నిన్ను జనుల కొఱకుగాను మనువు స్థాపించినాడు. నీవు యజ్ఞమున పుట్టినావు. కణ్వుడు నిన్ను హవిస్సులతో ప్రకాశింపచేసినాడు. మానవులు నీకు "నమస్యంతి" నమస్కరింతురు.

    20. అగ్ని జ్వాలలు జ్వలించుచున్నవి. భయంకరముగా ఉన్నవి. అశక్యముగా ఉన్నవి. అగ్నీ ! నీవు బలవంతులగు అసురులను భస్మము చేయుము. మమ్ము బాధించు శత్రువులను రూపుమాపుము.

                                    ముప్పది ఏడవ సూక్తము

        ఋషి - ఘోరపుత్రుడు కణ్వుడు. దేవత - మరుత్తు. ఛందస్సు - గాయత్రి.


    1. కణ్వవంశీయులారా ! మరుత్తులు సంచార స్వభావము గలది. శత్రువులు లేనివి. రథమున ప్రకాశించునవి. మీకు బలములు ప్రసాదించుటకు మరుద్గణములను స్తుతించుడు.

    2. మరుత్తులు చుక్కల దుప్పుల వాహనములవారు. స్వయం ప్రకాశులు. గర్జనలు ఆయుధములుగా గలవారు. అనేక అలంకారములు గలవారు. వారు అట్లు అవతరించినారు. "అజాయంత స్వభానవః"

    3. మరుత్తుల చేతులలో కొరడాలున్నవి. అవి చేయు ధ్వని ఇచటి నుండియే వినవచ్చుచున్నది. ఈ ధ్వని యుద్ధమునందలి నానా ప్రకారముల ధ్వనులవలె ఉన్నది.

    4. ఋత్విజులారా ! మరుత్తులు మీ సంబంధీకులు. వారు నవ్వుల స్వభావపు వారు, శత్రుంజయులు, బలవంతులు. వారిని అన్నములకై అర్థింపుడు.

    5. మరుత్తులు గోవులయందు ఉన్నట్టివారు. ఇతరులకు లొంగనివారు. విహార స్వభావులు. శత్రుంజయులు. ఋత్విజులారా ! మరుత్తుల సంబంధమైన తేజస్సును స్తుతించుడు. అందుకు సంబంధించిన రసము ఉదరమున వృద్ధిచెందుతున్నది. జంభే రసస్య వావృధే

    6. వృక్షాగ్రమునువలె భూలోక ద్యులోకములను వడికించుచున్నారు కదా! కోవా వర్షిష్ఠ? మీలో అంత బలవంతులు ఎవరు?

    7. మరుత్తులారా ! మీది నిరుపమాన వేగము. కొండలను కదలించగలది. అందువలన గృహస్థుడు స్తంభములను నిలుపుకున్నాడు.

    8. యుద్ధమున ముసలి రాజు గడగడలాడును. అట్లే భూమి మరుత్తుల వేగమునకు గడగడలాడుచున్నది.

    9. మరుత్తుల బలము భూమ్యాకాశములకు విభజించబడినది. ఆ రెండింట నిండి ఉన్నది. అందుకే మరుత్తుల జన్మస్థలమగు ఆకాశము స్థిరముగా ఉన్నది. వారి తల్లులగు పక్షులు ఆకసమున ఎగురుచున్నవి.

    10. మరుత్తులు మాటలకు జన్మదాతలు. వారి ధ్వనికి జలములు అల్లకల్లోలము అగును. గోవులు అంబారావములు చేయుచు కాళ్లు ఎగురవేసి పరిగెత్తును.

    11. మేఘములు విశాలములు. నీటిచుక్క నేలరాలకుండ ధరించునవి. లొంగనివి. కాని మరుత్తులు మేఘములను ఉరికించుచున్నారు !

    12. మరుత్తులారా ! మీరు బలవంతులు. జనులను తమ తమ పనులకు పురికొల్పుడు. మేఘములను సహితము పురికొల్పుడు. "గిరీరచుచ్యవీతన"

    13. వాయువు వీచునపుడు మార్గములు ధ్వనించును. ఆ ధ్వనిని ఏ ఒక్కరో వినగలరు !

    14. మరుత్తులారా ! రథములమీద త్వరత్వరగా బయలుదేరుడు ఋత్విజులు మీ కొఱకు వేచి ఉన్నారు. వారి సేవలను అందుకొనుడు. వారిని తృప్తినొందించుడు.

    15. మరుత్తులారా ! మేము మీ సేవకులము. మేము హవిస్సులు సమర్పించినాము. తృప్తినొందుడు. మాకు పూర్ణ ఆయుష్యము ప్రసాదించుడు. "విశ్వంచిదాయుర్జీవసే"

                                ముప్పది ఎనిమిదవ సూక్తము

    ఋషి - ఘోర పుత్రుడు కణ్వుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - గాయత్రి.

    1. స్తుతి ప్రియులగు మరుత్తులారా ! దర్భలను పరచినాము. తండ్రి తనపుత్రుని ధరించినట్లు మీరు దర్భలను ధరించుడు.

    2. మరుత్తులారా ! మీరు ఉన్నది ఎక్కడ ? ఎప్పుడు వత్తురని? భూలోకము నుండి కాక ద్యులోకము నుండి రండు. ఋత్విజులు మిమ్ములను గోవుల ధ్వనులను పోలినుతించుచున్నారు.

    3. మరుత్తులారా ! సుమ్నములు, ప్రజా పశురూప ధనములు ఎచట ఉన్నవి? సంపాదించదగిన సువితలు, మణిమాణిక్యాదులు ఎచట ఉన్నవి? సమస్త సౌభాగ్యములు గజాశ్వాదులు ఎచట ఉన్నవి ? వాటిని అన్నింటిని తీసుకొని రండు.

    4. మరుత్తులారా ! మీరు పృశ్నియను గోవునకు పుత్రులు, మర్త్యులు. అయినను మిమ్ము స్తుతించువాడు అమృతుడు అగును. అమృతఃస్యాత్

    5. గడ్డిని మృగము వదలలేదు. మరుత్తులారా ! అట్లే మిమ్ము స్తుతించువాడు మిమ్మువదలకుండవలెను. యముని బాటన పోకుండవలెను.

    (గాలివదలకున్న యముడు పట్టలేడు.)

    6. నిరృతి అణు రాక్షసి గొప్పది. ఎవ్వరు ఎదిరింపజాలనిది. మరుత్తులారా ! ఆ రాక్షసి మమ్ము బాధించకుండ దానిని నాశనము చేయుము. అది మా తృష్ణతోనే చచ్చునుగాత.

    (నిరృతి మన ఆశ. ఆశ నశించినపుడే నిరృతి పోవును)

    7. మరుత్తులు ప్రకాశించువారు. బలవంతులు. రుద్రుని అధీనపువారు. మరుత్తులు ఎడారులలో గాలిలేని వాన కురిపించుచున్నారు. ఇది సత్యము. సత్యంత్వేషా

    8. పాలునిండిన చన్నులు కలిగి అంబారావము చేయు గోవువలె విద్యుత్తు ధ్వనించుచున్నది. తల్లిదూడను తడిపినట్లు వాన తడుపుచున్నది. ఉరుములు, మెరుపులతో వానకురియుచున్నది.

    9. మరుత్తులారా ! మబ్బులు నీరు మోయుచున్నవి. వాటిలో  మీరు పగలే చీకటి చిమ్మించుచున్నారు. భూమిని తడుపుచున్నారు. పృథివీం వ్యున్దన్తి

    10. మరుత్తుల గర్జనలకు భూమిమీద ఇండ్లన్నియు వడకును. మనుష్యులు కూడ వడకుదురు. అరేజన్త ప్రమానుషాః   

    11. మరుత్తులారా ! మీ చేతులకు మహిమలు ఉన్నవి. మీరు నదుల దరులను కదిలింతురు. మాదరికి చేరుదురు.

    12. మరుత్తులారా ! మీ రథపునేమి భద్రముగా ఉండవలెను. అశ్వములు స్థిరములయి ఉండవలెను. కళ్ళెములు చక్కగా అమర్చబడవలెను.

    13. ఋత్విజులారా ! మంచివాక్కులతో మరుద్గణములను, అగ్నిని, దర్శనీయుడగు మిత్రుని నుతింపుడు.

    14. ఋత్విజులారా ! గాయత్రి ఛందస్సున స్తోత్రములు రచింపుడు. వానితో మేఘుడు వర్షముతోవలె మమ్ము ఆనందింప చేయుడు.

    15. ఋత్విజులారా ! మరుద్గణము దీపించునది. స్తవనీయము. పూజనీయము. మరుద్గణములకు ప్రణమిల్లుడు. మా యజనములవలన మరుత్తులు మరింత వృద్ధిపొందవలెను. అస్మే వృద్ధా అసన్నివ




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.