Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    తెల్లవారింది . సత్యవతి వ్యాసుని చూచింది . "అమ్మా! అంబాలికకు బలపరాక్రమములు గల పుత్రుడు పుట్టును. కాని ఆమె యందు దోషము వలన పాండు దేహుడగును."
    సత్యవతి వ్యాసుని మాటలు విన్నది. ఆమె మనసు ఏడ్చినది. అంబిక యందు మరొక పుత్రుని ప్రసాదించమని కోరినది. వ్యాసుడు అంగీకరించినాడు. ఆనాటి రాత్రి అంబిక తన దాసిని నియమించినది. ఆనాటి రాత్రి వ్యాసుడు దాసితో సంగమించినాడు. వెళ్ళిపొయినాడు.
    కాలము గడచినది. అంబికకు గుడ్డి బిడ్డడు పుట్టినాడు. అతడు దృతరాష్ట్రుడు . అంబాలికకు తెల్లని ఓడలు గలవాడు పుట్టినాడు. అతడు పాండురాజు.
    దాసికి వేదవ్యాసుని వలన పుత్రుడు జన్మించినాడు. అతడు విదురుడు.
    ఈ విధముగా భరతవంశ రక్షణకు, భారత రచనకు కారకుడు అయినాడు వ్యాస మహర్షి.
    
                                              ఆలోచనామృతము
1. మానవుని ఇతిహాసము సుదీర్ఘము. ఆలోచించగా అది అనంతము అనిపించును. దానికి మనము ఏర్పరచుకున్న కొలబద్దలు చాలవు. ఈ మానవ జీవనస్రవంతి ఎటు నుండి మొదలయినదో, ఎటునుంచి సాగినదో, ఎన్ని మలుపులు తిరిగినదో లెక్కించుట అసాధ్యము. పాశ్చాత్య జీవనము ఇటీవలిది. వారు దానిని కొలుచుటకు ప్రయత్నించుచున్నారు. అది వారి చేతికి అంధనంత దూరమున ఉన్నది. భారత జాతీయ ఇతిహసమును లెక్క కట్టుట అసాధ్యము. అందుకే యుగముల కింద లేక్కించినారు.
    మానవుడు జంతుదశ నుంచి మొదలయినాడు. స్వేచ్చా జీవి. అతడు ఇతరులకు లొంగడు. అట్టివానిని ఒక కుటుంబముగా , ఒక జనపదముగా, ఒక రాష్ట్రముగా, తీర్చిదిద్దుటకు ఎందరు మహర్షులు, ఎందరు మహానుభావులు తమ మేధలను కప్పురముగా అర్పించినారో చరిత్రకు అందని విషయము.
    ఆచారములను ఏర్పరచుట దుర్లభాతి దుర్లభము. ఎంతో పరిశ్రమ తరువాత ఒక అంశము కనుగొనవచ్చును. కనుగొన్న అంశమును ఆ సేతు హిమాచల పర్వంతము ప్రచారము చేయుటకు ఎన్ని సంఘములు కృషి చేసినవో చెప్పుట కష్టము. ఒట్టి ప్రచారము మాత్రమూ చాలదు. మానవులచేత ఒప్పించి, వారి సహకారము పొంది, అమలుపరుచునట్లు చేయుట ఎంతో కష్టమయిన పని.
    దీర్ఘతముడు అట్టి ఒక అచారమును ఏర్పరచిన వాడుగా కనిపించుచున్నాడు. అతడు పుట్టు గుడ్డి, కాని విద్వాంసుడు, శాస్త్రజ్ఞుడు. అతని భార్య ప్రద్వేషిణి అనుకూలవతిగానే ఉన్నది. కొంతకాలమునకు ఆమెకు విసుగు కలిగినది వదిలివేసినది.
    స్త్రీలు స్వేచ్చాచారిణులు. సంపదలు ఉడిగినప్పుడు భర్తలను వదిలివేతురు. అను విషయము రామాయణమున చెప్పబడినది. అప్పుడు దీర్ఘతముడు ఆలోచించినాడు. భార్యలు మధ్య జీవితమున వదలివేసిన ఏమగును? అతని జీవితమూ నట్టేట కొట్టుకొని పోయినట్లు అగును. అందువలన భర్తలను భార్యలు వదలకుండుటకు కొన్ని నియమములు ఏర్పరచినాడు. శాపము సంకేతము మాత్రమే. గాంధారి దృతరాష్ట్రుని వెంట జీవితాంతము ఉండుటకు దీర్ఘతముని పూర్వ కృషి ఎంతో సహకరించినది.
    ఆనాడు ఏర్పడిన ఆచారము ఈనాటి పరిస్థితులు దృష్టి యందుంచుకొని పరిశీలించుట సరికాదు. అప్పటి పరిస్థితులు దృష్ట్యా అధ్యయనము చేయవలెను.
    అతి స్వేచ్చ మానవునకు అనర్ధదాయకము.
2.  ఇచట మరొక విచిత్రమయిన ఆచారమున్నది. అది దేవర పద్దతి. సంతానము లేనపుడు భార్యను మరొకరికి అర్పించి సంతానము పొందుట. ఇది సుమారు నేటి కృత్రిమ గర్భధారణ వంటిది. సంతానము కలిగించుటకు బ్రాహ్మణులనే ఎన్నుకున్నట్లు కనిపించుచున్నది. బ్రాహ్మణులు మేధావులు. లేదా మేధావులు అయినవారే బ్రాహ్మణులు. తమకు కలుగు సంతానము మేధావంతులు కావలెనని కోరుట సహజము. అందుకు బ్రాహ్మణులను ఎన్నుకున్నారు.
    సహజముగా దొరికినది ఎట్టిదయినను భరించవలె. ఎన్నుకొనవలసి వచ్చినపుడు మంచి పదార్ధమును ఎన్నుకొనుట మానవ గుణము. తన భార్య వలన తనకు గలిగిన సంతానము ఎట్టిడయిన భరించును. తన భార్యకు మరొకరి వలన సంతానము కలుగావలెననిన ఉత్తముని ఎన్నుకొనుట సహజము.
    ఈ ఆచారము మంచిది కాదు. అందువలన అనేక దుష్పరిణామములు కలుగును. అందుకే అట్టి ఆచారము అంతరించినది.
    విచిత్రము ఏమనిన మనము కొన్ని వేల సంవత్సరముల పూర్వము ప్రయోగించి విడిచిన దానిని పాశ్చాత్యులు ప్రారంభించుచున్నారు.
    అమెరికాలో ఒక విచిత్రమయిన ప్రయోగము జరుపుచున్నారు. నోబెల్ బహుమతి పొందిన మేధావుల వీర్యమును సేకరించినారు. స్త్రీలకు దాని ద్వారా గర్భాదారణము చేయించినారు. వారికి కలుగనున్న సంతానము పరిశీలించనున్నారు.
3. కలుగనున్న సంతానము స్త్రీ మానసిక అవస్థ మీద ఆధారపడి ఉండును. అను సిద్దాంతమును ప్రవచించినాడు. వ్యాసునితో సంగమించినపుడు అంబిక కనులు మూసుకున్నది. గుడ్డివాడు పుట్టినాడు. అంబాలిక పాలిపోయినది. పాండురోగి పుట్టినాడు.
    స్త్రీ మానసిక స్థితికి, కలుగనున్న సంతానమునకు ఏదో దగ్గరి సంబంధమున్నట్లుంది. ఇందులో ఏదో సత్యము ఉన్నట్లు కనిపించుచున్నది.
    లైంగిక శాస్త్రజ్ఞులు ఇందును గురించి పరిశోధించవలసి ఉన్నది.

                                            పెద్దవాని పెండ్లి
    వేద వ్యాసుని వలన అంబికకు , అంబాలికకు సంతానము కలిగినది. దృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించినారు. వారు భీష్ముని రక్షణలో పెరుగుచున్నారు. వారికి ఉపనయనములు జరిగినవి. వారు వేద విద్యలు నేర్చినారు. ధనుర్విద్యలు నేర్చినారు. వారు పెద్దవారు అగుచున్నారు.
    వారు పెద్దవారు కావలెను. భీష్ముడు వారికి రాజ్యము అప్పగించవలెను. అంతవరకు రాజ్యమును భీష్ముడు పాలించుచున్నాడు. భీష్ముడు ధర్మమును అనుసరించి రాజ్యము పాలించినాడు. రాజ్యము బహుధా ప్రకాశించినది. పంటలు పుష్కలంగా పండినవి. భూములు లక్ల్ష్మీ యుక్తములయి విరాజిల్లినవి. పాడి పశువులు వర్దిల్లినవి. పాడిపంటలు పొంగిపొర్లినవి. జనులు తమ తమ వృత్తులను నిర్వర్తించినారు. ద్వేషములు మానినారు. స్నేహముగా మెలగినారు. హింస అంతరించినది. శాంతి విరాజిల్లినది. 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.