Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    21. తండుల పిష్టమా! నేను సవితృదేవత ఆజ్ఞానువర్తిని. నేను అశ్వినుల బహువులతోను, పూష హస్తములతోను నిన్ను పూర్తిగా కలుపుచున్నాను. జలము ఓషధులతోను, ఓషధులు జలముతోను కలియవలెను. రేవతి నదితో కలియవలెను. జలము మధురము, మధుర జలము రసమున రసము ఓషధులందు కలియవలెను.

    22. తండుల పిష్టమా! యజమానికి స్వర్గాదులు  కలుగుటకు గాను నిన్ను జలము మున్నగు వానిచే కలుపుదును. ఇది అగ్ని పురోడాశము. ఇది అగ్ని సోమ పురోడాశము.

    (అగ్ని మీద ఘృతమువేసి) ఘృతమా! నేను నిన్ను వర్షము నిమిత్తము అగ్నికి అర్పించుచున్నాను.

    (పురోడాశము అగ్నిమీద వేసి) పురోడాశమా! నీవు ప్రవర్గ్యమవు. నీవు సర్వాయువపు. నీవు ఉరు ప్రథాన స్వభావవు. కావున పూర్తిగ విస్తరించుము. యజ్ఞపతి నీకు సర్వాయువవు. నీవు ఉరు ప్రథాన స్వభావవు. కావున పూర్తిగ విస్తరించుము యజ్ఞపతి నీకు పూర్తి విస్తృతి ప్రసాదించును గాత. అగ్ని నీ పైపొరను మాడ్చకుండును గాత. సవిత నిన్ను శ్రేష్ఠ స్వర్గమునందు పరిపక్వము చేయునుగాత.

    23. పురోడశమా! భయపడకుము. కలత చెందకుము. ఈ యజ్ఞ సాధన పురోడాశము నిప్పుల మీద గ్లాని రహితమగును. అందువల్ల యజమాని సంతానము విపత్తుల నుండి గ్లాని రహిత మగును.

    ప్రోక్షణ జలమా! త్రిత - ద్విత- ఏకత కొరకు నిన్ను అందుకొను చున్నాను.

    24. హే స్ఫేన! నేను సవితృ దేవత ఆజ్ఞానువర్తిని. నేను నిన్ను అశ్వినుల బాహువుల తోను పూష హస్తముల తోనూ పట్టినామ. నీవు దేవతల నిమిత్తము యజ్ఞవేది నిర్మించుదానవు. నీవు ఇంద్రుని కుడిచేతివి. నీవు సహస్రధార, శతతేజ, తీక్ష్ణతేజము గల సాక్షాత్తు వాయువవే. నీవు ద్వాహతో వధః -శత్రువధకు బయల్వెడలినావు.

    (స్ఫన- కత్తి వంటి కర్ర పరికరము. దానితో వేది త్రవ్వుదురు)

    25. దేవయజన భూమీ! యజ్ఞార్థము నీయందున్న ఓషధులను తొలగింతును- వ్రేళ్లు తెగకుండ తొలగింతును.

    స్ఫనతో తొలగించిన మృత్తికా! నీవు గోవుల గోశాల వద్ద పడుము.(మట్టిని కుప్ప మీద వేయవలెను.)

    వేదీ! సూర్యుడు నీ మీద వర్షించవలెను.

    సవితా! మమ్ము ద్వేషించు వానిని - మేము ద్వేషించు వానిని  వందల కట్లు కట్టి భూమికి అట్టడుగున ఉన్న అంధతామిశ్ర నరకమున పడవేయుము. అక్కడి నుంచి వానికి విముక్తి కలిగించకుము - "మామౌక్"

    (ప్రకృతి విషయమున మానవుడు ఎంత ఉదాత్తముగ, ఎంత దయతో ప్రవర్తించుచున్నాడో గమనించవలెను. పొదలను తొలగించునపుడు మూలమును వ్రేళ్లను జాగ్రత్త  పరచుచున్నాడు! "మూలం ,మా హ్రింసిః")

    26. దేవయజన భూమి యజ్ఞవేదికి బహుదూరమున అసుర దైత్యులను బాధింతుము. (దగ్గరలో ఎట్టి హింస చేయము అని అర్థము.)

    త్రవ్వి తీసిన మృతికా! నీవు గోవులుండు స్థలమగు గోశాలకు చేరుము.

    వేదీ! నీమీద సూర్యుడు వర్షము కలిగించవలెను.

    సవితా! మేము ద్వేషించు- మమ్ము ద్వేషించు 'అరరుదైత్యాదులను వందల కట్లు కట్టి భూమికి అట్టడుగున ఉన్న అంధతా మిశ్ర నరకమున పదవేయుము. వానిని అక్కడి నుండి విడువకుము.

    అరరుదైత్యా! నీకు ద్యులోకమునకు ఆరోహించు శక్తి కలుగకుండవలెను. నీ రక్తము లేక వీర్యము ద్యులోకమున పడరాదు.

    (భూమిని రెండవ, మూడవ, నాల్గవసారి త్రవ్వుచు)

    మృత్తికా! నీవు గోవులుండు స్థలమగు గోశాలకు చేరుము.

    (అరరుడను వాడు రక్షసుడు. దేవతలు అతనిని భూమి అడుగునకు త్రోసినారని శతపథము. భ్రాతృవ్యో అరరుః అని తైత్తరీయము' శత్రువే అరరుడు అని)

    27. (తూర్పు దిశముఖముగా కూర్చుండి వేది త్రవ్వుటకు పశ్చిమ - దక్షిణ ౦ఉత్తర దిశలుగా స్ఛనతో మూడు రేఖలు గీయుచు)

    విష్ణూ! నిన్ను గాయత్రీ ఛందమున గ్రహింతును. త్రిష్టుప్ ఛందమున గ్రహింతును. జగతీ ఛందమున గ్రహింతును.

    వేది స్థలమా! నీవు శోభనవు. శాంతవు. సుఖ స్వరూపవు. ఆనందముగ ఆసీనయోగ్యవు. అన్నవంతవు. జలవంతవు. (ధరిత్రియే కదా ఇవన్నియు!)

    "సుక్ష్మాచాసి శివాచాసి స్యోనాచాసి సుషదా చాస్యూర్జస్వతీ చాసి పయస్వతీచ"

    28. మహావిష్ణో! పూర్వము -దేవాసుర సంగ్రామమునకన్న ముందు- జీవనదానము చేయగల పృథ్విని -దేవతలు స్వధల ద్వారా - చంద్రుని వైపు ప్రేరణ కలిగించినారు. యజన యోగ్యమగు చంద్రుని యందున్న అద్దానినే బుద్ధిమంతులగు బుత్విజులు యజింతురు.

    అగ్నీధ్రమా! ప్రోక్షించు తీర్థమును వేదిపై ఉంచుము.

    స్ఫన! నీవు శత్రువును వధించుము.

    ఆలోచనామృతము:

    పూర్వము దేవాసుర సంగ్రామము జరుగనుండెను. అప్పుడు దేవతలు దేవయజన భూమిని రక్షించ దలచినారు. దానిని చంద్రుని యందుంచినారు. తాము పరాజితులయినా పక్షమున దేవయజనము చేసి తిరిగి దైత్యులను జయించ దలచినారు. అదియే నేడు చంద్రునిలో మచ్చగా ఉన్నదను వృత్తాంతము మహీధర వ్యాఖ్యలో చెప్పబడినది.

    భూమి దేహమగును. సద్బుద్ధి యజన భూమి యగును. సద్బుద్ధి చంద్ర స్వరూపమగు మనసున నిలిపిన లోక కళ్యాణమగును.

    29. స్రువమును ఎత్తి అగ్నికి తాకించుచు స్రువమా! రాక్షసులు ప్రతి దగ్ధులైనారు. అదాతలు ప్రతి దగ్ధులైనారు. రాక్షసులు పూర్తిగా కాలినారు. అదాతలు పూర్తిగా కాలినారు. నీవు అతి తీక్ష్ణాకృతివి కావు. అయినాను శత్రుచ్ఛేదము చేయుదానవు. హవిరన్న వంతవగు నిన్ను యజ్ఞదీప్తి కొరకు శుద్ధి చేయుదును.

    జుహువా! రాక్షసులు ప్రతిదగ్ధులైనారు. అదాతలు ప్రతి దగ్ధులైనారు. రాక్షసులు పూర్తిగా కాలినారు. అదాతలు పూర్తిగా కాలినారు. నీవు అతి తీక్ష్ణాకృత్తికావు. అయినను శత్రుచ్ఛేదము చేయుదానవు. హవిదన్న వంతవగు నిన్ను యజ్ఞదీప్తి కొరకు శుద్ధి చేయుదును.

    (స్రువము, జుహువు యజ్ఞోపకరణములు)

    30. (ముప్పేట పేనిన త్రాటిని గార్హపత్యాగ్నికి దక్షిణ భాగమున కూర్చున్న యాజమాన పత్ని నడుముకు కట్టి)

    రజ్జూ! నీవు పృథ్విని బంధించు రజ్జువవు. దక్షిణపాశమా! నీవు యజ్ఞమందు వ్యాపన శీలవు.

    అజ్యమా! అన్న ప్రాప్తికిగాను నిన్ను అహింసక చక్షువున చూచెదను. నీవు అగ్నికి జిహ్వవు. దేవతలకు సంతృప్తివి. యజ్ఞము నిమిత్తము నీవు నాకు ప్రతిచోట లభించుము.

    31.ఆజ్యమా! నేను సవితృ దేవుని అజ్ఞానువర్తిని. నేను నిన్ను అచ్ఛిద్ర  పావన పవనమందును సూర్యుని రశ్మి యందును పవిత్రము చేయుదును.

    ప్రోక్షణ తీర్థమా! నేను సవితృ దేవుని ఆజ్ఞానువర్తిని. నేను నిన్ను  అచ్ఛిద్ర   పావన పవనమందును -సూర్యునిరశ్మి యందును పవిత్రము చేయుదును.

    ఆజ్యమా! నీవు తేజమవు. బలవీర్యమవు. అమృతమవు. అందరి చిత్తవృత్తులు ధరించు స్థానమవు. దేవతలకు ప్రియమగు అనాదర్షత యజ్ఞ సాధనమవు.

    "తేజోసి శుక్రమస్య మృతమసి ధామనామసి ప్రియం దేవానామదృష్టం దేవయజనం మసి"

       

                                     దాశరథి రంగాచార్య విరచిత
                     శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
                                 తొలి అధ్యాయము సమాప్తము.
                                     సర్వేపి సుఖినస్సంతు




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.