Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    3. అగ్నీ ! నీవు శ్రేష్ఠుడవు. తండ్రి కొడుకునకువలె, బంధువు బంధువునకువలె, మిత్రుడు మిత్రునకువలె నా కోరికలు తీర్పుము.

    4. అగ్నీ ! వరుణుని యజ్ఞమునకువలె, ఆర్యముని యజ్ఞమునకువలె, నరులు ప్రజాపతి యజ్ఞమునకువలె, నీవు మా యజ్ఞమునకు విచ్చేయుము. ఆసీనుడవుకమ్ము.

    (వరుణుడు, ఆర్యముడు అగ్నికి బంధువులు. తనను బంధువుగా భావించమని యజమాని ప్రార్ధన)

    5. అగ్నీ ! నీవే హోమములు కలిగించువాడవు. మా యజ్ఞములకు సంతసింపుము. మా స్తుతులకు ప్రసన్నుడవు అగుము.

    6. హవిస్సులు నిత్యములు, విస్తారములు. వానితో అన్యదేవతలను పూజించుచున్నాను. అయినను ఆ హవిస్సులు అన్నియు నీకే చెందుచున్నవి. త్వే ఇద్ధూయతే హవిః

    7. అగ్ని ప్రజాపాలకుడు, హోమ కారకుడు, శ్రేష్ఠుడు. అతడు ఆనందించవలెను. మాకు హితుడు కావలెను. మేము ప్రియమయిన అగ్నివంతులము కావలెను. ప్రియాః స్వగ్నమోవయం

    8. అగ్నీ ! నీవు వెలుగులవాడవు. ఋత్విజులు అర్పించు హవిస్సులు ధరించినవాడవు. మేము పవిత్రాగ్నివంతులము అయినాము. నిన్ను యాచించుచున్నాము.

    9. అమృతాగ్నీ ! మేము మర్త్యులము. నీకు హవిస్సులు అందింతుము. హోమము ముగిసిన వెనుక ఉభయులము మంచిగ మాట్లాడుకుందము. మిథః పస్తు ప్రశస్తయః

    10. బలములకు పుత్రుడవగు అగ్నీ ! ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు కలవాడవయి మా యజ్ఞమునకు రావలసినది. మా స్తుతులను సేవించుము. మాకు ఆహారము ప్రసాదించుము.

                  ఇరువది ఏడవ సూక్తము, ఋషి - శునశ్శేఫుడు,

    దేవతలు 1 -12 అగ్ని, 13 విశ్వేదేవతలు, ఛందస్సు 1-12 గాయత్రి, 13 త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు యజ్ఞములకు రాజువు. గుఱ్ఱము తోకతో ఈగలను తోలుకొనును. నీ సాయమున మేము శత్రువులను తోలుచున్నాము. నీవు నమస్కరించుచున్నాము.

    2. అగ్ని బలములకు పుత్రుడు. వేగవంతుడు. సుఖప్రదాత. మా కోర్కెలను తీర్చుటకు వర్షించవలెను.

    3. అగ్నీ ! నీవు సర్వగమనుడవు. మమ్ము దూరము నుండి రక్షింపుము. దగ్గర నుండి రక్షింపుము. నరులు ఎక్కువ నష్టము కలిగించువారు. వారినుండి రక్షింపుము.

    4. అగ్నీ ! ఈ ఎదుట జరుగుచున్న హవిర్దానమును గాయత్రీఛందో బద్ధమయిన ఈ స్తుతిని దేవతలకు ఎరిగింపుము.

    5. అగ్నీ ! ద్యులోకమునందలి ఆహారమును, అంతరిక్షమునందలి ఆహారమును భూలోకము నందలి సంపదలను మాకు ప్రసాదించుము.

    6. వింతకాంతులవాడా ! నదులు తమ తరంగములచే కాలువలను సంపన్నము చేసినట్లు, నీవు మా కోర్కెలను తీర్చుము. (నదులకు కాలువలు తీయు పద్ధతి ఆనాటికి తెలిసినట్లున్నది.)

    7. అగ్నీ ! నీవు యుద్ధములకు ప్రేరేపించిన నరుడు, నీవు యుద్ధమున గెలిపించిన నరుడు శాశ్వత యశస్సుగలవాడు అగుచున్నాడు. పయంతా శశ్వతీరిషః

    8. అగ్నీ ! నీవు శత్రుజయుడవు. నీభక్తుడు అగు యజమానిని గెలువగలవారు లేరు. తని శౌర్యమును అనేకులు వినగలరు.

    9. విశ్వహితుడవగు అగ్నీ ! ఆశ్వయుధ్ధముల తరింపచేయుము. విద్వాంసుల స్తుతులకు సంతుష్టుడవగుము. ఫలప్రదాతవు అగుము.

    10. స్తోత్రప్రియుడవగు అగ్నీ ! యజమానులను అనుగ్రహింపుము. వారి దేవయజన స్థానముల ప్రవేశింపుము. వారు ఉగ్రుడవు అగు నిన్ను ఉత్తమముగ స్తుతింతురు.

    11. అగ్ని అప్రమేయుడు. ధూమధ్వజుడు. కాంతులు విరజిమ్మువాడు. అతడు మా బుద్ధి బలమును వృద్ధిచేయవలెను. ధియే వాజాయ హిన్వతు

    12. నరనాధుడు, దేవసంబంధి, దేవదూత, కిరణ్మయుడు అగు గ్ని ధనపతివలె మాస్తుతులను వినవలెను.

    13. బలవంతులకు నమస్సులు. దుర్భలులకు నమస్సులు. యువకులకు నమస్సులు. వృద్ధులకు నమస్సులు. మేము సమర్ధులము కావలెను. దేవతలను పూజించవలెను. శ్రేష్ఠులను ప్రశంసించుటలో లోపము రానీయము.

             ఇరువది ఎనిమిదవ సూక్తము, ఋషి - శునశ్శేషుడు

        దేవతలు - వేరు వేరు, ఛందస్సు 1-6 అనుష్టుప్, 7-9 గాయత్రి.

    1. ఇంద్రా ! ఇది రోలు, రోకలిని ఉపయోగించి పిండి తీసిన సోమరసము. దరికిచేరుము సేవింపుము.

    2. ఇంద్రా ! రెండు పిరుదులవంటి రాతి పలకలతో పిండి సోమరసమును తీసినాము. దరికిచేరుము. సేవింపుము.

    3. యజమాని పత్ని యజ్ఞశాలయందు ప్రవేశించి, నిర్గమించినపుడు రోటిలో దంపిచేసిన సోమరసపు దరికి చేరుము సేవింపుము.

    4. గుఱ్ఱము కళ్లెమువలె కవ్వమునకు త్రాడుచుట్టి త్రిప్పి రోటిలో దంపిన సోమరసపు దరికి చేరుము. సేవింపుము.

    5. ఉలూఖమా - రోలా ! ధాన్యము దంచుటకు ప్రతి ఇంట ఉందువు. అయినను వైదిక కర్మలందు జయశీలురదుందుభివలె గంభీర స్వనము చేతువు.

    6. రోలురూపపు వనస్పతీ ! నీ ఎదుటనే గాలి వీచుచున్నది. నీవు ఇంద్రుని కొఱకు సోమము పిండుము.

    (రోకలి దంచునప్పటి లయను వర్ణించినాడు)

    7. రోలు - రోకలి రూపమున ఉన్న వృక్షములారా ! మీరు సోమరసము పిండుదురు. అందువలన దర్శనీయులు.

    8. రోలు రోకలి రూపమున ఉన్న వృక్షములారా ! మీరు సోమరసము పిండుదురు. అందువలన దర్శనీయులు.

    ఇంద్రుని కొఱకు సోమము తీయుడు. ఇంద్రాయ మధుమత్సుతమ్

    9. రోటిలోని సోమ రసమును జల్లెడలో పోయుము. జల్లించిన సోమమును తోలు తిత్తిలో నింపుము.

    ఆలోచనామృతము :

    1. ఇది మానవ నాగరకతలో మహత్తర ఘట్టముగా కనిపించుచున్నది. ఇది రోలు రోకలి కనుగొన్న శుభవేళ ! లేనివాడుగాని ఉన్ననాటి విలువతెలియదు. రోలులేనినాడు కొత్తగా కనుగొన్న ఆనందము పురివిప్పి ఆడుచున్నది.

    రోలు, రోకలి కనుగొన్న తొలిగడియలోని ఆశ్చర్యము, ఆతురత, అనుభవము, అలలమీద ఆడుచున్నది. ఇంటింట రోలు, రోకటి లయను గొప్పగా వర్ణించినాడు !

    రోలు, రోకలి కర్రవి. అంతకు ముందు రాతివి ఉండెనో? తొలిసారి కర్రవే అనుగొనిరో !

    పనిముట్లమీద నాగరకత ఆధారపడుతున్న పాశ్చాత్యుల సూత్రము భ్రమగా కనిపించుచున్నది. రోలు సైతము లేనివాడు ఎంత ఉన్నతముగా ఆలోచించినారు ! ఎంతటి సదాశయములను వెలువరించినారు !

    పనిముట్ల ప్రగతితో మానవుడు సంకుచితుడు అగుచున్నాడు !!!

    రోలురోకలి, రుబ్బురాయి, కవ్వము, తిత్తి ఇచట కనిపించినవి.

    ప్రాణము లేనివి అయినను అవి సమాజమునకు పనికి వచ్చినవి. పనికి వచ్చినందుకు వాటిని దేవతలవలె పూజించినారు ! ఎంతటి కృతజ్ఞత !!

    నేటికిని మనము ఉపకరణములను శుభకార్యములందు, ప్రత్యేక దినములందు పూజించుచున్నాము.

        ఇరువది తొమ్మిదవ సూక్తము, ఋషి-శునశ్శేషుడు, దేవత-ఇంద్రుడు,
                                     ఛందస్సు - పంక్తి.


    1. ఇంద్రా ! నీవు సోమపాయివి. సత్యవాదివి. మేము ప్రశస్తులముకాము. అయినను మాకు వేనవేల గోవులను, అశ్వములను శుభప్రదములను ఇమ్ము. మమ్ము ప్రశస్తులను చేయుము.

    2. ఇంద్రా ! నీవు శక్తిమంతుడవు. అందగాడవు. కార్యశూరుడవు. మాకు వేనవేల గోవులను, అశ్వములను, ఇతర శుభప్రదములను ఇమ్ము. మమ్ము ప్రశస్తులను చేయుము.

    3. మాకు కలుగు దుర్గతులకు తెలివి తప్పింపుడు. మరల తెలివిరాకుండ చూడుము. మాకు వేనవేల గోవులను, అశ్వములను, ఇతర శుభప్రదములను ఇమ్ము. మమ్ము ప్రశస్తులను చేయుము.

    4. మా శత్రువులు స్పృహ లేకుండవలెను. మిత్రులు స్పృహ కలిగి ఉండవలెను. మాకు గోవులను, అశ్వములను ఇతర శుభప్రదములను ఇమ్ము. మమ్ము ప్రశస్తులను చేయుము.

    5. ఇంద్రా ! తమ పాప వచనములతో మాకు అపకీర్తి కలిగించు గార్దభములవంటి శత్రువులను సంహరింపుము. మాక్కు వేలవేల గోవులను, అశ్వములను, శుభప్రదములను ఇమ్ము. మమ్ము ప్రశస్తులను చేయుము.

    6. వంకరనడకల విపరీత వాయువులు మమ్ము విడిచి దూరముగా అడవులు దాటి పోవునట్లు చేయుము. మాకు వేనవేలగోసులను, అశ్వములను, శుభప్రదములను ఇమ్ము. మమ్ము ప్రశస్తులను చేయుము.

    7. ఇంద్రా ! మా మీద పగబట్టిన వారిని వధింపుము. మమ్ము హింసింపదలచినవారిని వధింపుము. మాకు వేనవేలగోవులను, అశ్వములను, శుభప్రదములను ఇమ్ము. మమ్ము ప్రశస్తులను చేయుము.

    ఆలోచనామృతము :

    ధనమును ఆర్జించుట సులభము. రక్షించుట దుర్లభము. ధనరక్షణకు అడ్డువచ్చు వానిని వివరించినాడు. వాటిని దూరము చేయుటకు ప్రార్ధించవలెను. ప్రయత్నించవలెను.

        ముప్పదవ సూక్తము-ఋషి-శునశ్శేఫుడు, దేవతలు 1-16 ఇంద్రుడు, 17-19
        అశ్వినులు, 20-22 ఉషస్సులు, ఛందస్సు - 16 త్రిష్టుప్, తక్కినవి గాయత్రి.


    1. ఇంద్రుడు ఘనుడు, శతక్రతువు. మేము అతని నుంచి ఆహారములు ఆశించుచున్నాము. గుంతను నీటితో నింపినట్లు - ఇంద్రుని సోమరసమున అభిషేకింతుము.

    2. పాలు మరిగించి సోమముతో చేసిన దానిని "అశిరము" అందురు. వందల వేల కొలది అశిరములు నీరు పల్లమును చేరునట్లు ఇంద్రుని చేరుచున్నవి.

    3. అశిరముల వందల వేల ధారలు సముద్రమునకు నదులు చేరునట్లు ఇంద్రుని ఉదరమున చేరుచున్నవి. అవి ఇంద్రుని బలమును పెంపొందించును.

    4. గర్భధారణ యోగ్యతగల ఆడ పావురమును మగ పావురము వేగవంతముగ చేరును. ఆవిధముగనే ఈ సోమములు, మా స్తవములు ఇంద్రుని చేరును.

    5. ఇంద్రుడు ధనములకు అధిపతి. శూరుడు. ఈ స్త్రోత్రములు, సంపద, సత్యము ఇంద్రునకు ప్రియములు కావలెను.

    6. శతక్రతువా ! ఈ యుద్ధమున మా రక్షణ కొఱకు ఉత్సాహవంతుడవయి ఉండుము. ఇతర కార్యముల విషయమునను చక్కగా యోచింపుము.

    7. పనికి పనికి ముందు, యుద్ధము యుద్ధమునకుముందు, మిత్రునివలె ఇంద్రుని ఆహ్వానింతుము సఖాయ ఇంద్రమూతయే

    8. ఇంద్రుడు మా పిలుపులను వినును. వెంటనే వేలకొలది రక్షణలతోను, ద్రవ్యములతోను మాదరికి చేరును.

    9. ఇంద్రుని - పూర్వము మాతండ్రి పిలిచి ఉన్నాడు. ఆ స్థానమునుండియే యజమానికొఱకు విచ్చేయవలసినదని ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.

    10. ఇంద్రా ! నిన్ను ఎల్లరు కోరుదురు. ఎల్లరు పిలచెదరు. ఎల్లరు నిన్ను మిత్రుని చేసికొందురు. అటువంటి నిన్ను స్తుతించవలసినదని స్తుతికర్తలను ప్రార్ధించుచున్నాము.

    11. ఇంద్రా ! నీవు సోమపాయివి. సఖుడవు. వజ్రివి. మా సోమములను రక్షించుము. మాకు దీర్ఘనాసికలయిన గోవులను ప్రసాదించుము.

    12. ఇంద్రా ! నీవు సోమపాయివి. సఖుడవు. వజ్రిని. మా కోరికలు నీ ఇష్టప్రకారము తీరును. మా అభీష్టములు నీ అనుగ్రహమును బట్టి నెరవేరును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.