Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    5. రాత్రి చప్పుడు కాకుండ పడుకొని నగరపు వెనుక భాగమును కూల్చినాడు. సముద్రమువంటి ఆ గుహయొక్క మూడు ద్వారములను తెరచినాడు. ఉదయమైనంత సూర్యుని, గోవులను ఒకేసారి చూచినాడు. అప్పుడు గోవులు మేఘగర్జన వంటి ధ్వనులు చేసినవి.

    6. గోవులను నిలిపి ఉంచిన బలమును బృహస్పతి ఆయుధముచే హుంకారముననే చెదరగొట్టినాడు. మరుత్తులను కలిసికొనదలచిన ఇంద్రుడు వారి పాపములను పిడిపించినాడు - గోవులను విడిపించినాడు.

    7. సత్యవాదులు, దీప్తిమంతులు, ధనదాతలగు వారి సాయమున అతడు ఆవులను కట్టిపెట్టిన వారి బలమును అణచివేసినాడు. వర్షక, జలదాత, ప్రదీప్తగమన మరుత్తుల సహితుడైన సామస్తోత్రాధిపతి గోధనముపై అధికారము సాధించినాడు.       

    8. మరుత్తులు సత్యచిత్తులై తమ ప్రయత్నమున గోవులను సాధించియు, బృహస్పతిని గోపతిని చేయదలచినారు. పరస్పర సహాయమున మరుత్తులతో కలిసిన బృహస్పతి గోవులను వెలికి తీసినాడు.

    9. బృహస్పతి అంతరిక్షమున సింహమువలె గర్జించువాడు. కోరికలు తీర్చువాడు. విడయుడు. మేము రుత్తులము అతనిని వర్థిల్లచేయ దలచినాము. వీర, శూరుల యుద్ధమున మంగళమయ స్తుతులతో అతనిని స్తుతిస్తాము.

    10. బృహస్పతి నానారూప అన్నములు కలవాడైనపుడు అంతరిక్షమునకు ఆరోహించునపుడు సకల దిశలందు వెలుగులు చిమ్ము దేవతలు అతనిని నోటితో స్తుతింతురు.

    11. దేవతలారా ! అన్నలాభము కొరకు నేను చేయు స్తుతులను సార్థకము చేయండి. మీ ఆశ్రయము కలిగించి నన్ను రక్షించండి. నా శత్రువులు నశించవలెను. లోకములను సంతోష పరచు ద్యావా పృథ్వులు మా విన్నపము వినవలెను.

    12. ప్రభువును, మహిమాన్వితుడునగు బృహస్పతి జలగర్భ మేఘముల తలనరికినాడు "మూర్ద్నాన భినదర్బదస్య" జలములను నిలిపి పెట్టిన శత్రువును హతమార్చినాడు గంగమున్నగు నదులను సముద్రమున కంపినాడు. ద్యావాపృథ్వులు, దేవతల సహితలై మమ్ము రక్షించవలెను.

                                   అరువది ఎనిమిదవ సూక్తము
                                           ఋష్యాద్యాః పూర్వవత్.

    1. రైతు పంటపొలము కాపాడుటకు పక్షులను పారద్రోలుటకు చేయుధ్వనివలెను- మేఘగర్జనవలెను- మేఘము పర్వతమును తాకినప్పటి శబ్దతరంగముల వలెను బృహస్పతి ప్రశంసాధ్వని వినిపించుచున్నది.

    2. బృహస్పతి అంగిరుల పుత్రుడు. అతడు గుహయందున్న గోవుల వద్దకు సూర్యకాంతిని తెచ్చినాడు. భగునివలె అతని తేజస్సు వ్యాపించినది. దంపతులను కలిపినట్లు అతడు గోవులను మానవులతో కలిపినాడు. బృహస్పతీ! యుద్ధములందు అశ్వములను వలె గోవులను ఉరికించుము.

    3. గరిశనుంచి ధాన్యము బయటికి తీసినట్లు బృహస్పతి పర్వతగుహనుండి గోవులను బయటికి తెచ్చినాడు. గవులు శుభప్రదదుగ్ధములిచ్చునవి. సతత గమనశీలలు. సహృదయణీయులు మనోహర వర్ణనలు, ప్రశంసనీయ మూర్తులు.

    4. బృహస్పతి గోవులను ఉద్ధరించి సత్కర్మకు ఆధారస్థానమగు యజ్ఞానుష్ఠానమును సుగమము చేసినాడు. అప్పుడు బృహస్పతి సూర్యుడు ఆకసమునుండి ఉల్కవిసిరినంతగా వెలిగినాడు. అతడు రాతిమూతను తొలగించినాడు. గోవులను విడిపించినాడు. అతడు గోవులగిట్టలతో భూమిని మేఘము వర్షముచే వలె విచీర్ణము చేయించినాడు.

    5. వాయువు నీటిమీది నాచును తొలగించినట్లు బృహస్పతి ఆకాశము నుండి అంధకారమును తొలగించినాడు. వాయువు మేఘములను వ్యాపింపచేసినట్లు బృహస్పతి తన ఆలోచనలతో బలాసురుని రహస్యస్థావరము నుండి గోవులను వెల్లడి చేసినాడు.

    6. హింసకుడగు బలుని అస్త్రమును బృహస్పతి యొక్క అగ్నితుల్యమై ఆర్పరాని అస్త్రము త్రుంచివేసినపుడు బృహస్పతి గోవుల మీది ఆధిపత్యము సాధించినాడు. నోటిలోనికి పోయిన పదార్థము దంతముల మధ్యనలిగి, నాలుకకురుచి కలిగించును. అట్లే గోవులను అపహరించిన ప్రాణులకు బృహస్పతి జనులకు ఆవుపాల రుచి చూపినాడు.

    7. గుహనుండి గోవుల శబ్దములు వినిపించినపుడే బృహస్పతి అందు గోవులు ఉన్నవని గ్రహించినాడు. పిట్ట గ్రుడ్డును పొదిగి పిల్లను తీసినట్లు - బృహస్పతి గోవులను గుట్టనుంచి బయటికి తెచ్చినాడు.

    8. కొద్ది నీటిలో కలవరపడు చేపలు కనిపించును. అట్లే బృహస్పతికి పర్వతమున బంధించిన మధుర గోవులు కనిపించినవి. చెట్టునుంచి సోమపాత్రనువలె బృహస్పతి గోవులను గుట్టనుండి బయటికి తెచ్చినాడు.

    9. గోవులను చూచుటకు బృహస్పతి ఉషస్సును ఆవిష్కరించినాడు సూర్యాగ్నుల ఉత్తమ తేజమున అంధకారములను నష్టపరచినాడు. ఎముకనుండి ములుగును తీసినట్లు బృహస్పతి బలాసురుని పర్వత బంధము నుండి గోవులను వెలికి తీసినాడు.

    10. హిమము పద్మపత్రములను హరించిన పగిది బృహస్పతి బలుని ఆవులను అన్నింటిని హరించినాడు. ఇది అననుకరణీయము. ఈ కార్యము సూర్యచంద్రులు ఉదయించి నంతటిది.

    (సూర్యచంద్రులు ఒకేసారి ఉదయించు నంతటి అసాధ్యాకార్యమది. అందువలననే అనుకరింపరానిది.)

    11. నల్లని గుఱ్ఱమును బంగారు నగలచే అలంకరించినట్లు పాలకులగు దేవతలు నల్లని ఆకసమును తెల్లని నక్షత్రములచే అలంకరించినారు. వారు చీకట్లను రాత్రి కొరకు, వెలుగులను పగటి కొరకు ఏర్పరచినారు. బృహస్పతి పర్వతములను బ్రద్దలు చేసి గోవులను సాధించినాడు.

    12. బృహస్పతి అనేక ఋక్కులు పలికినాడు. అంతరిక్షవాసి అయినాడు, అతనికి నమస్కరించు చున్నాము. బృహస్పతి మాకు గోవులు, అశ్వములు, సంతానము, భృత్యులను ప్రసాదించవలెను.

     (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ అష్టకము పదవ మండలమున అయిదవ అనువాకము సమాప్తము)

                ఆరవ అనువాకము             అరువది తొమ్మిదవ సూక్తము
        ఋషి - బధ్న్య శ్వపుత్ర సుమిత్రుడు. దేవత - అగ్ని. ఛందస్సు - 1-2, జగతి
                                            మిగిలినవి త్రిష్టుప్.   

    1. బధ్న్యశ్యుడు స్థాపించిన అగ్ని దర్శనీయము కావలెను. అతని ప్రసన్నత శుభప్రదము కావలెను. అతని యజ్ఞాగమనము శోభస్కరము కావలెను. మేము - సుమిత్రులము - అగ్నిని స్థాపింతుము. అప్పుడు అగ్ని ఘృతాహుతులు గ్రహించును. ఉద్దీప్తుడగును. మేము అట్టి అగ్నిని స్తుతింతుము.

    2. బధ్న్యశ్వుని అగ్ని ఘృతము వలననే వర్థిల్లినది. ఘృతమే అగ్నికి ఆహారమగును. అదియే అతనికి పుష్టి అగును. ఘృతాహుతులు అందుకున్న అగ్ని ఎంతో విస్తరించును. ఘృతము సమర్పించినంత అగ్ని సూర్యునివలె ప్రదీప్తుడగును.

    3. అగ్నీ ! మనువు నీ కిరణములను ప్రదీప్తము చేసినాడు. అట్లే నేను సహితము నిన్ను నూతన కిరణపుంజములచే ప్రదీప్తుని చేయుదును. నీవు ధనికుడవగుము. ప్రదీప్తుడవగుము. మా స్తుతులను స్వీకరింపుము. శత్రు సేనను చెదరగొట్టుము. ఇచ్చట అన్నము కలిగింపుము.

    4. బధ్న్యశ్వుడు తొలుత నిన్ను ప్రదీప్తుని చేసినాడు. నీవు మా దేహమును, గేహమును రక్షింపుము. నీవు మాకు ప్రసాదించిన వాటి నన్నింటిని రక్షించుము.

    5. బధ్న్యశ్వుని అగ్ని ప్రజ్వరిల్లవలెను. అగ్నీ ! రక్షింపుము. జనులను హింసించువారు నిన్ను ఓడించరాదు. వీరుని వలె శత్రువును ఎదిరించుము. నాశము చేయుము. బధ్న్యశ్వుని అగ్ని నామములను సుమిత్రుడను జపింతును.

    6. అగ్నీ ! పర్వతముల మీద పెరుగు ధనమును నీవు దస్యులనుండి గెలిచినావు. ఆర్యులకు ఇచ్చినావు. దుర్ధర్ష వీరుని వలె శత్రువును కొట్టుము. యుద్ధము చేయ వచ్చిన వారితో తల పడుము.

    7. ఈ అగ్ని సుదీర్ఘవిస్తృతము. ఇతడు ప్రధానదాత. సహస్ర స్థానములను ఆచ్చాదించువాడు. శత మార్గముల పయనించునాడు. ఇతడు ప్రదీప్తులకు పుత్రుడు. ప్రధాన పురోహితులు ఇతనిని అలంకరింతురు. అగ్ని దేవభక్తులగు సుమిత్రవంశీయుల గృహమున ప్రదీప్తుడగును.

    8. జ్ఞాని అగ్నీ ! నీవు ఇచ్చిన గోవును సులభముగా పితుకవచ్చును. దానిని పితుకుటకు ఎత్తి విఘ్నము కలుగదు. అది అప్రమత్తమై అమృతమువంటి పాలనిచ్చును. దేవభక్త సుమంత్ర వంశమునందలి ప్రధానవ్యక్తి దక్షిణ సంపన్నుడై నిన్ను ప్రజ్వలితుని చేయును.

    9. బధ్న్యశ్వుని అగ్నీ ! అమర దేవతలు నీ మహిమను గానము చేయుదురు. మానవులు నీ మహిమ తెలియుటకు సాగినారు. అప్పుడు నీవు అందరినేతలు, వర్థిల్లు దేవతలతో కలసి కర్మ విఘ్నకరులను ఓడించినావు.

    10. అగ్నీ ! తండ్రి కొడుకును వడిలోనికి తీసికొని ఎట్లు ఆలనపాలన చేయునో అట్లే నా తండ్రి నిన్ను సేవించినాడు. యువక అగ్నీ ! నీవు నా తండ్రినుంచి సమిధలు అందుకున్నావు. బాధించు శత్రువులను హతమార్చినావు.

    11. సోమరసము సమర్పించు వారలతో కూడి బధ్న్యశ్వుని అగ్ని సర్వదా శత్రువులను ఓడించినాడు. అకార తేజముల అగ్నీ! నీవు పట్టు పట్టి హింసకులను దహించినావు. ఎక్కువ ఎదిగిన హింసకులను అగ్ని హతమార్చినాడు.

    12. బధ్న్యశ్వ అగ్నీ! శత్రుహంతయగునతడు సదా ప్రజ్వలితుడు. నమస్కార యోగ్యుడు. బధ్న్యశ్వ అగ్నీ! సమస్త విజాతీయ శత్రువులను విజాతీయ హింసకులను ఓడించుము.


                                    డెబ్బదవ సూక్తము
        ఋషి - బధ్న్యశ్వ సుమిత్రుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ! ఉత్తర వేది మీద సమిధ ఏర్పరచినాను. గ్రహించుము. ఘృతశాలి సృక్కును అభిలషించును. ఉన్నత ప్రదేశమున నిలుపుము. మంచిరోజుకని జరుగు యజ్ఞమున జ్వాలలతోపైకి ఎగయుము.

    2. అగ్ని దేవతలకు అగ్రగామి. మానవులకు ప్రశంసనీయుడు. వివిధ వన్నెల గుర్రముల మీద ఈ యజ్ఞమునకు విచ్చేయవలెను. అగ్ని అత్యంతయోగ్యుడు. దేవతలందు ముఖ్యుడు అతడు హవిని అందుకొనవలెను.  

    3. యజమాని హవిర్దాత. అగ్ని సనాతనుడు. దూతకార్యమునకు అగ్నిని యజమాని స్తుతించును. అగ్ని రథములు, అశ్వములతో ఇంద్రాదులను తీసికొని యజ్ఞమునకు విచ్చేయ వలెను. హోతవగుము. ఈ యజ్ఞమున ఆసీనుడవగుము.

    4. కుశలు దేవతలు సేవించునవి వంకరవి పొడుగైనవి మా కుశములు సురభిళములు కావలెను. ఒర్హి అగ్నీ! ప్రసన్న చిత్తుడవగుము. హవికోరువారు ఇంద్రాది దేవతలు వారిని పూజించుము.

    5. ద్వాద దేవేరులారా! ఆకాశపు ఉన్నత స్థానమును అందుకొనండి, పృథ్వి అంతటి విశాలముగ విస్తరించండి. దేవాభిలాషులు కండి, మీ మహిమలతో దేవతలు అధిష్టించునదియు, విహారసాధనమగు రథమును సాధించండి.

    6. ఉష ప్రకాశమాన, ద్యులోక పుత్రి, ఆమెయు రాత్రియు యజ్ఞస్థానమునకు వేంచేయవలెను. అభిలాషిణిలు శోభన ధనులగు దేవులారా! మీ స్థానము విస్తృతము. మసీపస్థము. హవిని కోరు దేవతలను ఆస్థానములందు ఆసీనులు కావలెను.

    7. సోమాభిషవమునకు శిలలు కదిలినపుడు అగ్ని సమిద్దుడైనపుడు హవిధారక యజ్ఞపాత్రను యజ్ఞస్థానమునకు తెచ్చినపుడు పురోహిత, ఋత్విక, విద్వాంసులారా! మీరు ఈ యజ్ఞమందు ధనము ఇవ్వండి "ద్రవిణమాయజోథామ్."

    8. మువ్వురు దేవేరులారా! మీ కొరకు మేము కుశలు పరచినాము. ఈ ఉన్నత స్థానమును అధిష్టించండి. ఇళా! ప్రకాశమాన సరస్వతీ! దీప్తపదయుక్త భారతీ! మీరు మనువు యజ్ఞమున హవిని స్వీకరించినారు. మా యజ్ఞమునను హవిని సమర్పించినాము. అట్లే స్వీకరించండి.

    9. త్వష్ట దేవా! నీకు మంగళమయరూపము లభించినది. నీవు అంగిరులకు మిత్రుడవగుము. నీవు సుందర ధనవంతుడవు. హవిని కోరుము, దేవతల భాగము తెలిసికొనుము. వారికి హవిని అందించుము.

    10. వనస్పతులచే చేయబడిన యూపకాష్ఠమా! నీవు విద్వాంసుడవు. త్రాళ్లచే కట్టబడుము. దేవతలకు అన్నము అందించుము. వనస్పతి దేవా ! హవి రుచిచూడుము. మేము ఇచ్చిన హవిని దేవతలకు అందించుము. ద్యావా పృథ్వులు మా ఆహ్వానములు రక్షించవలెను.

    11. అగ్నీ ! మా యజ్ఞము కొరకు ద్యులోకము, అంతరిక్షము నుండి ఇంద్రుని, వరుణుని, మిత్రని తీసికొనిరమ్ము. యజనీయ దేవతలందురు కుశలపై కూర్చుండవలెను. అమర దేవతలు స్వాహ, శబ్దమునకు ఆనందించవలెను.

                                   డెబ్బది ఒకటవ సూక్తము
 ఋషి - అంగిరస బృహస్పతి. దేవత - బృహదేవత. ఛందస్సు - త్రిష్టుప్ 9 జగతి.

    1.బాలకుడు ముద్దుమాటలతో పదార్థములకు ముద్దు పేర్లు పలుకును. ఇది వారి భాషాజ్ఞానపు తొలిమెట్టు, వారి ఉత్కృష్టము, నిర్దోషమగు జ్ఞానము దాగి ఉండును. అది సరస్వతి దయవలన ప్రకటితమగును.   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.