Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    9. నీ మనసు దూరమందున్న పర్వతపంక్తులపైకి చేరినది. మేము దానిని రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    10. నీ మనసు ఈ సమస్త విశ్వమునకు బహుదూరముగ వెళ్లిపోయినది. మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    11. నీ మనసు భూత, భవిష్యత్తువంటి ఏదోసుదూర ప్రదేశమునకు. వెళ్లి పోయినది మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    ఆలోచనామృతము

    ప్రాణి దేనివలన జీవించుచున్నది? ఏది పోయినంత జీవితము చాలించుచున్నది? ఆ ఉన్నదేది? ఈ పోయినదేది ఇది ప్రశ్నయే! దీనికి బదులు లభించలేదు! లభించదు!! ఏలనన ఇది సత్యము ఋతము. దీనిని ఎవడును చూడజాలడు! ప్రాణము, ఆత్మ ఇవి ఉన్నంత కాలము జీవితము ఉండును. ఇవి లేనపుడు కళేబరము మిగులును ప్రాణము, 'ఆత్మ' నామ వాచకములు మాత్రమే! వాటి స్వరూప స్వభావములు తెలియవు!

    ఈ సూక్తమున మనసు, ప్రాణమయినది. మనసే ప్రాణమని అప్పటి అవగాహన. మనసునకు, ప్రాణమునకు రూపములేదు. కావున పర్యాయమయిన తప్పుకాదు. మనసే మనిషిని కదిలింప చేయుచున్నది. మనసులేకున్న ఏ అవయవము తన విధి నిర్వర్తించలేదు. మనసులేనపుడు కన్ను చూచుచుండును కాంచదు. ఈ న్యాయము అవయవములన్నింటికి వర్తించును.

    అందువలననే మనసన్న ప్రాణ్ ము అన్నాడు !

    ఈ మనసు మనిషిని వదిలి ఎచట కేగును?

    ఆ ప్రశ్నయే ఈ సూక్తము. అన్వేషణము ఎంతో అందముగా చెప్పినాడు. "తత్త ఆవర్తయామసీహ క్షయామ జీవసే" ! ఇదొక అంతములేని అన్వేషణ !

                              ఏబది తొమ్మిదవ సూక్తము
  ఋషి - గోపాయనుడు. దేవత - వేరు వేరు. ఛందస్సు -17 త్రిష్టుప్ 8 పంక్తి 9
                                మహాపంక్తి 10 పంక్త్యుత్తర

    1. సారథి కుశలుడైన రథమునెక్కిన వాడు సుఖముగా ఉండును. అట్లే పరమాయువు యవ్వనయుక్తమై పెరుగ వలెను. ఆయువునకు హాని కలిగిన వాడు ఆయుర్వృద్ది కోరును. నిర్రుతి యనుపాపదేవత దూరము కావలెను. "నిబ్రుతిర్జి హీమతామ్."

    2. పరమాయుస్వరూపసంత్తి లాభమునకుగాను మేము సామగానము చేయుదుము. భక్ష్యపదార్థములను కూర్చుకొందుము. మేము నిబ్రుతినిస్తుతించినాము. ఈ సకల భక్ష్యములను భుజించి "నిబ్రుతిర్జి హీమతామ్."

    3. మా బలమున శత్రువులను పరాజితులను చేయుదుము. భూమికిపైన ఆకాశమున్నట్లు మేము శత్రువులమీద స్థానము సాధింతుము. మేఘగతిని పర్వతము నిలుపును. శత్రుగతిని మేము నిరోధింతుము. మా స్తుతులు విని "నిబ్రుతిర్జి హీమతామ్."

    4. సోమమా! మమ్ము మృత్యువునకు వప్పగించకుము. మేము సూర్యోదయములు చూడవలెను మా వార్థక్యము ప్రతి నిత్యము సుఖముగా గడువ వలెను.

    5. అసునీతి-ప్రాణనేత్రి దేవీ! మనసు మావైపు మరల్చుము. మేము జీవించవలెను. మాకు ఉత్కృష్ట పరమాయువు ప్రసాదించుము. సూర్యుడు ఉన్నంతకాలము మమ్ము జీవించనిమ్ము. మేము నీకు ఘృతము అర్పింతుము. దానిచే పుష్టినందుము.

    6. అసునీతీ! మాకు మరల నేత్రములిమ్ము. మరల మా ప్రాణములను మా వద్దకు చేర్చుము. మేము భోగములు అనుభవింపవలెను చిరకాలము సూర్యుని దర్శించవలెను నాశము లేని విధముగా మాకు సుఖములు కలిగించుము.

    7. పృథ్వి మరల మాకు ప్రాణదానము చేయవలెను. ద్యులోక అంతరిక్షములు మాకు ప్రాణదానము చేయవలెను. సోమము తిరిగి మాకు శరీరము ప్రసాదించవలెను. మాకు సర్వదా శుభములు కలుగునట్లు పూష మాకు హితకర వాక్కు ప్రసాదించవలెను.

    8. మహతి, మాతృస్వరూప ద్యావాపృథ్వులు శుభములు కలిగించవలెను. ద్యులోకము, విశాలపృథ్వి సకల అశుభములను దూరము చేయవలెను. ఎవరును ఎటువంటి హాని కలిగించరాదు.

    9. స్వర్గమందురెండును, మూడును ఓషధులున్నవి. వానిలో ఒకటి భూమి మీద లభించును. అవన్నియు ప్రాణములను రక్షించవలెను. ద్యులోకము, విశాల పృథ్వి సకల అశుభములను దూరము చేయవలెను. ఎవరును ఎటువంటిహాని కలిగించరాదు.

    10. ఇంద్రా ! ఉశీనవుని భార్య శకటము తీసికొని వెళ్లిన వృషభమును ప్రోత్సహించుము. ద్యులోకము, విశాల పృథ్వి సకల అశుభములను దూరము చేయవలెను ఎవరును ఎటువంటి హాని కలిగించరాదు.
   
                                 అరువదవ సూక్తము
  ఋషి - గోపాయవ, బంధ్వాదులు. దేవతలు - వేరు వేరు. ఛందస్సు - 1-6
                      గాయత్రి 8,9 పంక్తి - మిగిలినవి అనుష్టుప్.

    1. అసమాతి రాజు యొక్క జనపదము ఉజ్వలము. మహామహులు ఆజనపదమును ప్రశంసింతురు. వినమ్రులై ఆ జనపదమున ప్రవేశింతురు.

    2. అసమాతిరాజు అందగాడు. శత్రుసంహారకుడు. రథము ఎక్కినవాని కోరికలు సిద్ధించినట్లు ఆ రాజు దగ్గరకు వెళ్లువాని కోరికలు తీరును. అతడు భజేరథము వంశమున జన్మించినాడు సుపరిపాలకుడు సత్పతిమ్.

    3. అతడు కరవాలము ధరించినను, ధరించకున్నను బలపౌరుషములు ప్రదర్శించగలడు. సింహము మహిషములను వలె అతడు నరులను పడగొట్టగలడు.

    4. ధనికుడు శత్రుసంహారకుడు. ఇక్ష్యాకు ప్రభువు రక్షణ కార్యము నిర్వర్తించుచున్నాడు. పంచ జనులారా! స్వర్గసుఖములు అనుభవించండి.

    5. ఇంద్రా ! అందరు దర్శించు కొనుటకుగాను ఆకసమున సూర్యుని స్థాపించినావు. అట్లే రథారూఢుడగు అసమాతి రాజునకు ఆనుగామి వీరులను నియమించుము.

    6. రాజా ! అగస్త్యుని దౌహిత్రుల కొరకు రెండు హితవర్ణ అశ్వములను రథమునకు కట్టుము. అతి కృషణలు, ఎన్నడు దానము చేయని వ్యాపారుల నందరను ఓడించుము.

    7. ఈ అగ్ని, మాత, పిత, ప్రాణదాత ఔషధము. అగ్ని విచ్చేసినాడు. సుబంధో! ఇదే దేహము. ఇందు వసించుము.

    8. రథమును నిలుపుటకు పగ్గమున పట్టి ఉంచుదురు. అట్లే అగ్ని నీ మనసును పట్టి ఉంచినాడు. ఇక నీవు జీవింపుము. కళ్యాణస్వరూపుడవగుము. అరిష్టములు, మృత్యువు దూరము కావలెను.

    9. ఈ విశాలపృథ్వి మహా మహా వృక్షములను భరించుచున్నది. అట్లే అగ్ని నీ మనసును భరించి ఉన్నది. ఇక నీవు జీవింపుము. కళ్యాణ స్వరూపుడవగుము. అరిష్టములు, మృత్యువు దూరమగునుగాత.

    10. వివస్వత పుత్రుడు యమరాజునుండి నేను సుబంధు మనసును అపహరించినాను. అందువలన అతడు జీవించును. కళ్యాణ స్వరూపుడగును. మృత్యువుదూరమగును.

    11. వాయువు ద్యులోకమునుండి క్రిందకు వీచును. సూర్యుడు పైన ఉండి క్రింద మండించును. గోవుపాలు క్రిందినుండి పితుక బడును. అట్లే నీ పాపము క్రిందకు పారవలెను.

    12. హస్తము ఎంతటి సౌభాగ్యశాలి ! అది ఎంతో సౌభాగ్యశాలి అగును. ఇది ఎల్లరకు ఔషధమగును, దీని స్పర్శవలన శుభములు కలుగును.

    (హస్తమునకు ఎంతటి ప్రభావము ! హస్తమేకదా సర్వము సాధించునది!)

   (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ అష్టకము, వచన మండలమున నాలుగవ అనువాకము సమాప్తము.)



                 అయిదవ అనువాకము             అరువది ఒకటవ సూక్తము
           ఋషి - మానవ నాభావేదిష్టుడు. దేవత - విశ్వేదేవతలు. ఛందస్సు - త్రిష్టుప్.

    1. నాభానేధిష్టు తల్లి, తండ్రి, సోదరులు విషయ విభజనమైనప్పుడు అతనికి భాగము కల్పించలేదు. రుద్రస్తుతి చేయసాగినారు. అప్పుడు నాభానేదిష్టుడు రుద్రస్తవము చేయనుంకించి అంగిరుల యజ్ఞమున చేరినాడు. యజ్ఞపు ఆరవనాడు మరచినవానిని స్పతహోతలకు చెప్పి యజ్ఞము సంపూర్ణము చేయించినాడు.

    2. రుద్రుడు స్తోతలకు ధనములు ఇవ్వదలచినాడు. శత్రువులను నష్టపరచుటకు అస్త్రాదులు ఇవ్వదలచినాడు. యజ్ఞవేదికి చేరినాడు. ఆసీనుడు అయినాడు వర్షమేఘము వలె నలుదిశల తన ప్రభావమును ప్రదర్శించినాడు.

    3. అశ్వినులారా ! నేను యజ్ఞమున ఉన్నాను. మీ చేతి వ్రేళ్లు పట్టుకున్న వారును, విస్తృతహవిని సంపాదించు వారును, మీ నామములు ఉచ్ఛరించుచు చరుపాకము చేయువారలగు అధ్వర్యుస్తోతల యజ్ఞప్రయత్నములు చూచి మనోవేగమున మీరు యజ్ఞమునకు వెళ్లుదురు.

    4. రేతిరి చీకట్లు అణగి తొలిపొద్దు ఎరుపుడాలు అగుపించినప్పుడు ద్యులోకపుత్ర అశ్వద్వయమా! మిమ్ము నేను ఆహ్వానింతురు. మీరు మా యజ్ఞమునకు విచ్చేయండి. మేము అందించు అన్నము స్వీకరించండి. గ్రాహక అశ్వములవలె భక్షించండి. మాకు హాని తలపెట్టకండి.

    5. ప్రజాపతి వీర్యము సంతానోత్పాద సమర్థమైనది. అది వృద్ధి చెందినది వెడలినది మానవ హితము కొరకు ప్రజాపతి తన రేతస్సును సుందర కన్య దేహమున విసర్జించినాడు.

    6. ప్రజాపతికి సుందరకన్యతో రతి కోరిక కలిగినది. వారిద్దరు సంగమించినారు. అప్పుడు అల్పశుక్రము విడిచినారు. శుక్ర ఆధారస్వరూపమగు ఒక ఉన్నత స్థానమున ఆ శుక్రము పడినది.

    7. పిత కన్యతో సంగమించినప్పుడే పృథ్వితో కలియుటవలన శుక్రము పడినది. సుకృతులగు దేవతలు దీనితో వ్రతరక్షక బ్రహ్మను సృష్టించినారు.

    8. ఇంద్రుడు నముచితో యుద్ధము చేయునపుడు నురుగులు చిమ్ముచు వచ్చినారు. అట్లే నా వద్ద మంచి వాస్తోప్పతి మరలి పోయినాడు. అతడు ఏ పాదమున వచ్చినాడో అదే పాదమున మరలి పోయినాడు. అంగిరులు నాకు దక్షిణగా గోవులను ఇచ్చినారు. వాటిని గ్రహించుట సమర్థులయ్యు గ్రహించలేదు.

    (నముచిని వధించుటకు ఇంద్రుడు సముద్రపు నురగను ఉపయోగించినాడని వృత్తాంతము వాస్తోప్పతి రుద్రుడే అగును)

    9. ప్రజలను పీడించువారును అగ్నివలె దహించు వారలగు రాక్షసాదులు ఈ యజ్ఞమున ప్రవేశించలేరు. ఏలననగా రుద్రుడు ఈ యజ్ఞమును రక్షించుచున్నాడు. రాత్రులందును నగ్న రాక్షసులు యజ్ఞపు అగ్ని వద్దకురాలేరు. రాత్రులందును అగ్ని యజ్ఞమును రక్షించును. అతడు కొరివి చేత బూని అన్న వితరణ చేయుచు ఆవిర్భవించును. రాక్షసులతో యుద్ధము చేయును.

    10. అంగిరులు తొమ్మిదినెలలు యజ్ఞము చేయుచునే గోవులను పొందినారు. వారు కమనీయ స్తుతులసాయమున యజ్ఞవచనములు పలుకుచునే యజ్ఞము పూర్తి చేసినారు. వారు ఇహ, పరలోకములందు వర్థిల్లినారు. ఇంద్రుని చేరినారు. వారు దక్షిణలులేని సత్రయాగము చేసి అవినాశ్యఫలము సాధించినారు.

    11. అంగిరులు పాడియావుల అమృతసమము, పవిత్ర దుగ్ధములను యజ్ఞమున కొసంగినారు. అప్పుడు వారు స్తోత్రములచే నూతన సంపదవంటి వర్షజలమును సాధించినారు.

    12. యజ్ఞకర్తలతో ఇంద్రుని స్నేహము అపారము. యజ్ఞకర్త పశువులు తప్పిపోయినచో ధనిక, కుశల, నిష్వాప, ఇంద్రుడు ఆవిషయము తెలియ పరచినను, పరచుకున్నను, వెదికి తెచ్చును. అట్లని జనులు చెప్పుకొందురు.

    13. సుస్థిర ఇంద్రుడు బహువిస్తారక శుష్ణుని నిగూఢ మర్మములను వెదకి వధించినప్పుడు అతని అనుచరులు అతని చుట్టుమూగి పొగడుదురు, వెంటసాగుదురు.

    14. స్వర్గతుల్య యజ్ఞస్థానమున ఆసీనులైన దేవతలు అగ్ని యొక్క తేజస్సును 'భర్గ' అని నామకరణము చేయుదురు అగ్ని యొక్క మరొక తేజస్సు పేరు "జాతవేద" హోమ నిష్పాదక అగ్నీ ! నీవే యజ్ఞమునకు హోతవు. నీవే అనుకూలుడవై మా పిలుపును ఆలకింతువు.

    15. ఇంద్రా ! వారిద్దరూ ఆదీప్తమార్తులు, రుద్రపుత్రులు, అశ్వినులు, మా స్తోత్రమును, యజ్ఞమును గ్రహించవలెను. వారు మనువు యజ్ఞమున ప్రసన్నులగుదురు. అట్లే మా యజ్ఞమున ప్రసన్నులు కావలెను. కుశలపై కూర్చుండవలెను. ప్రజలకు ధనము ప్రసాదించవలెను యజ్ఞము స్వీకరించ వలెను.

    16. సర్వశ్రేష్ఠ సోమమును అందరు స్తుతింతురు. మేము సహితము స్తుతింతుము. క్రియాకుశల సోమము స్వయముగా వారధి అగును. జలములను దాటును. శీఘ్రగామి అశ్వము రథచక్రముల ఇరసును వడికింఛినట్లు సోమము కక్షీవంతుని అగ్నిని వడికించును.

    17. అగ్ని ఇహ, పరలోకముల హితము కోరును. అతడు తరింపచేయువాడు. యజ్ఞకర్త అమృత సమములగు పాలిచ్చు గోవులు పాలివ్వనప్పుడు అగ్ని వాటిని ప్రసవవతులను దుగ్ధదాయనులను చేయును. మిత్ర, వారు, ఆర్యములను శ్రేష్ఠస్తోత్రములచే సంతుష్టులను చేయుదురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.