Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    6. ద్రువాపి భూమీ! నీవు స్థిరత్వము కలదానవు.

    (వేది మధ్యమును తాకవలెను.)

    7. ప్రకాశమాన అగ్నీ! నీవు స్తోత్ర సాధ్యుడవు. నీయందు పశ్చిమ పరిధిని వేయుచున్నాను. అది నీకు ఇష్టమగును గాత.

    దక్షిణ, ఉత్తర పరిధులారా! మీరు యజ్ఞ ఫల రూపమగు అన్నమును పొందండి.

    (మూడు పరిధులను అగ్నిలో వేయవలెను.)

    8. విశ్వే దేవతలారా! మీరు సంస్రావాజ్య భాగమును కోరువారు. మీలో కొందరు ప్రస్తరముష్టిలో ఉన్నవారు. కొందరు వేది యందు పరచిన దర్భలందు ఉన్నవారు. ఈ యజ్ఞమున మా స్తుతులను గ్రహించండి. సంతుష్టులు కండి.

    (సంస్రావాజ్యము హవ్య శేషమగును.)

    9. జుహు ప్రభృతులారా! మిమ్ము అవినాశ్యమగు అగ్ని శకట స్థానమున - యజమాని సుఖము కొరకు - స్థాపించు చున్నాను. మీరు సుఖవంతులు కండు. నాకు సుఖములు కలిగించండి. యజమాని దంపతులను రక్షించండి.

    (జుహుప్రభృతులను ధాన్యశకటము ఉంచిన స్థలమున వేయవలెను.)

    10. అగ్నీ! స్వర్గవాసులు నా అపరాధములు గ్రహించకుండునట్లు చేయుము. నన్ను విఘ్నముల నుండి పాహి. దుష్ట ప్రవర్తననుండి పాహి. దుష్ట భోజనము నుండి పాహి. నిషిద్దా చరణమునుండి పాహి. మా అన్నమునందు విషము లేకుండ చేయుము.

    అగ్నీ! నీవు అహింస్యుడవు. ఉష్ణశరీరవి. మాకు సుఖప్రదుడవగుము. - స్వాహా.

    11. దేవతలారా! మీరు మార్గములు తెలిసినవారు. వచ్చిన మార్గముననే తిరిగివెళ్లండి.

    మనస్సునకు పతియగువాడా! దేవతలందు మా యజ్ఞమును ప్రతిష్ఠించుము. స్వాహా. వాయువునకు స్వాహా.

    (వాయు దేవతచే మొదలయిన యజ్ఞము వాయుదేవతచే సమాప్తమైనట్లు బర్హిస్సును అగ్నిలో వేయవలెను.)

    దర్శపూర్ణ మాస యాగ మంత్రములు సమాప్తము.

                                పదనాలుగవ అనువాకము

    1. ఇంద్రాగ్నులారా! మీరు పురోడాశవంతులు. యజ్ఞ నిర్వహణకు అన్నము, ధనము ఇచ్చువారు. మీకు సంతోషము కలిగించుటకును - మాకు అన్న లాభమునకును హువే - ఆహ్వానించుచున్నాము.

    2. ఇంద్రాగ్నులారా! ఈ లోకమున అల్లుడు దౌహిత్ర సంతానమును ఇచ్చుచున్నాడు. బావమరిది మేన సంతానమును ఇచ్చుచున్నాడు. మీరు వారిని మించిన బహు సంతానప్రదులని వినియున్నాను. కావున సోమరస సదృశ పురోడాశమును అర్పించుచున్నాను. మిమ్ము సంతుష్టులను చేయుచున్నాను.

    3. ఇంద్రాగ్నులారా! ప్రజలనపహరించు రాజులున్న తొంబది పట్టణములు ఉన్నవి. వానిని ఒకే దెబ్బకు కొట్టి పడేయండి.

    4. ఇంద్రాగ్నులారా! మీరు వృత్రుని సంహరించిన వారు. మా స్తోత్రములు దోషరహితములు. నూతనములు. అన్నము వలన కల్పితము. మీరు వానిని స్వీకరించండి. మంచి యజ్ఞములకు అర్హులగు మిమ్ము ఆహ్వానించుచున్నాను.

    మీరు యజమానికి అన్నము ప్రసాదించండి.

    5. పథప్రభువా! సూర్యదేవా! అన్నము లభించు కర్మ కొరకు - రథమును వలె - నిన్ను యాచించుచున్నాము.

    6. పూష దేవత ఫలప్రదాత. నేను ఫలము కోరువాడను. నేను పూషను స్తుతించుచున్నాను. అతడు దుఃఖ వినాశకములును - చంద్రుని వంటి ఆహ్లాదకములగు - ఓషధులను మాకు ప్రసాదించును గాత.

    7. భూమి వలన మాకు గోవులు, అశ్వములు, మమ్ము పోషించు అన్నాదికములు లభించుచున్నవి. క్షేత్రపతి ఇట్టివానిచే మాకు సుఖములు కలిగించును గాత.

    8. క్షేత్రపతీ! గోవు మధురములగు దుగ్ధములనిచ్చును. అట్లే నీవు మాకు మధురములును, మరల మరల లభించునవియు, నేయి వంటి పవిత్రములగు పదార్థములను కలుగుచేయుము. "ఋతస్య నః పతయో మృడయంతు" సత్యసనాధులు మమ్ము రక్షింతురు గాత.

    9. అగ్నీ! ధనమునార్జించుటకు మమ్ము సన్మార్గమున నడిపించుము. నీవు సమస్త మార్గములు తెలిసినవాడవు. మమ్ము పాపమార్గమునుండి రక్షించుము. నిన్ను బహువిధములుగా నమస్కరించుచున్నాను.

    10. మాకు శక్తి ఉన్నంతలో కర్మలను ఆచరించ తలపెట్టినాము. అవి నిరాటంకముగ కొనసాగుటకు దేవతల మార్గమున వచ్చినాము.

    అగ్ని కర్మలు తెలిసినవాడు. అతడు - మాకొరకు - యాగము చేయుము. ఆహ్వానించును. ఋతువులను అనుసరించి కర్మములు కల్పించును.

    11. ప్రాణణీయ హవిస్సు అగ్నికి ఘనమగును గాత. బర్రెకు మేతపెట్టిన ఎక్కువ పాలిచ్చును. అట్లే అగ్నీ! మా హవిస్సులను అందుకొనుము. మాకు ఫలితము ప్రసాదించుము. అందువలన మాకు ధనము, అన్నము మరింత లభించును గాత.

    12. అగ్నీ! మాకొరకు నవ్వుడవై అవతరించుము. మమ్ము పాపములనుండి దాటించుము. మాకు శుభములు, సుఖములు కలిగించుము. మాకు భూమి విశాలమగును గాత. మా పుత్రులు, దౌహిత్రులకు శుభప్రదుడవు అగుము.

    13. అగ్నీ! నీవు మానవుల వ్రతపాలకుడవు అగుచున్నావు. దేవతవు అగుచున్నావు. యజ్ఞములందు స్తుతించ బడువాడవు అగుచున్నావు.

    14. దేవతలారా! మీరు విద్వాంసులు. మీకు సంబంధించిన యజ్ఞయాగాదులు మాకు తెలియకున్నవి. మేము సక్రమముగా నిర్వర్తించలేకున్నాము. విద్వాంసుడగు అగ్ని ఆ లోపమును పూరించును గాత. ఋతువులను అనుసరించి దేవతల క్రతువులు జరిపించును గాత.


        శ్రీమదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత యందలి
                     మొదటి కాండమున మొదటి ప్రపాఠకము
                                         సమాప్తము

                         బహలా న ఉర్వీభవ తోకాయ తనయాయ శంయోః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.