Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    (కుత్సుడు ఇంద్రుని రథమున ఇంద్రసహితుడై సొగును తేనెటీగలే మధువునిచ్చును. కాని అశ్వినులు చేసిన మధువు తేనెటీగలనే మురిపించునంతటిది!)

    7. అశ్వినులారా! మీరు "భుజ్యు"ని సముద్రము నుండి రక్షించినారు. మీరు రాజగు 'వశు'ని, 'అత్రి'ని, 'ఉశన'ను ఉద్ధరించినారు. దాత అయినవాడే మీతో బంధుత్వము చేయగలడు. నీ ఆశ్రయమున లభించు సుఖమునే నేను ఆశించుచున్నాను.

    8. అశ్విద్వయమా! మీరు కృశుని కాపాడినారు శయుని కాపాడినారు. మీకు పరిచారిక అయిన విధవను కాపాడినారు. యజ్ఞకర్త కొరకు మీరే మేఘమును భిన్నము చేసినారు. భిన్నమైన దతిశీలమ్ ధారాత మేఘము గర్జించినది. వర్షించినది.

    9. నేను ఘోషను మీ దయవలన నారీలక్షణములు గల సౌభాగ్యవతిని అయినాను. నా పెళ్లికి వరుడు విచ్చేసినాడు. మీరు వర్షము కురిపించినారు. సస్యాదులు ఫలించినవి. పల్లమునకు పారు నదులు పంటల వైపుసాగుచున్నవి. ఈ రోజు నేను భార్యను అయినాను. "అస్మాఅహ్నేభవతి తత్పతిత్వనమ్".

    (ఘోషలో ఏదోనారీ లక్షణము లోపించినట్లున్నది. అశ్వినులు దానిని సరి చేసినట్లున్నారు. ఆలస్యముగా వరుడు లభించిన వధువు వలె  ఘోష పొంగిపోయినది.)

    10. తమ భార్యల ప్రాణరక్షణ కొరకు ఏడ్చినంత చేసిన వారున్నారు. స్త్రీలను యజ్ఞమున నియమించిన వారున్నారు. స్త్రీలను తమ బాహుబంధములందు ఎంతోసేపుఉంచి సంతానము పొంది, పితృయజ్ఞమును నిర్వహించిన వారున్నారు. అట్టివారిని భార్యలు ఆనందముగ ఆలింగనము చేసికొందురు.

    11. అశ్విద్వయమా! అటువంటి సుఖము నేను ఎరుగును. యువకుడైన భర్త యువతియైన భార్య వీరి సహవాస సుఖమును నాకు బోధించుడు. నాడి ఒకే కోరిక స్త్రీవిషయమున అనురక్తుడైన బలశాలి ఇంటికి చేరవలెను.

    12. అన్నవంత ధనవంత అశ్వినులారా! మీరు నన్ను అనుగ్రహించండి. నా మనసులోని కోరికలు తీర్చండి. మీరు కళ్యాణ కారకులు, నాకు రక్షకులు కండి. నేను భర్త ఇంటికి చేరి అతనికి ఇష్టురాలను కావలెను!

    13. నేను మిమ్ము స్తుతించుచున్నాను. అందుకు మీరు సంతుష్టులై నా పతి గృహమందు ధనము, సంతతి కలిగించండి. నేను నీరుత్రాగు తీరమును సౌకర్యవంతము చేయండి. నేను పతిగృహమునకేగు మార్గమున విఘ్నములున్న వానిని తొలగించుము.

    14. ప్రియదర్శన, శుభంకర అశ్విద్వయమా! ఈ మధ్య మీరు ఎక్కడ, ఎవరింట ఆనందప్రమోదములందు ఉన్నారు? ఎవరు మిమ్ము కట్టి పడవేసినాడు? ఏ బుద్ధిమంతుడగు యజమాని ఇంటచేరినారు?
   
                                నలుబది ఒకటవ సూక్తము   
  ఋషి - ఘోష పుత్రుడు సుహస్తుడు. దేవత - అశ్వినులు. ఛందస్సు - జగతి.


    1. అశ్విద్వయమా! మీ  ఉభయులది ఒకే రథము. దానిని అనేకులు ఆహ్వనింతురు. స్తుతింతురు. ఆ మూడు చక్రముల రథము యజ్ఞములకు వెళ్లును. అది నలువైపుల తిరుగును. యజ్ఞములను సుసంపన్నము చేయును. నిత్యము ప్రాతఃకాలములందు స్తుతులచే ఆరథమునే ఆహ్వానింతుము.

    2. సత్యస్వరూప అశ్వినులారా! మీ రథము ప్రాతఃకాలమున సిద్ధమగును - సాగును. అది మధువును వహించును. ఆ రథము పైనే యజ్ఞకర్తల వద్దకు  వెళ్లండి. మిమ్ము స్తుతించువాని హోత్రయుక్త యజ్ఞమునకు కూడ వెళ్లండి.

    3. అశ్విద్వయమా! నేను సుహస్త్యుడను. మధువు చేతబూని అధ్వర్యు కార్యము విర్వార్తింతును. నావద్దకుగాని బలవంతుడు, పురోహితుడు, దాతయగు అగ్నీధ్రుని వద్దకు గాని విచ్చేయండి. మీరు  విప్రుల యజ్ఞములకు పోవువారే కావచ్చును. మధుపానము కొరకు మా ఇంటికి విచ్చేయండి.

    (ఘోషపుత్రుడు అన్నాడు ఘోషభర్తపేరు  చెప్పలేదు. ఘోష స్వతంత్ర వలె ఉన్నది. నేడు సహితము అట్టివారున్నారు.)

                               నలుబది రెండవ సూక్తము   
    ఋషి - అంగిరస కృష్ణుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.

    1. ధనుర్ధారి గురిచూచి బాణము విడిచినట్లు - ఇంద్రుని గూర్చి స్తుతులు చేయండి. ప్రాంజలులై అలంకృత స్తుతులను సమర్పించండి. విప్రులారా! మిమ్ము స్పర్ధించువారు పరాజితులగు నట్టి స్తుతులు ప్రయోగించండి. స్తోతలారా! ఇంద్రుని సోమము వైపు ఆకర్షించండి.

    2. స్తోతలారా! పాలు పితుకుకొని గోవు వలన ప్రయోజనము పొందినట్లు మిత్రస్వరూపుడగు ఇంద్రుని వలన ప్రయోజనము పొందండి. ఇంద్రుని స్తుతించండి. మేల్కొల్పండి. గింజలగిన్నెను బోర్లించిగింజలు తీసికొన్నట్లు ఇంద్రుని అను కూలుని చేసికొని మీ కోరికలు తీర్చుకొండి.

    3. ఇంద్రా! జనులు నిన్ను భోజుడని ఎందుకు అందురో? అర్ధమైనది. నీవు దాతవు. అందుకే నీకా పేరు వచ్చినది. నీవు జనులను పదును పెట్టుదువని విన్నాను. నా బుద్ధికి పదును పెట్టుము నన్ను నిపుణుని చేయుము. నాకు సంపన్నుడగు నట్టి అదృష్టము కలిగించుము.

    4. ఇంద్రా! జనులు యుద్ధములకు పోయినపుడునీ నామము తలచుకొందురు. నీవు యజమానికి సహాయకుడవు అగుదువు. నీకు సోమము సమర్పించని వానితో నీవు స్నేహము చేయవు.

    5. అన్నవంతుడగు ఏవ్యక్తి ఇంద్రునకు ప్రథమ సొమము సమర్పించునో, గోవులు, అశ్వములు దానము చేయుధనవంతునివలె ఇంద్రునకు ఉదారముగ సోమరసము అందించునో, అట్టివానికి ఇంద్రుడు సహాయకుడగును. అతనికి బలిష్ఠులు అనేక సేనలున్న శత్రువులున్నను. ఇంద్రుడు వారిని శీఘ్రాతి శీఘ్రముగ పారద్రోలును.

    6. మేము స్తుతించిన ఇంద్రుడు ధనవంతుడు. అతడు మా కోరికలు తీర్చిన్నాడు. ఇంద్రుని శత్రువులు పారిపోవలెను. శత్రుదేశ సంపద ఇంద్రుని చేతికిరావలెను.

    7. ఇంద్రా! నిన్ను లెక్కకు మిక్కిలిమంది పిలిచెదరు. నీ వజ్రము భయంకరము. దానితో దగ్గరి శత్రువును దూరము చేయుము. నన్ను గోయుక్తుడను, యువయుక్తుడను చేయుము. నీ స్తోతల స్తుతులను అన్న, రత్న సంపన్నములను చేయుము.

     8. సోమరసము అనేకధారలుగా మధురరసము కురింపించుచు ఇంద్రుని దేహమున చేరును. ఆ సమయమున ఇంద్రుడు సోమదాతను వారించడు. ఇకవలదు అనేమాట సహితము అన్నాడు. అంతేకాదు సోమదాతకు కోరినవన్నియు ఇచ్చుమ.

    9. ఓడిన జూదరి ఓడించిన జూదరిని వెదికి వట్టి ఓడించును. ఇంద్రుడు అరిష్టకర్తను అట్లే ఓడించును. ఏ దేవభక్తుడు దేవపూజలో కృపణత్వము చూపడో అట్టివానిని ఇంద్రుడు మరింత ధనికుని చేయును.

    10. గోవులవలన మేము దుఖఃదారిద్య్రమును దాటి పోవలెను. అనేకులచే ఆహూత ఇంద్రా! యవలతో మేము ఆకలి తీర్చుకొనగలుగ వలయు. మేము రాజుల వెంట వెంటనడిచి అగ్రసరులమై స్వబలప్రభావమున సంపదలను గెలువ గలుగవలెను.

    11. పాపి శత్రువుబారినుండి మమ్ము బృహస్పతి పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలందు కాపాడవలెను. తూర్పు దిశయందును మధ్యభాగమునను ఇంద్రుడు మమ్ము రక్షించవలెను. ఇంద్రుడు మా మిత్రుడు. మేము ఇంద్రుని మేము ఇంద్రుని మిత్రులము. అతడు మా కోరికలు తీర్చవలెను.

    శ్రీమందాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ అష్టకము పదవ మండలమున మూడవ అనువాకము సమాప్తము.

                నాలుగవ అనువాకము        నలుబది మూడవ సూక్తము   
                    ఋషిదేవతే పూర్వవత్. చంధస్సు - జగతి - 10,11 త్రిష్టుప్

    1. నా స్తుతులన్ని కలిసి ఉద్దేశ పూర్వకముగ ఇంద్రుని గుణగానము చేసినవి. స్తుతులు సకల విధలాభములు కలిగించ గలవు. భార్యలు భర్తలను ఆలింగనము చేసికొన్నట్లు స్తుతులు శుద్ధస్వభావ ఇంద్రుని ఆశ్రయమునకుగాను అతనిని ఆలింగనము చేసికొనును.

    2. ఇంద్రా! నిన్ను విడిచి నా మనసు అన్యత్ర సంచరించదు. నీ మీదనే నేను నా అభిలాషలు నిలిపినాను. రాజు తన భవనమున ఆసీనుడైనట్లు. మీరు కుశలపై ఆసీనులు కండి. ఈ  సురిచిర సోమపాన కార్యము సాగించండి.

    3. దుర్గతి, అన్నరాహిత్యమునుంచి మమ్ము రక్షించుటకు ఇంద్రుడు మాకు నలువైపుల ఉండవలెను. ఇంద్రుడు ధనదాత సకల సంపదలకు ధనములకు అధిపతి. కోరికలు తీర్చువాడు తేజస్వి ఇంద్రుని ఆదేశముననుసరించియే గంగాది సప్తనదులు పల్లమునకు ప్రవహించుచున్నవి. వ్యవసాయమును వృద్ధిచేయుచున్నవి.

    4. పచ్చని ఆకుల చెట్టును పిట్టలు ఆశ్రయించును. పాత్ర యందున్న ఆనందకర సోమము ఇంద్రుని ఆశ్రయించును. సోమరస తేజమున ఇంద్రుని ముఖము వెలిగినది. ఇంద్రుడు మానవులకు ఉత్కృష్ట జ్యోతి అగును. "మనవేజ్యోతిరార్యమ్."

    5. జూదగృహమున తనను గెలిచిన వానిని వెదికి ఓడించినట్లు - ఇంద్రుడు వృష్టినిరోధక సూర్యుని ఓడించును. ఇంద్రా! నీవు ధనాధిపతివి. పాత, కొత్త వాడెవడును నీ పౌరుషమువలె పని చేయజాలడు.

    6. ధనద ఇంద్రుడు ప్రత్యేక వ్యక్తిలో వసించును. కోరికలు తీర్చు ఇంద్రుడు స్తోత్రములన్నింటిని జాగ్రత్తగా వినును. ఇంద్రుని ప్రీతుని చేసిన సోమయజ్ఞకర్తలు సోమము వలన శత్రువులను పరాజితులను చేయుదురు.

    7. జలము నదులవైపు. చిన్న చిన్న  కాలువలు చెరువు వైపునకు సాగునట్లు సోమరసము ఇంద్రునిలోనికి సాగును. యజ్ఞస్థలమున విప్రులు ఇంద్రుని వానకు పంటవలె వర్థిల్ల చేయుదురు.

    8. ఆబోతు కోపమున మరొక ఆబోతు మీదకు పోవును. అట్లే  ఇంద్రుడు మేఘము మీదకు పోయి తను కోరిన జలమును వెలికి తీయును. సోమ యజ్ఞము చేసిన వానికి, ఉదారముగ దానములు చేసిన వానికి, హవి సంగ్రహించినవానికి ధనిక ఇంద్రుడు జ్యోతిని ప్రసాదించును.

    9. ఇంద్రుని వజ్రము తేజోవంతమై ఉదయించవలెను. పూర్వము వలెనే ఇప్పుడును యజ్ఞక్రియలు జరుగవలెను ఇంద్రుడు ఉజ్వల తేజస్సుతో శోభిల్లవలెను. సాధుజనపాలక ఇంద్రుడు సూర్యునివంటి శుభ్రవర్ణదీప్తితో వెలుగొందవలెను.

    10. గోవుల వలన మేము దుఃఖదారిద్య్రములను దాటిపోవలెను. అనేకులచే ఆహూత ఇంద్రా! యవలతో మేము ఆకలి ఆర్పుకొన గలుగవలెను. మేము రాజులవెంటనడచి, ఆశ్రసరులమై స్వబలమున సంపదలను గెలువవలెను.

    11. పాపి శత్రువు బారినుండి మమ్ము బృహస్పతి పశ్చిమ ఉత్తర దక్షిణ దిశలందు కాపాడవలెను. తూర్పు దిశయందును, మధ్యభాగమునను ఇంద్రుడు రక్షించవలెను ఇంద్రుడు మామిత్రుడు. మేము మిత్రులము. అతడు మా కోరికలు తీర్చవలెను.
   
                                నలుబది నాలుగవ సూక్తము   
               ఋషి - అంగిరస కృష్ణుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు -
                             1-3, 9,10 త్రిష్టుప్ 4-8 జగతి.


    1. ఇంద్రుడు స్థూలకాయుడు అతడు తన విపుల, దుర్ధర్ష బలమున బలశాలురను సహితము బలహీనులను చేయును. అట్టి ధనిక ఇంద్రుడు రథమును ఎక్కినాడు అతడు  ప్రమోదించుటకు రావలెను.

    2. నరపతి ఇంద్రా! నీ రథము చక్కగా అమర్చినది. నీ అశ్వములు సుశిక్షితములు నీ చేత వజ్రము ఉన్నది. ఆ రూపముగలవాడవై సులభమార్గమున కిందికి దిగిరమ్ము. నీ పానమునకు సోమము సిద్ధముగా ఉన్నది. సోమము త్రావించి మేము నీ బలమును మరింత పెంచుదుము.

    3. ఇంద్రుడు నేతలకు నేత. వజ్రహస్తుడు శత్రుబలాపహారి. దుర్థర్షుడు. కోపము వృధాకానివ్వనివాడు. అతడు తనను వహించు బలిష్ఠ అశ్వయుక్తుడై మా వద్దకు రావలెను.

    4. సోమరసము పుష్టి కలిగించును. కలశమున కలసిపోవును. బలమును కదలించును. ఇంద్రా! ఆసోమమును ఉదరమున ధరింపుము. మా బలమును పెంచుము. మమ్ము నీకు ఆత్మీయులను చేసికోనుము.

    5. ఇంద్రా! నేను స్తోతను. నా వద్దకు సకల సంపదలు చేరవలెను. నాకు ఉత్తమ అభిలాషలు ఉన్నవి. వానిని తీర్చుకొనుటకు సోమ సంచయనము చేసినాను. యజ్ఞము తలపెట్టినాను.  అందుకు అధిపతివగు ఇంద్రా! విచ్చేయుము. కుశలపై కూర్చుండుము. నీ కొరకు సోమపాత్ర సిద్ధమైనది. అందు కొనుము. దానిని బలాత్కారముగా గుంజు కొనగల వాడు లేనేలేడు.

    6. ప్రాచీన కాలమందే యజ్ఞములు చేసి దేవతలను ఆహ్వానించిన వారున్నారు. వారు మహా మహాకార్యములు చేసినారు. సద్గతిని చేరుకున్నారు. కాని యజ్ఞరూప నౌకను ఎక్కనివారు కుకర్ములు, రుణగ్రస్తులు నీచస్థితిలో అణగారి పోయినారు.

    7. ఇప్పుడు కూడ అటువంటి దుర్భుద్ధులున్నారు. వారిది అధోగతి కావలెను. వారి దుర్గతి ఎట్టిదగునో చెప్పరాదు. ముందునుంచే యజ్ఞాదులందు దానము చేయువారు. చేరుస్థానము పవిత్రమగును. అచట చిత్రవిచిత్రములగు భోగపదార్థములు లభించును.

    8. ఇంద్రుడు సోమపానము చేసి మత్తుడైనంత సర్వత్ర సంచరించును. కదలాడు మబ్బలను ఆకాశమునల్లకల్లోలము చేయును. అప్పుడు ఆకసము బెదిరిపోవును. పరస్పర సంయుక్తములైన ద్యావ, పృథ్వులను ఇంద్రుడు అట్లే ఉంచును. మంచి మాటలు చెప్పును.

    9. ధనశాలి ఇంద్రా! నీ కొరకు నేను ఒక గట్టి అంకుశమును పట్టి ఉన్నాను. నీవు ఈ అంకుశరూప స్తోత్రమున గజములను దండిపుము. వానిని వశపరచు కొనుము ఈ సోమ యజ్ఞమునకు విచ్చేయుము. స్థానమును గ్రహించును. ఈ యజ్ఞమందు మమ్ము సౌభాగ్యవంతులను చేయుము.

    గత సూక్తపు 10,11 మంత్రములు పునరావృతములు.
   
                                 నలుబది అయిదవ సూక్తము
        ఋషి - భాలందన వత్సప్రేరుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని తొలుత ఆకాశమున విద్యుద్రూపమున జన్మించినాడు. రెండవ జన్మము జాతవేది, పేర జనమధ్యమున జరిగినది. జలమధ్యమందు మూడవ జన్మకలిగినది. అగ్ని మానవ హితైషి. అతడు నిరంతర ప్రజ్వరిల్లుచుండును. ఉత్తమ ధ్యావమును  ఎరిగిన  వారు. అగ్నిని స్తుతింతురు.

    2. అగ్నీ! మేము నీ మూడు రకముల మూర్తులను ఎరుగుదుము అనేక ప్రదేశములందు నీకు ఉన్న స్థానములను ఎరుగుదుము. నీ నిగూఢ నామములను ఎరుగుదుము. నీవు  ఆవిర్భవించిన ఉత్పత్తిస్థానములను సహితము ఎరుగుదుము.

    3. ఇంద్రా! మానవ హితము కోరు వరుణుడు నిన్ను సముద్రమధ్యమున, జలములోతున దహించి ఉంచినాడు ఆకాశస్థానమున సూర్యుడు ఉన్నాడు. అతనిలో కూడా నీవు ప్రజ్వలించి ఉన్నావు. నీ మూడవస్థానము మేఘములందలి వర్షజలమగును. ప్రధాన దేవతలు నీ తేజస్సును పెంచుదురు.

    4. అగ్ని  ఘోరముగా గర్జించినాడు. అది పిడుగు పాటు అనిపించినది. అగ్ని పృథ్విని నాకును. లతాదులను ఆలింగనము చేసికొనును. అగ్ని ఇదిగో ఇప్పుడే పుట్టినాడు అయినను ఎంతో ప్రజ్వలించినాడు. విస్తరించినాడు.

    5. ప్రభాతపు ప్రథమ భాగమున అగ్ని ప్రజ్వలితుడగును. అప్పుడు అతని శోభ ఎట్లుండును? అతడు ఎన్నో శోభలు వెల్లడించును. అగ్ని అశేష సంపదలకు ఆధార భూతుడు స్తోత్రవచనములకు స్ఫూర్తిదాత. సోమరస రక్షకుడు. ధనస్వరూపుడు. బలపుత్రుడు. అగ్ని జలమధ్యమున వసించును.

    6. అగ్ని సమస్త పదార్థములను ప్రకాశింప చేయును. అతడు జల మధ్యమున జన్మించును. అతడు జన్మించగానే ద్యావాపృథ్వులను పరిపూర్ణము చేసినాడు. జనులు అగ్ని కొరకు యజ్ఞము చేసినపుడు అతడు మబ్బులువైపు వెళ్లినాడు. వాటిని కొట్టినాడు నీరు తెచ్చినాడు.

    7. అగ్ని హవిని కోరును. అతడు అందరిని పావనము చేయును. అతడు నలుదిశల  సంచరించును. అరణ్యమున ఉత్కృష్టుడగును. అతడు అమరుడే కాని దుర్త్యమనుష్యులలో ఉండును. సుందర  రూపము దాల్చి గతివిధులు ఆచరించును. శుక్లవర్ణ తేజము దాల్చి ఆకాశమును నింపును.

    8. అగ్ని జ్యోతిర్మయుడు. అతని దీప్తి మహాత్తరము అతడు వెలుగులతో సాగుచు శోభా సంపన్నుడగును. అగ్ని వనస్పతులను ఆరగించినాడు. అమరుడైనాడు. దివ్యలోకము అగ్నికి జన్మనిచ్చినది దివ్యలోకపు జన్మదాన శక్తి ఎంతగొప్పది!

    9. మంగళమయ జ్వాలల అభినవ అగ్నీ! నీకు నేడు ఘృతయుక్త పురోడాశము సమర్పించినవాడు విశిష్టవ్యక్తియగును. అతనిని నీవు సర్వోత్తమ ధనముల వైపు నడిపింపుము. ఆదేవ భక్తుని సుఖసంతోషముల వైపు నడిపించుము.

    10. ఒకప్పుడు ఉత్తమోత్తమ అన్నములచే క్రియలు అనుష్ఠించబడును. అట్టితరి నీవు యజమానికి అనుకూలుడవు అగుము. అతడు  అగ్నికి ప్రియుడు, సూర్యునకు ప్రియుడు కావలెను. "ప్రియఃసూర్యం ప్రియోఅగ్నాభవ" ఉన్న  పుత్రులు, కలుగనున్న పుత్రులు, అతనితో కూడి శత్రు సంహారము చేయవలెను

    11. అగ్నీ! నిత్యము యజమానులు నిన్ను పూజింతురు. వివిధములగు ఉత్తమ పదార్థములు సమర్పింతురు విద్వాంసులగు దేవతలు నీతో కలసినారు. తమ ధనపు కోరికలను పూర్తి చేయదలచినారు. గోవులునిండిని గోష్ఠముల ద్వారములు తెరచినారు.

    12. మానవులందు అందగాడును. సోమమును రక్షించువాడును అగు అగ్నినే ఋషులు స్తుతింతురు. ద్వేషశూన్య ద్యావాపృథ్వులను ఆహ్వానించుచున్నాము. దేవతలారా! మాకు భౌతకబలమును. ధనబలమును ప్రసాదించండి.

    దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్ర ప్రదేశ ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును కమలానామ్ని ధర్మపత్నీ సమేతుండును 'పరిశీలన' మను సాహిత్య సమాలోచన గ్రంథకర్తయు, "ప్రేమ్ చంద్ జీవితము రచనలు" అనుహిందీ రచయిత సమీక్షా గ్రంథరచయితయునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన
 ఋగ్వేదసంహితమున ఏడవ అష్టకము సమాప్తము.
                                       సర్వే భద్రాణి పశ్యంతు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.