Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    11. అంధకన్యకు  ఆశ్రయమిచ్చు బుద్ధిమంతుడెవడు? నేనే ఆమెను వరింతును! ఆమెను భరింతును!! నన్ను బాధించగల వాడెవ్వడు?

    12. కేవలము ద్రవ్యమునకే ప్రసన్నలగు స్త్రీలు ఎందరు? వారు స్త్రీవాంఛాపరులపై ఆసక్తులగుదురు. కళ్యాణి, సభ్య, సుసంఘటితశరీరముగల స్త్రీ తన మనసునకు అనుకూలుడు అయిన వానినే పతిగా స్వీకరించును.

    13. సూర్యుడు తన కిరణములచే జలమును గ్రహించును. అట్టి జలమును తనలో దాల్చును. తన శిరస్సున ఉన్నకిరణములను జనుల తలలమీద విడుచును. పైన నిలిచి తనప్రకాశమును వెల్లడించును నేలమీద తన దృష్టిని విస్తరించును.

    "అత్రాదిత్యాత్మనేంద్రః స్తూయతే తదంశత్వాత్ ఆదిత్యరూపుడగు ఇంద్రుడు ఆ అంశమును స్తుతించుచున్నాడు."

    14. ఆకులేనిచెట్టుకు ప్రకాండ విచరణ శీల సూర్యునకు నీడ ఉండదు. ద్యులోక స్వరూపమాత స్థిరమై అన్నది:-

    త్రిలోకరూప గర్భమునుండి సూర్యశిశువు విడివడినాడు. పాలు త్రాగుచున్నాడు. ద్యులోకరూప గోవునకు మరొక దూడ ఉన్నది. తల్లిఆవు దూడను ప్రేమగా నాకి స్థిరపరచినది ద్యులోకగోవు తనస్తనమును ఎక్కడ ఉంచును?

    (గర్భమునుండి వెలువడినపుడు ఎర్రని రక్తపుముద్ద త్రాగిన పాలు తెల్లనిది. ద్యులోకపు మరొకశిశువు చంద్రుడు గోవుస్తనము కలిగించుమేఘము.)

    15. ఇంద్రరూప ప్రజాపతి దేహమునుండి విశ్వామిత్రాది ఏడుగురు ఋషులు పుట్టినారు. అతని శరీరపు ఉత్తర భాగము నుండి వాలఖిల్యాది ఎనిమిది మంది పుట్టినారు. వెనుకనుండి భృగువులు తొమ్మది మంది పుట్టినారు. ముందునుంచి అంగిరాదులు పదిమంది పుట్టినారు. వారు యజ్ఞాంశమును ఆరిగించు ద్యులోకపు ఉత్పన్న  ప్రదేశమును వర్థిల్ల చేసినారు.

    (ఉత్పన్నులు ఈ సంఖ్యల మరుత్తులు కూడా కావచ్చును.)

    16. పదిమంది అంగిరులలో 'కపిలుడు' ఒకడు అతడు యజ్ఞసాధనకు పూనుకున్నాడు. అందుకు తల్లి సంతోషించినది గర్భము ధరించినది.

    17. ప్రజాపతి పుత్రులగు అంగిరులు బలిష్ఠములగు మేకలను కనుగొన్నారు. పాశక్రీడ స్థానమునపాశములు విసరి పోయినారు. వారిలో ఇరువురు ప్రకాండ ధనువును అందుకున్నారు. మంత్రములు ఉచ్చారించినారు. దేహమును పరిశుద్ధపరచుచు జలమధ్యమున సంచరించినారు.

    18. కేకలువేయువారును వివిధ నడకల అగు అంగిరులు ప్రజాపతినుండి ఉత్పమ్నలైనారు. వారిలో సగము మంది  ప్రజాపతికి హవి పచనము చేయుదురు మిగిలిన సగము చేయరు. ఈ మాటలు నాకు సూర్యుడు చెప్పినాడు. కాష్ఠాన్న అగ్నియు ఘృతోదన అగ్నియు ప్రజాపతిని పూజింతురు.

    19. చూచినాను! నేను చూచినాను!! అనేకులు దూరము నుండి వచ్చుచున్నారు. వారుస్వయంసిద్ధ ఆహారమున ప్రాణములు నిలుపు కొందురు. వారి ప్రభువు ఇద్దరిద్దరు వ్యక్తులను జతచేయుచున్నాడు వారిలో కొత్తదనము కనిపించుచున్నది. వారు వెంటనే శత్రుసంహారము చేయుదురు.

    20. నా పేరు ప్రమరుడు. నారెండు గోవులు యజ్ఞమునకు సిద్ధమైనవి. వానిని కొట్టకండి గారాబము చేయండి. ఇవి జలములందు  లుప్తములగును. సూర్యుని వ్యాపింప చేయును. మేఘములను శోధించుట ఎరిగినవాడు ఎదుగును.

    21. ఈ వజ్రము సూర్యమండలమునుంచి ఎంతో వేగముగా క్రిందపడును. పడినంత దానిస్థానములు అనేకములు. స్తోతలగువారు అనాయాసముగ ఆస్థానములను దాటిపోవుదురు.

    22. ధనుస్సు నారీటంకారము చేయును. శత్రువును వధించు బాణము వెడలును.సకలలోకములు గడగడలాడును. జనులందరు ఇంద్రునకు సొమము సమర్పింతురు. ఋషులు సహితము శిక్షణ పొందుదురు.

    23. దేవతల సృష్టిలో మొట్టమొదలు మేఘము కనిపించినది. ఇంద్రుడు మేఘమును భిన్నము చేసినాడు. మేఘము జలము వర్షించినది. పర్జన్యుడు, వాయువు, సూర్యుడు ఈ ముగ్గురు  ఉద్బిజ్జములను పరిపక్వము చేయుదురు. వాయువు, సూర్యుడు జలములను ధరింతురు.

    24. సూర్యుడే మీ  ప్రాణాధారము. యజ్ఞమున సూర్యుని ఆ ప్రభావమును వర్ణించండి. స్తుతించండి. సూర్యుడు  ఎస్వర్గమును ప్రకాశింప చేసినాడు. అతడు శోషించేయును. సూర్యుడు పరిష్కారకుడు. అతడు ఎన్నటికి తననడక మానడు.
   
                                  ఇరువది ఎనిమిదవ సూక్తము
                     ఋషి - ఇంద్రుడు వసుక్రుడు - వసుక్రపత్ని. దేవత -
                            ఇంద్రుడు వసుక్రుడు ఛందస్సు - త్రిష్టుప్.


    ఇది ఇంద్ర వసుక్ర సంవాదము.

    1. వసుక్రి పత్ని అనుచున్నది:-

    మా యజ్ఞమునకు ఇంద్రుడు తప్ప తక్కిన దేవతలందరు విచ్చేసినారు. మా మామగారు ఇంద్రుడుగారు మాత్రమేరాలేదు. వారు వచ్చి ఉన్నట్లయిన పేలములు భక్షించి ఉందురు. సొమము పానము చేసి ఉందురు. భోజనము ముగించి ఇంటికి మరలిపోయి ఉందురు.

    2. ఇంద్రుడు అనుచున్నాడు:-

    తీక్ష్ణశృంగముల వృషభమువలె గర్జించుచు నేను పృధయొక్క ఉన్నత పర్వతప్రదేశమున నివసింతును. నాకు కడుపునిండ సోమము అందించువానిని రక్షింతును.

    3. వసుక్రుడు అనుచున్నాడు:-

    ఇంద్రా! యజమానులు అన్నమును ఆశించి నీ కొరకు హవనము చేయుదురు. అప్పుడు త్వరత్వరగా యజమాని ప్రస్తర ఫలకముల మీద  మాదక సోమము ఉంచును. నీవు దానిని పానము చేయుము. యజమాని వృషభయమును వండును దానిని ఆరగింపుము.

    4. ఇంద్రా! నీవు నాకు ఎంతటి సామర్థ్యము నివ్వవలె ననగా నేను కోరినంత నదులు ఎదురు పారవలెను. గడ్డితిను లేడి సింహమును ఓడించి తరుమవలెను. నక్క వరాహమును తరిమి కొట్టవలెను.

    5. నా బుద్ధి అపరిపక్వము. నీవు ప్రాచీనుడవు. బుద్ధిశాలివి. నిన్ను స్తుతించు శక్తి నాకు ఏది అయినను అప్పుడపుడు కొంచెము స్తుతించగలుగుచున్నాను.

    6. ఇంద్రుడు అనుచున్నాడు:-

    నేను ప్రాచీనుడను నా  కార్యభారము స్వర్గమార్గముకన్న భారమైనదని స్తోతలు నన్ను స్తుతింతురు. నేను ఒకే దెబ్బకు అసంఖ్యాక శత్రువులను దుర్బలులను చేయుదును. నా జన్మదాత నన్ను పుట్టుకతో నా ముందు శత్రువన్నవాడు నిలువజాలకుండ చేసినాడు.

    7. వసుక్రుడు అనుచున్నాడు:-

    ఇంద్రా! దేవతలు నన్ను నీ అంతటి ప్రాచీనుడను, విశిష్టకర్మ శూరుడను. అభీష్ట ఫలప్రదాతను అనుకొందురు. అనాయాసముగా నేను వజ్రమున వృత్రుని వధించినాను. నా మహిమవలన దేవతలకు గోధనమును ప్రసాదించినాను.

    8. దేవతలు సాగుదురు. వజ్రము అందుకుందురు. మేఘమును బ్రద్దలు చేయుదురు మానవుల కొరకు వర్షము కలిగింతురు. ఆ జలమును నదులందు ఉంచుదురు. మేఘమున జలము కనిపించినప్పుడల్ల దేవతలు  దానిని కాల్చి వర్షము కలిగింతురు.

    9. ఇంద్రుడు కోరినంత కుందేలు సింహాదులను ఎదిరించ గలదు - నేను మట్టిపెడ్డతో కొండలను కూల్చగలను. గొప్పవి సహితము చిన్నదాని ముందు పడిపోవును. దూడ ఆబోతు మీదకు కాలుదువ్వును.

    10. ఇంద్రుడు అనుకున్నంత బోనులోని సింహము పాదములు రాచినట్లు శ్యేనము తన గోళ్లురాచును. మహిషమునకు దప్పియైనంత ఉడుము నీరు అందించును.

    11. యజ్ఞాన్నముతో తమను పోషించుకొను వారికి ఉడుము సులభముగా నీరు అందించును అట్టివారు సర్వరసయుక్త సోమమును సేవింతురు. శత్రువు దేహమును, బలమును ధ్వంసము చేయదురు.

    12. సోమ యజ్ఞము చేసి బలము పొందిన వారు ఉత్తమ కర్మకర్తలు సుకర్మయుక్తలు అగుదురు. ఇంద్రా! దివ్యధామమున నీకు దానవీరుడవను పేరున్నది. నీవు మానవులవలె స్పష్టవాక్యములు ఉచ్చరింపుము. మాకు అన్నము అందింపుము.
   
                                ఇరువది తొమ్మిదవ సూక్తము
            ఋషి - వసుక్రదుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్

    1. శీఘ్రగామి అశ్విద్వయమా! ఈ స్తోత్రము అతినిర్మలము. మీ వద్దకు సాగునది. పక్షి భయమున నలువైపుల చూచుచు తన పిల్లను చెట్టుమీది గూటిలో దాచును. అట్లే నేను ఎంతో ప్రయత్నించి ఈ స్తోత్రము రచించినాను. ఎన్నో సార్లు నేను ఈ స్తోత్రమున  ఆహ్వానించినాను. అన్నిసార్లు మీరు యజ్ఞమునకు వచ్చినారు. మీరు నేతలకు నేతలు మానవుల హితైషులు. రాత్రిపూట సోమభాగమును గ్రహింతురు.

    2. ఇంద్రా! నీవు  నేతలకు నేతవు నేటిప్రాతః కాలమునను అన్య ప్రాతః కాలమునందును నిన్ను ప్రార్థింతుము. మేము శిష్ఠులమగుదుము. నిన్ను 'త్రిశోకి' ఋషి ప్రార్థించినాడు. అనేకమంది మానవ అనుచరులను పొందినాడు కుత్స ఋషి నీతో నీ రథమున కూర్చున్నాడు.

    3. ఇంద్రా! ఎటువంటి మత్తు  నిన్ను ప్రసన్నతముని చేయును? ఎటువంటి స్తుతి నిన్ను త్వరత్వరగా యజ్ఞగృహమునకు తెచ్చును? నాకు  ఎప్పుడు ఉత్తమ వాహనము  లభించును? నిన్ను స్తుతించగా అన్నము, అర్ధము మా వద్దకు ఎప్పుడు వచ్చును?

    4. ఏ స్తోత్రము చదివిన నీవు మానవులను నీతో సమానులను చేయుదువు? ఎప్పుడు వచ్చెదవు? ధనమిచ్చెదవు? ఇంద్రా! నీవు కీర్తిశాలివి. మానవులకు యదార్థ బంధువవు అందరిని పాలింతువు. పోషింతువు. స్తుతించినంతనే నీవు పాలింతువు పోషింతువు.

    5. భర్త భార్య కోరినది సమకూర్చును. అట్లే యజ్ఞము చేయువారికి వారు కోరిన ధనము ఇమ్ము. నీవు సూర్యసమాన దాతవు! నీవు బహురూపములు ధరించువాడవు నిన్ను ప్రాచీన  స్తుతులచే  స్తుతించువారికి అన్నము ధనము ప్రసాదించుము.

    6. ఇంద్రా! ప్రాచీన కాలమున ఎంతో  అందముగా  ద్యావాపృథ్వులను సృష్టించుట జరిగినది. అది నీకు తల్లి వంటిది. నీకు  ఘృతయుక్త సోమరసరము సమర్పించినాము దానిని  సేవించుము. ప్రసన్నుడవగుమ. నీకు సమర్పించిన  అన్నము నీకు రుచికరము కావలెను.

    7. ఇంద్రుడు స్వభావతః ఇంద్రునకు పాత్రనిండుగా సోమరసము సమర్పించండి. ఇంద్రుడు భూమి కన్నా పెద్దవాడు! అతడు  మానవ హితైషి. అతని పనులు విస్మయ కారకములు.

    8. ఇంద్రుడు శోభస బలవంతుడు అతడు శత్రుసేనను చుట్టుముట్టినాడు. బుద్ధి ఉన్న శత్రుసైనికులు ఇంద్రుని శరణు వేడుదురు. లోకకళ్యాణము కొరకు బుద్ధిమంతునివలె యుద్ధము చేయుటకు రథము నధిరోహింతువు. అట్లే  ఇప్పుడు రథమును నడుపుము.

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేదసంహిత ఏడవ అష్టకము పదవ మండలమున రెండవ అనువాకము సమాప్తము)

                మూడవ అనువాకము        ముప్పదవ సూక్తము   
   ఋషి - ఇలూషపుత్ర కవషుడు. దేవత - అప్ - జలము. ఛందస్సు - త్రిష్టుప్.

    1. సోమము మనోవేగము కలది. యజ్ఞములందు సోమము దేవతల కొరకు జలమువైపు సాగవలెను. మనసా! మిత్రావరుణుల కొరకు మరింత అన్నము వండుము. తీవ్రవేగముగల ఇంద్రుని కొరకు మంచి స్తుతులు రచించుము.

    2. పురోహితులారా! హోమద్రవ్యములు సమకూర్చండి. జలములు మీకు స్నేహయుక్తములు కావలెను. జలములవైపు తత్పరులై సాగండి. లోహితవర్ణ పక్షివలె సోమము వాలుచున్నది దానిని యధాస్థానమున చేర్చండి.

    3. పురోహితులారా! జలసముద్రమునకు చేరండి. అపాంనపాత, దేవతను హోమ ద్రవ్యములచే పూజించండి. ఆ దేవత మీకు  స్వచ్ఛజలతరంగములను అందించవలెను అతనికి మధుర సోమము సమర్పించండి.

    4. మేఘమధ్యమున నుండు నదియు, విప్రులచే ప్రస్తుతించ బడునదియునగు 'అపాంనపాత' దేవత రుచికరములగు జలములను ప్రసాదించవలెను. ఇంద్రుడు ఆజలములను పానము చేసి బలవంతుడు కావలెను. తన శౌర్యమును ప్రకటించవలెను.

    5. యువకులు యువతులతో కలసి ఆనందింతురు. స్వచ్ఛజలములందు సోమము ఆనందించును. సంతోషించును. అట్టి  జలములు తెచ్చుటకు వెళ్లండి. పురోహితులారా! ఆ  జలము తెచ్చి సోమమును శుద్ధిచేయండి.

    6. యువకులు యువతులవైపు ప్రేమ పూర్వకముగ కదలినప్పుడు - యువతులు యువకులు విషయము అను కూలముగ ప్రతిస్పందించినట్లు జలము సోమము విషయమున ప్రతిస్పందించును. పురోహితులకు, స్తోతలకు జలస్వరూప దేవతల జ్ఞానము ఉన్నది ఉభయులు తమ కార్యరాతులు అగుదురు.

    7. జలగణమా! మిమ్ములను అడ్డినపుడు ఇంద్రుడు అడ్డుతొలగించును మార్గము కలించును. మీరు విషమ దశయందున్నప్పుడు  విడిపించును. అట్టి ఇంద్రుని కొరకు మధుపూర్ణము, దేవతలకు మత్తు కలిగించు తరంగములు కలిగించండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.