Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    4. అగ్నీ ! నీవు సమస్తలోకములను పోషించువాడవు - అన్నవర్థకుడవు. ఉత్పాదక వనస్పతులు అన్నము కొరకు నిన్ను సేవించును. శుష్కవనస్పతులందు దావరూపమున ప్రవేశింతువు. మానవులకు, ప్రజలకు హోమ నిష్పాదకుడవు - "అసిత్వంవిక్షుమాను షీషుహోతా."

    5. అగ్ని దేవతల ఆహ్వాత. వివిధ రథవంతుడు. సమస్త యజ్ఞములకు పతాకస్వరూపుడు. శ్వేతవర్ణుడు దేవతల అధిపది. ఇంద్రుని వద్దకు వెళ్లువాడు. యజమానులకు పూజ్యుడు. అట్టి అగ్నిని సంపద కలుగుటకుగాను స్తుతిస్తాము.

    6. అగ్నీ ! నీవు దీప్యమానుడవు. హిరణ్మయ తేజోవంతుడు. శుక్లాది రూపములు ధరించువాడవు.  పృథ్వినాభియగు ఉత్తరవేదిన ఉత్పన్నుడవు. ఆదరణీయ స్థానమగు తూర్పుదిక్కున స్థాపించబడినవాడవు. అట్టి అగ్ని ఈ  యజ్ఞమున దేవతలను పూజించవలెను.

    7. అగ్నీ! పుత్రుడు మాతాపితరులను పోషించినట్లు నీవు ద్యావా పృథ్వులను పోషింతువు. తరుణతమఅగ్నీ! అభిలషించు వ్యక్తులవైపు సాగుము. బలపుత్ర అగ్నీ! మా యజ్ఞమునకు ఇంద్రాది దేవతలను తోడ్కొనిరమ్ము.
       
                                        రెండవ సూక్తము
                                          ఋష్యాద్యాః పూర్వవత్
   
    1.  యువతమ అగ్నీ! దేవతలు స్తోత్రాభిలాషులు. వారిని ప్రసన్నులను చేయుము. నీవు దేవయజ్ఞ, కాలములకు స్వామివి. యజ్ఞసమయమును గమనించి ఈ యజ్ఞమున దేవతలను పూజింపుము. దేవపురోహితులతో కలసి పూజింపుము. నీవు హోతలందు జ్యేష్ఠుడవు.

    2. అగ్నీ ! నీవు హోతవు, పోతవు, విప్రుడవు, సత్యనిష్ఠుడవు, ధనదుడవు, మాహవిస్సులను దేవతలకు అందించుము. దీప్యమాన ప్రశస్య అగ్నీ ! దేవతలను పూజింపుము.

    3. మేము దేవతల మార్గమును అనుసరింతుము. మేము ప్రారంభించిన కర్మ తగురీతి పూర్తికావలెను. జ్ఞాని అగ్ని దేవతలను పూజించావలెను. మానవుల హోమనిష్పాదకుడగు అగ్ని యజ్ఞములను,  వాని సమయమును మించవలెను.

    4. దేవతలారా ! మేము అజ్ఞానులము. జ్ఞానవంతులు మీ కర్మములను తెలియుదురు. అయినను లోపము చేయుచున్నారు. అగ్నికి ఈ విషయము లన్నియు తెలియును. అగ్నియే సకల కర్మలను పూర్తి చేయవలెను. యగయోగ్య సమయములందు అగ్ని దేవతలను "కల్పయాతి" కల్పించును.

    (కర్మములు నిర్వహించుట యందు జ్ఞానులు, అజ్ఞానులు సమానము అనుచున్నాడు.)

    5. మానవుడు దుర్బలుడు. అతని మనసు జ్ఞానశూన్యము మానవుడు ఎరుగని  కర్మమును -  హోత యాజ్ఞికుడగు - అగ్ని ఎరుంగును. అగ్ని యజ్ఞములందు సకాలమునకు దేవయజనము చేయవలెను.

    6. అగ్ని సకల యజ్ఞములకు ప్రధానకారకుడు. అతడు యజ్ఞపతాక స్వరూపి. అగ్నిని బ్రహ్మ సృష్టించినాడు. అగ్నీ ! దాసులు మున్నగువానితో కూడిన భూమిని మా కొసంగుము. స్పృహణీయ, స్తుతి మంత్రాల యుక్తుడవై దేవతలకు సర్వహితము కోరు అన్నమును అందించుము.

    7. అగ్నీ, నిన్ను భూలోక, ద్యులోక, అంతరిక్షములు మూడు సృష్టించినవి. శోభన జన్మ ప్రజాపతి నిన్ను సృష్టించినాడు. నీవు పితృమార్గమును. ప్రజలను ఎరింగినవాడవు. దీప్తయుక్తుడవై విరాజిల్లుము - "సమిధానో విభాహి."
       
                                  మూడవ సూక్తము
                                   ఋష్యాద్యాః పూర్వవత్

    1. దీప్త అగ్నీ! నీవు సర్వసామివి. హవ్యవాహనుడవు. అరిభయం కరుడవు వనస్పతులదున్న వాడవు. శుభములు కలిగించువాడవు. యజ్ఞమానులు ధనబుద్ధి కలిగి నిన్ను సర్వదా దర్శింతురు. అగ్ని సర్వజ్ఞుడు, అతడు సాయంత్రము తన మహాతేజమున శ్వేతవర్ణ దీప్తిచే అంధకారమును దూరము చేయును.

    2. ఉషస్సు పితృరూపుడగు ఆదిత్యునివలన కలిగినది. అగ్ని ఉషస్సును వెల్లడించుచు తన కాంతిచే అంధకారమును అడుగంటించును. గమనశీల అగ్ని ద్యులోకమునకు నివాసదాత అగ్ని తన తేజస్సుచే సూర్యుని వెలుగును పైన నిలిపి తాను ప్రకాశించును.

    3. కళ్యాణరూప భజనీయ ఉష అగ్నినిసేవించును. శత్రుఘాతక అగ్ని తనసోదరి ఉష వద్దకు వెళ్లును. దివ్య జ్ఞానము. దీప్త తేజముగల అగ్ని తన శ్వేతవర్ణ తేజమున కృష్ణ వర్ణ అంధకారమును దూరము చేయును.

    4. మహాగ్ని యొక్క ప్రకాశవంత కిరణములు సాగుచున్నవి. అవి స్తోతలను బాధించవు. మిత్ర, కళ్యాణరూప. భక్తుల సుఖంకర, స్తుత్య, కామవర్దక, శోభాముఖ అగ్ని కిరణములు అంధకారమును ధ్వంసము చేయును. తీక్ష్ణ ములగును. దేవతల వద్దకు చేరును. ప్రసిద్ధములు అగును.

    5. దీప్యమాన, శోభనదీప్త మహాగ్ని కిరణములు ధ్వని చేయుచు సాగును. అగ్ని అత్యంత ప్రశస్తుడు తేజస్వితముడు. క్రీడా కారుడు వృద్ధతముడు అతడు తన తేజస్సుచే ద్యులోకమునకు వ్యాప్తి కలిగించును.

    6. దృశ్యమాన ఆయుధవంతుడు, దేవతల వద్దకు చేరునట్టి అగ్ని కిరణములు శోషకములు వాయు యుక్తములు. అవిధ్వంచు చున్నవి. దేవతలందు ముఖ్యుడు, గంత, వ్యాపకుడు, మహానుడగు అగ్ని - తన శ్వేతవర్ణ, ప్రాచీన, శబ్దాయమాన - తేజమున ప్రదీప్తుడగును.

    7. అగ్నీ! మా యజ్ఞమునకు గొప్ప గొప్ప దేవతలను తోడ్కొనిరమ్ము. నీవు ద్యావాపృథ్వులమధ్యన సూర్యరూపమున ఉన్నవాడవు. మా యజ్ఞమందు ఆసీనుడవగుము. స్తోతలకు సులభసాధ్యుడు, వేగవంతుడగు అగ్ని -  అరుచుచు, పరుగులు పెట్టునట్టి అశ్వసహితుడై మా యజ్ఞమునకు విచ్చేయవలెను.
   
                                  నాలుగవ సూక్తము
                                   ఋష్యాద్యాః పూర్వవత్

    1. అగ్నీ! నీవు అందరకు వందనీయుడవు. మేము దేవతలను ఆహ్వానింతుము. అప్పుడు నీవు విచ్చేతువు నేను నీకు హవిసమర్పింతును. నిన్ను స్తుతింతును. ప్రాచీన ప్రభువగు అగ్నీ! సకలలోక స్వామివగు అగ్నీ! నీవు యాజ్ఞభిలాషి మానవులకు - మరుస్థలమున జలాశయమువలె - ధనమునిచ్చువాడవు సుఖములు కలిగించువాడవు.

    2. చలికి వాడకు గోవులు వెచ్చని కొట్టమునకు చేరును. తరుణతమ అగ్నీ! అట్లే ఫలప్రాప్తి కొరకు యజమానులు నిన్ను సేవింతురు. నీవు దేవతలకు, మానవులకు దూతవు. మహానుభావా ! నీవు హవిపట్టుకోని ద్యావాపృథ్వుల మధ్య, అంతరిక్షమున సంచరింతువు.

    3. పుత్రసమాన జయశీలుడవగు నిన్ను భూమాత పోషించును. నిన్ను చేరగోరును. ధరించును. అభిలాషివగునీవు అంతరిక్షపు ప్రశస్త మార్గమున  యజ్ఞములను సాగుదువు. కట్టువీడిన గొడ్డు కొట్టమునకు ఉరికినట్లు - హవి అందుకున్న నీవు దేవతల వద్దకు పరుగు పెట్టుదువు.

    4. అగ్నీ! నీవు మూఢుడవు కావు. చైతన్యవంతుడవు. మేము మూర్ఖులము నీ మహిమలు ఎరుగము నీవు మాత్రమే నీ మహిమలను ఎరుంగుదువు. అగ్ని వనస్పతులలో వసించును. తన నాలుకల జ్వాలలతో హవిర్బక్షణ చేయును. అగ్ని ఆయుతులను ఆస్వాదించును.

    5. నన్యాగ్ని ఎచట ఉత్పన్నుడగును? అతడు పాత చెట్లమీద ఉండును. పాలక, ధూమకేతు, శ్వేతవర్ణ అగ్ని అరణ్యములందు నివసించును. స్నానములేకనే పరిశుద్ధుడగు అగ్ని దూపగొన్న ఎద్దువలె - అడవియందలి నీతివద్దకు చేరును. మానవులు సన్మనస్కులై అగ్నిని ప్రసన్నుని చేయుదురు.

    6. అడవి దొంగలు ఇద్దరు బాటసారులను త్రాళ్లతో కట్టిగుంజుదురు. అగ్నీ! మా చేతులు అట్లే యజ్ఞకాష్ఠమునుండి నిన్ను మథించును. నేను నీ కొరకు నవస్తుతులను రచింతును నీవు వానిని గ్రహించుము. ప్రకాశవంతమగు నీ తేజస్సుతో రథమునకు అశ్వములవలె యజ్ఞమున చేరుము.

    7.  జ్ఞానివగు అగ్నీ! మేము నీకు యజ్ఞద్రవ్యములు సమర్పించినాము. నమస్కరించినాము. ఈ స్తుతి సదా వర్థిల్లినుగాత. అగ్నీ! మా పుత్ర, పౌత్రులను రక్షింపుము. సావధానుడవై మా అవయవములను రక్షింపుము.
   
                                   అయిదవ సూక్తము
                                    ఋష్యాద్యాః పూర్వవత్

    1.  అగ్ని అద్వితీయుడు సముద్రమువంటి ఆధారస్వరూపుడు. ధనములు ధరించినవాడు. బహుజన్మలవాడు అతడు - ఆ అగ్ని మా మనసులను ఎరుంగను. అగ్ని అంతరిక్షమందుండి మేఘమును సేవించును. అగ్నీ ! మేఘమధ్యమునందలి విద్యుత్తు వద్ద కేగుము.

    2. యజమాని ఆహుతులు అర్పించువాడు. అతడు నీల వర్ణ అగ్నిని మంత్రములచే ఆచ్ఛాదించును. అప్పుడు అతడు అశ్వవంతుడగును. విప్రులు - జలము నివాసముగాగల అగ్నిని స్తుతులతో ఆరాధింతురు. వారు హృదయకుహరమున అగ్ని యొక్క ప్రధాన నామములను జపింతురు "గుహానామానిదధిరేపరాణి."

    3.సత్యయుక్త, కర్మయుక్త ద్యావాపృథ్వులు అగ్నిని తమలో దాల్చును. తల్లిదండ్రులు పిల్లలను కన్నట్లు - ద్యావా పృథ్వులు ప్రశస్త అగ్నిని కలిగింతురు. అగ్ని సకల స్థావర, జంగమముల నాభివంటివాడు - ప్రధాని - మేధావి. అగ్నికి వ్యాప్తి కలిగించు వైశ్వానరాగ్నిని ఎరిగి మేము యజిస్తాము.

    4. యజ్ఞము నిర్వహించు, అభిలాషులుగల, ప్రాచీన యజమాని - విధివిహితమున ఉత్పన్నమైన అగ్నిని తన బలము కొరకు సేవించును. సకల లోకములను ఆవరించిన ద్యావా పృథ్వులు - మూడులోకములందు అగ్ని, విద్యుత్తు, సూర్యరూపమున ఉన్న - అగ్నిని మధు, ఘృత, పురోడాశాదులతో వర్థిల్ల చేసినారు.

    5. అగ్ని స్తోతలచే స్తుతించబడువాడు. సర్వజ్ఞుడు. అతనికి కాళి, కదాళిమున్నగు పేర్లుగల ఏడు జ్వాలలు - జిహ్వలు ఉన్నవి. అగ్ని యజ్ఞమునుండి ఏడు శిఖలను - సకల పదార్థద్రష్టలను చేయుటకు అవలీలగా పైకి లేపినాడు. ప్రాచీన కాలమున పుట్టిన అగ్ని అట్టి ఏడు శిఖలను ద్యావాపృథ్వుల మధ్య నిలిపినాడు. యజమానులను ఇష్టపడు అగ్ని భూమికి వర్షస్వరూపమగు తనరూపమును ప్రసాదించినాడు.

    6. విప్రులు సప్తపాపములను వర్జించినారు. వీనిలో ఏ ఒక్కటి చేసినవాడును పాపి అగును. మానవులను పాపమునుండి ఆపువాడు అగ్ని. అగ్ని మానవులందును - ఆదిత్య కిరణములు సంచరించు మార్గమందును - జలమధ్యమునను వసించును.

    (1.చౌర్యము, 2.బ్రహ్మహత్య 3.సురాపానము 4.గురు పత్నీగమనము 5. పునఃపునః పాపాచరణము 6. దుష్కృత్యము 7. అసత్యము అనునవి సప్త పాపములు)

    7. అగ్ని సృష్టికి ముందు సృష్టిఅయినంత సత్యము అయినాడు వ్యక్తుడైనాడు. అగ్ని పరంధాముడు. అతడు ఆకసమున సూర్యరూపమున జన్మించినాడు. అగ్ని మాకన్న ముందు ఉన్నవాడు. అగ్ని యజ్ఞమునకు పూర్వము ఉన్నవాడు అగ్ని వృషభమగును, గోవు అగును. స్త్రీ అగును పురుషుడగును.

    (శ్రీమదాంథ్ర వచన ఋగ్వేద సంహిత పదవ మండలము ఏడవ అష్టకమున అయిదవ అధ్యాయము సమాప్తము.)

        ఓం నతామినన్తి మాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
        నరోదసీ అద్రుహా వేద్యాభిర్న పర్వతాని నమేతస్థివాంసః

                ఆరవ అధ్యాయము        ఆరవ సూక్తము
            ఋషి - ఆప్త త్రితుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్

        ఓం అయంసయస్య శర్మన్నవోభిరగ్నె రేధతేజరితా భిష్టౌ |
        జ్యేష్ఠే భిర్యోభాను భిర్రుఘాణాం పర్యేతి పరివీతో విభావా ||

    1. ఇతడే ఆ అగ్ని యజ్ఞసమయమున స్తోతలను రక్షించువాడు. వారి గృహములను పెంపొందించువాడు అగ్ని దీప్తమంతుడు అతడు సూర్యకిరణముల ప్రశస్త తేజోవంతుడగును. సర్వత్ర సంచరించును.

    2. అగ్ని దీప్తుడు. అతడు దేవతల తేజమున దీప్తుడగును. అతడు సత్యస్వరూపుడు అహింసితుడు. యజమాని అగ్నికి మిత్రుడు. మిత్రోచిత కార్యము చేయుటకుగాను అవిశ్రాంత అశ్వమువలె అగ్ని యజమాని వద్దకేగును.

    3. అగ్ని సకల  లోకప్రభువు అతడు సర్వత్రగామి. ఉషః కాలమునుండియే హవనము కొరకు యజమాని ప్రభువు. అగ్ని మనస్సుకు అనుకూలముగా యజమానులు హవి సమర్పింతురు. అతని బలము శత్రుబలములకు అవధ్యము.

    4. అగ్ని బలములచే వర్థితుడు స్తుతులచే సేవితుడు వేగముగా దేవతల వద్దకు చేరువాడు. అగ్ని స్తుత్యుడు దేవతల ఆహ్వాత. ప్రధాన యజ్ఞకర్త దేవతలు నియమించినవాడు. అగ్ని దేవతలకు హవి అర్పించును.

    5. అగ్ని దేవతల ఆహ్వాత. జ్ఞాని విప్రులు ఆదరమున స్తుతించువాడు భోగముల నిచ్చువాడు. కదలుచుండువాడు. ఋత్విక్కులారా అగ్నిని ఇంద్రసమముగా - స్తుతించండి హవి అర్పించండి మాకు  సమ్ముఖుని చేయండి.

    6. యుద్ధమునకు త్వరగా చేరిన అశ్వమునకువలె. అగ్నియందు సమస్తలోకముల ధనములు లభించును "విశ్వావసూని జగ్ముః" అగ్నీ! ఇంద్రుని రక్షణలు మాకు అభిముఖము చేయుము.

    (సమస్త సంపదలు అగ్నినుండియే కలుగు చున్నవి అనునది నిత్యసత్యము)   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.